పెళ్లిళ్ల కారణంగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ మార్పు..
ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్ని నవంబర్ 30తో ముగించి, డిసెంబర్ 3న ఫలితాలను ప్రకటిస్తామని తెలిపింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు వస్తున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో అందరి చూపు ఈ ఎన్నికలపై ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని సవరించినట్లు ప్రకటించింది. నవంబర్ 23న ఓటింగ్ జరగాల్సి ఉంటే దీన్ని నవంబర్ 25కి మార్పింది. జోధ్‌పూర్ ఎంపీ పీపీ చౌదరితో పాటు పలు రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు ఆ రోజు దేవ్ ఉతాని ఏకాదశి ఉండటంతో పోలింగ్ తేదీని మార్చాలని కోరారు. పెళ్లిళ్లు, ఎంగేజ్మెంట్లు ఆ రోజున ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో పోలింగ్ తగ్గే అవకాశం ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
స్టార్ హీరో ఇంట పెళ్లి భాజాలు.. కూతురు వెడ్డింగ్ డేట్ అనౌన్స్ చేసిన అమీర్ ఖాన్!
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా అందరూ పిలుచుకునే అమీర్ ఖాన్ ఇంట త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. తాజాగా తన కూతురు పెళ్ళికి సంబంధించిన డేట్ అనౌన్స్ చేశారు అమీర్ ఖాన్. అమీర్ ఖాన్, ఆయన మాజీ భార్య రీనా దత్తాలకు జన్మించిన ఐరా ఖాన్ ఒక ఫిట్ నెస్ ట్రైనర్ ను వివాహం చేసుకోగా వారి నిశ్చితార్థం 2022 నవంబర్ 18న ఘనంగా జరిగింది. ఎంతో కాలం నుంచి ఆమె ప్రేమిస్తున్న నుపుర్ శిఖర్ తో ప్రేమను ఇరుకుటుంబాలు ఒప్పుకోవడంతో ఆ నిశ్చితార్థం జరిగింది. ఇక వీరి వివాహానికి సమయం ఆసన్నమైంది. 2024 జనవరి 3న కుమార్తె వివాహం జరగనున్నట్టు అమీర్ ఖాన్ తాజాగా ప్రకటించారు.
విమానంలో నటికి లైంగిక వేధింపులు..మద్యం మత్తులో అసభ్య ప్రవర్తన?
ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎన్ని చట్టాలు చేస్తున్న దేశంలో నిత్యం ఏదో ఒక చోట మహిళలపై వేధింపుల ఘటనలు తెర మీదకు వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు సామాన్యులకు జరిగిన ఘటనలు బయటకు వచ్చేవి కాదు కానీ సోషల్ మీడియా దెబ్బతో ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఇక తాజాగా మలయాళ నటి దివ్యప్రభ విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. తాను ప్రయాణిస్తున్న విమానంలో తన తోటి ప్రయాణికుడి నుంచి వేధింపులను ఎదుర్కొన్నట్లు దివ్య ప్రభ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అక్టోబర్ 9న ముంబై నుంచి కొచ్చి వెళ్లే ఎయిరిండియా ఫ్లైట్ ఏఐ 681లో తన తోటి ప్రయాణికుడు తనను వేధించాడని కేరళ పోలీసులకు దివ్య ప్రభ ఫిర్యాదు చేసి ఆ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు.
రెండో రోజు ముగిసిన నారా లోకేష్ విచారణ..
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శ నారా లోకేశ్ రెండో రోజు సీఐడీ విచారణ ముగిసింది. ఐఆర్ఆర్ కేసుకు సంబంధించి పలు అంశాలపై సీఐడీ ప్రశ్నలు వేసినట్లు సమాచారం. హెరిటేజ్ ఫుడ్స్ భూముల కొనుగోలు, జీఓఎమ్ నిర్ణయం, లోకేష్ పాత్రపై సీఐడీ ప్రశ్నలు వేసింది. చాలా ప్రశ్నలకు నాకు సంబంధం లేదు, తెలియదు అని సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. పలు ప్రశ్నలకు సమాధానాలు దాట వేశారు అని సీఐడీ వర్గాలు అంటున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నారా లోకేష్‌ను సీఐడీ అధికారులు విచారించారు. విచారణ అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు. “హైకోర్టు ఒక్కరోజే హాజరు కావాలని చెప్పింది. అయినా సీఐడీ అధికారుల సూచన మేరకు రెండో రోజు కూడా హాజరయ్యా. వాషింగ్ మెషిన్‌లో తిప్పినట్టు నిన్నటి ప్రశ్నలే అడిగారు. 47 ప్రశ్నలు అడిగారు. రెండు, మూడు మాత్రమే కొత్త ప్రశ్నలు. మా అమ్మ ఐటీ రిటర్న్స్ నా ముందు పెట్టారు. భువనేశ్వరి ఈ కేసులో నిందితురాలు కాదు. అయినా మా అమ్మ ఐటీ రిటర్న్స్ మీ చేతికి ఎలా వచ్చాయి అని అడిగాను. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నాం. దీనిపై న్యాయపరంగా పోరాటం చేయాలనుకుంటున్నా.” అని నారా లోకేష్ వెల్లడించారు.
