NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

బైక్‌పై టపాసులు తీసుకెళ్తుండగా పేలుడు:
దీపావళి పండుగ రోజున ఏలూరు నగరంలో విషాదం చోటు చేసుకుంది. టపాసులను బైక్‌పై తీసుకెళ్తుండగా ఒక్కసారి పేలిపోయాయి. బండి గోతిలో పడి టపాసులు రాపిడికి గురై పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ పేలుడు దాటికి వాటిని తరలిస్తున్న వ్యక్తి శరీరం ముక్కలు ముక్కలుగా ఎగిరిపడింది. పేలుడు దాటికి యాక్టివా బండి పూర్తిగా దగ్ధమైంది. సమీపంలో ఉన్న నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు దాటికి ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. మృతుడు దుర్గాసి సుధాకర్‌గా గుర్తించారు. ఇక ఈ ఘటనలో తాబేలు సాయి, సతీష్, శశి, శ్రీనివాస్, పెద్దిరాజు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ పేలుడుపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సుధాకర్‌ మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

రేపు శ్రీకాకుళంలో సీఎం పర్యటన:
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో మహిళలకు దీపం పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. మొదట 833 రూపాయలు డబ్బులు చెల్లించి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తే 48 గంటల్లోపు కస్టమర్ల ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. దీపావళి పండుగ రోజు నుంచి ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ ప్రారంభించనున్నారు. ప్రతి 4 నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా ఏపీ సర్కార్ ఇవ్వనుంది. దీంతో ఏపీలో ఉచిత గ్యాస్‌ సిలిండర్లకు బుకింగ్‌లు జోరుగా జరుగుతున్నాయి. ఉచిత గ్యాస్ సిలిండర్‌ పథకానికి గ్యాస్ కనెక్షన్‌తో పాటు రేషన్ కార్డు, ఆధార్‌ కార్డును ప్రాతిపదికగా నిర్ణయించారు. పథకంలో భాగంగా వినియోగదారులు తొలుత సిలిండర్ కోసం నగదు చెల్లించాల్సి ఉంటుంది. అయితే గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన రెండు రోజులలోపే వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ మొత్తం జమచేస్తారు.

హైదరాబాద్‌లో రెండు చోట్ల హాష్ ఆయిల్ సీజ్:
హైదరాబాద్‌లో రెండు చోట్ల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో హాష్ ఆయిల్ పట్టుకున్నారు. బండ్లగూడలో 300 ఎంఎల్ హాష్ ఆయిల్‌ను టీఎస్ఎన్ఏబీ అధికారులు సీజ్ చేశారు. ఓ కిలేడీ లేడీ గుట్టు చప్పుడు కాకుండా హాష్ ఆయిల్ విక్రయిస్తుంది. విశ్వసనీయ సమాచారం మేరకు బండ్లగూడలో రహీమ్ ఉన్నీసా అనే లేడీ ఇంట్లో అధికారులు సోదాలు జరిపారు. చిన్న చిన్న బాటిల్స్‌లో హాష్ ఆయిల్‌ను పోలీసులు గుర్తించారు. విక్రయానికి రెడీగా ఉన్న హాష్ ఆయిల్‌ను సీజ్ పోలీసులు చేశారు. లేడి కిలాడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

మైనర్ బాలికపై అత్యాచారం:
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్‌లో దారుణం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమై.. ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఇన్‌స్టాలో వికారాబాద్ జిల్లా బషీరాబాద్ (మం) జివంగి గ్రామానికి చెందిన చెందిన వినీల్ (19), న్యాల్కల్‌కి చెందిన ఓ బాలిక(16)తో పరిచయం ఏర్పడింది. ఏడు నెలలుగా ప్రేమ పేరుతో ఇన్‌స్టాలో బాలికతో చాటింగ్, కాల్స్ చేశాడు. ఇటీవల యువకుడు బాలిక గ్రామానికి వచ్చి.. ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.

