NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు వరంగల్కు సీఎం రేవంత్ రెడ్డి.. షెడ్యూల్ ఇదే
నేడు వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి.. 1.30 కి వరంగల్ కు చేరుకుంటారు. అక్కడ.. మేఘా టెక్ట్స్ టైల్ పార్క్ ని పరిశీలిస్తారు. ఆ తర్వాత సెంట్రల్ జైలులో నిర్మాణం చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలిస్తారు. ఆ తర్వాత హన్మకొండ కలెక్టరేట్లు వహించనున్న గ్రేటర్ వరంగల్ పై రివ్యూ మీటింగ్ చేపట్టనున్నారు. సాయంత్రం అక్కడి నుంచి బయల్దేరి బేగంపేట ఎయిర్ పోర్టుకు హెలికాప్టర్లో చేరుకోనున్నారు.
సీఎం వరంగల్ షెడ్యూల్..
మధ్యాహ్నం 12:40కి హెలికాప్టర్ లో బేగంపేట విమానాశ్రయం నుంచి బయల్దేరుతారు.
మధ్యాహ్నం 1:30 నిమిషాలకు వరంగల్ మేఘ టెక్స్ టైల్ పార్క్ కు చేరుకుంటారు.
మధ్యాహ్నం 1:30 నుంచి 1:50 వరకు టెక్స్ టైల్ పార్క్ సందర్శించి కొత్త కంపెనీల స్థాపన, ఉపాధి కల్పన చేస్తారు.
మధ్యాహ్నం 1:50 అక్కడి నుంచి బయల్దేరి రంగంపేట మల్టీస్పెషలిటీ ఆస్పత్రి వద్దకు వెళ్తారు.
మధ్యాహ్నం 2:10 నుంచి 2:30 వరకు మల్టీస్పెషల్టీ ఆస్పత్రిని సందర్శిస్తారు.
మధ్యాహ్నం 2: 30కు హనుమకొండ సూపర్ స్పెషల్టీ ఆస్పత్రిని సందర్శిస్తారు.
మధ్యాహ్నం 2:45కు వరంగల్ లో మహిళా శక్తి క్యాంటీన్ ను ఓపెన్ చేస్తారు.
మధ్యాహ్నం 3:00 నుంచి 5:30 వరకు గ్రేటర్ వరంగల్ పై రివ్యూ మీటింగ్ చేపడతారు.
సాయత్రం 5:40కి ఓ ప్రైవేట్ ప్రోగ్రాంలో పాల్గొంటారు.
సాయంత్రం 6:30 హెలికాప్టర్ లో హైదరాబాద్ కు బయల్దేరుతారు
రాత్రి 7:20కి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ కన్నుమూత..
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్.. తెల్లవారు జామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు. డి.శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. డి.శ్రీనివాస్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలుపుతున్నారు. రేపు నిజామాబాద్ లో శ్రీనివాస్ అంత్యక్రియలు జరుగనున్నాయి. సాయంత్రం నిజామాబాద్ ప్రగతి నగర్ లోని ఆయన నివాసానికి డీఎస్ పార్థివదేహాన్ని తీసుకురానున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ధర్మపురి శ్రీనివాస్ 1948 సెప్టెంబర్ 25న జన్మించారు. ఈయనకు ఇద్దరు కుమారులు కాగా.. పెద్ద కుమారుడు డి.సంజయ్ నిజామాబాద్ నగర మాజీ మేయర్ గా పని చేశారు. ప్రస్తుతం ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అలాగే చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. డి.శ్రీనివాస్ 1989, 99, 2004లో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ధర్మపురి శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పాటు సేవలందించారు. 2014 అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన కొద్ది రోజుల పాటు ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

నేడు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం.. అంజన్నను దర్శించుకోనున్న పవన్ కళ్యాణ్
నేడు కొండగట్టు అంజన్నను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి కొండగట్టుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్. ఉదయం హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో కొండగట్టుకు చేరుకోనున్నారు. తమ ఇలవేల్పు కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు. పవన్ కల్యాణ్ ఒక్కరే కాదు మెగా ఫ్యామిలీ మొత్తం ఆంజనేయ స్వామిని ఇష్టంగా కొలుస్తారు. ప్రజారాజ్యం 2009 ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ కు కొండగట్టు సమీపంలో ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. హైటెన్షన్ వైర్లు పడటం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. అప్పటి నుంచి కొండగట్టు అంజన్నను పవన్ కల్యాణ్ ఇష్ట దైవంగా ఆరాధిస్తున్నారు. ఏ మంచి పని చేపట్టినా ముందుగా కొండగట్టు వెళుతుంటారు. గత ఎన్నికల్లో ప్రచారం కోసం పవన్ కల్యాణ్ వారాహి అనే ప్రత్యేక వాహనాన్ని ఉపయోగించారు. ఆ వాహనానికి తొలి పూజ కొండగట్టు అంజన్న ఆలయంలో నిర్వహించారు. ఎన్నికల ముందు వారాహి వాహనానికి పవన్ కళ్యాణ్ కొండగట్టులోనే పూజలు నిర్వహించారు. జనసేన అధినేతకు భారీ స్వాగత ఏర్పాట్లు చేసింది తెలంగాణ జనసేన విభాగం. మరోవైపు.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండగట్టు అంజన్న ఆశీస్సులతో తమకు మంచి జరిగిందని పవన్ కల్యాణ్ మరోసారి శనివారం కొండగట్టు పర్యటనకు వస్తున్నట్లు జనసేన పార్టీ శ్రేణులు తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అఖండ విజయం సాధించింది. కూటమి విజయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రధాన పాత్ర పోషించారు.

