NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు100 శాతం పెంపు

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రితోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు 100 శాతం పెంపుకు ప్రతిపాదించింది. కాగా కర్ణాటక ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. అదే సమయంలో, కర్ణాటక ప్రభుత్వం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను 100 శాతం పెంచడానికి ఆమోదం తెలిపింది. కర్ణాటక మంత్రుల జీతాలు, భత్యాలు (సవరణ) బిల్లు 2025, కర్ణాటక శాసనసభ సభ్యుల జీతాలు, పెన్షన్లు, భత్యాలు (సవరణ) బిల్లు 2025 ఆమోదించింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పెరుగుతున్న ఖర్చులు, శాసనసభ్యులు మనుగడ సాగించాల్సిన అవసరం కారణంగా ఈ ప్రతిపాదన చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఆర్సీబీ, కోహ్లీని వీడటంపై మహ్మద్‌ సిరాజ్ ఏమన్నాడంటే?

టీమిండియా పేసర్, హైదరాబాద్ ఆటగాడు మహ్మద్‌ సిరాజ్‌ ఏడేళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ఆడిన విషయం తెలిసిందే. ఆర్సీబీలో కీలక ఆటగాడిగా ఉన్న సిరాజ్‌ను ఐపీఎల్ 2025 వేలంలో ఆ ప్రాంచైజీ రిటైన్‌ చేసుకోలేదు. వేలంలో గుజరాత్ టైటాన్స్‌ అతడిని రూ.12.50 కోట్లకు కొనుగోలు చేసింది. కొన్నేళ్లుగా ఆర్సీబీ జట్టు ఆటగాళ్లతో మంచి అనుబంధం ఉన్న సిరాజ్.. ప్రాంచైజీని వీడటంపై తాజాగా స్పందించాడు. విరాట్ కోహ్లీ తనకు మద్దతుగా నిలిచాడని, ఆర్సీబీని వీడటం తనను భావోద్వేగానికి గురిచేసిందన్నాడు.

‘ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు గుజరాత్‌ టైటాన్స్‌లో చేరడం సంతోషాన్ని కలిగిస్తోంది. అయితే కష్ట సమయాల్లో విరాట్ కోహ్లీ నాకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉన్నాడు. అందుకే ఆర్సీబీ నుంచి వైదొలగడం కొంత భావోద్వేగానికి గురి చేసింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో మాకు ఇక్కడ మంచి జట్టు ఉంది. మంచి ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాం. మొదటి మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నా’ అని మహ్మద్‌ సిరాజ్ చెప్పాడు. ఏడు సీజన్ల పాటు ఆర్సీబీకి ఆడిన సిరాజ్‌కు విరాట్ కోహ్లీతో మంచి అనుబంధం ఉంది. విరాట్ సూచనలతో మనోడు ఎన్నో వికెట్లు పడగొట్టాడు.

యుఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యాశాఖ రద్దు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నాడు. అధికారం చేపట్టిన నాటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళ్తున్నారు. వలసలను కఠినతరం చేస్తూ.. పలు దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తూ సంచలనంగా మారారు. తాజాగా యూఎస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విద్యా శాఖను రద్దు చేస్తూ ఉత్తర్వుపై సంతకం చేశారు. వైట్ హౌస్ తూర్పు గదిలోని డెస్క్‌ల వద్ద కూర్చున్న పాఠశాల పిల్లలతో ఒక ప్రత్యేక కార్యక్రమంలో సంతకం చేసిన తర్వాత ట్రంప్ నవ్వుతూ ఆర్డర్‌ను పైకిఎత్తి చూపారు. ఈ ఉత్తర్వుతో సమాఖ్య విద్యా శాఖ శాశ్వతంగా రద్దు చేయడం ప్రారంభమవుతుందని డోనాల్డ్ ట్రంప్ అన్నారు.

చివరి నిమిషంలో సాయి పల్లవి హ్యాండ్ ఇచ్చిందా..!

