Site icon NTV Telugu

Top Headlines@5PM: టాప్‌ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

*పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..
గాంధీభవన్ లో జరిగిన పీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మనకోసం పని చేసిన అందరికి అందాల్సిందేనని తెలిపారు. మన ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అనేది కాదు.. మనం బీ ఫార్మ్ ఇచ్చిన నాయకుడి ద్వారానే పథకాలు అందాలని అన్నారు. మన కార్యకర్తలు సంతృప్తి పడేలా పని చేద్దామని రేవంత్ రెడ్డి నేతలకు చెప్పారు. గ్రామ సభలలోనే లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. జిల్లా ఇంఛార్జిలకి పెత్తనం ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల బాధ్యత అంతా ఇంచార్జి మంత్రులదేనన్నారు. సంక్రాంతి తరవత ఎంపీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని సీఎం పేర్కొన్నారు. పార్లమెంట్ కి నెల ముందే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇదిలా ఉంటే.. నెల రోజుల్లో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్నారు. ఎమ్మెల్సీ సీట్లు అధిష్టానం చూసుకుంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. మరోవైపు.. నామినేటెడ్ పదవులు ఎంపిక ఇంఛార్జి థాక్రే, ఏఐసీసీ కార్యదర్శుల చూసుకుంటారని సీఎం చెప్పారు. ఇదిలా ఉంటే.. పీఏసీ సమావేశంలో ఐదు అంశాలే ఎజెండాగా చర్చ కొనసాగింది. పార్లమెంట్‌ ఎన్నికల వ్యూహంపై చర్చించారు. అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు పీఏసీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్బంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని తీర్మానించారు. రాష్ట్ర ఆర్థిక స్థితి గతులపై భట్టి విక్రమార్క వివరించగా.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో చర్చ పెట్టనున్నట్లు పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ తెలిపారు. మిషన్ భగీరథ అవకతవకలపై చర్చ.. రేషన్ కార్డు, ఆసరా పెన్షన్, మహిళలకు రూ.2500, ఇందిరమ్మ గృహాలు, గ్యాస్ ధర రూ.500పై చర్చించినట్లు చెప్పారు.

 

*పీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు
హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో పీఏసీ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇదిలా ఉంటే.. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇంచార్జి మంత్రులను నియమించింది. 17 నియోజక వర్గాలకు 17 మంది మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రెండు పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది పీఏసీ.
పార్లమెంట్ నియోజక వర్గాల ఇంఛార్జీలు
చేవెళ్ల, మహబూబ్ నగర్- సీఎం రేవంత్ రెడ్డి
ఆదిలాబాద్, మహబూబాబాద్- భట్టి విక్రమార్క
ఖమ్మం- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నల్గొండ- ఉత్తమ్ కుమార్ రెడ్డి
కరీంనగర్- పొన్నం ప్రభాకర్
ఇదిలా ఉంటే.. నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం ఇంచార్జి, ఏఐసీసీ కార్యదర్శిలకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. నాగపూర్ సభ ఇంచార్జిగా మహేష్ గౌడ్ ను నియమించారు.

 

*నాణ్యత లేకుండా ఎలా చేసారు.. ఎల్ అండ్ టి ప్రతినిధులపై ఉత్తమ్ ఫైర్‌
అంత పెద్ద ప్రాజెక్ట్ లో ఎలా నాసిరకం పనులు చేసారని, ఇంత నాణ్యత లేకుండా ఎలా చేసారని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. సచివాలయంలో మెడిగడ్డ బ్యారేజ్ పనులు చేసిన ఎల్ అండ్ టి ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. సమావేశంలో ఎల్ అండ్ టి గ్రూప్ డైరెక్టర్ ఎస్. వి దేశాయ్ పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సమావేశంలో మంత్రి ఉత్తమ్ ఎల్.అండ్ టి ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత పెద్ద ప్రాజెక్ట్ లో ఎలా నాసిరకం పనులు చేసారని మండిపడ్డారు. ఇంత నాణ్యత లేకుండా ఎలా చేసారని ఉత్తమ్ నిలదీశారు. ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి మా ప్రమేయం లేదు అని తప్పించుకోవాలంటే ఊరుకోమని హెచ్చరించారు. ప్రజా ధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవ్వరిని వదిలిపెట్టమని వార్నింగ్‌ ఇచ్చారు. పూర్తి స్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు మంత్రి. అన్నారం, సిందిళ్ళ ప్రాజెక్టు ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలని, తప్పు చేసిన వారు తపించుకోవాలని చూస్తే న్యాయ పరంగా, చట్ట పరంగా చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. గాంధీ భవన్ లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఈ మీటింగ్ కు ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావు ఠాక్రే అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ, వి.హనుమంతరావు తదితరులు వచ్చారు. అయితే.. మరోవైపు సూర్యాపేట జిల్లా అధికారులతో సమీక్ష కారణంగా సచివాలయం ఉత్తమ్ కుమార్ రెడ్డి బయలు దేరారు. ఇక మరోవైపు విద్యుత్ పై సమీక్ష కారణంతో పీసీసీ పొలిటికల్ కమిటీ సమావేశం నుంచి సమీక్షకు డిప్యూటీ సీఎం భట్టి వెళ్లారు. పార్లమెంట్ ఎన్నికలపై సన్నాహకంపై చర్చ కొనసాగుతుండగా భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నుంచి వెళ్లిపోవడంతో సర్వత్రా చర్చకు దారితీసింది.

