శ్రీవారి భక్తులకు అలర్ట్:
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. నవంబర్ నెల కోటాకు సంబందించిన ఆర్జిత సేవా టికెట్లను రేపు (ఆగష్టు 19) విడుదల చేయనున్నారు. ఆగష్టు 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎల్రక్టానిక్ డిప్ కోసం ఆగష్టు 21 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారిలో ఈ నెల 21 నుంచి 23 మధ్యాహ్నం 12 గంటల్లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లతో పాటు నవంబర్ 9న శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పుష్పయాగం సేవ టికెట్లను ఆగష్టు 22 ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఈనెల 22న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఈనెల 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం టోకెన్లను, ఈనెల 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను విడుదల చేయనున్నారు.
పూర్తిస్థాయి బడ్జెట్పై ఏపీ ప్రభుత్వం కసరత్తు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే విషయమై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ వరుస సమావేశాలు కానుంది. బడ్జెట్ అంచనాలు పంపాలని కోరుతూ అన్ని శాఖల ఉన్నతాధితారులకు ఆర్థిక శాఖ సర్కులర్ జారీ చేసింది. కొత్త ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని అంచనాలు పంపాల్సిందిగా ఆర్థిక శాఖ సూచనలు చేసింది. ఇక, ఈ నెల 31వ తేదీలోగా అన్ని శాఖలు బడ్జెట్ అంచనాలను పంపాలని ఆర్థిక శాఖ కోరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్టుతో ఏపీ సర్కార్ నెట్టుకొస్తుంది.
తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ:
హైదరాబాద్‌లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ)లో నిర్మించే స్పోర్ట్స్ హబ్‌లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 12 క్రీడల అకాడమీలను ఇందులో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటిలో అంతర్జాతీయ స్థాయి అధునాతన మౌలిక సదుపాయాలు ఉంటాయి. ఈ స్పోర్ట్స్ హబ్‌లో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ కూడా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తారు. కొత్తగా స్థాపించిన సిల్ యూనివర్సిటీ తరహాలోనే తెలంగాణ స్పోర్ట్స్ వర్సిటీకి ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ అనే పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్పోర్ట్స్ హబ్ కోసం అనువైన స్థలంగా ప్రస్తుతం హకీంపేటలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్ లేదా గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను అధికారులు పరిశీలిస్తున్నారు. సదరు క్యాంపస్‌ను ఒలింపిక్స్ స్థాయి అంతర్జాతీయ ప్రమాణాలు ఉండేలా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు.
త్వరలోనే తెలంగాణలోని మరో కొత్త ట్రైన్ మార్గం:
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నిత్యం అనేక రైళ్లు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ ఎప్పటికప్పుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో పలు ప్రాంతాల్లో ట్రాక్ మరమ్మతులు, రైల్వే స్టేషన్ల నిర్మాణం, కొత్త రైల్వే లైన్ల నిర్మాణాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రైల్వే శాఖ ప్రయాణికులకు శుభవార్త అందించింది. తెలంగాణలో మరో కొత్త రైలు మార్గం త్వరలో అందుబాటులోకి రాబోతోందని రైల్వే శాఖ తెలిపింది. అయితే ఈ కొత్త రైలు మార్గం దక్షిణాది అయోధ్యగా పేరొందిన భద్రాద్రి మార్గం గుండా వెళ్లనుంది. ముఖ్యంగా ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. అయితే వచ్చే ఐదేళ్లలో అంటే 2029-30 నాటికి ఈ రైల్వే ప్రాజెక్టును పూర్తి చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. లేదంటే ఒక్క లెవెల్ క్రాసింగ్ కూడా లేకుండా ఈ రైలు రూట్ డిజైన్ చేశారు. కాగా, రైలు మార్గం మొత్తం పొడవు 200.60 కి.మీ. అయితే ఈ మార్గంలో ఏకకాలంలో 301 వంతెనలు నిర్మించనున్నారు. అంటే ప్రతి రెండు కిలోమీటర్లకు మూడు వంతెనలు నిర్మించనున్నారు. అలాగే, ఈ రైలు మార్గంలో మూడు భారీ వంతెనలు, 34 పెద్ద వంతెనలు, 264 చిన్న వంతెనలు, 41 ROBలు మరియు 76 RUBలను నిర్మించనున్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో పొట్టు పొట్టు కొట్టుకున్నారు:
