NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు:
నేడు నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. శుక్రవారం ఉద‌యం 9 గంట‌ల‌కు అసెంబ్లీ ప్రారంభం కానుండగా.. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుంది. ప్రశ్నోత్తరాలలో కడప నగరంలో తాగునీటి సమస్య, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, తణుకులో ఈఎస్‌ఐ ఆసుపత్రి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గిరిజన ప్రాంతాల్లో కనీస సదుపాయాలు, విద్యా శాఖలో ఖాళీలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో మౌళిక సదుపాయాలు, డిస్కంలచే కొనుగోళ్లలో అక్రమాలు, భీమిలీ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ-జూనియర్ కళాశాలలు, మనుషుల అక్రమ రవాణా తదితర సమస్యలపై ఎమ్మెల్యేలు ప్రశ్నలు లేవనెత్తనున్నారు. వాటికి మంత్రులు సమాధానాలు చెబుతారు.

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ:
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ సంచతరించుకుంది. తెల్లవారుజాము నుంచే భక్తుల పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దీంతో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామున 4.30 గంటల నుంచి శివాలయాల్లో మహాన్యాసం, ఏకాదశ రుద్రాభిషేకంతో పూజలు ప్రారంభమయ్యాయి. కార్తీకమాసంలో చేసే స్నానం, జపం, తపస్సు, దానధర్మాలు, ఉపవాసాలు అనంత పుణ్యఫలాలను ఇస్తాయని కార్తీక పురాణం చెబుతోంది. అందుకే ఈ ఏడాదంతా ఎలా ఉన్నా.. ఆ స్వామిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ మాసమంతా ఆధ్యాత్మిక ఆనందమయ వాతావరణం.

ప్రజా పాలన విజయోత్సవ వేడుకలపై సీఎం:
ప్రజాపాలన- విజయోత్సవాలపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం ముగిసింది. డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలపై చేపట్టే కార్యక్రమాలను సీఎంకు అధికారులు వివరించారు. ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రేవంత్ సూచించారు. ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో సీఎం పాల్గొననున్నారు. మహిళల సాధికారత, రైతుల సంక్షేమం, యూత్ ఎంపవర్మెంట్ కు సంబంధించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది.

కోటి దీపోత్సవంలో ఏడవ రోజు కార్యక్రమాలు:
కోటి దీపోత్సవంలో ఇప్పటికే ఆరు రోజులు విజయవంతంగా ముగిశాయి. నేడు కోటి దీపోత్సవంలో ఏడవ రోజు. కార్తీక పౌర్ణమి వేళ ఈరోజు జరిగే విశేష కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందాం. నేడు పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ (అవధూత దత్తపీఠం, మైసూరు) అనుగ్రహ భాషణం చేయనున్నారు. మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు గారు ప్రవచనామృతం వినిపించనున్నారు. వేదికపై స్వర్ణలింగానికి రజత బిల్వార్చన, అష్టోత్తరశత స్వర్ణపుష్పార్చన ఉంటుంది. భక్తులచే మహాకాళేశ్వరునికి కోటి పుష్పార్చన చేయిస్తారు. అగ్నిలింగ క్షేత్రం తిరువణ్ణామలై శ్రీ అరుణాచలేశ్వర స్వామి కల్యాణం జరుగుతుంది. పల్లకీ వాహన సేవ ఉంటుంది.

ఏడు కోట్లు విలువైన ఏనుగు దంతాలు:
చెన్నై నగరంలో స్మగ్లింగ్ సంబంధించిన ఓ విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనలో సుమారు 7 కోట్లు పైగా విలువ చేసే ఏనుగు దంతాలతో తయారు చేసిన 4 ఏనుగు బొమ్మలను స్వాదినం చేసుకున్నారు చెన్నై అటవీశాఖ అధికారులు. నగరంలోని విల్లుపురం కొత్త బస్ స్టేషన్ సమీపంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ బొమ్మలకు సంబంధించి బేరమాడి విక్రయిస్తుండగా అటవీశాఖ అధికారులు, విల్లుపురం పోలిసు అధికారులు అరెస్టు చేసారు. ఈ ఘటనలో చెన్నై, తిరుచ్చి, తంజావూరు, దిండిగల్‌, ధర్మపురి జిల్లాలకు చెందిన 12 మంది స్మగ్లర్లు అరెస్టు అయినట్లు అధికారులు తెలిపారు.

వరుసగా రెండోరోజూ ఢిల్లీని కమ్మేసిన పొగమంచు:
దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కురుస్తుంది. వరుసగా రెండోరోజు గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) తీవ్రస్థాయికి చేరుకుంది. గురువారం ఉదయం వరకు 428గా నమోదైంది. దీంతో కట్టడి చర్యల్లో భాగంగా ఢిల్లీ- ఎన్‌సీఆర్‌ పరిధిలో గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ (GRAP) 3 అమలు చేస్తున్నట్లు ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ పేర్కొనింది. కాగా, ఈరోజు (శుక్రవారం) నుంచి ఆంక్షలు అమల్లోకి రాబోతున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దాదాపు 300 విమాన సర్వీసులు లేట్ గా నడుస్తున్నాయని అధికారులు చెప్పుకొచ్చారు. వాయు కాలుష్యం తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రాథమిక పాఠశాలలు (5వ తరగతి వరకు) వర్చువల్ క్లాసులు నిర్వహించాలని సీఎం ఆతిశీ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఇవి అమలులో ఉంటాయని పేర్కొన్నారు.

