NTV Telugu Site icon

TS HIGHCOURT: 14ఏళ్ల తర్వాత నెరవేరిన 2008డీఎస్సీ అభ్యర్థుల కల

Ts High Court

Ts High Court

Telangana Highcourt : తెలంగాణ హైకోర్టు 2008 డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ప్రకటించిన 2008 నోటిఫికేషన్లో పేర్కొన్న ఖాళీలను ఇప్పటి వరకు భర్తీ కానీ 3500 పోస్టుల విషయంలో కీలక తీర్పు వెలువరించింది. అందులో భర్తీ చేయకుండా ఉన్న 1815 పోస్టులను మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని తెలంగాణ సర్కారుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 14ఏళ్ల నిరీక్షణ తర్వాత డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేకూరినట్లయింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2008సంవత్సరంలో 30558 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ సమయంలో 30శాతం పోస్టులు డీఈడీ అభ్యర్థులకు కేటాయిస్తూ 2009న ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీనిని కొందరు బీఈడీ అభ్యర్థులు ఒప్పుకోలేదు. 10200పోస్టులను తమకు కాకుండా డీఈడీ అభ్యర్థులకు ఎలా కేటాయిస్తారంటూ బీఈడీ అభ్యర్థులు మండిపడ్డారు. నోటిఫికేషన్ పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా 69మంది బీఈడీ అభ్యర్థులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అప్పటినుంచి ఇప్పటి వరకు కోర్టులోనే కేసు నడుస్తూ ఉంది.

ఈ క్రమంలో, డీఈడీ అభ్యర్థులకు 30 శాతం పోస్టులు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయం జోలికి వెళ్లకుండా ఈ నోటిఫికేషన్ లో వెల్లడించిన మొత్తం పోస్టుల్లో ఇంకా 3,500 పోస్టులను భర్తీ చేయలేదని హైకోర్టు గుర్తించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి చెందిన ఆ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంపై భర్తీ చేసిందని, కానీ తెలంగాణకు చెందిన 1815 పోస్టులను ఇంకా భర్తీ చేయలేదని హైకోర్టు గుర్తించింది. ఆ ఖాళీల్లో ఇంకా భర్తీ చేయకుండా ఉన్న ఉద్యోగాలను 2008 డీఎస్సీ రాసిన వారిలో మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా భర్తీ చేయాలని తీర్పునిచ్చింది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ తుది ఉత్తర్వులను వెలువరించింది.