NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

శ్రీకాకుళం జిల్లాలో సీఎం పర్యటన:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ రోజు సీఎం దీపం పథకం 2.0 గురించి చెప్పారు. దీపావళి కానుకగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇచ్ఛాపురం నియోజకవర్గం, ఈదుపురంలో దీపం 2.0 ఉచిత సిలిండర్ల పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 4.95 లక్షల మంది మహిళలు దీపం పథకంకు అర్హులుగా ఉన్నారు.

కత్తుల దాడిలో ముగ్గురు మృతి:
కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాజులూరు మండలం శలపాకలో రెండు కుటుంబాల మధ్య జరిగిన కత్తుల దాడిలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. పక్క పక్క నే ఉంటున్న రెండు కుటుంబాల మధ్య విభేదాల కారణంగానే ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఒక మహిళ విషయమై రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగిందని సమాచారం. చనిపోయిన ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ దాడిలో బత్తుల రమేశ్‌, బత్తుల చిన్ని, బత్తుల రాజులు చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ హుటాహుటిన సంఘటనా స్థలంకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం:
హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 18లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్ నాల్గవ అంతస్తులోని ఫ్లాట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో అపార్ట్మెంట్లో ఉన్నవారు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఫ్లాట్ ఓనర్ ఉదయం పూజ చేసి బయటకు వెళ్లాడు. వెళ్లే సమయంలో బాల్కనీ డోర్ ను తెరిచి వెళ్లాడు. గాలికి దీపం మంట పక్కన వస్తువులకు అంటుకోవడంతో ఫ్లాట్ లో మంటలు వ్యాపించాయని పోలీసులు తెలిపారు.

దీపావళి వేడుకల్లో అపశృతులు:
తెలుగు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. యువకులు, వృద్ధులు పటాకులు పేల్చుతూ ఆనందంగా గడిపారు. అయితే దీపావళి వేడుకల్లో పలు చోట్ల అపశృతులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ నగరంలో దీపావళి వేడుకల సందర్భంగా పలుచోట్ల టపాసులు కాలుస్తూ కంటికి గాయాలైన ఘటనలు చోటుచేసుకున్నాయి. మరోచోట పటాకులు కాల్చి పలువురు గాయపడ్డారు. దీంతో బాధితులంతా సరోజినీదేవి కంటి ఆస్పత్రి వద్ద బారులు తీరారు. ఇప్పటి వరకు 50 మంది బాధితులు గాయాలతో ఆస్పత్రికి చేరుకున్నారు. ఇందులో 9 మందికి సీరియస్‌గా వున్నట్లు వైద్యులు తెలిపారు. వారందరికి ప్రథమ చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. కాగా 34 మందికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు సరోజినీదేవి కంటి ఆసుపత్రి ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసింది.

ఢిల్లీలో దారుణంగా మారిన గాలి:
దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్ని రోజులుగా పొగ మేఘాలు కమ్ముకోవడంతో ప్రజలు విషపూరితమైన గాలి పీల్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అదే సమయంలో ఇప్పుడు దీపావళి తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. దీపావళి సందర్భంగా పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడం వల్ల నగరంలో ఎక్కడ చూసినా పొగలు కమ్ముకుంటున్నాయని, ఢిల్లీ గ్యాస్ ఛాంబర్‌గా మారిందని చెప్పక తప్పదు. బాణసంచా కారణంగా ఢిల్లీ గాలి నాణ్యత చాలా పేలవమైన స్థితికి చేరుకుంది. ఉదయం 5:30 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 700 కంటే ఎక్కువ నమోదైంది. దీపావళి తర్వాత ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది. అంతేకాకుండా రోడ్లపై పలు చోట్ల పటాకుల అవశేషాలు కూడా దర్శనమిస్తున్నాయి.

గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం:
జమ్మూకాశ్మీర్‌లో కొత్తగా ఏర్పడిన నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం-రాజ్‌భవన్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం కేంద్రపాలిత వ్యవస్థాపక దినోత్సవాన్ని బహిష్కరించింది. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తప్పుపట్టారు. ఇది ద్వంద్వ వైఖరి అంటూ విమర్శలు గుప్పించారు. దీంతో మనోజ్ సిన్హా-ఒమర్ అబ్దుల్లా మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.

కన్నప్ప విడుదలపై క్లారిటీ లేదప్ప:
మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కన్నప్ప. ఈ సినిమాను డిసెంబర్ నెలలో రిలీజ్ చేస్తామని గతంలోనే మేకర్స్ వెల్లడించారు. ఆ మధ్య టీజర్ రిలీజ్ సమయంలోను అదే విషయం ప్రకటించారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే కన్నప్ప డిసెంబరు రిలీజ్ లేనట్టే అనిపిస్తోంది. అందుకు పుష్ప -2 కారణం కనిపిస్తోంది. ఆగస్టులో రావాల్సిన పుష్ప డిసెంబరు 5న వస్తుండడం, వరల్డ్ వైడ్ గా ఆ సినిమాకు భారీ హైప్ ఉండడంతో కన్నప్ప కామ్ గా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. క్రిస్టమస్ కానుకగా వేద్దామా అనుకుంటే ఆ డేట్ కు మైత్రి మూవీస్ నిర్మిస్తున్న మరో సినిమా రాబిన్ హుడ్ 20న డేట్ వదిలారు. ఇక సంక్రాంతి సంగతి సరేసరి. అక్కడ కన్నప్ప వచ్చేందుకు స్పేస్ లేదు. రిపబ్లిక్ రోజు అంటే రోజు మాస్ మహారాజ్ మాస్ జాతర ఉంది, ఫిబ్రవరి లో తండేల్ అని టాక్. మరి ఇంత టైటు షెడ్యూల్ మధ్య కన్నప్ప ను ఎప్పుడు తీసుకువస్తారో అని గందరగోళం నెలకొంది.

దుల్కర్ చెప్పిన 12వ తరగతి ప్రేమ కథ:
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా లో వస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ -4 గ్రాండ్ గా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. సెకండ్ ఎపిసోడ్ కు గాను మలయాళ నాటుడు దుల్కర్ సల్మాన్ విచ్చేశాడు.దుల్కర్ తో బాలయ్య చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రశ్నలు పంచులతో ఆద్యంతం సరదాగా సాగింది. అందులో భాగంగా దుల్కర్ అమల్ సూఫియా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం పై ప్రశ్నలు వేసాడు.అందుకు బదులుగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ..” నా భార్య అమల్ సూఫియా నా స్కూల్ లో నాకు జూనియర్. నేను 12వ తరగతి చదివేటప్పుడు ఆమె 8వ తరగతి. కానీ ఆ టైమ్ లో మేము ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఆ తర్వాత అప్పుడప్పుడు చెన్నైలోను సినిమా థియేటర్స్, రెస్టారెంట్స్ లో ఫ్రెండ్స్ తో కనపడేది. కొన్నాళ్ల తర్వాత నాకు ఇంట్లో సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు. దాంతో నేనే తనకు ఫేస్ బుక్ లో మెసేజ్ చేశాను. మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, మీ ఇంట్లో కూడా నీకు చూస్తుంటారు. మనం ఒకసారి కలిసి ఎందుకు మాట్లాడుకోకూడదనుకున్నాం. అలా ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాము. ఆ తర్వాత మూడు వారాల్లోనే మా నిశ్చితార్థం అయిపోయింది. ఇప్పటికి మా పెళ్లయి 13 ఏళ్ళు అయింది. అప్పటికి ఇప్పటికి అంతే ప్రేమగా ఉన్నాం” అని తెలిపారు.

 

Show comments