మరో కొత్త స్కూటర్ లాంచ్.. ఫుల్ ఛార్జింగ్‌తో 70-80 కి.మీ
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. కొత్త కొత్త సంస్థలతో పాటు ప్రముఖ కంపెనీలు కూడా ఈ సెగ్మెంట్‌పై ఫోకస్ చేయడంతో కస్టమర్స్‌కు మంచి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. మాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆంపియర్ 2025 జనవరిలో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఏ కెపాసిటీ బ్యాటరీ అందించారు.. ఎలాంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి..? ఏ ధరకు కొనుగోలు చేయవచ్చు..? అనే విషయాలు తెలుసుకుందాం…..
ఆంపియర్ భారత మార్కెట్‌లో మాగ్నస్ నియో పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది (Ampere Magnus Neo). ఇది మాగ్నస్ యొక్క కొత్త వేరియంట్‌గా కంపెనీ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇక ఈ స్కూటర్ ఫీచర్ల విషయానికొస్తే.. 12 అంగుళాల టైర్లను కలిగి ఉంది. అంతే కాకుండా.. ఇది 165 mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో డ్యూయల్ టోన్ ఇంటీరియర్, IoT ఎనేబుల్డ్ ఇన్‌స్ట్రుమెంట్ డిజిటల్ క్లస్టర్, లైవ్ ట్రాకింగ్, ఫైండ్ మై స్కూటర్, యాంటీ థెఫ్ట్ అలారం వంటి ఫీచర్లు ఉన్నాయి.
లాస్ ఏంజిల్స్ కార్చిచ్చులో హాలీవుడ్ నటి సజీవదహనం
అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో గత కొద్దిరోజులుగా కార్చిచ్చు చెలరేగుతోంది. ఇప్పటికే భవంతులు, వేలాది ఎకరాలు కాలి బూడిదయ్యాయి. కోట్లాది రూపాయుల ఆస్తి మంటల్లో కాలిపోయింది. తాజాగా ఈ మంటల్లో హాలీవుడ్ నటి డాలీస్ కర్రీ (95) సజీవ దహనం అయినట్లు బంధువులు స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా దృవీకరించారు. ఇంట్లో కాలిపోయిన అవశేషాలను అధికారులు గుర్తించారు. ది బ్లూస్ బ్రదర్స్, ది టెన్ కమాండ్‌మెంట్స్, లేడీ సింగ్స్ ది బ్లూస్ పాత్రలకు రిటైర్డ్ హాలీవుడ్ నటి డాలీస్ కర్రీ పేరు ప్రఖ్యాతలు గడించారు. అయితే కార్చిచ్చు చెలరేగడంతో ఆమె తప్పించుకోలేకపోయారు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమె అభిమానులు విషాదంలో మునిగిపోయారు. కాలిఫోర్నియాలోని అల్టాడెనాలోని ఆమె ఇంటిలో అవశేషాలు గుర్తించారు. ఇల్లు కూడా ధ్వంసమైంది.
కొత్తపేటలో అంగరంగ వైభవంగా ప్రభల ఉత్సవం ప్రారంభం..
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో మకర సంక్రాంతి సందర్భంగా ప్రభల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాదిగా ప్రజలు ప్రభల ఉత్సవాన్ని చూసేందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఉత్సవ కమిటీలు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటప్పుడు ప్రభల ఉత్సవం జరపడం కొత్తపేటలో ఆనవాయితీగా వస్తుంది. ప్రభల ఉత్సవాలు మూడు ప్రధాన వీధుల మధ్య పోటాపోటీగా జరుగుతుంది. ముందుగా పాత రామాలయం మనసేబు గారి ప్రభ వీరభద్రుని అలంకరించుకొని పురవీధుల్లోకి వస్తుంది. మిగిలిన ప్రభలు పురవీధుల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఊరేగింపుగా బయలుదేరాయి.
మేడ్చల్ జిల్లాలో నిత్య పెళ్లికొడుకు.. అరెస్ట్ చేసి అత్తారింటికి..!
