TTD: వైకుంఠ ద్వార దర్శనానికి ఎంతో ప్రత్యేకత ఉంది.. అందుకే తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తుతారు.. తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోతాయి.. దీంతో.. భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలకు పూనుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. పది రోజుల పాటు దర్శనం కలిపిస్తూ వస్తోంది.. ఇక, ఏడాది వైకుంఠ ద్వార దర్శనం షెడ్యూల్ విడుదల చేశారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.. డిసెంబర్ 23వ తేదీ 2023 నుంచి జనవరి 1వ తేదీ 2024 వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్టు వెల్లడించారు.
Read Also: RJ Swathi: కేటీఆర్ పై అద్భుతమైన ర్యాప్.. పాడి రఫ్పాడించిన ఆర్ జే స్వాతి
మరోవైపు.. శ్రీవారి దర్శనాలు, వివిధ సేవలకు సంబంధించిన టికెట్ల విడుదల తేదీలను కూడా ప్రకటించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.. ఈ నెల 10వ తేదీన ఆన్‌లైన్‌లో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనున్నట్టు తెలిపారు.. రోజుకి 22,500 చొప్పున 2.25 లక్షల టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఇక, 10వ తేదీన ఆన్‌లైన్‌లో శ్రీవాణి దర్శన టికెట్లు కూడా ఉంచనున్నట్టు పేర్కొన్నారు.. రోజుకి 2 వేలు చొప్పున 20 వేల టికెట్లు విడుదల చేస్తాం అన్నారు.. డిసెంబర్ 22వ తేదీన సర్వదర్శనం భక్తులకు ఆఫ్ లైన్ లో దర్శన టోకెన్లు విడుదల చేస్తాం.. రోజుకి 42,500 చొప్పున 4.25 లక్షల టికెట్లు విడుదల చేస్తామని.. సర్వదర్శనం టికెట్లను తిరుపతిలో ఏర్పాటు చేసే 10 కౌంటర్ల ద్వారా కేటాయించనున్నట్టు తెలిపారు. ఇక, డిసెంబర్ 23వ తేదీ 2023 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని షెడ్యూల్ విడుదల చేస్తూ.. ఆ పది రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేయనున్నట్టు వెల్లడించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.