దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వివాదంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ సాగుతోంది. భూదేవి కాంప్లెక్స్‌లో లడ్డు కల్తీ వ్యవహారంపై సీబీఐ సిట్ బృందం సమావేశమంది. డీఎస్పీ, సీఐలు సహా ఇతర అధికారులు సీబీఐ ఎస్పీ మురళి రాంబాతో సమావేశం కానున్నారు. సిట్ బృందం డీఎస్పీల స్థాయిలో విచారణ ప్రారంభించింది. అధికారులు అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు.
సిట్ అధికారులు తిరుమలలో రెండు రోజులుగా దర్యాప్తు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులతో కలిసి ఇటీవల సిట్ ఏర్పాటు చేశారు. సీబీఐ అధికారుల పర్యవేక్షణలో ఈ విచారణ ముమ్మరంగా సాగుతోంది. అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు దిండిగల్ ఏఆర్ డెయిరీలో సిట్ బృందం సభ్యులు వివరాలు సేకరించారు. తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ గోదాములను పరిశీలించారు. నెయ్యి కొనుగోలు టెండర్ల దస్త్రాలపై ఆరా తీశారు. వైష్ణవి, ఏఆర్ డెయిరీల నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఏఆర్ డెయిరీలో 13 గంటల పాటు సోదాలు జరిగాయి. తిరుపతి తూర్పు పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా సిట్ విచారణ సాగుతోంది.