Site icon NTV Telugu

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

జైపూర్లో భూకంపం.. ఒక్క గంటల్లో మూడుసార్లు కంపించిన భూమి

రాజస్థాన్‌లోని జైపూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. గంట వ్యవధిలో 3 సార్లు భూకంపం వచ్చింది. భూకంపం తీవ్రత 4.4గా రిక్టర్ స్కేలుపై నమోదైంది. భూకంపం రావడంతో నిద్రలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. భూకంపం చాలా బలంగా ఉంది, దాని ప్రకంపనలు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో కూడా కనిపించాయి.

భూకంపాలను పర్యవేక్షించే నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సిఎస్) ప్రకారం, శుక్రవారం తెల్లవారుజామున 3.39 గంటలకు భూకంపం సంభవించింది. ఆ సమయంలో జైపూర్‌లో ప్రజలు గాఢనిద్రలో ఉన్నారు. బలమైన భూకంపం నగరం మొత్తాన్ని కదిలించింది. భూకంపం ధాటికి ఇళ్లన్నీ కదిలిపోయాయి. కొద్ది నిమిషాల తర్వాత 3.1 రిక్టర్ స్కేల్‌తో మరో భూకంపం సంభవించింది. కాసేపటి తర్వాత సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్ 3.4గా నమోదైంది.

వరుసగా మూడో రోజు పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే?

బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్. వరుసగా మూడో రోజు పసిడి రేట్లు పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (జులై 21) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,700 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,750గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరిగింది. ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం 6 గంటలకు నమోదైనవి. దేశంలోని పలు నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,900గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,750గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,100లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 61,200 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,600లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర 60,650గా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,750 వద్ద కొనసాగుతోంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,750గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,700 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,750గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 55,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,750 వద్ద కొనసాగుతోంది.

ఎన్ని కూటమిలు వచ్చినా.. ఈ 105 లోక్‌సభ స్థానాల్లో బీజేపీని ఓడించడం అసాధ్యం..!?

2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ఇప్పటికే రాజకీయ పోరు ప్రారంభించింది. మరోవైపు, కాంగ్రెస్‌తో పాటు 26 ప్రతిపక్ష పార్టీలు ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ అంటే I.N.D.I.A కింద ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించాయి. వీటన్నింటి మధ్య 2019, 2014 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఆసక్తికర అంకం తెలియాల్సి ఉంది. ప్రతిపక్ష పార్టీల కూటమి అయిన ‘భారత్‌’కు ఈ సంఖ్య పెద్ద సవాలుగా చెప్పవచ్చు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికలలో ఈ గణాంకాలు ఎంతవరకు ప్రభావవంతంగా ఉంటాయో తెలుసుకోవాలి. ఈ గణాంకాలను బట్టి బిజెపి బలాన్ని అంచనా వేయవచ్చు.

ముగిసిన తొలి రోజు ఆట.. భారీ స్కోరు దిశగా భారత్!

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజైన గురువారం ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (87 నాటౌట్; 161 బంతుల్లో 8 ఫోర్లు) సెంచరీకి చేరువలో ఉండగా.. స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (36 నాటౌట్; 84 బంతుల్లో 4 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (80; 143 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. విండీస్‌ బౌలర్లలో కీమర్‌ రోచ్‌, గాబ్రియల్, వారికన్, జేసన్ హోల్డర్‌ తలో వికెట్ పడగొట్టారు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్ మంచి ఆరంభం ఇచ్చారు. నిలకడగా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపారు. రోహిత్‌ నెమ్మదిగా ఆడినా.. జైస్వాల్‌ మాత్రం దూకుడుగా ఆడాడు. తొలి సెషన్లో విండీస్‌ బౌలర్లు భారత ఓపెనర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. 19వ ఓవర్లో రోచ్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో రోహిత్ అర్ధ శతకం (74 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు.

