TSLPRB SI Exam: ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష.. ఎంత మంది హాజరయ్యారంటే..

Police Constable Final Exam

Police Constable Final Exam

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) ఆధ్వర్యంలో 275 ఎస్సై (సివిల్, తత్సమాన) పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రిలిమినరీ రాత పరీక్ష నేడు ప్రశాంతంగా ముగిసింది. జూలై 29, 2026న విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10 ప్రాంతీయ కేంద్రాల్లోని మొత్తం 335 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 1,60,712 మంది హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోగా అందులో 1,45,342 మంది (90.44 శాతం) హాజరైనట్లు బోర్డు ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది.

ప్రాంతీయ కేంద్రాల వారీగా హాజరు వివరాలను పరిశీలిస్తే.. అత్యధికంగా కరీంనగర్ ప్రాంతంలో 92.69 శాతం మంది (14,095 మందికి గాను 13,065 మంది), హన్మకొండలో 92.25 శాతం మంది (18,194 మందికి 16,784 మంది), నల్గొండలో 92.17 శాతం మంది (13,729 మందికి 12,654 మంది) పరీక్షకు హాజరయ్యారు. అలాగే నిజామాబాద్‌లో 91.93 శాతం (6,258 మంది), మహబూబ్‌నగర్‌లో 91.40 శాతం (9,734 మంది), ఖమ్మంలో 91.24 శాతం (12,110 మంది), సంగారెడ్డిలో 90.73 శాతం (9,036 మంది), హైదరాబాద్‌లో 89.58 శాతం (19,663 మంది), ఆదిలాబాద్‌లో 89.22 శాతం (9,015 మంది) మరియు మేడ్చల్-మల్కాజిగిరిలో 88.25 శాతం (41,952 మందికి 37,023 మంది) హాజరు నమోదైంది.

నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పరీక్షను సమర్థవంతంగా నిర్వహించినట్లు బోర్డు పేర్కొంది. అభ్యర్థుల గుర్తింపును నిర్ధారించేందుకు , తదుపరి నియామక ప్రక్రియను సులభతరం చేసేందుకు ఈ పరీక్షలో తొలిసారిగా ‘ఆధార్ ఫేషియల్ అథెంటికేషన్’ (ముఖ గుర్తింపు) విధానాన్ని విజయవంతంగా అమలు చేశారు. దీనికి తోడు అభ్యర్థుల డిజిటల్ వేలిముద్రలు, డిజిటల్ ఫోటోలను సేకరిస్తూ బయోమెట్రిక్ హాజరును కూడా తీసుకున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ త్వరలో అధికారిక వెబ్‌సైట్ www.tgprb.in లో అందుబాటులో ఉంటుందని అభ్యర్థులు హోమ్‌పేజీని గమనిస్తూ ఉండాలని TSLPRB చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు తెలిపారు.