NTV Telugu Site icon

మీతో కలిసి మేం.. మాకో ఎమ్మెల్సీ ఇవ్వండి.. కేసీఆర్‌కు విజ్ఞప్తి

cm kcr

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది.. త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి.. అభ్యర్థుల వేటలో పడిపోయారు గులాబీ పార్టీ బాస్‌, సీఎం కేసీఆర్.. మరోవైపు ఎలాగైనా ఓ సీటు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేసే ఆశావహులు లేకపోలేదు.. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సీఎం కేసీఆర్‌కు ఓ విజ్ఞప్తి చేసింది.. సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు.. ప్రైవేట్ పాఠశాలలో చదివే 55 శాతం విధ్యార్థుల కోరకు మరియు లక్షల మంది టీచర్ల భవిష్యత్ కోసం చట్ట సభలో ఉండేవిధంగా ఒక్కసారి ఆలోచించాలని ఓ లేఖ రాశారు..

Read Also: పెళ్లికి ఇలా కూడా పిలుస్తారా..? మీరు తప్పనిసరిగా తీసుకురండి..!

తెలంగాణ రాష్ట్రంలో 55 శాతానికి పైగా విద్యా సేవలందిస్తూ 5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ పది వేల ఐదు వందల ప్రైవేట్ పాఠశాలల నిర్వహణ ద్వారా మీ కల అయిన బంగారు తెలంగాణ సాధన దిశగా మీతో కలిసి అడుగులేస్తూ, మీ ఆశయాలకు, ఆలోచనలకు తోడుగా ఉంటూ, కన్నతల్లి వంటి తెలంగాణ రాష్ట్ర రుణాన్ని తమ వంతు కర్తవ్యంగా తీర్చగలుగుతున్నందుకు తెలంగాణ రాష్ట్ర గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల సంఘం (TRSMA) సభ్యులందరూ తమ అదృష్టంగా భావిస్తున్నారు. ఉద్యమ కాలం నుండి మీ ఆలోచనలకు అనుగుణంగా నడుస్తూ, మీ మాటలే ఆదేశాలుగా అమలు చేస్తూ ఒక నిబద్ధత కలిగిన కార్యకర్త వలే టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎన్నికల సమయాలలో, పార్టీ మీటింగ్ మరియు అధికారిక, అనధికారిక కార్యక్రమాల సమయంలో బస్సులు, జన సమీకరణ, ఇతర అవసరాలకు ట్రస్మా ముందున్నదని తెలియజేయుటకు సంతోషిస్తున్నామని.. పార్టీకి సేవలందిస్తున్న మమ్ములను, ప్రభుత్వానికి అండగా ఉంటున్న మా ( TRSMA)నిబద్ధతను గుర్తించి ఈ ఎమ్మెల్సీ కేటాయింపులలో విద్యా రంగానికి చెందిన మాకు ఒక అవకాశం కల్పించాలని కోరుతున్నామని.. ఈ ఒక్కసారి మాకు అవకాశం కల్పించినట్లైతే మా సేవలను అధికారికంగా అందించుటకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు.. గతంలో స్పష్టమైన మెజారిటీతో గెలిచే అవకాశాలు మెండుగా ఉన్న ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు గారు ఎమ్మెల్సీ స్థానానికి బరిలో ఉన్నప్పటికిని పార్టీ ఆదేశానుసారం రెండవ ఆలోచన లేకుండా చెప్పిన వెంటనే ఉపసంహరించుకోవడం జరిగింది. దయతో మమ్ములను గుర్తించి ఈసారి తప్పక మాకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానం కల్పించాలని కోరుతున్నాం అంటూ ట్రస్మా సీఎం కేసీఆర్‌కు లేఖ రాసింది.