రైతులకు కేంద్రం శుభవార్త.. ఆ ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపు
పండగ వేళ కేంద్ర ప్రభుత్వ, రైల్వే ఉద్యోగులతో పాటు అన్నదాతలకు కేంద్ర శుభవార్త తెలిపింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు సహా , రైల్వే ఉద్యోగులకు బోనస్, రబీ సీజన్‌లో ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపు వంటి వాటికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024-2025 రబీ సీజన్‌కు గానూ గోధుమ, బార్లీ, సన్‌ఫ్లవర్, శనగ, ఆవాలు, కందులు ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గోధుమలకు కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.150 పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం.. గోధుమల కనీస మద్దతు ధరను రూ.150 పెంచడంతో క్వింటా గోధుమల ధర రూ.2,275కు చేరుకుంది. అలాగే బార్లీపై రూ.115 పెంచి రూ.1850; శెనగపై రూ.105 పెంచి రూ.5440; కందులుపై రూ.425 పెంచి రూ.6425; ఆవాలుపై రూ.200 పెంచి రూ.5650; సన్‌ఫ్లవర్‌పై రూ.150 పెంచి రూ.5,800గా కనీస మద్దతు ధరగా నిర్ణయించారు. కేబినెట్ సమావేశం అనంతరం నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలిపారు.
12 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త
దీపావళికి ముందు రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రైల్వే ఉద్యోగులకు వారి 78 రోజుల జీతంతో సమానంగా బోనస్ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల 11.07 లక్షల మంది జాతీయ రవాణా సంస్థలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. బోనస్ చెల్లింపు వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.1968.87 కోట్ల భారం పడుతుందని భావిస్తున్నట్లు మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటన చేస్తూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం 2022-23 ఆర్థిక సంవత్సరానికి 78 రోజుల వేతనానికి సమానమైన ఉత్పాదకత లింక్డ్ బోనస్ (PLB)ని అన్ని అర్హతలు కలిగిన నాన్ గెజిటెడ్ రైల్వేలకు ఆమోదించిందని తెలిపారు. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి గాను 78 రోజులకు సమానమైన వేతనాన్ని బోనస్‌గా చెల్లించనున్నారు.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసిన టీడీపీ నేతల బృందం
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను టీడీపీ నేతల బృందం కలిసింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు అరెస్ట్ అంశంతో పాటు రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను గవర్నరుకు తెలుగు తమ్ముళ్లు వివరించారు. 17Aపై కీలక వాదనలు జరిగిన క్రమంలో గవర్నరుతో టీడీపీ భేటీ కీలక పరిణామమనే చర్చ జరగుతుంది. చంద్రబాబు కేసులపై గవర్నర్ ఇప్పటికే ఆరా తీశారనే ప్రచారం కొనసాగుతుంది. 17A నిబంధనను ప్రభుత్వం గాలికి వదిలేసిందనే అంశాన్ని గవర్నరుకు టీడీపీ శ్రేణులు వివరించారు. చంద్రబాబుపై పెట్టిన కేసులేంటీ..? అందులోని వాస్తవాలేంటి..? అనే అంశాన్ని టీడీపీ నేతలు తెలిపారు.
జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న కేపీ నాగార్జున రెడ్డి
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో శాసన సభ్యులు కుందురు నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగనన్న సురక్ష పథకంలో పాల్గొన్న ప్రజలకు పరీక్షలు చేసిన డాక్టర్లు మందులు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో కేపీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. జగనన్న సురక్ష పథకం ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. మీ ఆరోగ్యం కాపాడుకునే బాధ్యత మీదేనని ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి వెల్లడించారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మందులు కూడా ఫ్రీగా ఇస్తారని ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి అన్నారు.
పరిశ్రమల కేంద్రంగా జడ్చర్లను తీర్చిదిద్దే బాధ్యత నాది
బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తోంది. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. నియోజకవర్గాల వారీగా బహింరగ సభలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ లో ఏ చివరకు వెళ్లిన నేను దుఃఖంతో పోయేది, కళ్ళలో నీళ్ళు వచ్చేవన్నారు. మహబూబ్ నగర్ దరిద్రం పోవాలంటే ఎంపిగా పోటీచేయాలని జయశంకర్ సార్ చెప్పారన్నారు. మహబూబ్ నగర్ ఎంపిగా ఉంటూనే తెలంగాణ సాధించాను అనే కీర్తి చిరకాలం ఉంటుందని, నడిగడ్డలో ఒక ఊర్లో ఏడ్చానన్నారు. కృష్ణ నది పక్కనే పారుతున్న… గుక్కెడు నీళ్ళు లేవని, ముఖ్యమంత్రుల పర్యటనలు, నాటకాలు చూశామన్నారు సీఎం కేసీఆర్.
జైలులో చంద్రబాబు ఆరోగ్యం ఇబ్బందికరంగానే ఉంది..
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు రిమాండ్ లో ఉన్నారు. అయితే, ఇవాళ చంద్రబాబుతో నారా లోకేశ్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ములాకాత్ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు కుటుంబ సభ్యులు చంద్రబాబుతో ములాకాత్ అయ్యారు. అయితే, రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరకు మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎంపీ రామ్మోహన్ నాయుడు వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ నేత కళా వెంకట్రావు మాట్లాడుతూ.. జైలులో చంద్రబాబుకు ఆరోగ్యం ఇబ్బందికరంగానే ఉంది అని ఆయన ఆరోపించారు.
ఇన్నాళ్లు చంద్రబాబు టక్కుటమారా విద్యలతో బయటపడ్డారు..
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 26 వ తేదీ నుంచి వైసీపీ సామాజిక న్యాయ యాత్ర బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది అని వైసీపీ జోనల్ ఇంచార్జ్, జిల్లా ఇంచార్జ్ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. సమ సమాజ స్దాపన కోసం సీఎం జగన్ కృషిచేస్తున్నారు.. ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు తెలియ చెప్పడానికే సామాజిక న్యాయ యాత్ర చేయాలని పార్టీ నిర్ణయించింది.. దేశంలోనే ఏపీలో మాత్రమే సామజిక న్యాయం జరిగింది అని ఆయన అన్నారు. ఏలూరు బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన మాట నిలబెట్టుకొవడానికి జగన్ కృషి చేసారు.. బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చారు అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
2014 నుంచి 2019 వరకు దోపిడి ప్రభుత్వం నడిచింది..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతికి ఎక్కడా తావులేకుండా పాలన అందిస్తున్నామని వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యనించారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మ్యానిఫెస్టోలో ప్రకటించిన అన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన హామీలే కాదు ఇయ్యని హామీలు కూడా అమలు జరిపామని ఆయన చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో కూడా సంక్షేమం అందించాం.. కోట్లాది మందికి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం అందిస్తున్నాం అంటూ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టిలకు సీఎం జగన్ ప్రభుత్వంలో న్యాయం జరిగింది అని తెలిపారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి..
సోనియా గాంధీ తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికలో బుద్ది చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల బతుకుల్లో వెలుగులు నిండాలని రామప్ప దేవాలయంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పూజలు చేసి దేవున్ని వేడుకున్నారని ఆయన వెల్లడించారు. ములుగులో కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసి దేశ సంపద ప్రజలకు చెందాలని నినదించిన మహా నాయకుడు రాహుల్ గాంధీ అంటూ ఆయన కొనియాడారు.
రాజుల నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన సమ్మక్క, సారలమ్మ స్ఫూర్తితో నియంత పాలనకు వచ్చే ఎన్నికల్లో చరమగీతం పాడుదామంటూ భట్టి విక్రమార్క ప్రజలకు సూచించారు. తెలంగాణ సంపద, వనరులు ప్రజలకు చెందాలని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. తెలంగాణ సంపద వనరులు ప్రజలకు పంచడానికి సోనియా గాంధీ 6 గ్యారంటీలను ప్రకటించారన్నారు.
ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీలో ఓ టీమ్ పనిచేస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమను ఎవరు సంప్రదిస్తున్నారో, వారికి ఏమి అందిస్తున్నారో తనకు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు తెలియజేస్తున్నారని శివకుమార్ అన్నారు. ఈ విషయాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేల ద్వారా వెల్లడిస్తానని డిప్యూటీ సీఎం శివకుమార్ తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ మాట్లాడుతూ.. ‘అవును.. మాకు తెలుసు.. ఎమ్మెల్యేలంతా తమను ఎవరు కలుస్తున్నారో నాకు, ముఖ్యమంత్రికి పూర్తి సమాచారం ఇస్తున్నారని.. వారికి ఏం ఆఫర్ చేస్తున్నారో చెబుతున్నారని వెల్లడించారు. కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీలో ఓ బృందం క్రియాశీలకంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలపై డిప్యూటీ సీఎం మీడియాకు వివరించారు. అన్ని విషయాలపై మా వద్ద సమాచారం ఉంది… ఇప్పుడు కాదు, అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు సంప్రదించిన ఎమ్మెల్యేల నుంచి వెల్లడిస్తామని తెలిపారు.
