NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

వెన్నెల సంఘటనపై స్పందించిన పవన్:
పదోతరగతి విద్యార్థి వెన్నెల తల్లిదండ్రులు మధురపూడి విమానాశ్రయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. తమ కుమార్తె విషయంను పవన్ దృష్టికి వెన్నెల కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. వెన్నెల ఆత్మహత్యకు పాఠశాల యాజమాన్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ నేడు పవన్‌ కాన్వాయ్‌కి అడ్డుపడ్డారు. మధ్యాహ్నం వచ్చి మాట్లాడతానని డిప్యూటీ సీఎం పవన్‌ వారికి భరోసా ఇచ్చారు.

ఇదో ఆచారమట మరి:
దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఓ వింత ఆచారంను పాటించారు. దోర్నాల మండలం వై.చర్లోపల్లిలో దీపావళి పండుగ సందర్భంగా ఓ వింత ఆచారాన్ని గ్రామస్తులు ఆనవాయితీగా నిర్వహించారు. దీపావళి నేపథ్యంలో గ్రామస్తులు అందరూ గ్రామంలోని ఆవులను ఓ చోటకు చేర్చి.. ప్రత్యేక పూజలు చేశారు. ఆపై టపాసులు పేలుస్తూ.. ఆవులను గ్రామంలో పరిగెత్తించారు. ఇలా చేయడం ద్వారా గ్రామానికి మేలు జరుగుతుందని చర్లోపల్లి గ్రామస్థులు నమ్ముతారు. ప్రతి దీపావళికి ఇలా ఆవులను పరిగెత్తించడం తమ పూర్వికుల నుంచి వస్తున్న ఆనవాయితీ అని గ్రామస్తులు చెబుతున్నారు.

కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా:
శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటో కంచిలి మండలం బారువా సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలు అయ్యాయి. నలుగురు కూలీలకు తీవ్ర గాయాలు కాగా.. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంకు చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇస్సకోడేరులో జాతీయ రహదారిపై కారు బీభత్సం స్టూష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు.. ఏకంగా ఐదు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలు అయ్యాయి. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు.

రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తా:
పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎక్స్ లో కేటీఆర్ ప్రజలతో మాట్లాడుతూ.. పలువురు మీరేప్పుడు పాదయాత్ర చేస్తారని అడిగారు. దీనికి స్పందించిన కేటీఆర్.. ఖచ్చితంగా పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సంభాషణలో కేటీఆర్ అనేక అంశాలపై తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పాలన ఒక శాపంగా మారిందన్నారు. అబద్ధపు హామీల మీద ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతకంటే గొప్ప పరిపాలన ఆశించలేమన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ వేధింపులను ప్రారంభించిందన్నారు.సన్నవడ్లకు కూడా బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ హామీ.. బోగస్ గా మారిందని కేటీఆర్ అన్నారు.

మద్యం అమ్మకాల్లో మనమే టాప్:
మద్యం విక్రయాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణ భారతదేశంలో మద్యం విక్రయాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా.. ఏపీ రెండో స్థానంలో ఉంది. ఢిల్లీలోని ఎన్‌ఐపీఎఫ్‌పీ ప్రకారం తెలంగాణలో గతేడాది సగటు వ్యక్తి మద్యం కోసం రూ.1,623 ఖర్చు చేయగా.. ఏపీలో రూ.1,306 ఖర్చు చేశారు. పంజాబ్‌లో రూ.1,245, ఛత్తీస్‌గఢ్‌లో రూ.1,227 ఒక్కో వ్యక్తి ఖర్చుచేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మద్యంపై తక్కువ ఖర్చు చేస్తున్నాయని తెలిపింది. తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలు, వెయ్యికి పైగా బార్లు, పబ్బులు ఉన్నాయి. దసరా సందర్భంగా దాదాపు రూ.1,000 కోట్ల మద్యం విక్రయాలు జరిగిన విషయం తెలిసిందే. 11 లక్షల కేసుల మద్యం, 18 లక్షల కేసుల బీర్లు విక్రయించిన సంగతి తెలిసిందే. దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా బీరు కొనుగోలు చేస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో బీర్ల కోసం రూ.302.84 లక్షలు ఖర్చు చేసినట్లు అంచనా. తెలంగాణలో మద్యం విక్రయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తోంది.

