రిజిస్ట్రేషన్లలో ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలు అందించాలి
రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలు అందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అద్దెలు, విద్యుత్ ఛార్జీలు, అద్దె వాహనాల ఛార్జీలు మొదలైన వాటికి అవసరమైన బడ్జెట్ అవసరాలను త్వరలో క్లియర్ చేస్తామన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రిజిస్ట్రేషన్ శాఖకు శాశ్వత ప్రభుత్వ భవనాల ఆవశ్యకతను మంత్రి ప్రస్తావిస్తూ, త్రిముఖ వ్యూహాన్ని రూపొందిస్తున్నామని, దీని కింద అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రెండేళ్లలో ప్రభుత్వ భవనాల్లో పనిచేయడం ప్రారంభిస్తాయని ఆయన అన్నారు. 2014లో రూ.2,746 కోట్లుగా ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గతేడాది 14,588 కోట్లకు చేరుకుందని తెలిపారన్నారు.
ఏలూరులో తొలిసారి ఆగిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్
ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం– సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ (20708/20707) ఎక్స్‌ప్రెస్ రైలుకు ఏలూరు స్టేషన్‌లో ఒక నిమిషం హాల్టింగ్ సదుపాయాన్ని రైల్వే అధికారులు కల్పించారు. ఏలూరులో నేడు తొలిసారిగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆగింది. విశాఖ నుంచి సికింద్రాబాద్ , సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే సమయంలో నేటి నుంచి వందే భారత్ రైలుకు ఏలూరులో హాల్ట్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. వందే భారత్ రైలుకు ఏలూరులో హాల్టు ఇవ్వడంపై మంత్రి పార్థసారధి, ఎంపీ పుట్టా మహేష్, జిల్లా ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. ఏలూరు స్టేషన్ నుంచి విజయవాడ వరకు వందేమాత ట్రైన్‌లో మంత్రి పార్థ సారథి, ఎంపీ పుట్టా మహేష్, ఎమ్మెల్యేలు ప్రయాణించారు.
ఆ రాష్ట్రంలో మాజీ ఎమ్మెల్యేలకు నెలకు రూ. 50 వేల పింఛన్..
మాజీ ఎమ్మెల్యేలకు నెలవారీ పెన్షన్‌ను రూ.50 వేలకు పెంచుతున్నట్లు సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రకటించారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలకు నెలకు రూ.22 వేలు పింఛన్ అందుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది. ఆదివారం రాజధాని గ్యాంగ్‌టక్‌లో జరిగిన మాజీ ఎమ్మెల్యేల సమాఖ్య (ఎఫ్‌ఎల్‌ఎఫ్‌ఎస్) 22వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేల పెన్షన్‌ను పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు.
దెయ్యం వదిలిస్తానని వ్యక్తిని కొట్టి చంపిన పాస్టర్..
మతమౌఢ్యానికి ఓ వ్యక్తి బలయ్యాడు. పంజాబ్ గురుదాస్‌పూర్ జిల్లాలో 30 ఏళ్ల వ్యక్తి దెయ్యం వదిలిస్తానని చెబుతూ ఓ పాస్టర్, అతని 8 మంది సహచరులు సదరు వ్యక్తిని దారుణంగా కొట్టారు. అతని శరీరం నుంచి దెయ్యాన్ని వదిలించడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంటూ కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడైన పాస్టర్‌పై కేసు నమోదు చేశారు. బాధిత వ్యక్తిని సామ్యూల్ మాసిహ్‌గా గుర్తించారు. ఇతను రోజూవారీ కూలీగా పనిచేస్తున్నాడు. సామ్యూల్ మూర్ఛ రోగంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. పరిస్థితిపై ఆందోళన చెందిన శామ్యూల్ కుటుంబం బుధవారం ప్రార్థన కోసం అని పాస్టర్ జాకబ్ మాసిహ్‌ని ఇంటికి పిలిచినట్లు పోలీసులు తెలిపారు. శామ్యూల్‌కి దెయ్యం పట్టిందని పాస్టర్ పేర్కొన్నాడు. అతని శరీరం నుంచి దెయ్యం బలవంతంగా బయటకు పోతుందని చెప్పాడు.
సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదు.. కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటా..