అంధకారంలో గాజా.. ఉన్న ఒక్క విద్యుత్ కేంద్రం ఖతం..
ఇజ్రాయిల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడి మిడిల్ ఈస్ట్ లో మరోసారి టెన్షన్ వాతావరణం తీసుకువచ్చింది. హమాస్ దాడుల వల్ల ఇప్పటి వరకు 1200 మందికి పైగా ఇజ్రాయిలీ పౌరులు మరణించగా.. పలువురు బందీలుగా చేసుకుని గాజాకు తీసుకెళ్లింది హమాస్. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ తీవ్ర ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. హమాస్‌ని పూర్తిగా నాశనం చేసేదాకా విశ్రమించేది లేదని తేల్చి చెప్పింది. గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ వైమానికి దాడులను చేస్తోంది. మరోవైపు ఈ దాడుల్లో గాజాలో కూడా 1500కి పైగా మంది మరణించారు. ఈ యుద్ధం కారణంగా ఇప్పటి వరకు మరణాల సంఖ్య 3000 వేలకు చేరింది.
ఆ విషయంలో.. మీరో వర్గానికి ఇన్స్పిరేషన్ మేడమ్..
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్నవి అన్ని పాన్ ఇండియా సినిమాలే. ఈ ఏడాది జవాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నయన్.. ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో.. ఇంకోపక్క బిజినెస్ తో బిజీ బిజీగా మారింది. ఇక పెళ్లి తరువాత నయన్ లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. స్కిన్ షో చేయడం, లిప్ కిస్ లు, ముద్దులు.. ఇలా అన్ని పూర్తిగా మానేసింది. అందుకు నిదర్శనం జవాన్. బాలీవుడ్ సినిమా .. అంటే ఓ రేంజ్ లో స్కిన్ షో ఉంటుంది. సినిమా మొత్తం కాకపోయినా కనీసామ్ ఒక సాంగ్ లోనైనా హీరోయిన్ బికినీలో కనిపించాలి. కానీ, ఈ చిన్నది మాత్రం జవాన్ లో బికినీ కాదుకదా కనీసం స్కిన్ షో చేసే ఎలాంటి డ్రెస్ కూడా వేసుకోలేదు. ఈ సినిమాలోనే కాదు.. పెళ్లి తరువాత ఆమె బయట కనిపించినా కూడా స్టైలిష్ లుక్ లో కనిపిస్తూనే.. స్కిన్ షో లేని డ్రెస్ లతో మెప్పిస్తుంది.
ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు మేలు జరిగేలా చూడాలి..
వ్యవసాయం, అనుబంధ రంగాలతో పాటు పౌరసరఫరాలశాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పంటల సాగు, తాజా పరిస్థితులను సీఎంకు అధికారులు వివరించారు. జూన్ నుంచి సెప్టెంబరు వరకూ దాదాపుగా సాధారణ వర్షపాతం నమోదైందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అయినా జూన్, ఆగస్టు నెలల్లో వర్షాలు లేకపోవడంతో పంటల సాగుపై ప్రభావం పడిందని.. దీనివల్ల 73 శాతం మేర సాగు అయిందని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో ముందస్తు రబీకి రైతులు సిద్ధం అవుతున్నారు. దాదాపు 10 లక్షల ఎకరాల్లో ముందస్తు రబీ పంటలు వేసే అవకాశం ఉందని అధికారులు వివరించారు. శనగ సహా ఇతర విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నామని అధికారులు వెల్లడించారు. రబీలో సాగుచేసే శెనగ విత్తనాలపై సబ్సిడీని 25% నుంచి 40 శాతానికి పెంచామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం విత్తనాల పంపిణీ చురుగ్గా సాగుతోందని అధికారులు పేర్కొ్న్నారు. సుమారు లక్ష క్వింటాళ్ల శనగ విత్తనాలు సిద్ధం చేశామని సీఎంకు చెప్పారు. ఇందులో ఇప్పటికే 45 వేల క్వింటాళ్ల పంపిణీ చేశామని అధికారులు స్పష్టం చేశారు. ఎరువుల లభ్యతలో ఎలాంటి సమస్యా లేదని అధికారులు పేర్కొన్నారు. రైతుల అవసరాలకు తగిన విధంగా నిల్వలున్నాయని వెల్లడించారు.
చైనా రుణ ఉచ్చుతో జాగ్రత్త.. జైశంకర్ హెచ్చరిక
హిందూ మహాసముద్రం ప్రాంతంలోని అభివృద్ధి సవాళ్లను ఎదుర్కోవాలని బుధవారం ఇండియా పిలుపునిచ్చింది. శ్రీలంక రాజధాని కొలంబోలో జరుగుతున్న ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్(IORA) సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. యూఎన్ కన్వెన్షన్ ఆధారంగా హిందూ మహాసముద్రం స్వేచ్ఛా, బహిరంగ, సమ్మిళిత ప్రదేశంగా ఉండాలని అన్నారు.
