‘ప్రోబా-3’ మిషన్ విజయవంతమైంది:
శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ59 వాహక నౌక నింగిలోకి నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. గురువారం సాయంత్రం 4.04 గంటలకు వాహక నౌక కక్ష్యలోకి ప్రవేశించింది. సాంకేతిక లోపం కారణంగా బుధవారం చేపట్టాల్సిన ప్రయోగం నేటికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రయోగం విజయవంతమైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్ సోమ్‌నాథ్ తెలిపారు. ప్రయోగం విజయవంతంతో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ‘రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. అనుకున్న కక్షలోకి ప్రోబా-3 ఉపగ్రహాన్ని చేర్చింది. ఈ విజయం ఇస్రో కుటుంబ సభ్యులందరిదీ. పీఎస్‌ఎల్‌వీ-సీ60 రాకెట్‌ను త్వరలోనే ప్రయోగిస్తాం. సూర్యుడిపై మరిన్ని పరిశోధనలు చేస్తాం. ఎన్ఎస్‌ఐఎల్ భాగస్వామ్యంతో ఈ ప్రయోగం చేపట్టాం. పీఎస్‌ఎల్‌వీకి మరిన్ని అవకాశాలు కల్పించిన ఎన్‌ఎస్‌ఐఎల్‌కు ధన్యవాదాలు. డిసెంబరులో స్పేటెక్స్ పేరుతో పీఎస్‌ఎల్‌వీ-సీ60 ప్రయోగం ఉంటుంది. ఈ ఉపగ్రహంతోనే ఆదిత్య ఎల్-1 సోలార్ మిషన్ కొనసాగుతుంది’ అని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమ్‌నాథ్ చెప్పారు.
గన్నవరం విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం:
గన్నవరం విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్ల కలకలం రేపింది. విజయవాడలోని కేయల్ యూనివర్సిటీ నుండి ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆర్య అనే విద్యార్థి వద్ద బుల్లెట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎయిర్‌పోర్ట్ ఎంట్రన్స్ వద్ద విద్యార్థి బ్యాగులో రెండు బుల్లెట్లను పోలీసులు గుర్తించారు. విద్యార్థి ఆర్య నుంచి బుల్లెట్లను స్వాధీనం చేసుకుని.. గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మహిళా సంఘాలకు గుడ్‌న్యూస్:
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయిందని, రోజుకో శాఖను తాను పరిశీలిస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ చెప్పారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా కృషి చేస్తామన్నారు. ‘మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం. మొదటి విడుతలలో మహిళా శక్తి క్యాంటీన్ లను ప్రారంభించాం. ఎంజీఎం ఆసుపత్రిలో నూతన ఓపి కేంద్ర ప్రారంభించాం. ఆసుపత్రిలో నూతనంగా ఫార్మాసీ కేంద్రం ఏర్పాటు చేశాం. డయాలసిస్ యూనిట్ కేంద్రంను ఏర్పాటు చేస్తాం. మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తాం’ అని తెలిపారు.
బీజేపీకి భారీ షాక్:
బీజేపీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎంపీ సోయం బాపు రావు కాంగ్రెస్ లో చేరారు. బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ కండువు కప్పుకున్నారు. ఆయనతో పాటుగా అత్రం సక్కు కూడా హస్తం గూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బీజేపీకి రాజీనామా చేశా. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్శితున్ని అయ్యాను. అన్నీ మతాలను నేను గౌరవిస్తాను. కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తా’ అని పేర్కొన్నారు.
హేమంత్ సోరెన్ కేబినెట్ విస్తరణ:
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తాజాగా కేబినెట్ విస్తరణ చేశారు. గురువారం 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. జేఎంఎం నుంచి ఆరుగురు, కాంగ్రెస్ నుంచి నలుగురు, ఆర్జేడీ నుంచి ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు. కొత్త ప్రభుత్వంలో జేఎంఎంకు చెందిన హేమంత్ సోరెన్‌తో పాడు ఏడుగురు ఉన్నారు. కొత్తగా చేరిన మంత్రుల్లో జేఎంఎంకు చెందిన స్టీఫెన్ మరాండీ, రాందాస్ సోరెన్, దీపక్ బీరువా, కాంగ్రెస్‌కు చెందిన రాధా కృష్ణ కిషోర్, దీపికా పాండే సింగ్, ఆర్జేడీకి చెందిన సంజయ్ ప్రసాద్ యాదవ్ ఉన్నారు. కేబినెట్‌లో కొత్త వారికే హేమంత్ అవకాశం ఇచ్చారు. రాంచీలోని రాజ్‌భవన్‌లో మంత్రులతో గవర్నర్ సంతోష్ గంగ్వార్ ప్రమాణ స్వీకారం చేయించారు.
