NTV Telugu Site icon

Top Headlines @ 9PM : టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

సీఎంతో పెట్టుకునే స్థాయి కాదు మీది:
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై కేవీ రావు పెట్టిన కేసును ప్రజలు స్వాగతిస్తున్నారని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కాకినాడ పోర్ట్ సీఎండీగా ఉన్న కేవీ రావును అప్పట్లో బాగా భయపెట్టడమే కాకుండా బెదిరించారన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌పై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ఎంపీ నాగరాజు పేర్కొన్నారు. ఏపీపై విజయసాయి రెడ్డి విషం కక్కుతున్నారని, రాష్ట్ర ప్రతిష్టను ఆయన దిగజార్చుతున్నారని మండిపడ్డారు. విజయసాయి రెడ్డి తనతో చర్చకు రావాలని, సీఎంతో పెట్టుకునే స్థాయి కాదని ఎంపీ నాగరాజు సవాల్ చేశారు.

ధాన్యం కొనుగోలులో ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదు:
ధాన్యం కొనుగోలులో ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు నగదు అందాలని అధికారులకు సూచించారు. నేడు 26 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వివరాలను అధికారులను అడిగి తెలుకున్నారు.

చంద్రబాబు జైలుకు వెళ్తాడు:
తాము మళ్లీ అధికారంలోకి వస్తామని, సీఎం చంద్రబాబు నాయుడు బతికి ఉంటే తిరిగి జైలుపాలు కాక తప్పదని వైసీపీ రాజ్యసభ పక్ష నేత విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు అందర్నీ క్రిమినల్ అంటారని, ఆయనే ఓ క్రిమినల్ అని తెలుసుకోడన్నారు. బాబు 55 రోజులు జైల్లో ఉన్నాడు.. అందులకే అందర్నీ జైలుకు పంపాలని చూస్తున్నాడని మండిపడ్డారు. హామీలు ఇచ్చిన పథకాలు అమలు చేయలేకపోతున్నారని, రోజుకో సమస్య తెచ్చి దాని మీదే కాలం గడుపుతున్నారన్నారు. చంద్రబాబు, నారా లోకేష్ కంటే పవన్ కళ్యాణ్ బెటర్ లీడర్ అవుతారు అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

కాంగ్రెస్ పరిస్థితి గురువింద గింజ సామెతలా ఉంది:
కాంగ్రెస్ పరిస్థితి గురువింద గింజ సామెత లా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను ఏడాదికాలంగా కాంగ్రెస్ అమలు చేయలేదన్నారు. అబద్ధపు ప్రచారాలతో బాధ్యత రహితంగా పని చేస్తుందని విమర్శించారు. అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఆరు హామీలను పూర్తి అమలు చేస్తామని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు లేఖ రాశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ చతికీల పడిందన్నారు. వంద రోజులు పూర్తయ్యాయని.. 200 రోజులు దాటిపోయాయి.. ఎల్లుండితో 365 రోజులు పూర్తికానున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఏడాది తర్వాత వాళ్లకు మరోసారి జ్ఞాపకం చేసేందుకే బీజేపీ హైదరాబాదులో సభ నిర్వహిస్తుందని వెల్లడించారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ఎలా మోసం చేసిందో ప్రజలకు వివరిస్తామని చెప్పారు.

పోలీసులే విషమిచ్చి చంపారు:
ద్రోహి ఇచ్చిన సమాచారంతో డిసెంబర్ 1వ తేదీన ములుగు జిల్లా, ఏటూర్ నాగారం మండలం, చల్చాక గ్రామ పంచాయితీ అడవు పోల్ కమ్మ వాగు వద్ద తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు ఏడుగురి విప్లవకారులకు విషమిచ్చి అతి కిరాతకంగా చంపారని భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. “నవంబర్ 30వ సాయంత్రం ఏడుగురితో ఉన్న తమ దళం వలస ఆదివాసీ గ్రామాన్ని కలిసి నమ్మిన వ్యక్తికి తినడానికి భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పాం. ముందుగానే పోలీసులకు అప్లోవర్ గా మారిన ఇన్ఫార్మర్ ద్వారా భోజనంలో విషం ఇచ్చి స్పృహ కోల్పోయే లాగా చేశారు. స్పృహ కోల్పోయిన కామ్రేడ్స్ ను పట్టుకుని చిత్రహింసలు పెట్టి తెల్లవారు జామున 4 గంటలకు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. శత్రువు పథకంలో చిక్కి అమూల్యమైన కామ్రేడ్స్ ప్రాణాలర్పించారు. ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమరులకు పేరు పేరున తెలంగాణ రాష్ట్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తోంది.” అని పేర్కొన్నారు.