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అరవిల్ పాయింట్ లో ఓ ప్యామిలీ ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. అంతమంది ముందు ఓ మహిళపై ఓ వ్యక్తి చేయి చేసుకోవడంతో మహిళ బంధువులు ఆ వ్యక్తిపై దాడి చేశారు. ఇంతలో ఎయిర్ పోర్టు పోలీసులు ఇద్దరిని అక్కడి నుంచి పంపించారు. మళ్ళీ పార్కింగ్ లో కొట్టుకోవడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. వీరి మొత్తం సమాచారం సేకరించి కేసు నమోదు చేశారు. అయితే ఈ గొడవ శంషాబాద్ ఎయిర్ పోర్టులో కాదు డెహ్రాడూన్ నుంచే ప్రారంభమైందని సమాచారం. రెండు ఫ్యామిలీలు అక్కడి ఎయిర్‌పోర్ట్ లో కొట్టుకున్నారు. అక్కడ సీఐఎస్ఎఫ్ జవాన్లు ఆ రెండు ఫ్యామిలీలను తిట్టి పంపారు. ఫ్లైట్ ఎక్కిన ఆ తరువాత కూడా గొడవ పడ్డారు. అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగగానే మళ్లీ ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంతో పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. ఈ గొడవకు గల కారణం కుటుంబ సమస్యలే అని సమాచారం. డెహ్రాడూన్ లో అమ్మాయిని వేధించారని కారణంతో హైదరాబాద్ చేరుకునేంత వరకు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి ఆర్జిఐ పోలీస్ స్టేషన్ల ఇరు వర్గాలు ఫిర్యాదు చేసుకున్నారని తెలిపారు. ఇద్దరి కుంటుంబంలోని కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వామ్మో.. నాలుకతోనే బయపెట్టేస్తుందిగా:
మన నోటిలో ఉండే నాలుక ఆహారాన్ని రుచి చూడటానికి ఉపయోగపడుతుంది. అయితే నాలుక ఏమి చేయకుండానే కీర్తిని తెస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించగలరా..? ఇకపోతే తాజాగా అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఒక మహిళ ప్రపంచంలోనే అత్యంత విశాలమైన నాలుక (ఆడ) కలిగి ఉన్నట్లు ధృవీకరించబడింది. బ్రిటనీ లకాయో అనే మహిళా ఈ అదృష్టాన్ని పొందింది. బ్రిటనీ లకాయో నాలుక ఏకంగా 7.90 సెం.మీ (3.11 అంగుళాలు) విశాలంగా ఉండడంతో ఈ రికార్డ్ సాధించింది. ఈ వైశ్యాల్యం.. హాకీ పుక్ కంటే వెడల్పు, ఇంకా క్రెడిట్ కార్డ్ వలె వెడల్పుతో సమానం.
సౌరవ్ గంగూలీపై బెంగాలీ నటి ఆగ్రహం:
ఇటీవల కోల్‌కతాలోని ఆర్జీకార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించారు. దోషులను కఠినంగా శిక్షించాలని దాదా డిమాండ్ చేశారు. అయితే ఈ ఒక్క ఘటనతో కోల్‌కతా, వెస్ట్ బెంగాల్ సురక్షితంగా లేదనే వాదన సరికాదన్న దాదాపై బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగూలీ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని.. అత్యంత క్రూరమైన ఘటనను ఓ సాధారణ సంఘటన అని ఎలా అన్నారు? అని ఫైర్ అయ్యారు.
దేవర ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ:
దేవర ఓవర్సీస్ రైట్స్ దక్కించుకునేందుకు పలు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పోటీలో నిలిచాయి. భేరసారాలా అనంతరం దేవర ఓవర్శిస్ డీల్ క్లోజ్ చేసారు మేకర్స్. దేవర చిత్రాన్ని యూఎస్‌లో ప్రత్యంగిరా సినిమాస్, హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాయి. ఇందుకు సంబంధించి అధికారకంగా ప్రకటించారు సదరు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు. దీంతో పాటుగా దేవర ప్రీమియర్స్ ను సెప్టెంబరు 26న ప్రదర్శించబోతున్నట్టు వెల్లడించారు ప్రత్యంగిరా సినిమాస్. మరో వైపు దేవర రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసారు ప్రముఖ నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ. అటు బాలీవుడ్ లో సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కరణ్ జోహార్ దేవర నార్త్ రైట్స్ కొనుగోలు చేసి భారీ స్థాయిలో రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న దేవరకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.