NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

కాంగ్రెస్ వేదికపైనే మహిళా నేతకి లైంగిక వేధింపులు..

హర్యానాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తు్న్న కార్యక్రమం సభా వేదికపైనే ఆ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు లైంగిక వేధింపులకు గురైంది. పార్టీ సీనియర్ నేత దీపేందర్ హుడా సమక్షంలోనే హర్యానా మహిళా కాంగ్రెస్ నాయకురాలు పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు సమాచారం. కాంగ్రెస్ నాయకురాలు సెల్జా కుమారి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన గురించి తెలిసిన తర్వాత తాను బాధిత మహిళతో మాట్లాడానని, ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో తాను వేధింపులకు గురైనట్లు సదరు మహిళ చెప్పారని తెలిపారు. ఏ పార్టీ అయినా కూడా ఏ మహిళని అగౌరపరచకూడదని ఆమె అన్నారు.

తెలుగు రాష్ట్రాలకు 4 రోజుల పాటు భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో ఈరోజు ఏర్పడిన అల్పపీడనం ప్రభావం పశ్చిమ బెంగాల్‌తో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. అయితే, రానున్న నాలుగు రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. అలాగే, రాయలసీమ జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఏపీలోని ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చింది.

కొండా సురేఖ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న కూడా దాడి అవసరమా..?

సినిమా వాళ్ల ఎపిసోడ్ లో కొంత సంయమనం పాటించాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఫిర్యాదుదారులు మంత్రి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని అని అడిగారు.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నా… సినిమా వాళ్ళు చర్చను కొనసాగించారన్నారు. కొండా సురేఖనీ అవమానించేలా పోస్ట్ చేసిన అంశంపై కూడా సినిమా వాళ్ళు స్పందిస్తే బాగుండేదన్నారు. కొండా సురేఖ పై.. సినిమా హీరోల ట్వీట్స్ పై మంత్రి పొన్నం స్పందించారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నా.. కూడా అంత దాడి అవసరమా..? అని ప్రశ్నించారు. బలహీన వర్గాల మంత్రి ఒంటరి అనుకోకండి అని హెచ్చరించారు.

సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా తిరుపతి లడ్డుపై రాజకీయం చేస్తున్నారు..

సీఎం చంద్రబాబు వ్యవహార శైలిపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా చంద్రబాబులో ఏ మార్పు రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూ ప్రసాదంపై రాజకీయాలు చేస్తున్నారంటూ ఎక్స్ ట్వీట్టర్) వేదికగా ఆయన స్పందించారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తూ తీర్పు ఇచ్చిన కూడా.. ఆ తీర్పును వక్రీకరిస్తారా? అని ప్రశ్నించారు. తప్పులను సుప్రీంకోర్టు ఎత్తి చూపుతూ మిమ్మల్ని నిలదీస్తే మాకు అక్షింతలు వేసిందని అసత్య ప్రచారం చేస్తు్నారని ఆయన సీరియస్ అయ్యారు.

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. పోటెత్తిన హర్యానా ఓటర్లు

హర్యానాలో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ బూతులకు భారీగా తరలివచ్చారు. రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం ఓటింగ్ నమోదు కాగా.. సాయంత్రం 6 గంటలకు ముగిసే సమయానికి భారీగానే పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు భావిస్తున్నారు. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 1,031 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తమయ్యాయి. జమ్మూకాశ్మీర్‌లో మూడు విడతల్లో పోలింగ్ ముగిసింది. అక్కడ కూడా భారీగానే ఓటింగ్ నమోదైంది. ఇక జమ్మూకాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న విడుదల కానున్నాయి. హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పోటాపోటీగా తలపడ్డాయి. హ్యాట్రిక్ కొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా.. అధికారం ఛేజిక్కించుకోవాలని కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నం చేసింది. ఇక ఆప్ కూడా కొన్ని స్థానాలు దక్కించుకోవాలని ఆశలు పెట్టుకుంది. కానీ హర్యానా ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారో వచ్చే మంగళవారం తేలిపోనుంది.

వీఐపీ భక్తులు టైమ్ స్లాట్ ప్రకారం దుర్గమ్మ దర్శనానికి రావాలి..

విజయవాడ కనకదుర్గ ఆలయంలో గత రెండు రోజుల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన తెలిపారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకూడదనేదే మా ఉద్ధేశం.. వీఐపీ భక్తులు టైమ్ స్లాట్ ప్రకారం దర్శనానికి రావాలని కోరుతున్నాం.. ఉత్సవ కమిటీ సభ్యులకు కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాం.. రేపట్నుంచి రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వెల్లడించారు. ఇక, సామాన్య భక్తులకు మంచి దర్శనం కల్పించాలనేదే మా లక్ష్యం అని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. వీఐపీలకు కొంత అసౌకర్యం కలిగినా అర్ధం చేసుకోవాలి.. వీఐపీలు టైమ్ స్లాట్ ప్రకారమే వస్తే మంచి దర్శనం జరుగుతుంది.. 500 రూపాయల దర్శనం ఆలస్యమవుతోంది.. 300 రూపాయల క్యూలైన్ దర్శనం త్వరితగతిన జరుగుతోంది.. క్యూలైన్లలో పద్ధతి పాటించకుండా ప్రవేశించే భక్తులను నియంత్రిస్తున్నాం అని ఆయన చెప్పారు. పోలీస్ యూనిఫామ్ లో ఎవరు దర్శనానికి వెళ్లినా ఊరుకునేది లేదని హెచ్చరించాం.. వీఐపీ దర్శనాలకు యాప్ అందుబాటులోకి తెచ్చాం.. ట్రాఫిక్ విషయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. అస్ర్రం యాప్ ద్వారా ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నాం.. సైబర్ క్రైమ్ పై అవేర్ నెస్ కార్యక్రమం చేపట్టాం.. నిన్నటికి లక్ష మందిని యాప్ లో సైబర్ అవేర్ నెస్ కల్పిస్తున్నాం.. మూలానక్షత్రం రోజున మరింత పకడ్భందీగా ఏర్పాట్లు చేస్తున్నాం.. చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి వచ్చాయి.. వాటిని పరిష్కరిస్తున్నామని సీపీ రాజశేఖర్ బాబు అన్నారు.

హర్యానా కాంగ్రెస్ హస్తగతం.. బీజేపీకి హ్యట్రిక్ ఆశలు గల్లంతు.

లోక్‌సభ ఎన్నికలు -2024 తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్, హర్యానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దీంతో అందరి ఆసక్తి ఈ ఎన్నికలపై నెలకొంది. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. బీజేపీ హ్యాట్రిక్ ఆశలు గల్లంతయ్యే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మొత్తం 90 స్థానాల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని చెబుతోంది. హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉంటే 46 మ్యాజిక్ ఫిగర్. ఈ సంఖ్య చేరుకున్న పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. అసలు ఫలితాలు అక్టోబర్ 08న వెలువడనున్నాయి.

మాది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం.. ప్రతి ఉద్యోగికి భరోసా కల్పిస్తాం..

సచివాలయంలో సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసెస్ (SRDS) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం జరిగింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పంచాయత్ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ సెక్రెటరీ లోకేష్ కుమార్, కమిషనర్ అనితా రామ చంద్రన్, స్పెషల్ కమిషనర్ షఫీ ఉల్లా, ఇతర ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. బోర్డు మీటింగ్ పదేళ్లుగా నిర్వహించకపోవడం పట్ల మంత్రి సీతక్క విస్మయ వ్యక్తం చేశారు. పదేళ్లుగా మీటింగ్ నిర్వహించకపోతే ఉద్యోగుల సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ఎస్‌ఆర్‌డీఎస్ లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ద్ధతిలో 3700కు పైగా ఉద్యోగులు ఉన్నట్లు సీతక్క తెలిపారు. టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీసు సుబ్బార్డనేట్ల, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

నెల్లూరు నగరాన్ని పోస్టర్ ఫ్రీ సిటీగా మారుస్తాం..

నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ పిల్లర్లకు అంటించిన పోస్టర్లను మంత్రి నారాయణ తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని పట్టణాలలో పోస్టర్లు, ఫ్లెక్సీలు లేకుండా అందంగా మారుస్తామన్నారు. గతంలో తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కార్యక్రమం 90 శాతం విజయవంతమైంది అని తెలిపారు. ఆ స్ఫూర్తితోనే మళ్లీ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం.. నెల్లూరు నగరాన్ని పోస్టర్ ఫ్రీ సిటీగా మారుస్తాం.. ఫ్లెక్సీలను కూడా అనుమతించం.. రాజకీయ పార్టీల సమావేశాలు ఉన్నపుడు 48 గంటలు మాత్రమే అనుమతిస్తాం.. 2014-19ల మధ్య అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సూచనల మేరకు నగరంలో పోస్టర్స్, ఫ్లెక్సీలను తొలగించామని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.

దర్శన్‌ని భయపెడుతున్న రేణుకాస్వామి ఆత్మ..

కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్, అతని అభిమాని అయిన 33 ఏళ్ల రేణుకాస్వామి హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నాడు. దర్శన్‌కి నటి పవిత్ర గౌడకు ఉన్న సంబంధంపై రేణుకాస్వామి, పవిత్ర గౌడకు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టు పెట్టడమే అతడి మరణానికి కారణమైంది. చిత్రదుర్గ నుంచి రేణుకాస్వామిని దర్మన్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి, బెంగళూర్ తీసుకువచ్చి దారుణంగా కొట్టి, చిత్రహింసలు పెట్టి అతను మరణించేలా చేశారు. ఈ కేసులో మొత్తం 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుగా బెంగళూర్‌లోని పరప్పన అగ్రహార జైలులో దర్శన్‌కి రిమాండ్ విధించారు. అయితే, ఆ జైలులో వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వడంతో అతని బళ్లారి జైలుకు తరలించారు. ఈ జైలుకు తరలించినప్పటి నుంచి దర్శన్‌ని రేణుకాస్వామి ఆత్మ భయపెడుతోందని జైలు సిబ్బందికి చెబుతున్నట్లు సమాచారం. కొన్ని రోజులుగా రేణుకాస్వామి ఆత్మ కలలోకి వచ్చి భయపెడుతోందని జైలులో ఉన్న ఖైదీలతో దర్శన్ చెబుతున్నాడట. భయంతో తనకు నిద్ర పట్టడం లేదని చెప్పినట్లు సమాచారం. తనను బెంగళూర్ జైలుకి తరలించాలని జైలు అధికారుల్ని కోరినట్లు తెలుస్తోంది. అర్థరాత్రి సమయంలో దర్శన్ నిద్రలో కలవరిస్తున్నాడని, గట్టిగా కేకలు వేస్తున్నట్లు ఖైదీలు చెబుతున్నారు.