హైదరాబాద్‌లో గచ్చిబౌలిలో సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఎన్-కన్వెన్షన్‌కు సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయని నాగార్జున పేర్కొన్నారు. ఎన్ కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి అని, ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదన్నారు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని ప్రత్యేక న్యాయస్థానం ఏపీ ల్యాండ్ గ్రాబింగ్(నిషేధ) చట్టం ప్రకారం 2014 ఫిబ్రవరి 24న ఒక ఆర్డర్ Sr 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇవ్వటం జరిగిందన్నారు. ప్రస్తుతం , నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టుని ఆశ్రయించామన్నారు. న్యాయస్థానం తీర్పుకు తాను కట్టుబడి ఉంటానని నాగార్జున వెల్లడించారు. అప్పటి వరకు, ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని అభిమానులు, శ్రేయోభిలాషులను నటుడు నాగార్జున అభ్యర్థించారు.
వైద్యురాలిపై హత్యాచార ఘటన.. నిందితుల పాలిగ్రాఫ్ రిపోర్టు వచ్చింది.. కానీ..
పశ్చిమబెంగాల్ రాజధాని కోలకత్తాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మహిళా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య కేసులో మొత్తం ఏడుగురికి పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు. కోల్‌కతా లోని సీబీఐ కార్యాలయంలో నిందితుడు సంజయ్ రాయ్, ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్, ఘటన జరిగిన రాత్రి బాధితురాలితోపాటు నలుగురు వైద్యులను.. అలాగే, ఒక వాలంటీర్ లకు పాలిగ్రాఫ్ పరీక్షలు చేపట్టారు. ఇకపోతే నిందితులు నిజాన్ని బయటపెట్టడానికి, పోలీసులు పాలిగ్రాఫ్ పరీక్షను నిర్వహిస్తారు. దీనిలో లై డిటెక్టర్ యంత్రం ద్వారా అబద్ధాలను గుర్తించే ప్రయత్నం చేస్తారు. ఇందులో నిందితుడి సమాధానం సమయంలో శరీరంలో సంభవించే మార్పుల ద్వారా, నిందితుడు ప్రశ్నకు సరిగ్గా సమాధానం ఇస్తున్నాడా లేదా అనేది నిర్ధారించబడుతుంది. ఈ పరీక్షలో నిందితుల శారీరక మార్పులని జాగ్రత్తగా స్టడీ చేసి, వారి ప్రతిచర్యను బట్టి సమాధానం నిజమో.. అబద్ధమో.. నిర్ణయించబడుతుంది.
దేవుడా.. గుండెపోటుతో యూకేజీ చదువుతున్న చిన్నారి మృతి
పిల్లలు, యువకులు, పెద్దలు అనే తేడా లేకుండా గుండెపోటు మరణాలు అందరిలోనూ వస్తున్నాయి. తాజాగా.. యూపీలోని అమ్రోహాలో యూకేజీ (UKG) చదివే చిన్నారి గుండెపోటుకు బలయింది. ఉన్నట్టుండి తరగతి గదిలో అస్వస్థతకు గురి కాగా.. వెంటనే చిన్నారిని గజ్రాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరిశీలించి చనిపోయినట్లు ప్రకటించారు. దీంతో.. విద్యార్థిని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. కాగా.. ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండానే మృతదేహాన్ని ఖననం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జహాన్, తన్వీర్ అహ్మద్ కుమార్తె ఇఫ్ఫత్ (5 సంవత్సరాల చిన్నారి).. షకర్‌గర్హి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో యూకేజీ చదువుతుంది. రోజూలాగే శనివారం కూడా స్కూల్‌కి వెళ్లింది. తరగతి సమయంలో చిన్నారి ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలో.. టీచర్లు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు వెంటనే పాఠశాలకు చేరుకుని.. తొలుత ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అనంతరం గజ్రౌలాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆ చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. గుండెపోటుతో చనిపోయిందని డాక్టర్లు పేర్కొన్నారు. కాగా.. చిన్నారి మృతి పట్ల అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు.
