Site icon NTV Telugu

Top Headlines @9PM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

వైష్ణవి హత్య కేసులో వీడని సస్పెన్స్:
కడప జిల్లా గండికోటలో జరిగిన ఇంటర్ విద్యార్థిని వైష్ణవి హత్య కేసులో సస్పెన్స్ ఇంకా వీడలేదు. విద్యార్థిని హత్యపై అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. సోమవారం (జులై 14) ఉదయం 8.30 గంటలకు గండికోటకు చేరుకున్న వైష్ణవి, లోకేశ్‌.. 10:40 గంటలకు లోకేశ్‌ ఒక్కడే తిరిగి వెళ్లినట్లు సీసీ కెమెరాలు చూపిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వైష్ణవి హత్య జరిగినట్లు వైద్యులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. హత్య ఎవరు చేశారు అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే లోకేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వైష్ణవి హత్య కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వైష్ణవి మృతదేహానికి మంగళవారం రాత్రి 10 గంటలకు పోస్టుమార్టం ముగిసింది.

వైఎస్ జగన్ కీలక ప్రెస్‌మీట్:
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేడు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రెస్‌మీట్‌లో పాల్గొననున్నారు. కీలక ప్రెస్‌మీట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, తాజాగా జరుగుతున్న పరిణామాలపై వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడనున్నారు. రైతుల సమస్యలు, గిట్టుబాటు ధరలు, అక్రమ అరెస్టులు, తన పర్యటనలపై ఆంక్షలు సహా తాజా రాజకీయ పరిణామాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది. ప్రతీసారి మీడియా సమావేశానికి జగన్ లెక్కలతో సహా వస్తున్నారు. జగన్ లెక్కలకు కూటమి ప్రభుత్వం సమాధానాలు చెప్పాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. జగన్ కీలక ప్రెస్‌మీట్ నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం:
నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర జల శక్తి కార్యాలయంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా రెండు రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. సమావేశ ఎజెండాలో గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు అంశం పక్కన పెట్టాలని జలశక్తి శాఖ కార్యదర్శికి తెలంగాణ సీఎస్ లేఖ రాసింది. కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను చర్చించి పరిష్కరించాలని జలశక్తి శాఖ మంత్రికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు.

అక్రమాస్తుల కేసులో రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్‌రావు అరెస్ట్:
మాజీ ఈఎన్సీ మురళీధర్‌రావును అక్రమాస్తుల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.200 కోట్ల రూపాయల అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని మురళీధర్‌రావు ఇంటితో పాటు పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఉన్న చర, స్థిరాస్తుల్ని గుర్తించారు. మంగళవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగాయి. జహీరాబాద్‌లో 2 కెవీ విద్యుత్ ప్రాజెక్టు వందల కోట్ల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి మురళీధర్ రావు పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. బినామీ పేర్లతో పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు కనుగొన్నారు. ఇక హైదరాబాద్, కరీంనగర్‌లో భారీ అపార్ట్‌మెంట్లు నిర్మించారు.

విజయ్‌తో జీవితంలో మళ్లీ కలిసి పని చేయకూడదు అనుకున్న:
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా, నిత్య మీనన్ హీరోయిన్ గా కలిసి నటిస్తున్న చిత్రం ‘తలైవన్ తలైవి’. దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. సత్య జ్యోతి ఫిలిమ్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమైంది. అయితే తాజాగా ఈ ‘తలైవన్ తలైవి’ సినిమా ఈవెంట్ లో భాగంగా దర్శకుడు పాండిరాజ్ మాట్లాడిన మాటలు ప్రజంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో, దర్శకుడు పాండిరాజ్, నటుడు విజయ్ సేతుపతి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తాయి. దీంతో ఆ విభేదాల కారణంగా.. ‘జీవితంలో మళ్లీ ఇంకెప్పుడూ కలిసి పనిచేయకూడదని తామిద్దరం నిర్ణయించుకున్నాం. అయితే, ఈ నిర్ణయం ఊహించని విధంగా మారిపోయింది. ప్రముఖ దర్శకుడు మిష్కిన్ పుట్టినరోజు పార్టీలో తామిద్దరం మళ్లీ కలుసుకున్నాం

మైత్రీ, దిల్ రాజు ఔట్:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. మెగా సూర్య బ్యానర్ లో ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 24న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. విడుదలకు కేవలం తొమ్మిది రోజులు ఉన్న హరిహర వీరమల్లు థియేట్రికల్ రైట్స్ విషయంలో ఇంకా తర్జన భర్జన కొనసాగుతుంది. ఆంధ్ర వరకు ఏరియాల వారీగా ఈ సినిమాను విక్రయించారు. కానీ నైజాం ఎవరు అనే దానిపై కొద్దీ రోజలుగా గందరగోళం నెలకొంది. మొన్నటి వరకు మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తుందని టాక్ వినిపించింది. కాదు కాదు దిల్ రాజు నైజాం రైట్స్ కొనుగోలు చేసారని వార్తలు వచ్చాయి. లేటెస్ట్ గా ఆ ఇద్దరు కాదు అమెరికా సుబ్బారావు రైట్స్ దక్కించుకున్నాడు అని ఇలా రోజుకొక పేరు వినిపించింది. అసలు విషయం ఏంటని ఆరాతీయగా అసలు వాళ్ళు ఎవరు కాదు హరిహార నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమాను నైజాంలో సొంతగా రిలీజ్ చేయబోతున్నాడని తెలిసింది. నైజాం రైట్స్ విషయంలో నిర్మాత అటు ఇటుగా రూ. 45 కోట్లు అడుగుతున్నారని సమాచారం. కానీ బయ్యర్స్ రూ. 35 నుండి 38 కోట్లు వరకు కోట్ చేసారు. అటు నిర్మాత ఇటు బయ్యర్స్ మధ్య బేరం ఎటు తెగకపోవండతో సొంతంగా రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు నిర్మాత ఏ ఎం రత్నం.

రవితేజ ఇంట తీవ్ర విషాదం:
సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మరణం మరవక ముందే అలనాటి నటి సరోజ మరణం అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు హీరో రవితేజ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు తుది శ్వాస విడిచారు. ఆయన వయసు ప్రస్తుతం 90 సంవత్సరాలు. నిన్న రాత్రి రవితేజ నివాసంలో ఆయన కన్నుమూసినట్లు సమాచారం.

కారు ఢీకొని ప్రముఖ అథ్లెట్‌ ఫౌజా సింగ్‌ మృతి:
టర్బన్డ్ టోర్నడోగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ అథ్లెట్‌ ఫౌజా సింగ్(114) సోమవారం జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదంలో మరణించారు. జలంధర్-పఠాన్‌కోట్ జాతీయ రహదారిపై కారు ఢీకొని ఫౌజా సింగ్ కన్నుమూశారు. అయితే ఫాజా సింగ్‌ను ఢీకొట్టిన కారును గుర్తించినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. పంజాబ్‌లోని జలంధర్ సమీపంలోని సొంత గ్రామం దగ్గర రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. దీంతో తలకు గాయం అయింది. స్థానికులు ఆయన్ను ఆస్పత్రికి తరలించగా మరణించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ కారు కెనడాలో స్థిరపడ్డ ఎన్నారై అమృత్‌పాల్ సింగ్ ధిల్లాన్‌(30)దిగా గుర్తించి రెండు రోజుల తర్వాత అరెస్ట్ చేశారు. పంజాబ్‌లో రిజిస్టర్ చేయబడిన టయోటా ఫార్చ్యూనర్ కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

150 అడుగుల లోతైన లోయలో పడ్డ కారు:
ఉత్తరాఖండ్ రాష్ట్రం పిథోరాగఢ్ జిల్లాలో మంగళవారం (జులై 15) సాయంత్రం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మువానీ నుంచి బక్టా వెళ్తున్న ఓ కార్ (టాక్సీ) అదుపు తప్పి సుమారు 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదం సోనీ వంతెన సమీపంలో జరిగింది. అందిన సమాచారం ప్రకారం, ఈ టాక్సీలో మొత్తం 13 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలినవారు తీవ్రంగా గాయపడ్డారు.

భారత్, చైనాకు నాటో చీఫ్ వార్నింగ్:
దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొనగా.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపాలని రష్యాపై అమెరికా ఒత్తిడి తెస్తోంది. కానీ పుతిన్ మాత్రం ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. యుద్ధం ఆపేదిలేదని తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రష్యాతో వాణిజ్య సంబంధాలు కలిగిన దేశాలను ఇబ్బంది పెట్టాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి వార్నింగ్ ఇచ్చారు. రష్యాతో సంబంధాలు కలిగిన దేశాలపై 500 శాతం సుంకాలు విధిస్తామని.. భారత్, చైనాలను హెచ్చరించారు. అంతేకాకుండా 50 రోజుల్లో రష్యా శాంతి ఒప్పందాలకు రాకపోతే భారీగా సుంకాలు విధిస్తామని రష్యాను హెచ్చరించారు. ఇలా రష్యాపై అనేక రకాలుగా ఒత్తిళ్లు పెంచుతున్నారు.

ఉక్రెయిన్ ప్రధాని రాజీనామా:
ఉక్రెయిన్ ప్రభుత్వంలో పునర్వ్యవస్థీకరణ చోటుచేసుకుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేర్పులు.. మార్పులకు పూనుకున్నారు. ఇందులో భాగంగా ఉక్రెయిన్ ప్రధాని డెనిస్ ష్మిహాల్ రాజీనామా చేశారు. మంగళవారం ష్మిహాల్ తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అయితే అమెరికా మద్దతుతో రష్యాపై భారీ దాడులకు ఉక్రెయిన్ సిద్ధపడుతోంది. ఇందులో భాగంగానే జెలెన్‌స్కీ ఈ మార్పులు.. చేర్పులకు పూనుకున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version