లేడి పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నేచురల్ బ్యూటి సాయి పల్లవి ప్రజంట్ వరుస హిట్ లతో ధూసుకుపోతుంది. ఇక ఈ అమ్మడు సినిమాల ఎంపిక విషయంలో ఎంత క్లారిటిగా ఉంటుందో మనకు తెలిసిందే. ఆమె ఒక సినిమా ఒప్పుకుంటే కచ్చితంగా ఆ మూవీలో ఎదో బలమైన కథ ఉందని అందరూ నమ్ముతారు. అందుకే సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే ఈ సినిమా సగం సూపర్ హిట్ అయిపోయినట్టే. ఇలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ రప్పించగల సత్తా ఉన్న ఈ హీరోయిన్ తాజాగా ఒక సినిమా నుండి తప్పుకుందట.

తెలంగాణ టెన్త్‌ ఎగ్జామ్‌లో తొలిసారి 24 పేజీల బుక్‌లెట్‌

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,650 పరీక్షా కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఈ సంవత్సరం టెన్త్‌ పరీక్షలకు మొత్తం 5,09,403 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

ఈసారి తెలంగాణ టెన్త్‌ పరీక్షల్లో ఒక కీలక మార్పును చేపట్టారు. విద్యార్థులకు తొలిసారిగా 24 పేజీల బుక్‌లెట్‌ అందించనున్నారు. ఇంతకు ముందు అదనపు పేజీలు అందించే విధానాన్ని ఈసారి రద్దు చేశారు. దీంతో విద్యార్థులు అందించిన బుక్‌లెట్‌లోనే సమాధానాలను పూర్తిచేయాల్సి ఉంటుంది. అధికారులు ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాలను వివరిస్తూ, ఇది విద్యార్థులకు సమయ పరిమితులను గమనిస్తూ సమర్థవంతమైన సమాధానాల రచనకు సహాయపడుతుందని తెలిపారు.

ఫొటోషూట్‌లో అపశృతి.. కలర్ బాంబ్ పేలి వధువు విలవిల

ఒకప్పుడు పెళ్లంటే చాలా సింపుల్‌గా జరిగిపోయేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. డబ్బు పెరిగింది. ఆలోచన మారింది. ఒకరి కంటే గొప్పగా వేడుక చేసుకోవాలని తాపత్రయం పడుతున్నారు. పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే చేసుకునేది. దీన్ని గ్రాండ్‌గా చేసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ దీని పేరుతో కొత్త కొత్త ట్రెండ్‌లు సృష్టిస్తున్నారు. పెళ్లికి ముందు ఫొటోషూట్‌లంటూ.. విహారయాత్రలంటూ లేనిపోని ఆచరాలు పుట్టుకొస్తున్నాయి. ఈ పేరు మీద కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. ఆ మధ్య ఫొటోషూట్ పేరుతో నదిలోకి దిగి వీడియోలు తీస్తుండగా ప్రమాదవశాత్తు పుట్టి మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఫొటోషూట్ పేరుతో జరిగిన ఘటనలో తృటిలో వధువుకు ముప్పు తప్పింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలంగాణ పరిశ్రమల అంశంపై కేటీఆర్ విమర్శలు

తెలంగాణలో ఉన్నత స్థాయిలో అభివృద్ధి చెందాల్సిన పరిశ్రమలు నాశనం అవుతున్నాయని, దీనిపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఊసేలేకుండా ఉండటం విచారకరమని తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేటీఆర్ తన ట్వీట్‌లో ప్రధానంగా బయ్యారంలోని ఉక్కు పరిశ్రమ స్థాపనపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. మరోవైపు, ఆదిలాబాద్‌లోని సీసీఐ (సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఫ్యాక్టరీను వేలానికి పెట్టడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి కీలకమైన ఈ పరిశ్రమలను బీజేపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నట్లు కేటీఆర్ విమర్శించారు.