NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన వాయిదా.. కారణమేంటంటే..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ క్రమంలో.. ఈరోజు వరంగల్ పర్యటన రేపటికి వాయిదా పడింది. నేడు జరగాల్సిన కార్యక్రమాలు యధావిధిగా రేపటికి వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం.. సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం వరంగల్‌లో పర్యటించాల్సి ఉంది. మధ్యాహ్నం 1:30కి టెక్స్‌టైల్‌ పార్క్‌కు చేరుకుని, అనంతరం 2:10కి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను పరిశీలించాల్సి ఉంది. ఓరుగల్లులో మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించడంతో పాటు సాయంత్రం వరంగల్‌ మున్సిపల్‌ అధికారులతో సమీక్ష జరపాల్సి ఉంది. అయితే, సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ రాత్రి హైదరాబాద్‌కు చేరుకుని.. రేపు వరంగల్ పర్యటనకు వెళ్తారని అధికారులు వెల్లడించారు. టీపీసీసీ చీఫ్ ఎన్నిక, కేబినెట్ విస్తరణపై ఏఐసీసీ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. ఈ అంశం గురువారం కొలిక్కి రాకపోవడంతో రేవంత్ రెడ్డి శుక్రవారం కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన వాయిదా పడింది. మరోవైపు.. సీఎం పర్యటన దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసు శాఖ కూడా భద్రతను కట్టుదిట్టం చేసింది.

మెదక్ జిల్లా వడియారంలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
నిర్లక్ష్యం.. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మెదక్ జిల్లా వడియారంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేగుంట(మం) వడియారం బైపాస్ వద్ద ముందు వెళ్తున్న లారీని అతివేగంతో వెనుక నుంచి వచ్చి మరో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో.. లారీ క్యాబిన్లో ఉన్న నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో లారీలో మొత్తం 15 మంది ఉన్నారు. మధ్యప్రదేశ్ నుంచి మేకల లోడుతో హైదరాబాద్ వెళ్తుండగా ఘటన జరిగింది. కాగా.. క్షతగాత్రులకు తూప్రాన్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఈ ప్రమాదంలో ఓ మృతదేహం క్యాబిన్లో ఇరుక్కోగా క్రేన్ సహాయంతో బయటకు తీశారు. మృతులంతా మధ్యప్రదేశ్కి చెందిన వారీగా గుర్తించారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు మృతదేహాలను లారీ క్యాబిన్ నుంచి బయటకు తీసి పోస్టుమార్టం కోసం తరలించారు. దీనిపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం..
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. గత రెండు రోజుల క్రితం కొంత తగ్గినట్లు కనిపించినా మళ్లీ నిన్నటి నుంచి రద్దీ పెరిగింది. ఇక, శుక్ర, శని, ఆదివారాలు భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటారని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. వీకెండ్ లో ఎలాగూ తిరుమలలో భక్తుల రద్దీ అధికంగానే కొనసాగుతుంది. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేకంగా మరిన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ఈరోజు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. అయితే, తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 60, 782 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక, 30, 100 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హూండీ ఆదాయం 3. 53 కోట్ల రూపాయలు వచ్చింది.

