Travis Head: ఐపీఎల్ 2027 (IPL 2027) రిటెన్షన్ జాబితా విడుదలైన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తీసుకున్న ఓ నిర్ణయం అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను (Travis Head) జట్టు నుంచి రిలీజ్ చేస్తున్నట్లు ఎస్ఆర్‌హెచ్ ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తన అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌ను బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ సీజన్‌లో ఆడలేనని హెడ్ ముందే ఫ్రాంచైజీకి చెప్పాడట. అయితే, దీని వెనుక అసలు కథ వేరే ఉందని భారత మాజీ కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్ (Kris Srikkanth) ఓ కొత్త ట్విస్ట్ ఇచ్చాడు.
తన యూట్యూబ్ ఛానెల్‌లో వివిధ ఐపీఎల్ జట్ల నిర్ణయాలపై మాట్లాడిన శ్రీకాంత్, ట్రావిస్ హెడ్ ఆలోచనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “నిజానికి ఎస్ఆర్‌హెచ్ ఎలాగూ హెడ్‌ను రిటైన్ చేసుకునే ఆలోచనలో లేదేమో! వాళ్లు తనను జట్టు నుంచి రిలీజ్ చేస్తారని హెడ్ ముందే పసిగట్టి ఉండొచ్చు. ఆ భయంతోనే, వాళ్లు తీసేయకముందే తనే స్వయంగా ఐపీఎల్ 2027 నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఉంటాడు” అని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. కాగా, 2024 వేలంలో (auction) రూ. 6.8 కోట్లకు హెడ్‌ను కొనుగోలు చేసిన హైదరాబాద్, 2025 వేలానికి ముందు ఏకంగా రూ. 14 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే.
మరోవైపు, హెడ్ నిర్ణయంపై సన్‌రైజర్స్ హెడ్ కోచ్ డేనియల్ వెటోరి (Daniel Vettori) నిరాశ వ్యక్తం చేశాడు. జియోస్టార్ (JioStar) నిర్వహించిన ‘ఐపీఎల్ 2027 రిటెన్షన్ స్పెషల్’ కార్యక్రమంలో మాట్లాడిన వెటోరి, ఈసారి రిటెన్షన్ నిర్ణయాల్లో ఆటగాళ్ల అందుబాటు అనేది చాలా కీలక పాత్ర పోషించిందని స్పష్టం చేశాడు. ప్రస్తుత సైకిల్‌లో ఇది చివరి ఏడాది కావడంతో, గత సీజన్‌లో బాగా ఆడిన కోర్ టీమ్‌ను నిలబెట్టుకోవాలని చూశామని, కానీ కొందరి అందుబాటుపై స్పష్టత లేకపోవడంతో మార్పులు చేయాల్సి వచ్చిందని వివరించాడు. గత మూడేళ్లుగా జట్టు విజయాల్లో హెడ్ కీలక భాగమని వెటోరి గుర్తు చేసుకున్నాడు. రాబోయే రోజుల్లో ఆస్ట్రేలియా తరఫున అతనికి చాలా ముఖ్యమైన సిరీస్‌లు ఉన్నాయని, అందుకే దేశానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడని తెలిపాడు. హెడ్ ఈసారి తమతో లేకపోవడం బాధగానే ఉన్నా, గత మూడేళ్లుగా ఎస్ఆర్‌హెచ్‌కు అతను అందించిన సేవలకు ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటామని జియోస్టార్ ప్రెస్ రిలీజ్ ద్వారా వెటోరి పేర్కొన్నాడు.