రోజుకు ఎన్ని సిగరెట్లు తాగడంతో సమానమో తెలుసా :
ఢిల్లీ గాలి పీల్చడం సిగరెట్ తాగినట్లుగా మారింది. ఢిల్లీ ఏక్యూఐ చాలా చోట్ల 300 కంటే ఎక్కువగా ఉంది. ఇది ఆరోగ్యానికి హానికరం అని చెప్పబడింది. ఈ సమయంలో ఢిల్లీ గాలి పీల్చడం సిగరెట్ తాగడంతో సమానమట. ఢిల్లీలోని గాలిలో కాలుష్య కారకాలు ఎక్కువగా ఉన్నాయని, ప్రతిరోజూ ఢిల్లీలోని గాలిని పీల్చడం 40 సిగరెట్లు తాగడంతో సమానమని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. ఢిల్లీలో కాలుష్యం అంతగా పెరగడానికి అనేక కారణాలున్నాయి. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో గాలిలో హానికరమైన వాయువులు, కణాలను విడుదల చేసే అనేక పరిశ్రమలు ఉన్నాయి. ఢిల్లీలో వాహనాల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడంతో వాటి నుంచి వెలువడే పొగ గాలిని కలుషితం చేస్తోంది.

ఎన్నికల బరిలో 7,994 మంది అభ్యర్థులు:
నవంబర్ 20వ తేదీన జరగనున్న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ఇటీవల ముగిసింది. 288 అసెంబ్లీ స్థానాల్లో పోటీ పడేందుకు మొత్తం 7,994 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగినట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది. వారిలో 921 మంది నామినేషన్ పేపర్లను అధికారులు తిరస్కరించినట్లుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఒకరు చెప్పుకొచ్చారు. ఎన్నికలకు అభ్యర్థుల నామినేషన్‌ దాఖలు ప్రక్రియ అక్టోబర్‌ 22వ తేదీన ప్రారంభమై 29తో ముగిసింది. అక్టోబర్‌ 30వ తేదీన నామినేషన్‌ పత్రాల పరిశీలన కూడా పూర్తైంది. అభ్యర్థిత్వాల ఉప సంహరణకు నవంబర్ 4వ తేదీ లాస్ట్.

లంచ్‌ బ్రేక్‌ వరకు న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే:
ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో భారత బౌలర్లు కట్టుదిట్టంగానే బౌలింగ్ చేస్తున్నారు. మొదటిరోజు లంచ్‌ బ్రేక్ సమయానికి కివీస్ 3 వికెట్ల నష్టానికి 92 రన్స్ చేసింది. క్రీజ్‌లో విల్‌ యంగ్ (38), డారిల్ మిచెల్ (11) ఉన్నారు. ఓపెనర్‌ డెవన్ కాన్వే (4)ను ఔట్‌ చేసిన ఆకాశ్‌ దీప్‌ టీమిండియాకు తొలి బ్రేక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ రంగంలోకి స్పిన్నర్లను దించాడు. దీంతో వాషింగ్టన్‌ సుందర్, రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజా పదునైన బౌలింగ్‌తో న్యూజిలాండ్ జట్టును అడ్డుకున్నారు.

తొలి రోజు అదరగొట్టిన క:
క సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 6.18 కోట్లు రాబట్టింది.ఈ ఓపెనింగ్ కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా దీపావళికి కేవలం తెలుగులో మాత్రమే విడుదలైంది. రానున్న వారం తమిళ్, కన్నడ, మలయాళం, హింది బాషలలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. చాలా కాలంగా హిట్లు లేక సతమతమవుతున్న కిరణ్ అబ్బవరానికి ‘క’ మంచి బూస్ట్ ఇచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్టుగానే హిట్టు కొట్టి మరి చూపించారు ఈ యంగ్ హీరో.

Show comments