సిరియాపై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్:
ఇజ్రాయెల్ డమాస్కస్ పశ్చిమ శివార్లలో, రాజధాని శివారులో రెండు వైమానిక దాడులను నిర్వహించింది. ఈ దాడిలో కనీసం 15 మంది మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు. డమాస్కస్‌లోని మజే పరిసరాల్లో, రాజధానికి వాయువ్యంగా ఉన్న ఖుద్‌సయా శివారులో వైమానిక దాడుల్లో రెండు భవనాలు దెబ్బతిన్నాయి. నేలమాళిగను ఢీకొన్న క్షిపణి ధాటికి ఐదు అంతస్తుల భవనం దెబ్బతింది. సిరియాలోని ఇస్లామిక్ జిహాద్ టెర్రరిస్టు గ్రూప్‌కి చెందిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సైట్‌లు, కమాండ్ సెంటర్‌లపై దాడి చేసి తీవ్రవాద సంస్థ కమాండ్ సెంటర్, దాని కార్యకర్తలకు గణనీయమైన నష్టాన్ని కలిగించిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

రిటైర్మెంట్‌ ప్రకటించిన టిమ్‌ సౌథీ:
న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్, మాజీ కెప్టెన్ టిమ్‌ సౌథీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు తన సారథ్యానికి గుడ్‌బై చెప్పేశాడు. తాజాగా టెస్టు ఫార్మాట్‌కే వీడ్కోలు పలికేందుకు రెడీ అయ్యాడు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరగనున్న సిరీసే చివరిదని అతడు పేర్కొన్నాడు. హామిల్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. అక్కడే తన ఆఖరి మ్యాచ్‌ను టిమ్‌ సౌథీ ఆడనున్నారు. కివీస్‌ తరఫున 104 టెస్టులు ఆడిన సౌథీ 2,185 రన్స్ చేశారు. బౌలింగ్‌లో 385 వికెట్లు తీసుకున్నాడు. 161 వన్డేల్లో 742 పరుగులు, 221 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయంగా 125 టీ20లు ఆడిన టీమ్ సౌథీ 303 రన్స్, 164 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లోనూ 54 మ్యాచుల్లో 120 పరుగులు, 47 వికెట్లు పడగొట్టాడు.

నేడు దక్షిణాఫ్రికాతో భారత్‌ ఆఖరి టీ20:
నేడు టీ20 సిరీస్‌లో చివరిదైన నాలుగో మ్యాచ్‌లో భారత్ ఈరోజు (శుక్రవారం) దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. ఇప్పటికే రెండు విజయాలు సాధించినా.. బ్యాటింగ్‌లో టీమిండియా తడబడుతోంది. సంజు శాంసన్, తిలక్‌ వర్మల శతకాలు సిరీస్‌లో ఆ టీమ్ ను ముందంజలో నిలిపాయి. కానీ, జట్టు సమష్టిగా మెరవాల్సిన అవసరం ఉంది. అయితే, సెంచరీ తర్వాత సంజూ వరుసగా రెండు మ్యాచ్ లలోనూ డకౌట్ అయ్యాడు. అలాగే, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం మూడు మ్యాచ్ ల్లో కేవలం 26 రన్స్ మాత్రమే చేశాడు. హర్థిక్ పాండ్యా జట్టుకు భరోసా ఇవ్వలేకపోతున్నాడు. భారత్‌కు సిరీస్‌ దక్కాలంటే బ్యాటుతో పాటు బంతితో పుంజుకోవడం చాలా కీలకం. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ.. మూడో టీ20 మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో ఫామ్‌ను అందుకోవడం శుభ సూచకంగా చెప్పుకొవచ్చు.

ప్రముఖ లిరిసిస్ట్ మృతి:
ప్రముఖ కన్నడ లిరిసిస్ట్ శ్యామ్ సుందర కులకర్ణి కన్నుమూశారు. శ్యామ్ సుందర కులకర్ణి అక్టోబర్ 31న కన్నుమూశారు. ఎన్నో ప్రముఖ పాటలకు సాహిత్యం అందించిన శ్యామ్ సుందర కులకర్ణి మరణవార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్యామ్ సుందర కులకర్ణి గత పదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అక్టోబర్ 31న కన్నుమూశారు. శ్యామ్ సుందర కులకర్ణి మరణవార్త పెద్దగా ప్రచారం పొందకూడదని కోరుకున్నారు. అలా శ్యామ్ సుందర కులకర్ణి పర లోకానికి వెళ్లిపోయారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ సినీ రచయిత శ్యామ్ సుందర కులకర్ణి జర్నలిజంలో కూడా గుర్తింపు పొందారు. ఆయన వ్యాసాలు పాఠకులను ఆకట్టుకున్నాయి. నటుడు డాక్టర్ రాజ్‌కుమార్, నటి కల్పన వంటి ప్రముఖ కళాకారులను శ్యామ్ సుందర కులకర్ణి ఇంటర్వ్యూ చేశారు.

యముడు ఫస్ట్ లుక్ రిలీజ్:
జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరో గా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం “యముడు”. ధర్మో రక్షతి రక్షిత అనే ఉప శీర్షిక తో వస్తున్నా థ్రిల్లర్ చిత్రం షూటింగ్ అంత పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ మాసం లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం లో శ్రావణి శెట్టి హీరోయిన్ గా నటించింది మరియు ఆకాష్ చల్లా రెండో హీరోగా నటించారు. అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈరోజు ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా విడుదల చేశారు.