*ఎమ్మెల్యేలతో కొనసాగుతున్న సీఎం జగన్‌ వరుస భేటీలు
ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. పార్టీలు అభ్యర్థుల ఖరారుపై కసరత్తును వేగవంతం చేశాయి. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ వై నాట్ 175 నినాదంతో అధికారం లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. గెలుపే ప్రామాణికంగా అభ్యర్దులను.. ఇంఛార్జ్‌లను మారుస్తున్నారు. అటు జగన్ ను ఓడించటమే టార్గెట్‌గా టీడీపీ, జనసేన పొత్తుతో బరిలోకి దిగాయి. ఎన్నికల వాతావరణం వేడెక్కెతున్న ఈ తరుణంలో సీఎం జగన్‌ అభ్యర్థుల ఖరారుపై దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎమ్మెల్యేలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. సీఎంవో నుంచి ఎమ్మెల్యేలకు పిలుపులు అందుతున్నాయి. ఈ క్రమంలో కొంత మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎంతో సమావేశమయ్యారు. ఇవాళ పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఆయనతో సీఎం చర్చించినట్లు తెలిసింది. మరో నలుగురు ఎమ్మెల్యేలకు కూడా సీఎంవో నుంచి పిలుపు అందింది. పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేలకు పిలుపు అందగా.. అందరితో వేర్వేరుగా సీఎం జగన్ సమావేశం కానున్నట్లు సమాచారం. సీఎం జగన్‌ చాలా మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను పక్కన పెడతారనే ఊహాగానాలు వస్తున్న తరుణంలో చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది.

 

*రేపటి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన జూనియర్ డాక్టర్లు..
తెలంగాణలో జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా.. రేపట్నుంచి విధులకు హాజరు కాబోమని జూడాలు ప్రకటించారు. గత మూడు నెలలుగా స్టైపెండ్ ఇవ్వకపోవడంతో రేపటి నుంచి జూడాలు సమ్మెకు పిలుపునిచ్చారు. కాగా.. రేపటి నుండి సమ్మె చేస్తామని ప్రభుత్వానికి వారు నోటీస్ ఇచ్చారు. ఈ క్రమంలో వైద్య సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది .రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యార్థులు 10 వేల మంది వరకు ఉంటారు. అందులో.. గవర్నమెంట్ హాస్పిటల్ లో ఇంటర్న్షిప్ చేస్తున్న హౌస్ సర్జన్లు 2500 మంది ఉంటారు. పీజీ స్పెషాలిటీ విద్యార్థులు(జూడా) 4000 మంది ఉంటారు. సీనియర్ రెసిడెంట్లు 1500 ఉంటారు. ఇదిలా ఉంటే.. రేపటి నుండి జూడాలు సమ్మెకు దిగుతుండడంతో గాంధీ ఆసుపత్రిలో పేషేంట్స్ కు ఎటువంటి ఇబ్బంది జరగకుండా ప్రత్యమ్నాయా ఏర్పాట్లు చేసామని గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.

*సంచలన ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి దారుణ హత్య..
నిజామాబాద్ జిల్లాలో సంచలన ఘటన వెలుగు చూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్య గురైన ఘటన సదా శివనగర్‌లో చోటుచేసుకుంది. 15 రోజుల వ్యవధిలోనే కుటుంబ సభ్యులను వరసగా హత్య చేశాడు ఓ సైకో కిల్లర్. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. పోలీసులు తెలిపన వివరాలు ప్రకారం.. మాక్లుర్‌కు చెందిన ప్రసాద్ కుటుంబంలోని ఆరుగురు వరస హత్యకు గురయ్యారు. 15 రోజుల వ్యవధిలోనే కుటుంబం మొత్తాన్ని హత్య చేసి వివిధ ప్రాంతాల్లో మృతదేహాలు పారేశాడు హంతకుడు. ఈ క్రమంలో సదా శివనగర్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం కావడంతో అసలు విషయం బయటపడింది. బాల్కొండ సోన్ బ్రిడ్జి సమీపంలో ఇద్దరు పిల్లల మృతదేహాలు, నిజామాబాద్ హైవేపై మృతదేహం, మాచా రెడ్డి లో మరొక మృత దేహం లభ్యం కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినది, మాక్లూర్‌కు చెందని ప్రసాద్ కుటుంబంగా పోలీసులు గుర్తించారు. వారిని హత్య చేసింది ప్రసాద్ స్నేహితుడు ప్రశాంత్‌‌గా సమాచారం. ఇంటి కోసమే అతడు కుటుంబాన్ని హత్య చేసినట్టు విచారణలో నిందితుడు తెలిపనట్టు తెలుస్తోంది. మాక్లుర్‌కు చెందిన ప్రసాద్ ఇటీవల తన భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెల్లతో మాచారెడ్డికి వలస వెళ్లాడు. ఇక మాక్లుర్‌లో ఉన్న అతడి ఇంటిని స్నేహితులు ప్రశాంత్ సొంతం చేసుకొవాలనుకున్నాడు. పథకం ప్రకారం ప్రసాద్‌ను తీసుకేళ్లి నిజామాబాద్ – కామారెడ్డి జాతీయ రహదారి అటవీ ప్రాంతంలో హత్య చేశాడు. ఆ తర్వాత ప్రసాద్ భార్యను చంపి బాసర నదిలో పడేశాడు. అతడి పెద్ద సోదరిని హతమార్చాడు. ఇక ప్రసాద్ ఇద్దరు పిల్లను హత్య చేసి మృతదేహాలను సోన్ బ్రిడ్జి సమీపంలో పడేశాడు. ఆ తర్వాత ప్రసాద్ చిన్న సోదరిని మాచారెడ్డిలో హత్య చేసినట్టు సమాచారం. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం మిస్సింగ్ కేసు నమోదు కాలేదని, దీంతో సుమోటో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగు చూసింది. ప్రస్తుతం ప్రశాంత్ పోలీసుల అదుపులో ఉన్నాడని, అతడిని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

*లోక్‌సభలో 33 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు
పార్లమెంట్‌లో గతవారం నెలకొన్న భద్రతా వైఫల్యం ఘటనపై ఇరు సభల్లో విపక్ష ఎంపీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాల నిరసనలతో రాజ్యసభ, లోక్‌సభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. ఈ క్రమంలో లోక్‌సభలో ఆందోళన చేపట్టిన విపక్ష సభ్యులపై స్పీకర్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు. లోక్‌సభ శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి సహా 33 మంది ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి సోమవారం సస్పెండ్‌ చేశారు. ఇటీవలి పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై ప్రతిపక్ష సభ్యుల నిరంతర నిరసనల తర్వాత ఇది జరిగింది. సభలో గందరగోళం సృష్టించినందుకు గాను 33 మంది ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు (ఎంపీలు) లోక్‌సభ నుంచి మిగిలిన శీతాకాల సమావేశాలకు సస్పెండ్ అయ్యారు. ఇటీవలి పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై ప్రతిపక్ష సభ్యుల నిరంతర నిరసనలు, ఈ విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన కోసం డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన తరుణంలో వారిని స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన ఎంపీలలో కాంగ్రెస్‌కు చెందిన అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీలు టీఆర్ బాలు, దయానిధి మారన్, టీఎంసీకి చెందిన సౌగత రాయ్ ఉన్నారు. స్పీకర్ ఆదేశాలు ధిక్కరించిన సభ్యుల సస్పెన్షన్‌కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించగా.. స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇదిలా ఉండగా.. లోక్‌సభలో ఇప్పటికే 13 మంది విపక్ష ఎంపీలపై గత గురువారం సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ సమావేశాల్లో ఇప్పటివరకు మొత్తం 46 మందిని లోక్‌సభ నుంచి సస్పెండ్‌ చేసినట్లయింది. మరోవైపు, రాజ్యసభలో టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఓబ్రియెన్‌పై ఈ శీతాకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్‌ అమలులో ఉంది. మొత్తంగా, ఒక రాజ్యసభ ఎంపీతో సహా 47 మంది ప్రతిపక్ష ఎంపీలు మిగిలిన శీతాకాల సమావేశాలకు సభ నుండి సస్పెండ్ అయ్యారు. పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై కేంద్రం సభలో ప్రకటన చేయాలని పట్టుబడటంతో లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ కార్యకలాపాలు స్తంభించాయి.

 

*జ్ఞానవాపి మసీదుపై సీల్డ్ నివేదికను కోర్టుకు సమర్పించిన పురావస్తు ప్యానెల్
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) సోమవారం వారణాసి జిల్లా కోర్టులో జ్ఞానవాపి మసీదుపై తన సీల్డ్ సైంటిఫిక్ సర్వే నివేదికను సమర్పించింది. వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు సముదాయానికి సంబంధించిన శాస్త్రీయ సర్వే నివేదికను సమర్పించేందుకు గత వారం ఏఎస్‌ఐకి కోర్టు వారం రోజుల గడువు ఇచ్చింది. నివేదిక సమర్పణ గురించి హిందూ తరపు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ మాట్లాడుతూ, “ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్ ఇండియా ఈరోజు వారణాసి జిల్లా కోర్టు ముందు తన శాస్త్రీయ సర్వే నివేదికను సమర్పించింది” అని అన్నారు. ముఖ్యంగా ఏఎస్‌ఐ 17వ శతాబ్దపు మసీదు హిందూ దేవాలయం పూర్వ నిర్మాణంపై నిర్మించబడిందో లేదో తెలుసుకోవడానికి కాశీ విశ్వనాథ దేవాలయం పక్కన ఉన్న జ్ఞానవాపి ప్రాంగణంలో శాస్త్రీయ సర్వేను నిర్వహిస్తోంది. అలహాబాద్ హైకోర్టు వారణాసి జిల్లా కోర్టు ఉత్తర్వును సమర్ధించి, “న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఈ చర్య తప్పనిసరి” అని తీర్పునిచ్చిన తర్వాత ఈ సర్వే ప్రారంభమైంది. వివాదంలో హిందూ, ముస్లిం పక్షాలకు ప్రయోజనం చేకూరుతుంది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల తర్వాత, జ్ఞానవాపి కమిటీ ఈ ఉత్తర్వుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏఎస్‌ఐ సర్వేపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు ఆగస్టు 4న సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తన ఆర్డర్‌లో, సర్వే సమయంలో ఎటువంటి దురాక్రమణ చర్య చేయవద్దని ఏఎస్‌ఐని కోరింది. దీంతో ఎలాంటి తవ్వకాలు జరగలేదని, అవసరమైతే వాటిని నిర్వహించవచ్చని వారణాసి కోర్టు పేర్కొంది.

 

*బిగ్ బ్రేకింగ్.. సలార్ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం సలార్. హోంబాలే ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా.. మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయినా ట్రైలర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఎన్నో వాయిదాల తరువాత డిసెంబర్ 22 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాపై హైప్ తీసుకురావడానికి మేకర్స్ తమవంతు కృషి చేస్తున్నారు. ఇక గత రెండు మూడు రోజుల నుంచి సలార్ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ అవుతుందని వార్తలు రావడం.. మళ్లీ అది వాయిదా పడడం జరుగుతూనే ఉంది. ఇక ఎట్టకేలకు చాలా వెయిటింగ్ తరువాత కొద్దిసేపటి క్రితమే సలార్ రిలీజ్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ట్రైలర్ కట్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. ఇద్దరు ప్రాణ స్నేహితులు.. ఎలా బద్ద శత్రువులుగా మారారు అనేది సలార్ కథగా తెలుస్తోంది. మొదటి ట్రైలర్ లో పృధ్వీరాజ్ సుకుమారన్ చేత కథ చెప్పించిన డైరెక్టర్.. ఈ ట్రైలర్ లో అసలు కథను చూచాయగా చూపించాడు. స్నేహితుడు కోసం.. ఒక రాజ్యంతో యుద్దాన్ని ప్రకటిస్తాడు దేవా.. చిన్నతనం నుంచి వరద కోసం ఏదైనా చేసే దేవా.. అతని రాజ్యాన్ని అతనికి అప్పగించడానికి ఎంతటి పోరాటం చేశాడు అనేది ట్రైలర్ లో కనిపిస్తుంది.మెకానిక్ గా ప్రభాస్ కనిపించాడు. ఇక ఆ కటౌట్ ను ఎలా వాడుకోవాలో ప్రశాంత్ కు బాగా తెలిసినట్లు కనిపిస్తోంది. మెషిన్ గన్స్.. పోరాటాలు.. కత్తులు.. ప్రభాస్ కెరీర్ లోనే ది బెస్ట్ యాక్షన్ మూవీగా సలార్ గుర్తిండిపోతుందని తెలుస్తోంది. పార్ట్ 1 లో ప్రాణ స్నేహితులు.. పార్ట్ 2 బద్ద శత్రువులుగా ఎలా మారారు అనేది చూపించనున్నారు. ఇక రవి బసూర్ సంగీతం నెక్స్ట్ లెవెల్. జర్నలిస్ట్ గా శృతి హాసన్ కనిపించింది. మామూలుగానే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.. ఇక ఈ ట్రైలర్ తో ఆ అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్ లు క్రియేట్ చేస్తుందో చూడాలి.

 

Exit mobile version