త్వరలో మేడిగడ్డకి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రెండో సారి సమీక్ష
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల లీకేజీలు, పిల్లర్లు కూలిన ఘటనలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మేడిగడ్డ, అన్నారం ఘటనలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ప్రకటించారు. దీనిపై తెలంగాణ శాసనమండలిలో సుదీర్ఘ ప్రసంగం చేసిన విషయం తెలిసిందే.. అయితే.. కాళేశ్వరం ప్రాజెక్టులో మెడిగడ్డ పిల్లర్ల అంశాలపై ఈ.ఏన్.సి మురళీధర్, ఇతర ఉన్నతాధికారులతో సచివాలయంలో రెండోసారి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. త్వరలోనే మేడిగడ్డకి వెళ్లనున్నట్లు సమాచారం. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై పారదర్శక విచారణకి అదేశిస్తామని నిన్న కౌన్సిల్ లో సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. మేడిగడ్డ ఎందుకు కుంగిపోయింది.. ఎందుకు పనికి రాకుండా పోయిందో తెలుసుకుంటాం అన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం సభ్యులందరినీ మేడిగడ్డకు తీసుకెళ్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. కాంట్రాక్టులు ఎవరు ఇచ్చారు, వాటి వెనుక మంత్రులు ఎవరు..? అధికారుల పాత్రతో సహా అన్నింటినీ వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.
టెక్నాలజీకి అనుగుణంగా అప్డేట్ అవ్వాలి.. క్యాడెట్లకు రాజ్ నాథ్ సింగ్ శుభాకాంక్షలు
టెక్నాలజీకి అనుగుణంగా అప్డేట్ అవ్వాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఇవాళ ఉదయం దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యువ పైలట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సైనికాధికారుల విన్యాసాలను వీక్షించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లను అభినందించారు. మీరు క్యాడెట్‌లుగా ఉన్నప్పుడు మీరంతా విద్యార్థులుగా ఉండి శిక్షణ పొందుతారని అన్నారు. అయితే ఈరోజు నుంచి మీరు అధికారులుగా మారబోతున్నారని తెలిపారు. మీ బాధ్యత మరింత పెరుగుతుందని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. శిక్షణ రోజులలో, మీరు మీ తల్లిదండ్రులు, కుటుంబం మరియు స్నేహితులకు దూరంగా ఉంటారు. ఈరోజుతో మీ శిక్షణ ముగిసిందని, అయితే మున్ముందు మరిన్ని సవాళ్లు ఎదురవుతాయని చెప్పారు.
సింగరేణి ఎన్నికలపై మరో ట్విస్ట్.. హైకోర్టులో మరో పిటిషన్
సింగరేణి ఎన్నికల్లో మరో పెద్ద ట్విస్ట్. ఎన్నికలను వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కార్మిక సంఘాల మధ్య పోరు తారాస్థాయికి చేరడమే ఇందుకు కారణం. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరిన తరుణంలో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ తెలంగాణ ఇంధన శాఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్లకు, సిబ్బంది నియామకానికి మరికొంత సమయం కావాలని కోరారు. పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ పిటిషన్ వెనుక ఎన్‌ఐటీయూసీ రాజకీయం ఉందని ఏఐటీయూసీ ఆరోపించింది. అయితే తాము చేసినవన్నీ చేసి పరువు తీస్తున్నారని ఏఐటీయూసీపై ఎన్‌ఐటీయూసీ నేతలు మండిపడ్డారు. దీనిపై ఇరువురు నేతలు విమర్శలు గుప్పించారు. వారి పరస్పర ఆరోపణలు ఎలా ఉన్నా.. తాజా పిటిషన్‌తో సింగరేణి ఎన్నికలు మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా? లేక మరో వాయిదా అనే చర్చ సింగరేణిలో నడుస్తోందా? అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నేపథ్యంలో 27న జరగనున్న ఎన్నికలపై హైకోర్టు సోమవారం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతుంది..
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్రా అనే పథకం కాదు వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంతో ఆడుకుంటుంది.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి అన్యాయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వారిని జైలుకు పంపించే పరిస్థితి ఉంది అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఘోరాతి ఘోరమైన నియంతృత్వ పాలన సాగుతుంది.. మాటతప్పం మడమ తిప్పం అనే ప్రభుత్వం నాలుక మడత పెడుతున్నారు అంటూ పురంధేశ్వరి విమర్శించారు. ప్రాంతాలు కులాల మధ్య విభేదాలు సృష్టించే ఇటువంటి ప్రభుత్వం మనకు కావాలా ప్రజలు ఆలోచించుకోవాలి అని పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడ్కో లబ్ధిదారుల వేదన దారుణంగా ఉంది కనీస వసతులు కల్పించడంలో గాని మంచినీరు పారిశుధ్యం పరిరక్షణ గాని లేకుండా ఉంది.. టిడ్కో లబ్ధిదారులను రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు తాకట్టు పెట్టడం ద్వారా 4:30 లక్షలు వడ్డీ భారం పడిందని గగ్గోలు పెడుతున్నారు అని ఆయన విమర్శలు గుప్పించారు.
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన.. నిందితుల కాలిపోయిన ఫోన్లు, దుస్తులు స్వాధీనం..
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటన యావత్ దేశాన్ని కలవరపెట్టింది. అది కూడా 2001 పార్లమెంట్ ఉగ్రవాద దాడి జరిగిన డిసెంబర్ 13 తేదీనే నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులు విజిటర్ పాసులతో పార్లమెంట్ లోకి ప్రవేశించి, సభ జరిగే సమయంలో ఛాంబర్ లోకి దూసుకెళ్లి పొగ క్యానిస్టర్లను పేల్చారు. మరో ఇద్దరు పార్లమెంట్ వెలుపల ఇలాంటి చర్యకే పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని సూత్రధారి లలిత్ ఝా గురువారం పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ ఘటనలో సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్ షిండే, నీలందేవీ, మహేష్ కుమావత్‌లను 7 రోజుల పోలీస్ కస్టడీకి పంపారు. ఢిల్లీ స్పెషల్ సెల్ ఈ కేసును విచారిస్తోంది. నలుగురు పార్లమెంట్ వద్ద హంగామా చేయగా.. ప్రధాన సూత్రధారి లలిత్ ఝా వారి మొబైల్ ఫోన్లు, దుస్తులను తీసుకుని రాజస్థాన్ పారిపోయాడు. అక్కడ ఇతనికి మహేష్ కుమావత్ బస ఏర్పాటు చేసేలా ప్లాన్ చేసుకున్నారు.
పార్లమెంట్ ఘటన దురదృష్ణకరం: ప్రధాని మోడీ
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. దురదృష్ణకరమైన, ఆందోళనకరమైన సంఘటనగా అభివర్ణించారు. ఈ ఘటనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అత్యంత సీరియస్ చర్యలు తీసుకుంటున్నారని, ఈ ఘటనను తక్కువగా అంచనా వేయవద్దని ప్రధాని అన్నారు. ‘‘ పార్లమెంట్‌లో జరిగిన ఘటన తీవ్రతను ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. అందువల్ల స్పీకర్ అత్యంత సీరియస్‌గా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు’’ అని చెప్పినట్లు నేషనల్ మీడియా కథనాలను ప్రచురించింది. ‘‘ దీని వెనుక ఉన్న అంశాలు, ప్రణాళికలు ఏమిటో అర్థం చేసుకోవడం, పరిష్కారాన్ని కనుగొనడం కూడా అంతే ముఖ్యం. పరిష్కారాల కోసం అన్వేషణ కూడా ఓపెన్ మైండ్‌తో చేయాలి. ప్రతి ఒక్కరూ అలాంటి విషయాలపై వివాదాలు, ప్రతిఘటనలకు దూరంగా ఉండాలి’’ అని ప్రధాని మోడీ సూచించారు.
ఆ నిమిషం 25 సెకండ్స్ ఏముంది నీల్ బ్రో… కాస్త లీక్ చెయ్యొచ్చుగా…
రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి పాన్ ఇండియా బజ్ జనరేట్ అయ్యింది. ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర సునామీ తెస్తుందని ట్రేడ్ వర్గాలు కూడా లెక్కలు వేసాయి. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా పేరు తెచ్చుకొని డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రానుంది సలార్ సీజ్ ఫైర్. ఈ మూవీ టీజర్, ట్రైలర్, సూరీడే సాంగ్స్ తో హైప్ ని మరింత పెంచాడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ చేయబోయే ర్యాంపేజ్ ఏ రేంజులో ఉండబోతుందో సలార్ శాంపిల్ చూపించడానికి రిలీజ్ ట్రైలర్ బయటకు రానుంది. ఈ ట్రైలర్ తో రాబోయే నాలుగు రోజులు సలార్ మేనియా మాత్రమే ఉండేలా చేస్తుందని సమాచారం. ఇదిలా ఉంటే సలార్ సినిమాకి సెన్సార్ A సర్టిఫికేట్ ఇచ్చింది. యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉండడంతో A రేటెడ్ సినిమాగా నిలిచింది సలార్. సెన్సార్ రిపోర్ట్స్ ప్రకారం సలార్ సినిమా 2 గంటల53 నిమిషాల నిడివితో ఉంది అనే మాట వినిపించింది.
ఆరు హెలికాప్టర్లతో ప్రభాస్ కు సినిమాటిక్ సెల్యూట్ చేసిన కెనడా ఫ్యాన్స్
రెబల్ స్టార్ ప్రభాస్ కు ప్రపంచమంతటా అభిమానులున్నారు. ఈ ఫ్యాన్స్ ప్రభాస్ పుట్టినరోజున, ఆయన కొత్త సినిమా రిలీజైన సందర్భంలో తమ అభిమానాన్ని వినూత్న పద్ధతిలో ప్రదర్శించడం చూస్తుంటాం. ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ సలార్ మరో అయిదు రోజుల్లో గ్రాండ్ గా థియేటర్స్ లోకి రిలీజ్ కు వస్తోంది. ఈ నేపథ్యంలో కెనడాలోని రెబల్ స్టార్ అభిమానులు తమ ఫేవరేట్ హీరో ప్రభాస్ కు ఎయిర్ సెల్యూట్ చేశారు. నేల మీద భారీ సలార్ పోస్టర్ డిజైన్ చేయించి..వివిధ రంగుల్లోని ఆరు హెలికాప్టర్స్ తో గాలి నుంచి ఆ పోస్టర్ కు సెల్యూట్ చేయించారు. చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఈ వీడియోను షేర్ చేసింది. ఓ భారీ హాలీవుడ్ సినిమా స్టైల్ లో యూనివర్సల్ డార్లింగ్ ప్రభాస్ కోసం అభిమానులు చేసిన ఈ ఫీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నెల 22న సలార్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా రెబల్ స్టార్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అభిమానుల్లో జోష్ మరింత పెంచడానికి ప్రశాంత్ నీల్ సలార్ సినిమా నుంచి రిలీజ్ ట్రైలర్ ని లాంచ్ చేస్తున్నాడు. ప్రభాస్ క్యారెక్టర్ సెంట్రిక్ గా కట్ చేసిన ఈ ట్రైలర్ సలార్ బజ్ ని మరింత పెంచనుందట.