భారత్ హిందూదేశం కాదు.. లోక్‌సభ ఎన్నికలనే నిదర్శనం..
లోక్‌సభ ఎన్నికలపై ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ హిందూదేశం కాదని ఇటీవల లోక్‌సభ ఎన్నికలు నిరూపించాయని అన్నారు. బుధవారం అమెరికా నుంచి కోల్‌కతా చేసుకున్న ఆయన విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఎలాంటి విచారణ లేకుండా జైలులోకి నెట్టడం కాంగ్రెస్ పాలనలో కన్నా బీజేపీ పాలనలో మరింత తీవ్రంగా ఉందని ఆరోపించారు. ప్రతీ ఎన్నికల తర్వాత మార్పును ఆశిస్తామని, పేద, ధనిక వర్గాల మధ్య అంతరాలు పెంచడం వంటివి జరిగేవని, అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయిన ఆయన అన్నారు. ఇలాంట వాటికి అడ్డుకట్టపడాల్సిన అవసరముందని చెప్పారు. లౌకిక దేశమైన భారత్‌లో రాజకీయాలు పారదర్శకంగా ఉండాలని చెప్పారు. హిందూ దేశంగా మార్చాలనే భావన సరికాదని చెప్పారు. అయోధ్యలో రామమందిరం నిర్మించిన యూపీలోని ఫైజాబాద్‌లో బీజేపీ ఓటమిపై స్పందిస్తూ.. భారతదేశానికి ఉన్న నిజమైన గుర్తింపు కప్పిపుచ్చే ప్రయత్నాలు జరిగాయని అన్నారు. మహాత్మాగాంధీ, రవీంద్ర నాథ్ ఠాగూర్, నేతాజీ పుట్టిన దేశంలో ఎంతో ధనం వెచ్చించి రామాలయం నిర్మించి భారతదేశాన్ని హిందూ దేశంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగి ఉండాల్సింది కాదని చెప్పారు. ఇండియాలో నిరుద్యోగం పెరిగిందని ప్రాథమిక విద్యా, ప్రాథమిక ఆరోగ్య సేవల వంటి రంగాలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కూలిన పైకప్పు.. ఆరుగురికి గాయాలు.. చాలా వాహనాలు ధ్వంసం
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. భారీ వర్షం మధ్య టెర్మినల్-1లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన వెంటనే, విమానాశ్రయం పైకప్పు కూలిపోవడంతో చాలా వాహనాలు శిథిలాల కింద చిక్కుకున్నాయి. పోలీసులు, అగ్నిమాపక శాఖ మూడు వాహనాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 5.30 గంటలకు జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో విమానాశ్రయం పైకప్పు కూలిపోవడంతో పలు వాహనాలు కింద పడి ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ రక్షించి ఆసుపత్రికి తరలించారు. అతడికి చికిత్స కొనసాగుతోంది. ప్రమాదం తర్వాత, దేశీయ విమానాశ్రయ టెర్మినల్ వెలుపల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చాలా వరకు వాహనాలు బారులు తీరుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. టెర్మినల్ పైకప్పు ఎలా కూలిపోయిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జూపై “చేతబడి”.. ఇద్దరు మంత్రులు అరెస్ట్..
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూపై చేతబడి చేసినందుకు ఇద్దరు మంత్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. పర్యావరణ మంత్రిత్వ శాఖలో స్టేట్ మినిష్టర్ ఉన్న షమ్నాజ్ సలీమ్, ప్రెసిడెంట్ కార్యాలయంలో మంత్రిగా పనిచేస్తున్న ఆమె మాజీ భర్త ఆడమ్ రమీజ్ మరియు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే, ఈ ఆరోపణల్ని వారు నిరాకరించారు. చేతబడికి చేసి ఉంటే దానికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టాలని వారు డిమాండ్ చేశారు. షమ్నాజ్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను ఆదివారం అరెస్ట్ చేశారు. వీరి ముగ్గురిని ఏడు రోజుల రిమాండ్‌కి తరలించారు. పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి ఆమెను బుధవారం సస్పెండ్ చేశారు. రమీజ్‌ని గురువారం సస్పెండ్ చేశారు. అరెస్ట్ అయిన ఇద్దరు మంత్రులు కూడా మాల్దీవుల రాజధాని మాలే నగర మేయర్‌గా ముయిజ్జూ పనిచేసే సమయంలో అతని సహచరులుగా ఉన్నారు. కౌన్సిల్ సభ్యులుగా ముయిజ్జూతో కలిసి పని చేశారు. గతేడాది నవంబర్ నెలలో ముయిజ్జూ మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత షమ్నాజ్‌ని అధ్యక్షుడి అధికారిక నివాసమైన ములియాగేలో స్టేట్ మినిష్టర్‌గా నియమించి, ఆ తర్వాత పర్యావరణ మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. మాలే సిటీ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్న సమయంలో రమీజ్, ముయిజ్జూకి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే, దీనిపై అధ్యక్ష కార్యాలయం అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

విజయం తర్వాత రోహిత్ శర్మ ఎమోషనల్.. (వీడియో)
భారత స్పిన్నర్ల మాయాజాలంతో టీ20 ప్రపంచ కప్ 2024 రెండవ సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను 68 పరుగుల తేడాతో ఓడించి భారత్ ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. లక్ష్యాన్ని చేధించడానికి రంగంలోకి దిగిన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ చేతులెత్తేయడంతో 16.3 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలో.. టీమిండియా ఫైనల్స్కు చేరింది. ఈ ఆనందంలో రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యాడు. రోహిత్ భావోద్వేగానికి లోనైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డగౌట్ లో కూర్చున్న అతడిని కోహ్లీతో పాటు ఇతర సహచర ఆటగాళ్లు భుజంపై తట్టి ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. చివరిసారిగా 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నీ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 39 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మకు ఇది మూడో అర్ధ సెంచరీ. ఈ టోర్నీలో టీం ఇండియా ఐదోసారి సెమీఫైనల్ మ్యాచ్‌ను ఆడి విజయం సాధించింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది.