Donald Trump: అగ్రరాజ్యాధినేతగా, సంచలనాలకు కేంద్ర బిందువుగా నిత్యం వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు కొత్త రికార్డు నెలకొల్పారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో (UNGA) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండవ పదవీకాలంలో తొలిసారిగా ప్రసంగించారు. తాజాగా ఆయన తన ప్రసంగం నిడివితో వార్తల్లో నిలిచారు. ట్రంప్ ఈ సమావేశంలో దాదాపు గంటసేపు ప్రసంగించారు.
15 నిమిషాలు కేటాయిస్తే..
పలు నివేదికల ప్రకారం.. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో నాయకులకు మాట్లాడటానికి 15 నిమిషాల సమయ పరిమితి ఇస్తారు. కానీ అమెరికా అధ్యక్షుడు దాదాపు గంటసేపు ప్రసంగించడం ద్వారా UNGA సంప్రదాయాన్ని ఉల్లంఘించారు. నిబంధనల ప్రకారం.. ప్రతి నాయకుడికి 15 నిమిషాలు మాత్రమే సమయం ఇస్తారు. కానీ ప్రధాన దేశాల అధిపతులు తరచుగా ఈ పరిమితిని మించిపోయి మాట్లాడుతారు.
ప్రపంచ రికార్డు ప్రసంగాలు..
UN చరిత్రలో అత్యంత సుదీర్ఘ ప్రసంగం 1960లో క్యూబా అధినేత ఫిడేల్ కాస్ట్రో ఇచ్చారు. ఆయన ప్రసంగం దాదాపు 4.5 గంటలు కొనసాగింది. లిబియా మాజీ అధ్యక్షుడు ముఅమ్మర్ గడాఫీ కూడా 2009లో గంటన్నరకు పైగా ప్రసంగించారు. తాజాగా ట్రంప్ గంటసేపటికి పైగా నడిచింది. ఆయన తన ప్రసంగంలో.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై యూరప్, భారతదేశం – చైనాపై తీవ్ర దాడి చేశారు. యూరోపియన్ దేశాలు ఇప్పటికీ రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేయడం ద్వారా రష్యాకు మద్దతు ఇస్తున్నాయని ఆరోపించారు. ఈ యుద్ధానికి భారతదేశం, చైనా అతిపెద్ద నిధులు సమకూర్చాయని విమర్శించారు.
రష్యా శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే అమెరికా భారీ సుంకాలు విధించడానికి సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. ఆయన తన ప్రసంగంలో.. వాతావరణ మార్పు ప్రపంచం ఇప్పటివరకు చూసిన అతిపెద్ద నష్టం అని స్పష్టంగా పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాలు, వాటి సరిహద్దులపై దాడులకు ఐక్యరాజ్యసమితి నిధులు సమకూరుస్తోందని ట్రంప్ ఆరోపించారు. అమెరికా దక్షిణ సరిహద్దుకు వచ్చే వలసదారులకు ఐక్యరాజ్యసమితి నగదు కార్డులను అందజేస్తోందని ఆయన విమర్శించారు. యుద్ధాలను సృష్టించడం లేదా వాటికి నిధులు సమకూర్చడం ఐక్యరాజ్యసమితి పని కాదని, యుద్ధాలను ఆపడం, అసలు యుద్ధాలు తలెత్తకుండా చూడటం యూఎన్ పని అని ఆయన అన్నారు.
READ ALSO: Gold Prices In India: పసిడి పరుగులను ఆప తరమా? రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర
