Site icon NTV Telugu

US Iran War: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. నేడు ఇరాన్‌కు “కాలరాత్రి”గా మారనుందా?

Trumpwarning

Trumpwarning

US Iran War: మధ్యప్రాచ్యంలో యుద్ధం రోజు రోజుకూ ముదురుతోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటనతో ఇరాన్‌తో ఉద్రిక్తతలను తీవ్రతరం చేశారు. మంగళవారం సాయంత్రంలోగా హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవకపోతే, విద్యుత్ కేంద్రాలు, వంతెనలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. ఇరాన్‌ను ఒకే రాత్రిలో తుడిచిపెట్టేయగలమని, అది మంగళవారమే జరగవచ్చని ట్రంప్ ప్రకటించడంతో గందరగోళం నెలకొంది. మరోవైపు, ఇరాన్ సైతం ఈ హెచ్చరికలపై అంతే తీవ్రంగా స్పందించింది. 45 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్ తోసిపుచ్చింది. యుద్ధం శాశ్వతంగా ముగియాలని డిమాండ్ చేస్తోంది. ఈ పరిణామాల మధ్య డెడ్‌లైన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ట్రంప్ మరోసారి స్పందించారు. “డెడ్‌లైన్‌ తర్వాత ఇరాన్‌లో పవర్‌ ప్లాంట్స్‌, బ్రిడ్జీలు ఉండవు.. 4 గంటల్లో ఇరాన్‌లోని పవర్‌ ప్లాంట్స్, బ్రిడ్జిలు పేల్చేయగలం. ఇరాన్‌ దగ్గర నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, డిఫెన్స్‌ సిస్టమ్‌ లేదు. యుద్ధంలో దక్షిణ కొరియా, జపాన్‌, ఆస్ట్రేలియా మాకు సహకరించలేదు. యుద్ధంలో అమెరికా విజయం సాధించింది” అని మరోసారి ట్రంప్ పేర్కొన్నారు. ఈ వరుస ప్రకటనలతో నిజంగానే ట్రంప్ మంగళవారం తీవ్రంగా దాడులు చేస్తాడా? ఇరాన్‌ పరిస్థితి ఏంటి? ఒక వేళ దాడి చేస్తే ప్రపంచ వాణిజ్యం అతలాకుతలమయ్యే పరిస్థితి ఉంది కదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

READ MORE: Homemade Natural Sunscreen: ఇక ఎండకు భయపడాల్సిన అవసరం లేదు..! ఇంట్లోనే ఇలా సన్‌స్క్రీన్‌ తయారు చేసుకోవచ్చు..

ఇప్పటికే.. తమ బలగాలు 13,000కు పైగా ఇరాన్ లక్ష్యాలపై దాడి చేశాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ పంచుకుంది.ఈ దాడుల్లో 155కు పైగా ఇరాన్ నౌకలు దెబ్బతిన్నాయని సెంట్‌కామ్ తెలిపింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్‌లు, బి-52 బాంబర్ల వరకు ఉన్న విమాన సముదాయంతో పాటు, యూఎస్ అణుశక్తితో నడిచే విమాన వాహక నౌకలు, జలాంతర్గాములు కూడా పాల్గొంటున్నాయని నివేదించింది. మరోవైపు.. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నేడు కీలక సమావేశం కానుంది. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు అవసరమైతే బలగాలను ఉపయోగించేలా బహ్రెయిన్ ప్రతిపాదించిన తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. ఒకవేళ ఇరాన్ పట్టువీడకపోతే, ఆ దేశం ఆర్థికంగా, సైనికంగా కోలుకోలేని దెబ్బ తినే ప్రమాదం కనిపిస్తోంది. ట్రంప్ ఇచ్చిన గడువు ముగియడానికి కొద్ది గంటల సమయం మాత్రమే ఉండటంతో ప్రపంచం మొత్తం ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తోంది.

Exit mobile version