బీపీఎల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ వ్యవస్థాపకుడు కన్నుమూత:
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బీపీఎల్ ​​వ్యవస్థాపకుడు టీపీజీ నంబియార్(95) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలు కారణంగా గురువారం తెల్లవారుజామున బెంగళూరులోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆరోగ్యం బాగోలేదని.. ఈ కారణం చేతనే నంబియార్ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈ మేరకు నంబియార్ అల్లుడు, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ ఎక్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. బీపీఎల్ అనేది.. భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ వస్తువుల్లో ఒక బ్రాండ్‌. ఎన్ని కంపెనీలు వచ్చినా.. నేటికీ బీపీఎల్‌కి మంచి ప్రజాదారణ ఉంది.

ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు బిగ్ షాక్:
మహారాష్ట్ర ఎన్నికల వేళ హస్తం పార్టీకి భారీ షాక్ తగిలింది. నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న రవి రాజా.. పార్టీకి గుడ్‌బై చెప్పారు. హస్తానికి బైబై చెప్పి కమలం గూటికి చేరారు. దీపావళి పండుగను పురస్కరించుకుని గురువారం డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో రవి రాజా బీజేపీలో చేరారు. పార్టీ కండువా కప్పి రవి రాజాను బీజేపీలోకి ఆహ్వానించారు. బీజేపీలో చేరే ముందు 44 ఏళ్లు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని రాజీనామాతో రవి రాజా తెంచేసుకున్నారు.

19 ఏళ్ల రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు:
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కెరీర్ ఆరంభంలో ఆడిన రెండు ఇన్నింగ్స్‌లను ఎవరూ మర్చిపోరు. పాకిస్తాన్‌పై 148 రన్స్, శ్రీలంకపై 183 రన్స్ బాదాడు. ముఖ్యంగా రాజస్థాన్‌లోని జైపుర్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఆడిన 183 భారీ ఇన్నింగ్స్‌ అందరికీ గుర్తుంటుంది. సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడి వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 145 బంతుల్లో 183 పరుగులతో మహీ నెలకొల్పిన రికార్డును గత 19 ఏళ్లుగా ఎవరూ బద్దలుకొట్టలేకపోయారు. ధోనీ శ్రీలంకపై 10 సిక్స్‌లు, 15 ఫోర్లతో మైదానంలో పరుగుల వరద పారించాడు. అంతకుముందు 2004లో ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ పేరిట ఉన్న 172 పరుగుల రికార్డు బద్దలైంది. ఇప్పటికీ వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌గా ధోనీ కొనసాగుతున్నాడు.

దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన:
భారత్‌తో స్వదేశంలో జరిగే టీ 20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికా బోర్డు జట్టును ప్రకటించింది. ఐడెన్ మార్క్రామ్ ఆఫ్రికన్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఫాస్ట్ బౌలర్లు మార్కో జెన్సన్, గెరాల్డ్ కోయెట్జీలు జట్టులోకి వచ్చారు. టీ20 జట్టులో అన్రిజ్ నోకియా, తబ్రేజ్ షమ్సీకి చోటు దక్కలేదు. నవంబర్ 8 నుంచి భారత్, దక్షిణాఫ్రికాల మధ్య 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే టీమిండియా జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.

‘గేమ్ ఛేంజర్’ టీజర్ డేట్ వచ్చేసింది:
తమ అభిమాన హీరో సినిమా నుంచి ఏ చిన్న అప్‌డేట్‌ వచ్చినా.. ఫ్యాన్స్‌ తెగ సంబరపడతారు. అందులోనూ ‘మెగా’ మూవీ నుంచి వస్తే.. ఇక వారికి పండగే అని చెప్పాలి. దీపావళి రోజు మెగా అభిమానులకు ఓ శుభవార్త. గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ నటిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి ఓ అప్‌డేట్‌ వచ్చింది. గేమ్ ఛేంజర్ టీజర్‌ను నవంబర్ 9న రిలీజ్ చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ తెలిపింది. ఈ సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. టీజర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ.. ఓ కొత్త పోస్టర్ కూడా చిత్ర నిర్మాణ సంస్థ పంచుకుంది. ఈ పోస్టర్‌లో రామ్‌ చరణ్‌ లుంగీ కట్టి మాస్ లుక్‌లో అదరగొట్టారు. విలన్‌ను చరణ్ చితకబాది పట్టాలపై వేసి కూర్చుకున్నట్లు అనిపిస్తోంది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయింది.