Travis Head: చరిత్ర సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ఒక్క ఓటుతో సంచలన విజయం..

Travis Head

Travis Head

Travis Head: ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ వరుసగా రెండో ఏడాది కూడా ఆస్ట్రేలియా అత్యున్నత వ్యక్తిగత క్రికెట్ పురస్కారం ‘అలన్ బోర్డర్ మెడల్’ను కైవసం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరఫున ఆడుతున్న ఈ కాటేరమ్మకొడుకు ఆసీస్ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఐదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ రేసులో తన ఆత్మీయ మిత్రుడు, వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీపై కేవలం ఒక్క ఓటు స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించి హెడ్ ఈ పతకాన్ని ముద్దాడాడు.

ఓ దివ్యమైన అవార్డుల ప్రదానోత్సవంలో ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ కెప్టెన్ అలన్ బోర్డర్ స్వయంగా ట్రావిస్ హెడ్‌కు ఈ మెడల్‌ను ప్రధానం చేశారు. 2025 జనవరి 29 నుంచి 2026 జనవరి 8 వరకు ఉన్న ఓటింగ్ కాలంలో హెడ్ అత్యధిక ఓట్లు సాధించాడు. అలెక్స్ క్యారీ రెండో స్థానంలో నిలవగా, వేగవంతమైన బౌలర్ మిచెల్ స్టార్క్ విజేత హెడ్ కంటే కేవలం మూడు ఓట్ల వెనుకంజలో ఉండి మూడో స్థానంలో నిలిచాడు. ఈ చారిత్రాత్మక క్షణంలో 32 ఏళ్ల హెడ్ ఎమోషనల్ అవుతూ.. “నా దగ్గర ఇప్పుడు రెండు పతకాలు ఉన్నాయనే ఆలోచనే చాలా అద్భుతంగా ఉంది. రాబోయే 20 ఏళ్లలో నా పిల్లలకు వీటిని గర్వంగా చూపించగలను. భారత్, ఇంగ్లాండ్ వంటి బలమైన జట్లపై ఆడిన కీలక సిరీస్‌లలో రాణించి ఈ రెండు పతకాలను గెలవడం నాకు చాలా ప్రత్యేకమైన అనుభూతి” అని హర్షం వ్యక్తం చేశాడు.

ఇక, ట్రావిస్ హెడ్‌కు ఈ ఏడాది అతని క్రికెట్ కెరీర్‌లోనే అత్యుత్తమ దశగా నిలిచింది. ముఖ్యంగా ఇంగ్లాండ్‌తో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఓపెనర్ బాధ్యతలను స్వీకరించి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పెర్త్ టెస్టులో 123 పరుగుల పోరాట పటిమను ప్రదర్శించగా, అడిలైడ్‌లో 170 పరుగుల భారీ స్కోర్ నమోదు చేశాడు. సిడ్నీ న్యూ ఇయర్ టెస్టులో 163 పరుగుల దూకుడు ఇన్నింగ్స్‌తో జట్టుకు కొండంత అండగా నిలిచాడు. రెడ్ బాల్ క్రికెట్‌లోనే కాకుండా, వన్డేల్లోనూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మెకే వేదికగా దక్షిణాఫ్రికాపై 142 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఓటింగ్ కాలంలో టెస్టులు, వన్డేలు రెండింటిలోనూ ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఈ కాటేరమ్మకొడుకు నిలిచాడు. మరోవైపు, ఈ చారిత్రాత్మక విజయంతో ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజాల సరసన చేరాడు. ఒకటి కంటే ఎక్కువసార్లు అలన్ బోర్డర్ మెడల్ గెలుచుకున్న స్టీవ్ స్మిత్, నాథన్ లయన్ వంటి దిగ్గజాల క్లబ్‌లో చోటు సంపాదించాడు. అంతేకాకుండా, వరుసగా రెండేళ్లపాటు ఈ గౌరవాన్ని అందుకున్న రికీ పాంటింగ్, మైకేల్ క్లార్క్, డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్ సరసన నిలిచాడు.