మాయ మాటలు చెప్పి యువతులను వల్లో వేసుకుని ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఓ కేటుగాడి బాగోతం తాజాగా బయటపడింది. ఈ వ్యక్తి బండారం రెండో భార్య లీలావతి గుర్తించడంతో జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్‌నగర్ గబ్బిబాల్‌పేట్ ప్రాంతానికి చెందిన లక్ష్మణరావు (34) ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2014లో బంధువుల అమ్మాయి అనూషతో అతనికి వివాహమైంది. అయితే కొంతకాలానికే అనూషతో మనస్పర్థలు ఏర్పడి ఆమెతో దూరంగా ఉంటున్నాడు. ఈ సమయంలో బాలాజీనగర్‌కు చెందిన లీలావతి (25)తో పరిచయం ఏర్పడింది. ఆమెను ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి 2021లో మెదక్ చర్చిలో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కానీ కొంతకాలానికే లీలావతితో కూడా విభేదాలు తలెత్తడంతో ఆమెను కూడా వదిలేసి తప్పించుకుని తిరగసాగాడు. 2022లో శబరి అనే మరొక యువతితో పరిచయం పెంచుకున్న లక్ష్మణరావు, ఆమెను కూడా మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నాడు. మల్కాజిగిరి ప్రాంతంలో ఆమెతో కలిసి ఉంటున్నాడు.
కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలకు ‘‘కల్లక్కడల్’’ హెచ్చరికలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికల ప్రకారం.. జనవరి 15 రాత్రి ఈ రెండు రాష్ట్రాల్లో ‘‘కల్లక్కడల్ అనే దృగ్విషయం’’ జరగనుంది. ఇది సముద్రాల్లో ఒకేసారి ఉప్పెనకు కారణమవుతుంది. అలలు సాధారణం కన్నా ఎక్కువ వేగంగా, ఎత్తుతో ఎగిసిపడుతుంటాయి. మంగళవారం రాత్రి 11.30 గంటల వరకు ఈ ప్రాంతాల్లో 0.5 నుంచి 1.0 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని, సముద్రం ఉప్పొంగే అవకాశం ఉందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) తెలిపింది. మత్స్యకారులతో పాటు తీర ప్రాంతా ప్రజలు ప్రమాదకర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు మారాలని అధికారులు సూచించారు. తీర ప్రాంతంలోని చిన్న పడవలు, కంట్రీ బోట్లు సముద్రంలోకి వెళ్లవద్దని, ఫిషింగ్ బోట్లను తీరంలో సురక్షితంగా లంగరు వేసి ఉంచాలని అధికారులు సూచించారు.
ప్రతి ఇంటికి హెల్త్, వెల్త్, హ్యాపీ అందించాలన్నదే నా లక్ష్యం..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో గ్రామస్థులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి పండుగ కళ వచ్చింది.. పండక్కి అందరూ సొంత ఊళ్లకు వెళుతున్నారు. ఇది వరకు ఇలా వెళ్లే వారు కాదని అన్నారు. మరోవైపు.. విజన్ 2047ను ప్రవేశపెట్టాను.. ప్రతి ఇంటికి హెల్త్, వెల్త్, హ్యాపీ అందించాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. సూపర్ సిక్స్ అమలుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం.. ఇప్పటికే ఉచిత సిలెండర్లు అందిస్తున్నాం.. వీలైనంత త్వరలోనే ఇంటింటికి సీఎన్జీ గ్యాస్ అందిస్తామని అన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో మనం ఇస్తున్న స్థాయిలో పెన్షన్లు ఇవ్వడం లేదు.. కొన్ని రాష్ట్రాల్లో ఇందులో సగం కూడా ఇవ్వడం లేదని తెలిపారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టనర్ షిప్ (పి – 4)అనే కొత్త నినాదంతో ముందుకు వెళుతున్నామనిన చెప్పారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతటి ఆస్తి ఉన్నట్లు.. భూమి ఆస్తి కాదు.. అందుకే పిల్లలని కనమని చెబుతున్నానని సీఎం పేర్కొన్నారు. వచ్చే ఉగాది లోపు నారావారి పల్లెలో అన్ని ఇళ్లకు సోలార్ పవర్ ఏర్పాటు చేయనున్నామని చంద్రబాబు తెలిపారు.
