Hormuz Strait: గ్యాస్, ఇంధన కష్టాలకు బ్రేక్ పడనుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా ప్రకటనతో పరిస్థితులు సర్దుమణిగాయి. ట్రంప్ రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటించారు. దీంతో ప్రపంచ దేశాలకు ఉపశమనం లభించింది. కాల్పుల విమరణ ఒప్పందంలో భాగంగా ట్రంప్ ఇరాన్‌కు 10 అంశాల శాంతి ప్రతిపాదనలు పంపారు. ఆ ప్రతిపాదనల్లో ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ని (Strait of Hormuz) తిరిగి తెరిచేందుకు ఇరాన్ సమ్మతించింది. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదింట ఒక వంతు జరిగే హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలకు ఇరాన్ సైన్యం సహకరిస్తుంది. అయితే, దీని ద్వారా వెళ్లే నౌకల నుంచి రవాణా రుసుము (Transit fees) వసూలు చేయాలని, ఆ నిధులను యుద్ధానంతర పునర్నిర్మాణానికి వాడాలని ఇరాన్ ప్రతిపాదిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈ జలసంధి తెరవడంతో చాలా దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి.
READ MORE: Crude Oil: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ వేళ.. భారీగా పడిపోయిన ముడి చమురు ధరలు
ఇదిలా ఉండగా.. గత 40 రోజులుగా మధ్యప్రాచ్యంలో జరిగిన ఉద్రికత్తలు, హర్మూజ్ జలసంధిలో నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా ఆసియా దేశాలకు ముడి చమురు సరఫరా చేసే సౌదీ ఆరామ్‌కో, మే నెలకు సంబంధించి తన ‘అరబ్ లైట్ క్రూడ్’ ధరను రికార్డు స్థాయిలో పెంచింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. సౌదీ అరేబియా ఆసియా రిఫైనరీలకు విక్రయించే ముడి చమురు ధరను బెంచ్‌మార్క్ ధర కంటే 19.50 డాలర్లు అదనంగా పెంచింది. మార్కెట్ నిపుణులు ఈ పెంపు 40 డాలర్ల వరకు ఉండవచ్చని అంచనా వేసినప్పటికీ, ప్రస్తుత 19.50 డాలర్ల పెంపు కూడా చమురు రంగ చరిత్రలో ఒక అత్యధిక రికార్డుగా నమోదైంది. ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20 శాతం వాటా కలిగిన హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించడం, అదనపు సుంకాలు వసూలు చేయడం సరఫరా గొలుసును దెబ్బతీసింది. తాజాగా కాల్పుల విరమణ ప్రకటనతో ఈ జలసంధి పూర్తిగా తెరుచుకోనుంది. ఈ నిర్ణయంతో తాజాగా క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.