ఈ సమావేశంలో చైనాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టులు, భరించలేని రుణాలతో ‘హిడెన్ ఎజెండా’ ప్రమాదాలపై జాగ్రత్తగా ఉండాలని పరోక్షంగా చైనాను ఉద్దేశించి అన్నారు. చైనా రుణ ఉచ్చు గురించి పరోక్షంగా సభ్యదేశాలకు తెలియజేశారు.
అమిత్ షా అబద్దాల కోరు.. ఆదివాసీల జిల్లాకు గిరిజన యూనివర్శిటీ ఏమైంది
అమిత్ షా అబద్దాల కోరు.. అమిత్ షా సభలో అన్ని అబద్ధాలు చెప్పారన్నారు ఆదిలాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న. ఇవాళ జోగు రామన్న మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఆయన కుటుంబం గురించి మాట్లాడే నైతిక హక్కులేదన్నారు. సీసీఐని స్క్రాప్ కింద అమ్మేస్తామన్నారని, సీమెంట్ పరిశ్రమను ఎందుకు పునరుద్దరించలేదన్నారు. సీసీఐ రీఓపెన్ కోసం బీజేపీ రాష్ట్రానికి ఏ లేఖరాయలేదని, లేఖపేరుతో ఆదిలాబాద్ ప్రజలను మోసం చేయోద్దన్నారు జోగురామన్న. బీజేపీ ప్రభుత్వం హాయంలో నే సీసీఐ మూతపడ్డదని, ఆదివాసీల జిల్లాకు గిరిజన యూనివర్శిటి ఏమైందని ఆయన ప్రశ్నించారు.
రేపు వైఎస్సార్ జగనన్న కాలనీని ప్రారంభించనున్న సీఎం జగన్
రేపు(గురువారం) కాకినాడ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయలుదేరనున్నారు. పది గంటలకు పెద్దాపురం చేరుకోనున్నారు. పది నిమిషాల పాటు స్థానిక నేతలు, కార్యకర్తలతో ఇంటరాక్షన్ కానున్నారు. అనంతరం సామర్లకోటకు ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. జగనన్న కాలనీలో లబ్ధిదారుల ఇళ్ల పరిశీలన, వైఎస్సార్ విగ్రహ ఆవిష్కరణను నిర్వహించనున్నారు. 11 గంటలకు బహిరంగ సభ వేదిక వద్దకు సీఎం చేరుకోనున్నారు. 40 నిమిషాల పాటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో తిరిగి తాడేపల్లికి ముఖ్యమంత్రి జగన్ చేరుకోనున్నారు.
తెలంగాణ పాలనా వ్యవస్థపై ఈసీ కొరడా.. ఐఏఎస్, ఐపీఎస్‌లపై బదిలీ వేటు
తెలంగాణ పాలనా వ్యవస్థపై కేంద్ర ఎన్నికల సంఘం(CEC) కొరడా ఝుళిపించింది. భారీగా పలు శాఖల ఉన్నతాధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా బదిలీ వేటు వేసినట్లు తెలిసింది. కమిషనర్లకు కూడా స్థానచలనంకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగనాథ్, నిజామాబాద్ సీపీ వి.సత్యనారాయణ, రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ టీకే శ్రీదేవి, ఎక్సైజ్ శాఖ సంచాలకుడు ముషారఫ్ అలీతో పాటు 9 జిల్లాల నాన్‌కేడర్ ఎస్పీల బదిలీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
రోహిత్ సెంచరీ.. అఫ్గానిస్థాన్‌పై భారత్ ఘన విజయం..
వరల్డ్ కప్ 2023 టోర్నీలో భారత్ విజయాల బాటలో పయనిస్తోంది. ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్‌లో చెమటోడ్చి గెలిచిన భారత్.. పసికూన అఫ్గానిస్థాన్ జట్టుపై అలవోకగా విజయం సాధించింది. హిట్ మ్యాన్ రోహిత్ భారీ శతకాన్ని నమోదు చేయడంతో 15 ఓవర్లు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని భారత్ తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో 273 పరుగుల లక్ష్యాన్ని 35 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి టీమిండియా ఛేదించింది. అఫ్ఘాన్‌కు ఇది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ కలిసి తొలి వికెట్‌కి 156 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో రోహిత్ శర్మ సెంచరీని పూర్తి చేశాడు. అఫ్గాన్ బౌలర్ మహ్మద్ నబీ వేసిన 18 ఓవర్‌లో మొదటి బంతికి ఫోర్ బాది 99కి చేరుకున్న రోహిత్.. తర్వాత బంతికి సింగిల్ తీసి తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 63 బంతుల్లో శతకం బాది అత్యంత వేగంగా సెంచరీ పూర్తి చేసుకున్న భారత ఆటగాడిగా రికార్డును నమోదు చేశాడు. ఈ క్రమంలోనే ప్రపంచకప్‌లో ఏడో సెంచరీని తన ఖాతాలో వేసుకుని.. సచిన్(6) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.