భారత్‌లో భారీగా పెట్టుబడులు పెడతాం:
భారత్‌లో పెద్ద మొత్తంలో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌ తెలిపారు. ప్రధాని మోడీ ఇచ్చిన ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాస్కోలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో చెప్పుకొచ్చారు. మోడీ ‘ఇండియా ఫస్ట్‌’ విధానంపై ఆయన ప్రశంసలు కురిపించారు. మేక్‌ ఇన్‌ ఇండియా నిర్ణయం ప్రపంచ దేశాల్లో భారత్‌ను ఏ స్థాయికి తీసుకెళ్లిందో ఈ సందర్భంగా వెల్లడించారు. దేశాభివృద్ధికి మోడీ నిర్ణయాలు ఎలా దోహదం చేశాయో చెప్పారు.. ఆయనపై తనకున్న అభిమానాన్ని పుతిన్ చాటుకున్నారు.

సీఎంగా ఫడ్నవిస్ తొలి సంతకం:
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ముచ్చటగా మూడోసారి గురువారం సీఎంగా ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం ఒక పేషెంట్‌కు ఆర్థిక సాయంపై చేశారు. పూణెకు చెందిన రోగి చంద్రకాంత్ శంకర్ కుర్హాడేకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.5లక్షల సాయం అందించే ఫైల్‌పై ఫడ్నవిస్ తొలి సంతకం చేశారు. బోన్ మ్యారో ట్రాన్స్‌ఫ్లాంట్(ఎముక మజ్జ మార్పిడి చికిత్స) కోసం రూ.5 లక్షల సాయం చేసి మానవత్వం చాటుకున్నారు.

డిప్యూటీ సీఎంగా ఏక్‌నాథ్‌ షిండే సొంత ప్రసంగం:
గత 10 రోజులుగా మహారాష్ట్రలో కొనసాగిన రాజకీయ ఉత్కంఠకు ఈరోజు తెరపడింది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ ముఖ్యమంత్రిగా, శివసేన (షిండే) చీఫ్ ఏక్‌నాథ్‌ షిండే, ఎన్సీపీ (ఏపీ) అధినేత అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, మహాయుతి కూటమిని లాస్ట్ వరకు టెన్షన్‌కు గురి చేసిన షిండే ప్రమాణ స్వీకారం సందర్భంగా సొంత ప్రసంగం చదివారు. మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం ప్రక్రియను స్టార్ట్ చేశారు. ఇక, ఏక్‌నాథ్‌ షిండే అక్కడున్న స్క్రిప్ట్‌ను చదవకుండా సొంతంగా ప్రసంగించారు. నా గురువు ధర్మవీర్ ఆనంద్ దిఘేని స్మరిస్తూ.. హిందూ హృదయ్ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రేకు నా ప్రణామాలు.. అలాగే, ప్రధాని మోడీ బలమైన నాయకత్వంలో.. హోంమంత్రి అమిత్ షా ఆశీర్వాదంతో పాటు మహారాష్ట్రలోని 13 కోట్ల మంది ఓటర్ల సపోర్టుతో అని ప్రసంగం చేశారు. దీంతో వేదికపై ఉన్న మోడీ, అమిత్ షా, ఫడ్నవీస్ సహా ముఖ్యనేతలందరూ షాక్‌ అయ్యారు.