అధికార మార్పిడిపై డీకే కీలక వ్యాఖ్యలు:
కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చాక ముఖ్యమంత్రి పీఠంపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ల మధ్య పోటీ తప్పలేదు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం సిద్దరామయ్యకే సీఎం పీఠం అప్పగించి.. డీకేకు ఉప ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టింది. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కీలక పాత్ర పోషించిన డీకేకు సీఎం పదవి రాకపోవడంపై పలువురు కాంగ్రెస్ నేతలు గతంలో బాహాటంగానే అధిష్టానంపై విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా అధికార మార్పిడిపై డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కన్నడ కాంగ్రెస్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి పదవి విషయంలో రహస్య ఒప్పందం ఏదో కుదిరినట్లు వస్తున్న వాదనలకు బలం చేకూర్చేలా డీకే వ్యాఖ్యలు చేశారు. దీంతో మళ్లీ అధికార పంపిణీ వ్యవహారంపై చర్చ జరుగుతోంది. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో డిప్యూటీ సీఎం డీకే మాట్లాడుతూ.. ‘అధికార పంపిణీ ఒప్పందం జరిగిన విషయం వాస్తవమే. ఆ వివరాలను బహిర్గతం చేయలేను. దీనిపై అధిష్ఠానాన్ని నేను బ్లాక్‌మెయిల్ చేయను. నేను గాంధీ కుటుంబానికి వీరవిధేయుడిని. అందులో మరో మాట లేదు’ అని డీకే తేల్చి చెప్పారు.
గాజా సమస్య పరిష్కారానికి మద్దతునిస్తాం:
పార్లమెంట్‌లో ప్రశ్నోత్తరాల సమయంలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ మాట్లాడుతూ.. గాజా సమస్యకు ‘ద్విదేశ’ పరిష్కారానికి తాము మద్దతు ఇస్తామని తెలిపారు. గాజాపై చేసే ఏ తీర్మానంలోనైనా ఉగ్రవాదం, హమాస్ బందీల అంశం ప్రస్తావించకపోతే.. అది వాస్తవిక పరిస్థితిని ప్రతిబింబించదన్నారు. అయితే, భారత్ స్వయంగా ఉగ్రవాద బాధిత దేశమన్నారు. అలాంటిది మనమే టెర్రరిజాన్ని విస్మరించడం, తక్కువగా చూపడం మన ప్రయోజనాలకే విరుద్ధమని వెల్లడించారు. ఎలాంటి తీర్మానాన్ని అయినా.. అందులో వాడిన పదాలతో సహా పరిపక్వతతో భారత్ చూస్తుందని చెప్పారు. ఉగ్రవాదాన్ని, ప్రజలను బంధించడాన్ని ఢిల్లీ ఖండిస్తుందని జైశంకర్ పేర్కొన్నారు.
థియేటర్‌పై రాళ్ల దాడి:
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఉదయం సినిమా థియేటర్ పై రాళ్లతో దాడి చేసిన వారిపై కేసు నమోదు అయింది. పుష్ప సినిమా వేయకపోవడంతో రాళ్ళతో థియేటర్ పై దాడి చేశారు అభిమానులు. బజ్జూర్ వినయ్ తో పాటు అతని అనుచరులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు పోలీసులు. 04న చెన్నూరుకు చెందిన బజ్జూరి వినయ్, కొంతమంది తన అనుచరులతో కలిసి చెన్నూరులోని శ్రీనివాస థియేటర్ ప్రోప్రైటర్ అయిన కుర్మ రాజమల్ల గౌడ్ వద్దకు వెళ్లి పుష్ప-2 సినిమా థియేటర్లో ఎందుకు ప్రదర్శించడం లేదని అడిగాడు. దానికి రాజమల్ల గౌడ్ థియేటర్ మరమ్మత్తులో ఉన్నందున సినిమాను ప్రదర్శించడం లేదని చెప్పగా దానికి వినయ్ మరియు అతని అనుచరులు పుష్ప-2 సినిమాను థియేటర్లో వేయకపోతే నీ అంత చూస్తామని చెప్పి బెదిరించారు. అనంతరం తన అనుచరులతో కలిసి శ్రీనివాస థియేటర్ వద్దకు వెళ్లి గేటుకు ఉన్న తాళాలు పగలగొట్టి అక్రమంగా లోపలికి ప్రవేశించి రాళ్లతో థియేటర్ అద్దాలను ధ్వంసం చేసి నష్టపరిచారని థియేటర్ ప్రొప్రైటర్ కుర్మా రాజమల్ల గౌడ్ ఫిర్యాదు మేరకు బజ్జూరు వినయ్ మరియు అతని అనుచరులపై కేసు నమోదు చేశారు.
జబర్దస్త్ రామ్ ప్రసాద్ కు గాయాలు:
జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. రాంప్రసాద్ ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ కావడంతో అతడికి స్వల్ప గాయాలైనట్లు చెబుతున్నారు. గురువారం ఉదయం షూటింగ్ కి వెళుతున్న క్రమంలో తుక్కుగూడ సమీపంలో రాంప్రసాద్ ప్రయాణిస్తున్న కారు.. ముందు వెళ్తున్న కారును ధి కొట్టింది. ముందు కారు బ్రేక్ వేయడంతో రాంప్రసాద్ ప్రయాణిస్తున్న కారు ఆ కారును ఢీకొన్నట్లు తెలుస్తోంది. రాంప్రసాద్ కారును వెనుక నుండి ఆటో ఢీకొట్టిందని తెలుస్తోంది.
టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు:
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024లో భాగంగా సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో బరోడా 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 349 పరుగులు చేసింది. భాను పునియా 134 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో బరోడా ఇన్నింగ్స్‌లో మొత్తం 37 సిక్సర్లు నమోదయ్యాయి. దీనితో టీ20 క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టీంగా ప్రపంచ రికార్డును సృష్టించింది. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు జింబాబ్వే పేరుపై ఉంది. ఈ ఏడాది అక్టోబరు 23న గాంబియాపై 344 పరుగులు చేసింది. ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ అయింది.