NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

పోలీస్‌స్టేషన్‌లో కుప్పకూలిన సీలింగ్‌:
ఎన్టీఆర్‌ జిల్లాలోని తిరువూరు పోలీస్‌స్టేషన్‌లో పైకప్పునకు వేసిన సీలింగ్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సెక్టార్‌-1 ఎస్సై సత్యనారాయణ విధులు నిర్వహించే గదిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన సమయంలో ఎస్సై సత్యనారాయణ బయట వరండాలో ఉండటంతో ఆయనకు ప్రమాదం తప్పింది. సీలింగ్‌ కూలిన సమయంలో గదిలో ఎవరూ లేరని ఎస్సై తెలిపారు.

బాచుపల్లిలో దారుణం:
హైదరాబాద్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. బాచుపల్లిలోని నారాయణ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని అనూష హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనూష ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. దసరా సెలవులకు వెళ్ళిన అనూషని తల్లిదండ్రులు ఈరోజు హాస్టల్లో వదిలేసి ఇంటికి బయలుదేరారు. తల్లితండ్రులు సిటీ దాటిలోపే ఆమె స్పృహ కోల్పోయిందని కాలేజీ యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో హుటా హుటిన కాలేజీ వద్దకు చేరుకున్నారు. కాలేజీకి వెళ్ళేసరికి అనూష ఊరి వేసుకొని చనిపోయిందని యాజమాన్యం తెలిపారు. షాక్ అయిన తల్లిదండ్రులు అనూషను చూడాలని తెలిపారు. అనూష మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించామని తెలుపడంతో తల్లిదండ్రలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దక్షిణ కొరియాలో తెలంగాణ మంత్రుల పర్యటన:
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం ఇవాళ పర్యటించనున్నారు. మూసీ పునరుజ్జీవంపై అధ్యయనానికి మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, నగర మేయర్, ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ, మూసి రివర్ ప్రంట్ అధికారుల బృందం పర్యటించనుంది. ఈ నెల 21 నుంచి 24 వరకు వీరి పర్యటన కొనసాగుతుంది. సియోల్‌లోని రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధిని మంత్రుల బృందం పరిశీలించనుంది. ఇందుకోసం 50 మందితో కూడిన బృందం 20న హైదరాబాద్‌లో బయలుదేరింది.

గ్రూప్ -1 పరీక్షకు సర్వం సిద్ధం:
నేడు గ్రూప్ -1 పరీక్షకు కేంద్రాల వద్ద సర్వం సిద్ధం చేశారు అధికారులు. అభ్యర్థుల ఆందోళనల దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరీక్షలు ప్రశాంతంగా సాగేందుకు ఏర్పాట్లు చేశారు. ఏవిధమైన పొరపాట్లు లేకుండా కడ్బందీగా ఏర్పాట్లు చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,382 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. దీనికోసం 46 పరీక్షా కేంద్రాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఏర్పాట్లు, పరీక్షలు నిర్వహించేందుకు సిద్దమైంది. 2011 సంవత్సరం తర్వాత గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు మళ్ళీ జరుగుతున్నాయి. హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 మొత్తం 46 కేంద్రాలలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి.

జస్టిన్‌ ట్రూడో చెడగొట్టారు:
భారత్‌, కెనడా దేశాల మధ్య ఉన్న దౌత్య సంబంధాలను ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో నాశనం చేస్తున్నారని కెనడాలోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ ఆరోపించారు. ఖలిస్తానీ నేత హర్థిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడా భారత్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలను బయట పెట్టలేదని చెప్పారు. ఈ హత్య కేసు విషయంలో ట్రూడో భారత్‌పై చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ ప్రేరేపితమని ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

డాక్టర్ సహా మరో ఆరుగురు హతం:
జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గాందర్‌బల్‌ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ వైద్యుడు సహా ఆరుగురు కార్మికులు మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని గుండ్‌ దగ్గర శ్రీనగర్‌ – లేహ్‌ జాతీయ రహదారిలో సొరంగ నిర్మాణ పనులు చేస్తున్న ప్రైవేటు కంపెనీ కార్మికుల కోసం తాత్కాలిక ఆవాసాలను ఏర్పాటు చేసింది. ఇక, ఆదివారం సాయంత్రం కార్మికులు, సిబ్బంది పనులు ముగించుకొని తమ ఇండ్లకు తిరిగి వస్తుండగా.. అదే సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు వారిపై కాల్పులకు దిగారు.

దక్షిణాఫ్రికాను వెంటాడుతున్న దురదృష్టం:
వన్డే ప్రపంచకప్‌, టీ20 ప్రపంచకప్‌, టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లను గెలిచిన చరిత్ర దక్షిణాఫ్రికా పురుషుల జట్టుకు లేదు. నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఒత్తిడికి గురి కావడం ఓ కారణం అయితే.. దురదృష్టం వెంటాడడం మరో కారణంగా ప్రొటీస్ ఇన్నాళ్లు టైటిల్ గెలవలేదు. టీ20 ప్రపంచకప్‌ 2024లో ఫైనల్స్‌కు చేరినా.. భారత్ చేతిలో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. మహిళల జట్టు కూడా తృటిలో టైటిల్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. మహిళల టీ20 ప్రపంచకప్‌ 2024 ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తయింది. 2023 తుది పోరులో ఆస్ట్రేలియాకు ప్రొటీస్ తలవంచింది. దాంతో వరుసగా రెండు ప్రపంచకప్‌ ఫైనల్స్‌లోనూ దక్షిణాఫ్రికా అమ్మాయిలకు నిరాశే ఎదురైంది. న్యూజిలాండ్‌పై చివరి బంతి కాగానే.. ప్రొటీస్ అమ్మాయిలు దుఃఖంలో మునిగిపోయారు. పురుషుల, మహిళల క్రికెట్లో ఇప్పటివరకూ ప్రపంచకప్‌ను అందుకోలేని దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడుతూనే ఉంది.

సరసమైన ధరలకు లవ్ రెడ్డి:
అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘లవ్ రెడ్డి’. స్మరన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా లవ్ రెడ్డి సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది. ఈ సినిమా యొక్క టికెట్ ధరలను తగ్గిస్తూ.. చిత్ర యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసింది. లవ్ రెడ్డి సినిమా ప్రదర్శింపబడుతున్న సింగిల్ స్క్రీన్స్, మల్టిఫ్లెక్స్ లోని అన్ని థియేటర్స్ లో టికెట్ ధరను కేవలం రూ.112 మాత్రమే ఉండేలా నిర్ణయిస్తూ అనౌన్స్ చేసారు.

Show comments