ఐసీసీ అధ్యక్షుడి నిర్ణయంపై ఉత్కంఠ:
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ ప్రకటన వరుసగా వాయిదా పడుతూనే ఉంది. నవంబర్ 29న షెడ్యూల్ విడుదల చేస్తారని అందరు అనుకున్నారు. కానీ, మరుసటి రోజుకు భేటీ వాయిదా పడింది. దీంతో ఆ రోజు జరగాల్సిన ఇంటర్ నేషనల్ క్రికెట్ కౌన్సిల్ భేటీ కూడా జరగలేదు. ఇక, అది ఇవాళ (డిసెంబర్ 5కి) జరిగిన సమావేశం మరోసారి వాయిదా పడింది. అయితే, మరోసారి ఐసీసీ సమావేశాన్ని రెండు రోజులకు వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతుంది. డిసెంబర్ 7న మీటింగ్ జరగనున్నట్లు సమాచారం. బీసీసీఐ కార్యదర్శి జైషా ఐసీసీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి భేటీ కావడంతో అందరిలోనూ ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పుడు ఈ సమావేశం వాయిదా పడటం గమనార్హం.

అల్లు అర్జున్ పై కేసు:
తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన క్రమంలో సంధ్య థియేటర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్, ఆయన టీం పైన కూడా కేసు నమోదు చేశారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా అల్లు అర్జున్ తీసుకురావడంపై కేసు నమోదు చేసినట్టు చెబుతున్నారు. అల్లు అర్జున్ వచ్చిన తర్వాత సెక్యూరిటీ సిబ్బంది చేసిన హంగామాతో తొక్కిసలాట జరిగినట్టు పోలీసులు తేల్చారు. అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది తోయడం వలెనే తోపులాట జరిగి ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. మధ్య మండల డిసిపి అక్షాంశ్ యాదవ్ మాట్లాడుతూ నిన్న రాత్రి 9.40 సమయంలో పుష్ప 2 ప్రీమియర్ షో సంధ్య థియేటర్లో ఏర్పాటు చేశారని అన్నారు. దీనికి అధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారని, ప్రేక్షకులతో పాటు సినిమాలో నటించిన కీలక నటులు హాజరవుతారని సమాచారం మాకు లేదని అన్నారు. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా మాకు ఆ సమాచారం చెప్పలేదు, థియేటర్ యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని అన్నారు. పబ్లిక్ ను కంట్రోల్ చేసేందుకు ఎలాంటి ప్రైవేటు భద్రతను ఏర్పాటు చేయలేదన్న ఆయన ఎంట్రీ, ఎగ్జిట్ లలో కూడా ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని అన్నారు.

రాజమౌళి భయపడినంతా అయ్యింది:
దర్శక ధీరుడు రాజమౌళికి తిరుగు లేదు. ఆయన సినిమా చేస్తే వేల కోట్లు వస్తాయి. కానీ దశాబ్ద కాలం క్రితం రాజమౌళి ఓ మాట చెప్పారు. వాళ్లు నిజంగా కాన్సంట్రేట్ చేసి మాస్ సినిమాలు తీశారంటే.. ఇక మనం సర్దుకోవాల్సిందే అని భయపడే డైరెక్టర్లు త్రివిక్రమ్, సుకుమార్ అని చెప్పుకొచ్చారు. మా అదృష్టం కొద్ది వాళ్లు ఫుల్‌ఫ్లెడ్జ్‌ మాస్ మసాలా సినిమా తీయడం లేదని అన్నాడు. కానీ అప్పుడు రాజమౌళి చెప్పిందే.. ఇప్పుడు అక్షరాలా నిజమైంది. ఇప్పటి వరకు సుకుమార్ చేసిన ఊరమాస్ సినిమా ఏదంటే.. పుష్ప 2 అని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. అసలు సెకండ్ సినిమా ‘జగడం’తోనే సుకుమార్ మాస్ బాట పట్టాడు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో.. క్లాస్ సినిమాలు చేస్తు వచ్చిన సుక్కు.. రంగస్థలం నుంచి యూటర్న్ తీసుకున్నాడు. పుష్ప పార్ట్ 1ని మాస్ శాంపిల్ అనేలా చేసిన లెక్కల మాస్టారు.. ఇప్పుడు పాన్ ఇండియా షేక్ అయ్యే ఊర మాస్ బొమ్మ చేసి.. బాక్సాఫీస్‌ను తగలబెట్టేశాడు. గతంలో ఓసారి బన్నీ చెప్పినట్టుగా.. అసలు ఇలా కూడా సినిమా తీస్తారా? అనేలా చేశాడు సుక్కు.

 

Show comments