Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ 1073 కాక్‌పిట్‌లో జరిగిన ఘోర దాడి వెనుక ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) హస్తం ఉండవచ్చని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న ఈ విమానంలో ఒమన్ దేశానికి చెందిన కో-పైలట్.. పైలట్‌పై కత్తితో దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అధికారులు విచారణ కొనసాగిస్తుండగానే ట్రంప్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఇరాన్‌కు, ఆ ఒమనీ కో-పైలట్‌కు మధ్య ఏమైనా లింకులు ఉన్నాయా? అని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిచ్చారు. “మేము ప్రస్తుతం దీనిపై పనిచేస్తున్నాం. వారు మనతో చాలా ఓపెన్‌గా విషయాలు పంచుకుంటున్నారు. ప్రస్తుతం నాకు అందుతున్న సమాచారం ఆధారంగా చూస్తే.. అవును, సంబంధం ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది” అని ట్రంప్ వెల్లడించారు. అలాగే దాడి చేసిన ఆ కో-పైలట్‌కు ఐఆర్‌జీసీ శిక్షణ ఇచ్చి ఉంటుందా అని ప్రశ్నించగా, “అవును, అలాగే జరిగి ఉండవచ్చు” అని సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా తేహ్రాన్‌కు (ఇరాన్) ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ ఈ ఘటన వెనుక ఇరాన్ ప్రమేయం ఉన్నట్లు తేలితే మాత్రం ఆ దేశం తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొంటుందని, చాలా గట్టిగా దెబ్బకొడతామని స్పష్టం చేశారు. వారికి అసలు ఏం జరిగిందో బాగా తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
మరోవైపు, విచారణాధికారులు ఈ దాడికి సంబంధించిన అన్ని కోణాలను పరిశీలిస్తున్నారు. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ బయలుదేరిన ఈ విమానం కాక్‌పిట్‌లో ఒక్కసారిగా దాడి జరగడంతో విమానం హడలెత్తిపోయింది. కేవలం ఒక్క నిమిషంలోనే విమానం దాదాపు 17,000 అడుగుల కిందకు పడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది వెంటనే తేరుకుని దాడికి పాల్పడిన కో-పైలట్‌ను అడ్డుకుని, అదుపులోకి తెచ్చారు. దీంతో విమానం సురక్షితంగా సౌదీ అరేబియాలో ల్యాండ్ అయింది. ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్ కార్యక్రమంతో మాట్లాడిన ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు మాత్రం.. దాడి చేసిన వ్యక్తికి తీవ్రవాద సంస్థలతో లింకులు ఉన్నాయో లేదో చెప్పడానికి ఇది సరైన సమయం కాదని అభిప్రాయపడ్డారు. విచారణ వేగవంతంగా జరుగుతోందని, ఈ అనుమానిత సంబంధాల గురించి త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వస్తాయని నెతన్యాహు వెల్లడించారు.