నేడే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు.. పాల్గొననున్న ముఖ్యనేతలు

కొద్ది రోజుల క్రితం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను తప్పించి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పగ్గాలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి అప్పగించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఎన్నికల వేళ ఈ పరిణామం హాట్ టాపిక్ గా మారింది. సీఎం కేసీఆర్ పై దూకుడు ప్రదర్శించే బండి సంజయ్ ను తొలగించి సౌమ్యుడిగా పేరొందిన కిషన్ రెడ్డిని నియమించడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని చర్చ జరుగుతోంది. అయితే విదేశీ పర్యటనలు, వివిధ కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్ కారణంగా కిషన్ రెడ్డి ఇప్పటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టలేదు. అయితే ఇవాళ కిషన్ రెడ్డి నేతల సమక్షంలో అధికారికంగా రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. ముందుగా నిర్ణయించిన శుభ ముహూర్తంలో ఈరోజు ఉదయం 11.45 గంటలకు ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం 12.15 గంటలకు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్‌, బండి సంజయ్‌, రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జ్‌లు తరుణ్‌ చుగ్‌, సునీల్‌ బన్సాల్‌, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొంటారు.

విద్యార్థినిపై పిడుగుపాటు.. అమెరికాలో ఘటన

భారతీయులు విదేశాలకు వివిధ పనుల కోసం వెళుతుంటారు. ప్రధానంగా ఉన్నత విద్యను అభ్యసించడంతోపాటు.. ఉద్యోగాల కోసం ప్రపంచంలోని వివిధ దేశాలకు వెళుతుంటారు. అందులో ఎక్కువ మంది ఉన్నత విద్యతోపాటు.. ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లే భారతీయు ఎక్కువగా ఉంటారు. ఇప్పటికీ అమెరికాలో ప్రవాస భారతీయులు ఎక్కువ మంది ఉంటారు. అలా అమెరికాలో ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం వెళుతున్న వారిలో కొందరు ప్రమాదాలకు గురవుతున్న వారు కూడా ఉంటున్నారు. ప్రమాదాలకు గురై మరణిస్తున్న వారు కొందరైతే.. ప్రమాదాల నుంచి బయట పడుతున్న వారు మరికొందరు. భారత సంతతికి చెందిన ఒక విద్యార్థిని పిగుడుపాటుకు గురైంది. విద్యార్థినిపై పిడుగు పడింది. పిడుగుపాటుకు గురైన విద్యార్థిని మృత్యుతో పోరాడుతోంది. ఉన్నత విద్య కోసం అమెరికా వచ్చిన సుశ్రూణ్య పిడుగుపాటుకు గురైంది. ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోంది.

నా టమాటాలు పోయాయి సార్.. పూణెలో పోలీస్ స్టేషన్లో మొదటి కంప్లైంట్

రైతులకు ఉల్లి, టమాటా సాగు అధిక రిస్క్‌తో కూడుకున్న పని. ఎందుకంటే ఈ పంటల సరఫరా విషయంలో ఎప్పుడూ అనిశ్చితి ఉంటుంది. ఈ పంట సాగుకు అయ్యే ఖర్చుకు, కోతకు వచ్చే ఖర్చుకు వ్యత్యాసం చాలా ఉంటుంది. దీంతో ఈ సరుకులను మార్కెట్ కమిటీకి తీసుకెళ్లకుండా రైతులు పలుమార్లు ఉల్లి, టమాటాలను రోడ్డుపై పడేసిన రోజులు ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం రైతుల పంట పండింది. టమాటాల ధర మోతమోగింది. ఈ పంట ద్వారా రైతులు చాలామంది కోటీశ్వరులయ్యారు. దీంతో ఈ పంటపై దొంగల కళ్లు పడ్డాయి. పూణె జిల్లాలో 400 కిలోల టమాటాలు చోరీకి గురైన ఘటన చోటుచేసుకుంది.

