NTV Telugu Site icon

Tribute to Ilayaraja: తొలి రోజు నిరాశే!

Ilayaraja'

Ilayaraja'

Tribute to Ilayaraja: మాస్ట్రో ఇళయరాజా ఈ యేడాది జూన్ 3వ తేదీన 80 వసంతాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా ప్రపంచం గర్వించే ఈ సంగీత దర్శకుడితో రెండు రోజుల పాటు హైదరాబాద్ లో ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఫిబ్రవరి 25న ‘ట్రిబ్యూట్ టు ఇళయరాజా’ పేరుతో ఓ కార్యక్రమం, 26న ‘ఇళయరాజా లైవ్ కన్సర్ట్’ జరపాలని అనుకున్నారు. అయితే… శనివారం జరిగిన ‘ట్రిబ్యూట్ టు ఇళయరాజా’ కార్యక్రమం పరమ కంగాళీగా జరగడంతో భారీ ఆశలు పెట్టుకుని గచ్చిబౌలీ స్టేడియంకు వెళ్ళిన వారంతా నిరాశకు గురయ్యారు.

తెలుగు సినిమా రంగం ఇవాళ అంతర్జాతీయ యవనికపై తన జెండాను రెపరెపలాడిస్తోంది. కానీ ఇళయరాజా లాంటి గొప్ప సంగీత దర్శకుడు తెలుగు నేలకు విచ్చేసి ఓ కార్యక్రమంలో పాల్గొంటే… ఆయనకు జరగాల్సిన స్థాయిలో సన్మానం జరగలేదని ఆహుతులు పెదవి విరిస్తున్నారు. తెలుగు చిత్రసీమకు చెందని అగ్ర కథానాయకులు ఎవ్వరూ దీనికి హాజరు కాలేదు. లోటును కొంతలో కొంత దర్శకనిర్మాతలు తీర్చారు. ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్, అశ్వనీదత్, సి. కళ్యాణ్, ఎస్. గోపాల్ రెడ్డి వంటి వారు ఈ ఈవెంట్ కు హజరయ్యారు. అలానే రచయితలు, సంగీత దర్శకులు, గాయనీ గాయకులు కూడా కొందరు పాల్గొన్నారు. విజయేంద్ర ప్రసాద్, మణిశర్మ, ఆర్పీ పట్నాయక్, రామజోగయ్య శాస్త్రి, సునీత, రఘుబాబు, మృణాళ్ ఠాకూర్ వంటి వారు ఇళయరాజా సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read Also: SSMB 28: రేపటి నుంచే కొత్త షెడ్యూల్ షురూ… శ్రీలీలా జాయిన్ అవుతోంది

అరగంట పాటు సాగిన ఇళయరాజా సన్మాన కార్యక్రమం మరీ గందరగోళంగా ఉండటం చాలా మంది నిరుత్సాహానికి గురయ్యారు. స్పాన్సర్స్ అంతా వేదికపైకి వెళ్ళిపోవడం, ఎవరికి తోచిన రీతిలో వారు వ్యవహరించడం, నిర్వాహకులు వేదికను కంట్రోల్ చేయకపోవడం వంటి వాటిని ఆహుతులు తప్పు పట్టారు. తనకు జరిగిన సన్మానానికి ఇళయరాజా సమాధానం చెబుతారని, ఆయన మాటలు వినవచ్చని ఆశించిన వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక కార్యక్రమంలో భాగంగా గాయకుడు శ్రీకృష్ణ మెడ్లీ పాడాల్సి ఉండగా మైకులు మొరాయించడంతో అది కాస్త ఆగిపోయింది. ఇలాంటి ఓ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో నిర్వాహకులు సౌండ్ సిస్టమ్ ను చెక్ చేసుకోకపోవడం క్షమించరాని విషయం. ప్రోగ్రామ్ నిర్వాహకులకు, స్పాన్సర్స్ కు మధ్య సమన్వయం లేదనే విషయం అనేక చోట్ల స్పష్టమైంది. కార్యక్రమ నిర్వహణ సరిగా లేకపోవడంతో టిక్కెట్స్ కొనుక్కుని, దూరాభారాన్ని లెక్క చేయకుండా గచ్చిబౌలికి వచ్చిన వారికి ఈ ‘ట్రిబ్యూట్ టు ఇళయరాజా’ కార్యక్రమం చేదు అనుభవాన్ని మిగిల్చింది.

Read Also: Virupaksha: ఇక వెయిటింగ్ లేదు మిత్రమా… అప్డేట్ లు మాత్రమే…

ఇవాళైనా తప్పులు దిద్దుకుంటారా!?
నిజం చెప్పాలంటే… ఇళయరాజా మ్యూజిక్ కన్సెర్ట్ అనగానే తెలుగు సినీ ప్రముఖులు తమంత తాముగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తమ వంతుగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని ప్రేక్షకులతో పంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ ఏ పెద్ద స్టార్ హీరో, హీరోయిన్ దీనికి రాకపోవడంతో ఎక్కడో ఏదో లింక్ తెగిందేమో అనే భావన ఆడియెన్స్ కు కలిగింది. కనీసం ఈ రోజు జరిగే ఇళయరాజా లైవ్ కన్సర్ట్ లో అయినా… ఈ లోపాలను గుర్తించి, సజావుగా కార్యక్రమం నిర్వహిస్తే అదే పదివేలు. అలానే ఇళయరాజాతో తెలుగు సినిమాతో ఆయనకున్న అనుబంధాన్ని కూడా చెప్పించగలిగితే బావుంటుందని అందరూ అనుకొంటున్నారు… చూద్దాం… ఏం జరుగుతుందో!!