NTV Telugu Site icon

Toxic Gas Leak: హెట్రో డ్రగ్స్ విషవాయువు లీక్‌ ఘటనలో నిలకడగా బాధితుల ఆరోగ్యం

Toxic Gas Leak At Anakapalli

Toxic Gas Leak At Anakapalli

Toxic Gas Leak: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం హెట్రో డ్రగ్స్‌ పరిశ్రమలో మంగళవారం రాత్రి విషవాయువు లీక్ అవడంతో తీవ్ర కలకలం రేగింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో పరిశ్రమలోని 9వ యూనిట్‌ హెచ్‌ 7 బ్లాక్‌లో కెమిస్టులు పనిచేస్తుండగా, ఓ పైపు నుంచి ప్రమాదవశాత్తూ విష వాయువు లీకైంది. వాయువు లీక్ కారణంగా సమీపంలో ఉన్న 12 మంది కార్మికులు కళ్లు మంట, గొంతు నొప్పి, ఊపిరాడకపోవడం వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పరిశ్రమ భద్రత సిబ్బంది వెంటనే స్పందించి బాధితులను అంబులెన్స్‌ల్లో నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విష వాయువు ప్రభావంతో తీవ్ర అస్వస్థతకు గురైన ముగ్గురిని ముందు జాగ్రత్తగా విశాఖపట్నంలోని ప్రయివేట్ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మిగతా 9 మంది నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో అబ్జర్వేషన్‌లో ఉంచారు.

Also Read: Pawan Kalyan: సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా ఏపీ డిప్యూటీ సీఎం

విష వాయువు లీక్ సమయంలో కార్మికులు భయంతో పరిశ్రమ నుంచి బయటకు పరుగులు తీశారు. వరుసగా ఇటువంటి ప్రమాదాలు జరగడంతో ఫార్మా కంపెనీల భద్రతాపరమైన చర్యలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన తర్వాత హెట్రో డ్రగ్స్‌లో ఈ విష వాయువు లీక్‌పై రెవెన్యూ, పోలీస్‌ శాఖలు విచారణ చేపట్టాయి. ప్రమాదానికి గల కారణాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశముంది. మరోవైపు పరిశ్రమ భద్రతా నిబంధనలపై అధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుతం 12 మంది కార్మికుల ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా త్వరలో ప్రకటించనున్నారు.