బఫర్ జోన్ రక్షణ దిశగా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్ ల ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాలతో జలాశయాల్లో నీరు నిల్వ ఉండలేక, వరదల సమయం లో ఇబ్బంది ఎదుర్కొంటున్నామని, సీఎం రేవంత్ జంట నాగరాల్లో అక్రమణలా తొలగింపునాకు హైడ్రా ఏర్పాటు చేయడం చైర్మన్ గా సీఎం ఉండడం అభినందనీయన్నారు. బఫర్ జోన్ రక్షణ దిశగా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన తెలిపారు. పర్యావరణ ప్రేమికులు ఈ విధానం పై హర్షం వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వం చర్యలతో ప్రజల నుండి స్పందన అని ఆయన అన్నారు. జాలాశయాల నిబంధనల పరిరక్షణకు అనుగుణంగా రాష్ట్రంతో పాటు పట్టణాలకు అనుబంధంగా ఉన్న వాటిలో కూడా ఆక్రమణలు పెరిగాయన్నారు. జిల్లా, పట్టణ పరిధిలో కూడా హైడ్రా లాంటి విధానం అమలు చేయాలని, హైడ్రా పరిధి పెంచకపోతే జిల్లా కలెక్టర్ లకు అధికారం ఇవ్వాలన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఆక్రమణ నిర్మాణాలు జరగకుండా హద్దులు నిర్ణయించాలని ప్రభుత్వం కు విజ్ఞప్తి చేస్తున్నా అని, హుస్సేన్ సాగర్ బఫర్ జోన్ లో ప్రభుత్వం అనుమతులు ఇచ్చి వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు జీవన్ రెడ్డి.
సూర్యకుమార్తో మను భాకర్.. ఫొటో వైరల్
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలను సాధించి చరిత్ర సృష్టించిన షూటర్ మను భాకర్.. క్రీడల్లో ఉండే చిన్న చిన్న నైపుణ్యాలను నేర్చుకుంటుంది. ఇటీవలే ఆమె గుర్రపు స్వారీ, భరతనాట్యం.. స్కేటింగ్ నేర్చుకోవాలని తన కోరికను వ్యక్తం చేసింది. తాజాగా.. ఆమె క్రికెట్ నేర్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో.. ఆదివారం భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి ఉన్న చిత్రాన్ని మను భాకర్ పంచుకుంది. ఈ ఫొటోకి మను అద్భుతమైన క్యాప్షన్ కూడా రాసింది. ‘నేను మిస్టర్ 360 ఆఫ్ ఇండియాతో కొత్త గేమ్ లో మెళకువలను నేర్చుకుంటున్నాను.’ అని తెలిపింది. కాగా.. ‘x’లో పోస్ట్ చేసిన ఫోటోలో మను బ్యాటింగ్ చేస్తున్నట్లు పోజ్ ఇస్తుంది. కాగా.. ప్యారిస్‌లో చరిత్ర సృష్టించిన మను ప్రస్తుతం మూడు నెలల విరామంలో ఉంది. ఈ క్రమంలో.. భారత టీ20 కెప్టెన్ నుండి క్రికెట్ యొక్క మెళకువలను నేర్చుకుంటుంది.
నా ఊపిరి ఉన్నంతవరకు సిద్దిపేట అభివృద్ధి కోసం కృషి చేస్తా
సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణలో అత్యధిక CMRF చెక్కులు అందినటువంటి నియోజకవర్గం సిద్దిపేట అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఆశీర్వాదంతో రాష్ట్రంలోనే బెస్ట్ నియోజకవర్గంగా సిద్దిపేట తీర్చిదిద్దుకున్నామని, సిద్దిపేటలో సగం నిర్మాణం పూర్తయిన వెటర్నరీ కాలేజీని కాంగ్రెస్ ప్రభుత్వం కొడంగల్‌కు తరలించుకుపోయిందన్నారు హరీష్ రావు. కొడంగల్‌కు అవసరమైతే కొత్త కాలేజీని నిర్మించుకోవాలి గాని సిద్దిపేటకు అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసం అని, 150 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న వెటర్నరీ కాలేజీని గద్దలా తన్నుకుపోతున్న సీఎం రేవంత్ రెడ్డి తీరును ప్రజలు గమనించాలన్నారు. అసెంబ్లీలో కొట్లాడి సిద్దిపేటకు రావాల్సిన పనులను హక్కుగా తీసుకొని వస్తా అని, నా ఊపిరి ఉన్నంతవరకు సిద్దిపేట అభివృద్ధి కోసం కృషి చేస్తా అని ఆయన అన్నారు.