శబరిమలలో మకరజ్యోతి దర్శనం… అయ్యప్ప శరణుఘోషతో మార్మోగిన శబరిగిరులు
సంక్రాంతి రోజున మకరజ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో కేరళలోని శబరిమలకు తరలివచ్చారు. పొన్నంబలమేడుపై వేలాది మంది భక్తులు మకరజ్యోతిని దర్శించారు. మకర జ్యోతి దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షించారు. చుట్టు పక్కల అడవుల్లో ఉన్న భక్తులు కూడా దర్శించుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతాలన్నీ స్వామియే శరణం అయ్యప్పా అంటూ నామస్మరణతో మార్మోగుతోంది. లక్షలాది మంది భక్తులు పొన్నంబలమేడులో మకర జ్యోతిని చూసేందుకు వచ్చారు. నాలుగు రోజుల క్రితమే కొండపైకి భక్తులు వచ్చారు. కొండపై 1.5లక్షల మంది భక్తులు వచ్చి ఉంటారని మంగళవారం అధికారులు అంచనా వేశారు. సోమవారమే 64, 194 మంది భక్తులు కొండపైకి వెళ్లినట్లు సమాచారం. అంతేకాకుండా చుట్టు పక్కల కొండలపైన కూడా వేలాది మంది భక్తులు ఉన్నారు. ఇదిలా ఉంటే మకర జ్యోతి దర్శనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేలాదిగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగాజస్టిస్ సుజయ్ పాల్
తెలంగాణ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా (High Court Chief Justice) జస్టిస్ సుజయ్ పాల్ (Justice Sujoy Paul) నియమితులయ్యారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుజయ్ పాల్‌కు సీజేగా బాధ్యతలు అప్పగించబడింది. ఇంతవరకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ ఆలోక్ అరాధే (Justice Aloke Aradhe) బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీ అయ్యారు. జస్టిస్ సుజయ్ పాల్ 1964 జూన్ 21న జన్మించారు. ఆయన బీకాం, ఎంఏ, ఎల్ఎల్‌బీ విద్యను పూర్తి చేశారు. 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో తన పేరు నమోదు చేసుకుని, పలు బ్యాంకులు, మానవ హక్కుల కమిషన్, ఇతర బోర్డులకు తన సేవలను అందించారు.
జంట హత్యల కేసుపై పోలీసులు సంచలన విషయాలు..
నార్సింగి పీఎస్ పరిధిలో జంట హత్యల కేసుపై పోలీసులు అప్‌డేట్ ఇచ్చారు. ఆదివారం రాత్రి జంట హత్యలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్ సాకేత్‌గా గుర్తించారు. నానక్‌రాం గూడ హనుమాన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటు్న అంకిత్ సాకేత్.. హౌజ్ కీపింగ్‌గా పని చేస్తున్నాడు. మృతుడి మృతదేహానికి 60 మీటర్ల దూరంలో మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు చెప్పారు. ఘటన స్థలంలో బైక్ తాళాలు స్వాధీనం చేసుకున్నారు. బైక్ ట్రేస్ అవుట్ అయితే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇద్దరు 30 నుండి 32 ఏండ్ల వయసు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు.. మహిళ వివరాలను పోలీసులు సేకరించారు. మృతురాలు బిందు (25) చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన మహిళాగా గుర్తించారు పోలీసులు. అంకిత్ సాకేత్‌తో సన్నిత సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఈనెల 8వ తేదీన మృతుడు అంకిత్ ఎల్‌బీ నగర్ నుంచి నానక్‌రామ్ గూడకు తీసుకొచ్చి స్నేహితురాలి గదిలో ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. 11వ తేదీ రాత్రి హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.
గిరిజన సంప్రదాయ చీరకట్టుతో ఆకట్టుకున్న మంత్రి సీతక్క
కొమురం భీం జిల్లాలోని కెరమెరి మండలంలోని జంగుబాయి జాతర ఘనంగా జరుగుతున్నది. ఈ జాతరలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి సీతక్క గిరిజన సంప్రదాయ చీరకట్టులో పాల్గొన్నారు. ఆదివాసీ గిరిజన మహిళలు గోలుసు, కడియాలు, చీరకట్టులో పాల్గొని తమ సంప్రదాయాన్ని ఉత్సవంగా జరుపుకున్నారు. మంత్రితోపాటు, ఎమ్మెల్యే కొవ్వ లక్ష్మి కూడా ఆదివాసీ సంప్రదాయ వేషధారణలో జాతరలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, మంత్రి సీతక్క జంగుబాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులైన కటోడాలను సన్మానించారు. జోడేఘాట్ వద్ద కుమ్రంభీం విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. ఆమె, ఆదివాసీ ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆదివాసీ సంస్కృతి , సంప్రదాయాలు ఎంతో గొప్పవని, వాటిని కాపాడుకోవాలని మంత్రి సీతక్క కోరారు. అడవుల్లో జీవిస్తున్న ఆ ప్రజల ప్రత్యేక జీవన విధానాన్ని సమర్థించారు. అలాగే, రూ.50 లక్షలతో జంగుబాయి పుణ్యక్షేత్రం లో మౌలిక వసతులను ఏర్పాటు చేస్తామని, క్షేత్రానికి సంబంధించిన భూములకు పట్టాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.