మాజీ ఎంపీ ప్రచార ‎రథాన్ని ‎తగలబెట్టిన ‎గుర్తు ‎తెలియని ‎వ్యక్తులు..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్‌ ఎన్నికల ప్రచార రథాన్ని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి తగలబెట్టారు. రాజమహేంద్రవరం నగరంలోని వీఎల్ పురంలో ఉన్న మార్గాని ఎస్టేట్స్‌లోని ఆయన కార్యాలయం దగ్గర ఈ వాహనం ఉంచారు. దీనికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు మార్గాని భరత్ కు సమాచారం అందించారు. ఇక, వెంటనే మాజీ ఎంపీ మార్గాని భరాత్ తో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా భరత్ రామ్‌ మాట్లాడుతూ.. రాజమహేంద్రవరంలో ఇలాంటి విష సంస్కృతి గతంలో ఎప్పుడూ లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ చేస్తున్న దాడుల నేపథ్యంలోనే ఈ దుశ్చర్యకు ఒడిగట్టి ఉంటారని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకులు గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను పెంచి పోషిస్తున్నారంటూ తాను ఎప్పటి నుంచో చెబుతున్నాను.. ఇలాంటి పరిస్థితి రాజమండ్రిలో ఏర్పడటం దారుణమని మార్గాని భరత్ అన్నారు.

నేడు కోర్టుకు సీఎం కేజ్రీవాల్‌.. అరెస్ట్ పై నిరసన తెలుపనున్న ఆప్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయన ఈరోజు రోస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. కేజ్రీవాల్‌ సీబీఐ రిమాండ్‌ గడువు నేటితో ముగియనుంది. జూన్ 26న సీబీఐ అతడిని అరెస్ట్ చేసింది. దీంతో కోర్టు అతడిని మూడు రోజుల సీబీఐ కస్టడీకి పంపింది. రూస్ అవెన్యూ కోర్టులో సిబిఐ సిఎం కేజ్రీవాల్‌ను ఐదు రోజుల కస్టడీని కోరింది. అయితే ఏజెన్సీకి కోర్టు నుండి 3 రోజుల రిమాండ్ మాత్రమే లభించింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు జూన్ 20న బెయిల్ మంజూరు చేసింది. దిగువ కోర్టు ఇచ్చిన ఈ నిర్ణయాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. ట్రయల్ కోర్టు నిర్ణయంపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియాపై పూర్తి నిందలు మోపారని, ఈ కేసులో ఇప్పటికే మనీష్ సిసోడియాను జైలులో పెట్టారని సీబీఐ కోర్టులో పేర్కొంది. ఎక్సైజ్ పాలసీపై తనకు ఎలాంటి అవగాహన లేదని కేజ్రీవాల్ చెప్పినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. సీబీఐ చేసిన ఈ ప్రకటనపై కేజ్రీవాల్ మాట్లాడుతూ నేను సిసోడియాపై ఎలాంటి నిందలు వేయలేదు. నేను కూడా నిర్దోషినే, సోసాదియా కూడా నిర్దోషి అని కేజ్రీవాల్ అన్నారు. సుప్రీంకోర్టులో విచారణకు ముందు కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ అరెస్టుపై ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. అరవింద్ కేజ్రీవాల్‌కు జూన్ 20న బెయిల్ లభించిందని చెప్పారు. ఈడీ వెంటనే స్టే తెచ్చుకుంది. ఆ మరుసటి రోజే సీబీఐ అతడిని నిందితుడిగా చేసి అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు రాకుండా చూసేందుకు మొత్తం వ్యవస్థ ప్రయత్నిస్తోంది. ఇది చట్టం కాదు. ఇది నియంతృత్వం అన్నారు.

కజకిస్తాన్ ఎస్‌సీఓ సమ్మిట్‌కి మోడీ బదులుగా జై శంకర్..
వచ్చే వారం కజకిస్తాన్ ఆస్తానాలో జరగబోయే ‘‘షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ)’’ సమావేశానికి భారత ప్రధాని నరేంద్రమోడీ వెళ్లే అవకాశం కనిపించడం లేదు. ఈ సమావేశాన్ని దాటవేయాలని ప్రధాని నిర్ణయించుకున్నట్లు సమాచారం. భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించేందుకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సమావేశానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా 5 ఏళ్ల తర్వాత ప్రధాని మోడీ జూలై 08,09 వరకు రష్యాలో పర్యటించనున్నారు. రష్యా పర్యటన తర్వాత రెండు రోజుల పర్యటన కోసం జూలై 09న ఆస్ట్రియా వెళ్లే అవకాశం ఉంది. రష్యా, ఆస్ట్రియా పర్యటనలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోడీ ఎస్‌సీఓ సమ్మిట్‌కి గైర్హాజరు కానున్నట్లు సమాచారం. అయితే, మోడీ రెండు దేశాల పర్యటనపై ఇంకా అధికారికంగా ఎలాంటి ధృవీకరణ రాలేదు. జూలై 3 మరియు 4 తేదీల్లో జరగనున్న SCO సమ్మిట్ ప్రాంతీయ భద్రతా పరిస్థితి మరియు కనెక్టివిటీ మరియు వాణిజ్యాన్ని పెంచే మార్గాలపై దృష్టి పెడుతుందని భావిస్తున్నారు. విదేశీవ్యవహారాల మంత్రిత్వశాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, SCO సమ్మిట్‌లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నాయకత్వం వహిస్తారని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి, ఉక్రెయిన్ వివాదం, ఎస్‌సీఓ సభ్య దేశాల మధ్య భద్రతా సహకారాన్ని పెంచడంపై ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చ జరగబోతోంది. మంగళవారం ప్రధాని మోడీ కజకిస్తాన్ అధ్యక్షుడు కస్సిమ్ జోమార్ట్ టోకాయేవ్‌తో ఫోన్‌లో సంభాషిస్తూ, సమ్మిట్ విజయవంతానికి భారత్ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం కజకిస్తాన్ అధ్యక్ష హోదాలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. భారతదేశం, చైనా, రష్యా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజ్‌స్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లు ఎస్‌సీఓ సభ్యదేశాలుగా ఉన్నాయి.

తుది సమరానికి వేళాయె.. నేడే సఫారీలతో సమరం..
7 నెలల క్రితం అద్భుత ప్రదర్శనతో వన్డే ప్రపంచం ఫైనల్ వరకు చేరుకొని చివరి ఘట్టంలో ఓడిపోయి కోట్ల మంది ఆశలను అడియాస చేసింది టీమిండియా. అయితే అప్పుడు చేజారిన అవకాశాన్ని మరోసారి వడిసి పట్టుకొనే అవకాశం నేడు ఆసన్నమైంది. టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో నేడు టీమిండియా దక్షిణాఫ్రికాతో తెలపడనుంది. 17 ఏళ్ల క్రితం అప్పటి టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మొదలుపెట్టిన ఈ వేట.. ఇన్నాళ్లకు మరోసారి రోహిత్ అందుకునే ఛాన్స్ వచ్చింది. ఇప్పటివరకు సీరియస్ లో అపజయం ఎరగకుండా ఫైనల్ కు వచ్చింది టీమిండియా. ఈ ఒక్కరోజు రోహిత్ సేన వెంట అదృష్టం తోడైతే అందుకు తగ్గ ప్రదర్శన టీమిండియా కనపడితే మరోసారి ప్రపంచకప్ పై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. బ్రిడ్జ్ టౌన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తుది పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ విజయంతో దక్షిణాఫ్రికా మొదటిసారి ప్రపంచకప్ ను గెలుచుకుంటుందో లేకపోతే టీమిండియా రెండోసారి టి20 ప్రపంచ కప్పును గెలుచుకుంటుందా..? అనేది రాత్రి 8 గంటలకు మొదలయ్యే మ్యాచ్ తో తేలిపోతుంది. ఇకపోతే ఐపిఎల్ 17వ సీజన్లో అత్యధిక స్కోరు సాధించిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ లో పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. సాంకేతికంగా ఉన్నత స్థాయిలో నిలిచే కోహ్లీ ఆశ్చర్యకరంగా ఈ సీజన్ లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. ఒక బంగ్లాదేశ్ పై చేసిన 37 పరుగులను మినహాయిస్తే అన్ని మ్యాచ్ లలోను విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. ఇక తన స్థాయి ఆటను ఫైనల్లో చూపితేనే టీమిండియాకు మరోసారి వరల్డ్ కప్ అందనుంది. ఇక మిగతా టీం విషయానికి వస్తే సమిష్టి ప్రదర్శనలతో టీమిండియా ఫైనల్ కు చేరుకుంది. ముఖ్యంగా బౌలింగ్ యూనిట్లో మంచి ప్రదర్శన చేయడం వల్ల టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగించింది. ముఖ్యంగా బూమ్ర ప్రతి మ్యాచ్ లోను పొదుపుగా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా కీలక వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టుకు కళ్లెం వేయగలిగారు. ముఖ్యంగా పాకిస్తాన్ పై 120 పరుగుల లక్ష్యాన్ని కూడా కట్టడి చేశారంటే దానికి కారణం బూమ్రానే. బూమ్రాతో పాటు మరో బౌలర్ హర్ష దీప్ కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తూ.. ప్రస్తుతం అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా సీరిస్ లో కొనసాగుతున్నాడు. ఇక స్పిన్నర్ల విషయానికొస్తే.. కుల్ దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా వారికి తగ్గ బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అనుకున్న దానికంటే ఎక్కువగా ఆడుతున్నాడు. నేడు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో తుది జట్లను ఈ విధంగా అంచనా వేయవచ్చు.