Site icon NTV Telugu

Top Headlines @9AM : టాప్ న్యూస్

Top Headlines@9am

Top Headlines@9am

ఆంధ్రప్రదేశ్ రైలు ప్రమాదం.. 14 రైళ్లు రద్దు.. ఐదు దారి మళ్లింపు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కంటకపల్లె, అలమండ రైల్వే స్టేషన్ల మధ్య రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్నాయి. విశాఖపట్నం-రాయగడ ప్యాసింజర్ ప్రత్యేక రైలు విశాఖపట్నం-పలాస ప్యాసింజర్ ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో పలు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో కనీసం 14 మంది ప్రయాణికులు మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు. ఢీకొన్న రైలు డ్రైవర్‌ సిగ్నల్‌ మిస్‌ అయ్యాడని రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. రైలు రెడ్ సిగ్నల్‌ను దాటుకుని ముందుకు సాగడంతో వెనుక నుంచి నెమ్మదిగా వెళ్తున్న లోకల్ రైలు ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత ఆ మార్గంలో కనీసం 14 రైళ్లు రద్దు చేయబడ్డాయి. ఎనిమిది రైళ్లను పాక్షికంగా ఆపేశారు. ఐదు రైళ్ల మార్గాలను దారి మళ్లించారు. కాగా, ఘటనా స్థలంలో చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం రైల్వేశాఖ బస్సులను ఏర్పాటు చేసింది.

విజయనగరం రైలు ప్రమాదం.. 14కు చేరిన మృతుల సంఖ్య! 100 మందికి పైగా గాయాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రెండు రైళ్లు బయల్దేరిన కొద్ది నిమిషాల వ్యవధిలో ఒకదానికిఒకటి ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య రాత్రి ఏడు గంటల సమయంలో ట్రాక్‌పై ఉన్న రైలును వెనక నుంచి మరో రైలు ఢీకొనడంతో మూడు బోగీలు నుజ్జయ్యాయి. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 14కి చేరింది. 33 మందికి తీవ్ర గాయాలయ్యాయని అధికార వర్గాలు తెలిపాయి. క్షతగాత్రుల సంఖ్య 100కి పైనే ఉంటుందని తెలుస్తోంది. మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది.

విశాఖపట్నం-పలాస పాసింజర్‌ రైలు ఆదివారం సాయంత్రం 6.42 గంటలకు కొత్తవలస రైల్వేస్టేషన్‌ నుంచి బయల్దేరింది. భీమాళి రైల్వేస్టేషన్‌ దాటిన తర్వాత అలమండ రైల్వేస్టేషన్‌ నుంచి సిగ్నల్‌ రాకపోవడంతో.. డ్రైవర్‌ రైలును ఆపేశాడు. అదే ట్రాక్‌పై సాయంత్రం 6.52 గంటల ప్రాంతంలో విశాఖపట్నం-రాయగడ పాసింజర్‌ కొత్తవలస నుంచి బయల్దేరింది. వేగంగా వస్తున్న విశాఖపట్నం-రాయగడ పాసింజర్‌ ముందు వెళ్తున్న విశాఖపట్నం-పలాస పాసింజర్‌ రైలును రాత్రి 7 గంటల సమయంలో వెనుక నుంచి భీమాళి–అలమండ రైల్వేస్టేషన్ల మధ్య ఢీకొట్టింది. దీంతో పలాస పాసింజర్‌ వెనుక ఉన్న రెండు బోగీలు, రాయఘడ పాసింజర్‌ రైలు ఇంజన్‌తో పాటు మూడు బోగీలు పలాస రైలు మీద పడి నుజ్జునుజ్జయ్యాయి. కొన్ని బోగీలు పక్క ట్రాక్‌పై ఉన్న గూడ్స్‌ రైలు మీద పడ్డాయి. దీంతో అక్కడ పెను విషాదం చోటుచేసుకుంది.

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు..ఈరోజు తులం ఎంతంటే?

మహిళలకు బ్యాడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలకు రెక్కలోచ్చాయి.. గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.. నేడు మార్కెట్ లో పసిడి ధరలు పుంజుకున్నాయి.. నిన్నటితో పోలిస్తే ఈరోజు స్వల్పంగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.. ఇక వెండి ధరలు మాత్రం రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఇవాళ అంతర్జాతీయంగానూ బంగారం రేటు మళ్లీ పుంజుకునేలా కనిపిస్తోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 పెరిగింది, 24 క్యారెట్ల బంగరం ధరపై కూడా రూ. 10 పెరుగుదల కనిపించింది. దీంతో సోమవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,410 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,630 వద్ద కొనసాగుతోంది..ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం..

కేరళ బాంబు బ్లాస్ట్.. 70సీసీ టీవీల స్కాన్.. అనుమానాస్పదంగా బ్లూ కలర్ కారు

కేరళ వరుస పేలుళ్లలో మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. మొత్తం 45 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పేలుడు ఘటనపై ఎన్‌ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. దీని వెనుక ఉగ్రవాద సంస్థల హస్తం ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. కొచ్చి పేలుడుకు బాధ్యత వహించిన డొమినిక్ మార్టిన్ వాంగ్మూలం తర్వాత ఎన్ఐఏ, కేరళ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో డొమినిక్ మార్టిన్ అతను ఉపయోగించిన ఐఈడీ(Improvised explosive device), పేలుడు పదార్థాలను ఎక్కడ నుండి పొందాడు అనే విషయాన్ని వెల్లడించలేదు.

విజయనగరం రైలు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు!

విజయనగరం రైలు ప్రమాదంపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్యాసింజర్‌ రైలుకు ప్రమాదం జరిగిందని, పలు బోగీలు పట్టాలు తప్పినట్లుగా సీఎంఓ అధికారులు సీఎంకు తెలపగానే.. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. రైలు ప్రమాదంలో మృతి చెందిన ఏపీకి చెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం జగన్‌ ప్రకటించారు.

రైలు ప్రమాదంలో ఇతర రాష్ట్రాల వారు మరణిస్తే రూ. 2లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఘటన గురించి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం ఆదివారం రాత్రి ఫోన్‌లో మాట్లాడారు. ఘటనాస్థలికి మంత్రి బొత్స సత్యనారాయణను పంపామని, ప్రమాద విషయం తెలియగానే సహాయక బృందాలు అప్రమత్తం అయ్యాయని సీఎం రైల్వే మంత్రికి వివరించారు. క్షతగాత్రుల్ని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

విమానం ఎక్కుతుండగా గుండెపోటు.. సర్పంచి భార్య మృతి!

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చిన్ననారాయణపురం సర్పంచి కె నర్సింహా భార్య ఇందిరాబాయి (48) ఛండీగఢ్‌లో మరణించారు. డ్వాక్రా ఉద్యోగిని అయిన ఇందిరాబాయి ఛండీగఢ్‌లో విమానం ఎక్కే క్రమంలో గుండెపోటు రావడంతో శుక్రవారం మృతి చెందారు. ఇందిరాబాయి మృతదేహాన్ని చిన్ననారాయణపురానికి తరలించడానికి హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ చర్యలు తీసుకున్నారు. ఆదివారం రాత్రి మృతదేహం ఆమె స్వగ్రామానికి చేరుకోగా.. సోమవారం అంత్యక్రియలు జరగనున్నాయి.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఇందిరాబాయి స్థానికంగా సీఆర్‌పీగా విధులు నిర్వహిస్తుంటారు. పంజాబ్‌లో సీఆర్‌పీకు నెల రోజుల పాటు నిర్వహించే అవగాహన సదస్సుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన 400 మందిలో ఇందిరాబాయి ఉన్నారు. పంజాబ్‌లో ఇందిరాబాయి సదస్సులు ముగించుకుని.. తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. ఛండీగఢ్‌లో విమానం ఎక్కుతుండగా.. ఆమెకు గుండెపోటు వచ్చింది. సిబ్బంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు.

డీజీపీ పదవి కోసం కోర్టుకెక్కిన ఇద్దరు ఐపీఎస్‎లు.. నేడు విచారణ

పంజాబ్ డీజీపీ పదవి కోసం ఇద్దరు ఐపీఎస్ అధికారులు తమ మధ్య వాగ్వాదానికి దిగారు. ఒక వైపు 35 ఏళ్ల నిష్కళంకమైన సేవా రికార్డును కలిగి ఉన్న ఐపీఎస్ వీకే భావ్రా తన అంకితభావం, వృత్తి నైపుణ్యానికి పేరుగాంచాడు. మరోవైపు ప్రస్తుతం పంజాబ్ పోలీస్ డీజీపీగా పనిచేస్తున్న ఐపీఎస్ గౌరవ్ యాదవ్ ఉన్నారు. గౌరవ్ యాదవ్‌ను పంజాబ్ పోలీస్ డైరెక్టర్ జనరల్‌గా నియమించడాన్ని భావ్రా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో సవాలు చేశారు. ఈరోజు అక్టోబర్ 30న విచారణ జరగనుంది. గౌరవ్ యాదవ్‌ను పంజాబ్ పోలీస్ డీజీపీగా నియమించిన అక్రమ పద్ధతిపై వివాదం నెలకొంది. యాదవ్ నియామకం పంజాబ్ పోలీసు చట్టం 2007లోని నిబంధనలను, ప్రకాష్ సింగ్ తదితరుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించడమేనని భావ్రా వాదించారు. UPSC సిఫార్సు చేసిన విధంగా తన మునుపటి నియామకం వలె పంజాబ్ పోలీస్ డిజిపి పదవికి తనను తిరిగి నియమించాలని భావ్రా వాదించారు.

శరవేగంగా రెస్క్యూ ఆపరేషన్ పనులు

రైలు ప్రమాద సంఘటన స్థలం వద్ద రెస్క్యూ ఆపరేషన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.. పట్టాల మీద ప్రమాదానికి గురైన బోగిలను తొలగించేందుకు బాహుబలి క్రెన్ రంగం లోకి దిగింది. ప్రమాదంలో పూర్తిగా నుజ్జునుజ్జయిన ప్యాసింజర్ బోగీలను, గూడ్స్ భోగిలను తొలగించే ప్రక్రియ కొనసాగుతుంది..ఇప్పటికే లోపల చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. మరో రెండు మృతదేహలు లోపల ఉన్నట్లు భావిస్తున్నారు.. అయితే.. విజయనగరంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా విశాఖపట్నం నుంచి వెళ్లే పలు రైళ్ల. రాకపోకలను రద్దు చేయడం జరిగింది మరికొన్నిటిని దారి మళ్లించారు రైళ్లు రద్దు కావడంతో నిన్న సాయంత్రం నుండి ప్రయాణికులు విశాఖపట్నం రైల్వే స్టేషన్ లోనే వేచి చూస్తున్నారు.

 

Exit mobile version