రెండేళ్లుగా అత్యాచారం.. బిడ్డను చంపేస్తేనే పెళ్లి చేసుకుంటానన్న నీచుడు

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఓ యువకుడు పెళ్లి సాకుతో యువతిపై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సమయంలో ఆమె గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి చేసుకోమని యువతి యువకుడిని బలవంతం చేయగా.. ఈ చిన్నారిని చంపేస్తే చేసుకుంటా.. ఇలా చేయకుంటే నేను పెళ్లి చేసుకోను. దీంతో పాటు నీ అశ్లీల వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరింపులకు దిగాడు.

యువకుడి బెదిరింపుపై భయపడిన యువతి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. కాని పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ యువకుడు తనను చంపేస్తానని పదే పదే బెదిరిస్తున్నాడని యువతి ఆరోపించింది. దీంతో ఆందోళనకు గురైన ఆమె ఎస్‌ఎస్పీ కార్యాలయానికి చేరుకుని యువకుడిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎస్పీ ఆదేశించారు.\

పెట్రోల్‌ ధరలు అక్కడే ఎక్కువ.. ఎందుకంటే?

పెట్రోల్‌ ధరలు సెంచరీ దాటి.. నూటి పది కూడా దాటింది. అయితే అత్యధికంగా ఏ రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ ధర ఎక్కడ ఎక్కువగా ఉందో తెలుసా? పెట్రోల్‌ ధరలపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల పన్నులు ఎక్కువగా ఉండటంతో సెంచరీ మార్కును దాటేసింది. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, బ్యారెల్‌ ధర తగ్గినప్పటికీ ఇండియాలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గవు. కారణం ఏమిటంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు. వాస్తవ పెట్రోలియం ధర కంటే పన్నులు అధికంగా ఉండటంతో.. ధరలు సెంచరీ మార్క్ ను దాటేశాయి. 15 ఏళ్ల క్రితం రూ. 30లోపు లీటర్‌ ఉన్న పెట్రోల్‌ ధర కాస్త.. ఇపుడు రూ. 110కి చేరింది. అయితే వీటికి తోడు మరో షాకింగ్‌ విషయం ఏమిటంటే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ఏపీలో లీటర్‌ పెట్రోల్‌ ధర నూటపది దాటేసింది. దేశంలో ఏపీలోనే పెట్రోల్‌ ధర అధికంగా ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. ఏపీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.111.87 ఉన్నట్టు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌పురి వెల్లడించారు.

మూడు రోజులుగా వర్షాలు.. పోటెత్తిన గోదావరికి వరద

గత రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ అస్తవ్యస్తంగా మారాయి. కాళేశ్వరం సమీపంలో గోదావరి, ప్రాణహిత నదులు ప్రవహిస్తున్నాయి. ఈ రెండు నదులు పుష్కరఘాట్ వద్ద 9.770 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంతోపాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద పోటెత్తింది. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా భద్రాచలం వద్దకు గోదావరి నుంచి 8 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. వర్షానికి తోడు గోదావరి వరద ఎగపోటు కారణంగా వెంకటాపురం మండలంలోని బల్లకట్టు, కంకలవాగు, జిన్నెలవాగు, పూసువాగు, పెంకవాగులు ప్రమాదకరంగా మారాయి. పలు గ్రామాలకు ప్రవాహాలు అడ్డుగా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో వరద నీటిలో రాకపోకలు బంద్ అయ్యాయి. గోదావరి వరదపోటుతో రహదారులపై వరదనీరు చేరింది. పేరూరు-చండ్రుపట్ల గ్రామాల మధ్యనున్న రహదారిని మరిమాగువాగు ముంచెత్తింది. వంతెనపై వరదనీరు చేరడంతో టేకులగూడెం, పెదగంగారం, చండ్రుపట్ల, కృష్ణాపురం గ్రామాలకు పేరూరుతో సంబంధాలు తెగిపోయాయి. ఏడ్జర్లపల్లి-బొమ్మనపల్లి గ్రామాల మధ్య ఒర్రెలో వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Exit mobile version