Site icon NTV Telugu

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు బెంగాల్లో ప్రధాని మోడీ పర్యటన.. కోల్‌కతాలో రోడ్ షో

ఏడో దశ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. ఇందులో భాగంగానే అందరికంటే ముందు నుంచే ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్న ప్రధాని పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. అందులో భాగంగానే నేడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాసత్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని అశోక్‌నగర్ తో పాటు దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బరుయ్‌పూర్‌లో జాదవ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు. అలాగే, తొలిసారి కోల్‌కతాలో రోడ్ షో కూడా చేయనున్నారు. మహానగరంలోని శ్యాంబజార్ ఫైవ్ పాయింట్ దగ్గర నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి సాయంత్రం 4 గంటలకు రోడ్ షో ప్రారంభమై సిమ్లా స్ట్రీట్‌లోని స్వామి వివేకానంద నివాసం దగ్గర ముగుస్తుందని బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ తెలిపారు.

ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపులు..

ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్లే ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఆ తర్వాత ప్రయాణికులను ఎమర్జెన్సీ డోర్ ద్వారా ఖాళీ చేయించిన సిబ్బంది.. దర్యాప్తు కోసం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఏవియేషన్ సెక్యూరిటీ, బాంబు నిర్వీర్య బృందంతో పాటు క్విక్ రియాక్షన్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన తారక్, కళ్యాణ్ రామ్..

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.నటుడిగా ఎన్నో గొప్ప చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు.తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు సొంతంగా రాజకీయ పార్టీని మొదలు పెట్టి తిరుగులేని నాయకుడిగా ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిలో నిలిచిపోయారు. గత ఏడాది ఎన్టీఆర్ శత జయంతిని ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఘనంగా నిర్వహించారు.

నేడు నగరంలో పవర్‌ కట్‌.. ప్రాంతాల వారీగా షెడ్యూల్..

నగరవాసులకు విద్యుత్ శాఖ అధికారులు కీలక సూచన చేశారు. అయితే కరెంట్ కోతలకు గల కారణాలను అధికారులు వివరించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గోడలు కూలి, చెట్లు విరిగిపడి, పిడుగులు పడి మొత్తం 14 మంది మృత్యువాతపడ్డారు. నాగర్​కర్నూల్, సిద్దిపేట జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. వర్షం కారణంగా నాగర్ కర్నూల్ జిల్లాలోనే 8 మంది చనిపోయారు. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు కూలిపోయాయి.

మరోసారి వాయిదాపడ్డ అగ్నిబాణ్ ప్రైవేట్ రాకెట్ ప్రయోగం

ఆంధ్రప్రదేశ్‌ తిరుపతిలోని శ్రీహరికోట నుంచి జరగాల్సిన ప్రైవేట్‌ రాకెట్‌ అగ్నిబాణ్‌ రాకెట్‌ (Agniban Rocket) ప్రయోగం మరోసారి వాయిదా పడింది. సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (SHAR) వేదికగా మంగళవారం ఉదయం రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉన్నది. అయితే ప్రయోగానికి ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇస్రో శాస్త్రవేత్తలు వాయిదావేశారు. దీంతో నాలుగు సారీ రాకెట్‌ ప్రయోగం వాయిదాపడినట్లయింది. చెన్నైకి చెందిన ప్రైవేటు స్టార్టప్‌ కంపెనీ అగ్నికుల్‌ కాస్మోస్‌ ఏరోస్పేస్‌ సంస్థ అగ్నిబాణ్‌ సబ్‌ ఆర్బిటాల్‌ టెక్నాలజీ డిమానిస్ట్రేటర్‌ (సార్టెడ్‌) రాకెట్‌ ప్రతిష్ఠత్మాకంగా రూపొందించింది. సొంత లాంచ్‌ప్యాడ్‌ ఏర్పాటుచేసి సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాలనుకున్నది. షెడ్యూల్‌ ప్రకారం 8 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం మంగళవారం ఉదయం 5.48 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. అయితే సాంకేతిక సమస్య తలెత్తడంతో చివరి నిమిషయంలో ప్రయోగాన్ని నిలిపివేశారు.

పాఠశాలలకు సెలవులు పెంపు.. కానీ.. మీరు అనుకునేది కాదండోయ్..

జూన్‌లో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. విద్యాశాఖ ఇప్పటికే విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. జూన్ 12, 2024 నుండి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. పాఠశాలలు తెరిచే సమయం ఆసన్నమైనందున, సెలవులను పెంచాలనే కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. తెలంగాణ విద్యాశాఖ ఇప్పటికే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అందులో మార్పులు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. సెలవులు పెంచాలని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తోంది. అయితే ఇది వేసవి సెలవుల గురించి కాదు.. పండుగలకు ప్రకటించిన సెలవుల గురించి.

ఎమ్మెల్యే పిన్నెల్లి పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ

ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది. పోలింగ్‌కు ముందు, తర్వాత నమోదైన 3 కేసులపై హైకోర్టుకు పిన్నెల్లి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లికి జూన్‌ 6 వరకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే.. మే 13న తన నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించిన నేరాలకు పాల్పడినందుకు తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ వైఎస్‌ఆర్‌సీపీ నేత, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మూడు కొత్త కేసులు. పోలింగ్ రోజున హింసకు పాల్పడ్డాడని ఆరోపించారు.

నేడు కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అనంతరం విచారణ చేపట్టనున్నారు. ఈకేసుపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించనున్నారు. కాగా.. కవిత తరపు న్యాయవాది 40 నిమిషాల పాటు నిన్న వాదనలు వినిపించారు. ఈడి, సీబీఐ ఇవాళ వాదనలు వినిపించనున్నారు. న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఇవాళ జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తానన్నారు. నిన్న కవిత భర్త అనిల్ విచారణకు హాజరయ్యారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. మహిళను విచారణ కోసం కార్యాలయానికి పిలవకూడదన్నారు. కేసు నమోదు చేసినప్పుడు కవిత పేరే లేదన్నారు. ఈ విచారణలో సమీర్, బుచ్చిబాబు, మాగుంట నా పేరు చెప్పారన్నారు. బెయిల్ కి ఉన్న గ్రౌండ్స్ ఏమిటి అని జడ్జి ప్రశ్నించారు.

విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్..

తెలంగాణ టీఎస్ ఆర్టీసీ 8, 10వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌, వరంగల్‌లోని #TGSRTC ఐటీఐ కళాశాలల్లో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన విద్యార్థులు జూన్ 10వ తేదీలోపు ఆన్ లైన్ (https://iti.telangana.gov.in) లో దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చింది. మోటార్‌ మెకానిక్‌ వెహికిల్‌, మెకానిక్‌ డిజిల్‌, వెల్డర్‌, పెయింటర్‌ ట్రెడ్‌లలో ప్రవేశాలు జరుగుతున్నాయని పేర్కొంది. స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఐటీఐ కోర్సులు వరంలాంటివని తెలిపింది.

 

Exit mobile version