NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ఆగని ఇసుక మాఫియా ఆగడాలు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా.. ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఇసుక అక్రమాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఇసుక అక్రమ తవ్వకాలకు పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు కేంద్రంగా మారింది. అనిగండ్లపాడు రీచ్ వద్ద ఇసుక మాఫీయా హల్చల్ చేసింది. గ్రామ సరిహద్దు వద్ద ర్యాంపు నుంచి ఇసుకను తెలంగాణకు తరలిస్తున్నాయి. అన్నిండ్లపాడు గ్రామ సరిహద్దు వద్ద ర్యాంపులో ఇసుక తీసుకెళ్తున్న లారీలను రైతులు అడ్డుకున్నారు. లారీల వెనకాల కేశినేని అని రాసున్న స్టిక్కర్లు కనిపించాయి. నదిలో ఎస్కువేటర్ల సహాయంతో ఇసుకను లోడింగ్ చేస్తుండగా.. రైతులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. వరదలు వస్తే తమ పొలాలు కోతకు గురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లారీలలో ఇసుకను లోడింగ్ చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు. నదుల్లో ఎస్కవేటర్లతో కాకుండా మనుషులతోటే లోడింగ్ చేయాలని ఉన్నప్పటికీ ఇసుక అక్రమార్కులు పట్టించుకోవడం లేదన్నారు.

జగన్ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారు:
ప్రజా జీవనంలో ఉండడానికి అర్హత లేదన్న విషయం మాజీ సీఎం వైఎస్ జగన్‌కు అర్థమైందని, అందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని మంత్రి నిమ్మల రామా నాయుడు అన్నారు. రాష్ట్రానికి జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమే అని ఆరోపించారు. అబద్ధాల్లో జగన్‌కి ఆస్కార్‌ అవార్డు ఇవ్వొచ్చని కౌంటర్‌ ఇచ్చారు. కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని మోసం చేసి.. జగన్‌ ఛీత్కారానికి గురయ్యారని నిమ్మల ఎద్దేవా చేశారు.

రాజకీయాలు వదిలేద్దాం అనుకున్నా:
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ASK KTR’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూసి రాజకీయాలు వదిలేద్దాం అనుకున్నానని కామెంట్స్ చేశారు. కానీ తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయాల్లో కొనసాగుతున్నానని తెలిపారు. తనను తన కుటుంబాన్ని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డిని వదిలి పెట్టనని హెచ్చరించారు. మరోవైపు పార్టీ అధినేత కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని, ప్రతిరోజు తమకు దిశా నిర్దేశం చేస్తున్నారని పేర్కొన్నారు. 2025 నుంచి కేసీఆర్ విశ్వరూపం చూస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌కు వెళ్లడం కన్నా.. తనకు తెలంగాణలో ఉండడమే ఇష్టమని తెలిపారు.

బాలికపై నలుగురు మైనర్లు అత్యాచారం:
వికారాబాద్ జిల్లా దోమ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. 8వ తరగతి మైనర్ బాలికపై నలుగురు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై దోమ పోలీసు స్టేషన్లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోడీ:
ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌ను ప్రధాని నరేంద్ర మోడీ కలిశారు. ఢిల్లీలోని ధన్‌కర్ నివాసానికి వెళ్లి కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి దంపతులకు ప్రధాని మోడీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన కోసం గుజరాత్ వెళ్లారు. బుధ, గురువారాల్లో గుజరాత్ రాష్ట్రంలో మోడీ పర్యటించారు. గురువారం గుజరాత్ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. అనంతరం ప్రధాని.. ఉప రాష్ట్రపతిని కలిశారు. అంతకముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలిసి దీపావళి శుభాకాంక్షలు చెప్పారు.

మహిళలకు ఫ్రీ బస్‌పై కర్ణాటక సీఎం క్లారిటీ:
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎత్తేస్తున్నారంటూ వచ్చిన వార్తలతో కర్ణాటకలో తీవ్ర కలకలం రేగింది. దీపావళి పండుగ రోజున మహిళలకు షాక్ తగిలినట్లైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై పున:సమీక్షిస్తామంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. కొంత మంది మహిళలు డబ్బులు చెల్లించి ప్రయాణం చేస్తామంటూ మెయిల్స్ పెడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు మీడియాలో పెను దుమారం రేపాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేస్తారనేది అవాస్తవం అని, మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కొనసాగిస్తాం అని చెప్పారు.

ప్రేక్షకులకు కృతజ్ఞతలు: కిరణ్ అబ్బవరం
కిరణ్ అబ్బవరం నటించిన పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క” ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చి ఘన విజయాన్ని అందుకుంది. సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించారు మూవీ టీమ్. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ .. క సినిమాకు ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలని, యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాకి పెద్ద సంఖ్యలో వెళ్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో కూడా సినిమాకు ఎంతో సపోర్ట్ లభిస్తోందని, క సినిమా విజయంతో ఈ దీపావళిని తమకు ఎంతో స్పెషల్ చేశారని తెలిపాడు.

విరాట్ కోహ్లీకి 21 కోట్లు:
ఐపీఎల్ 2025 రిటెన్షన్ లిస్ట్‌ వచ్చేసింది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో మూడుసార్లు ఫైన‌ల్ చేరినా క‌ప్ కొట్ట‌ని రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) ఈసారి జట్టును పూర్తిగా మార్చేందుకు సిద్ధ‌మైంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025 కోసం త‌మ బృందంలో కేవ‌లం ముగ్గురినే రిటైన్ చేసుకుంది. మిగతా అందరిని వేలంలోకి వదిలింది. ఈసారి ఆరుగురిని రిటైన్ చేసుకునేందుకు బీసీసీఐ అవకాశం ఇచ్చినా.. ఆర్సీబీ ముగ్గురిని మాత్రమే అట్టిపెట్టుకుని అందరికి షాక్ ఇచ్చింది. 2008 సీజ‌న్ నుంచి జ‌ట్టుతో కొన‌సాగుతున్న‌ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు తమ ప్రథమ ఎంపికగా తీసుకుంది. కోహ్లీకి రూ.21 కోట్లు చెల్లించేందుకు సిద్ధ‌మైంది. మిడిలార్డర్‌లో దూకుడుగా ఆడే ర‌జ‌త్ పాటిదార్‌ను రూ. 11 కోట్ల‌కు రిటైన్ చేసుకోగా.. యువ‌పేస‌ర్ య‌శ్ ద‌యాల్‌ను రూ. 5 కోట్ల‌కు రిటైన్ చేసుకుంది.

అత్యధిక ధర బుమ్రాకే:
ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) రిటెన్షన్ జాబితా ప్రకటనకు బీసీసీఐ ఇచ్చిన గడువు నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో పది ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్ట్‌ను అధికారికంగా ప్రకటించాయి. ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ తన రిటైన్ జాబితాను ప్రకటించింది. ముంబై ఓనర్ ఆకాష్ అంబానీ జట్టును సోషల్ మీడియాలో ప్రకటించారు. జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మలను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకుంది. జస్ప్రీత్ బుమ్రాకు అత్యధిక ధర (రూ.18 కోట్లు) చెల్లించింది. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు చెరో రూ.16.35 కోట్లు ఇవ్వనుంది. ఇక మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రూ.16.30 కోట్లకు రిటైన్ చేసుకుంది.