NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

తన క్యాంపు కార్యాలయాన్ని సందర్శించిన పవన్..పంచాయతీ రాజ్ శాఖ వ్యవహరాలపై ఆరా

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించారు. పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆ శాఖ కమిషనర్ కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. క్యాంపు కార్యాలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్‌కి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. తన క్యాంప్ ఆఫీసులో అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ అయ్యారు. పంచాయతీ రాజ్ శాఖ వ్యవహరాలపై డిప్యూటీ సీఎం ఆరా తీశారు. ఈనెల 19న పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో అధికారులతో చర్చించారు. అక్కడి నుంచి నేరుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముంద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గన్నవరం ఎయిర్‌పోర్టులో జనసేన నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయల్దేరారు. అక్కడి నుంచి సచివాలయానికి వెళ్లి తనకు కేటాయించిన ఛాంబర్‌ను పరిశీలించారు.

అసెంబ్లీ బైపోల్‌లో ముఖ్యమంత్రి భార్యకు సీటు

హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ భార్య కమలేష్ ఠాకూర్‌కు అసెంబ్లీ సీటు దక్కింది. డెహ్రాలో జరగనున్న ఉప ఎన్నికల్లో కమలేష్ ఠాకూర్‌ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆమె పేరును అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ మంగళవారం ప్రకటన రిలీజ్ చేసింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. హమీర్పూర్, నలగ, డెహ్రాలో జూలై 10న బైపోల్స్ జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఓటు వేసిన ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించడంతో ఉప ఎన్నికలు తటస్థించాయి.

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన రద్దు..కారణమేంటంటే?

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తొలిసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు ప్రకటన విడుదలైంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన రద్దైంది. ఈనెల 21, 22 నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పర్యటన రద్దు చేసుకున్నన్నారు. మాజీ సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. కాగా.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తేదీల్లో మార్పు జరిగింది. తొలుత జూన్ 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావించారు. అయితే తాజాగా జూన్ 21 నుంచి అసెంబ్లీ మీటింగ్స్ జరపాలని నిర్ణయం తీసుకున్నారు. జూన్ 21, 22 తేదీల్లో రెండురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ రెండు రోజుల సమావేశాల్లో ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అలాగే అసెంబ్లీ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు తొలుత ప్రొటెం స్పీకర్‌కు ఎంపిక చేయాల్సి ఉంటుంది. శాసనసభకు ఎక్కువసార్లు ఎన్నికైన, సుధీర్ఘ అనుభవం ఉన్న నేతను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్‌గా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించే అవకాశం ఉంది.

దేశ వ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు

దేశ వ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్స్ ద్వారా బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పోలీసులు విమానాశ్రాయాల దగ్గర పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రతీ వాహనాన్ని పరిశీలిస్తున్నారు. గుజరాత్‌లోని వడోదర ఎయిర్‌పోర్టుకు, బీహార్‌లోని పాట్నా ఎయిర్‌పోర్టుకు, రాజస్థాన్‌లోని జైపూర్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్ ద్వారా సమాచారం రాగానే భద్రతా సిబ్బంది అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. ఇక జైపూర్‌లోని ఒక కాలేజీకి కూడా బెదిరింపు వచ్చింది. అక్కడ కూడా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభించలేదు. గతంలో కూడా ఇదే తరహాలో బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎలాంటి అనుమానాస్పద వస్తువు దొరకలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వైద్య శాఖలో ప్రక్షాళన మొదలైంది

వైద్య శాఖలో ప్రక్షాళన మొదలైందని, ఒకటి రెండు ఏళ్లలో స్థిరమైన మార్పులు కనిపిస్తాయన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఅర్ కిట్ లో మార్పులు.. ప్రతి 35 కిలోమీటరు కి ఒక ట్రామ సెంటర్, కొత్తగా 75 ట్రమా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డయగ్నోస్టిక్ సెంటర్లు ప్రభుత్వ ఆస్పత్రులకు లింక్ చేసే విధంగా చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. 3 రకాల టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయబోతున్నామని, ప్రైవేటు ఆస్పత్రుల పర్యవేక్షణ ( క్లినికల్ ఎస్టాబ్లిష్ ) అని ఆయన వ్యాఖ్యానించారు. ఫార్మా మెడికల్ కోసం (డ్రగ్స్ నియంత్రణ ) ఫుడ్ క్వాలిటీ కోసమని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రాంతాల వారీగా సర్వే చేయకుండా అవసరం లేకుండా ఇచ్చారని, మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్లు కూడా దొరకని పరిస్థితి అని ఆయన అన్నారు. మెడికల్ ప్రొఫెషన్ స్లో గా పెరగాలన్నారు. కేసీఆరే డాక్టర్ అయ్యాడు… కేసీఆరే ఇంజనీర్ అయ్యాడని ఆయన సెటైర్లు వేశారు. కరోనా కు పారాసిటామాల్ అన్నారు.. కాళేశ్వరం ఆయన్నే డిజైన్ చేశారన్నారు.

జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో ఎన్‌కౌంటర్..

జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో భద్రతా బలగాలు-ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు సమాచారం. దీంతో.. వెంటనే అదనపు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పూంచ్ ప్రాంతంలో ఇద్దరు టెర్రరిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో ఆ ప్రాంతానికి అదనపు బలగాలను పంపించామని.. ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారని అధికారులు చెబుతున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) బృందంపై కాల్పులు జరిపినట్లు సోర్సెస్ చెబుతున్నాయి. అనంతరం ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. జూన్ 9 తర్వాత జమ్మూ ప్రాంతంలో ఇది ఆరో ఉగ్రవాద ఘటన. జూన్ 9న.. ఉగ్రవాదులు యాత్రికుల బస్సుపై దాడి చేశారు. ఈ దాడిలో 9 మంది యాత్రికులు మరణించారు. 41 మంది గాయపడ్డారు.

కేవలం విద్య మాత్రమే సమాజాన్ని , దేశాన్ని మారుస్తుంది

కేవలం విద్య మాత్రమే సమాజాన్ని , దేశాన్ని మారుస్తుంది రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విద్య ప్రమాణాలతో మెరుగుపడాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా విద్యార్థులు రాణించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తున్న వనిత మహావిద్యాలయా ఫార్మసీ కాలేజీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిధిగా హాజరయి మాట్లాడారు. నాణ్యమైన విద్య తో పాటు మహిళ సాధికారతను అందించడంలో సామాజిక బాధ్యతను నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీ కృషి అభినందనీయం అన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు అభినందనలు తెలిపిన మంత్రి.. విద్యార్థులకు, సంస్థకు ప్రభుత్వం నుండి అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు.

విచారణ కమిషన్ పారదర్శకంగా విచారణ చేయటం లేదు

విద్యుత్ విచారణ కమిషన్‌పై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇవాళ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. విచారణ కమిషన్ కేసిఆర్ పైన అనవసర ఆరోపణలు చేస్తుందన్నారు. విచారణ కమిషన్ పారదర్శకంగా విచారణ చేయటం లేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత బీ ఆర్ ఎస్ పైన బురద జల్లె ప్రయత్నం చేస్తోందని, కేసీఆర్ పైన, గత ప్రభుత్వం పైన చేసిన అభివృద్ది పై ఆరోపణలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. విద్యుత్ కొనుగోళ్ల పై ఉన్న విచారణ చేయిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనం దుర్వినియోగం జరగలేదు, ఒప్పందాల మేరకే ప్రాజెక్టులు జరిగాయని కేసిఆర్ లేఖ రూపం లో చెప్పారని, ఇందులో అవినీతి జరిగింది, కోట్ల రూపాయలు కూడబెట్టారు అంటూ ఆరోపిస్తున్నారన్నారు. నియమాలకు విరుద్ధంగా కమిషన్ వ్యవహరిస్తుందని జగదీష్‌ రెడ్డి అన్నారు. కమిషన్ న్యాయ బద్దంగా విచారణ చేయాలని, ఎలాంటి ఒత్తిడి లేకుండా వివక్ష లేకుండా పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. నల్లగొండ లో ప్రోజెక్ట్ ఎందుకు పెట్టారు అని కొంత మంది ప్రశ్నిస్తున్నారని, నల్లగొండ లో యాదాద్రి ప్రోజెక్ట్ ను వ్యతిరేకించే వారిని చెప్పుతో కొడుతామన్నారు.

అన్న క్యాంటీన్లలో రేట్లు మారాయా.. లేక అలాగే ఉన్నాయా..

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దింతో ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్వహించిన అన్న క్యాంటీన్లను మరోసారి ప్రారంభం కాబోతున్నాయి. ఈ మంచి కార్యక్రమం వల్ల చాలామంది పేదవారికి కడుపు నిండనుంది. ఇందులో భాగంగానే తాజాగా పొరపాలక శాఖ మంత్రి నారాయణ ఓ కీలక ప్రకటన చేశాడు. వచ్చే మూడు వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్ లను ప్రారంభిస్తామని., అలాగే సెప్టెంబర్ 21 లోగా 203 క్యాంటీన్లను ప్రారంభించేలా లక్ష్యం పెట్టుకున్నట్టుగా ఆయన తెలిపారు. ఈ నిర్ణయం చూస్తే అతి త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పేదల కోసం అన్న క్యాంటీన్లో మొదలు కాబోతున్నాయి.

ఆయిల్ పామ్ సాగు , ఉద్యాన పంటలలో సూక్ష్మ సేద్యం కొరకు రాయితీలు

రాష్ట్రంలో పెరిగిన పంట మార్పిడి ఆవశ్యకత దృష్ట్యా, తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు మరియు వివిధ ఉద్యాన పంటలలో సూక్ష్మ సేద్యం కొరకు రాయితీలు ఇస్తూ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. 2023-24 సం.కి గాను 59,261 ఎకరాలు కొత్తగా ఆయిల్ పామ్ సాగులోకి తీసుకురావడం జరిగింది. 2023-24 సం.కి గాను ఆయిల్ పామ్ సాగు పధకం (NMEO-OP) కింద, కేంద్ర ప్రభుత్వం రూ.80.10 కోట్లను విడుదల చేయడం జరిగింది. దీనికి రూ.53.40 కోట్ల రాష్ట్ర వాటా కలుపుకుని మొత్తం రూ.133.50 కోట్లు విడుదల చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ మొత్తంలో 2023-24 సం.లో కేవలం రూ.32.72 కోట్లు మాత్రమే విడుదల చేయగా, వివిధ కారణాల చేత రూ.100.76 కోట్లు పెండింగ్ లో పెట్టడం జరిగింది. దీని వలన ఉద్యాన శాఖ, రైతులకు మరియు ఆయిల్ పామ్/ డ్రిప్ కంపెనీలకు, సకాలంలో బకాయిలు విడుదల చేయడం వీలుపడలేదు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో, ముఖ్యమంత్రి దృష్టిలోకి ఆయిల్ పామ్ రైతుల మరియు కంపెనీల ఇబ్బందులను తీసుకురాగ, పెండింగ్ లో వున్న రూ.100.76 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది.