Site icon NTV Telugu

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నెహ్రూ మ్యూజియం పేరు మార్పు..

పేరు మార్పులపై దృష్టి పెట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఇపుడు రాజధాని న్యూఢిల్లీలో తీన్‌మూర్తి భవన్‌లో ఉన్న నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ (ఎన్‌ఎంఎంఎల్‌) పేరును మార్చారు. ఇకపై ఈ మ్యూజియం ప్రధానమంత్రి మ్యూజియం అండ్‌ లైబ్రరీ సోసైటీ(పీఎంఎంఎల్‌) పేరుతో కొనసాగనుంది. ఇందుకు సంబంధించి కేంద్రం సోమవారం నాడు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పేరు మార్పుపై ప్రతిపక్ష కాంగ్రెస్‌.. అధికార బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నెహ్రూ పేరుని చరిత్ర పుటల్లోంచి తొలగించడానికి ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్‌ మండిపడగా, ప్రధానమంత్రులందరికీ సమ ప్రాధాన్యం ఇచ్చామని బీజేపీ ఎదురుదాడికి దిగింది. అంతర్జాతీయంగా ఖ్యాతి వహించిన నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ (ఎన్‌ఎంఎంఎల్‌) పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడే వివాదం రేగింది. ‘‘నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం లైబ్రరీ ఇక నుంచి ప్రైమ్‌ మినిస్టర్స్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీగా మారింది. ప్రజాస్వామ్యానికి అనుగుణంగా వైవిధ్యాన్ని చాటి చెప్పడానికే ఈ పేరు మార్పు జరిగింది. ఈ నెల 14 నుంచి ఉత్వర్వులు అమల్లోకి వచ్చాయని పీఎంఎంల్‌ వైస్‌ చైర్మన్‌ సూర్యప్రకాశ్‌ వెల్లడించారు. తీన్‌మూర్తి భవనంలో 16 ఏళ్లపాటు నెహ్రూ అధికారిక నివాసంగా ఉంది. ఆ తరువాత 1966, ఏప్రిల్‌1న అందులో నెహ్రూ మ్యూజియంను ఏర్పాటు చేశారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూ్స్.. ఈ రాష్ట్రాల్లో ముందుగానే జీతాలు

కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త. కేంద్ర ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు వారికి ముందుగానే పెన్షన్, జీతం అందుతాయి. విశేషమేమిటంటే కేరళ, మహారాష్ట్రలకు చెందిన పదవీ విరమణ పొందిన, ప్రస్తుతం సేవలందిస్తున్న ఉద్యోగులకు మాత్రమే దీని ప్రయోజనం లభిస్తుంది. ఈ రెండు రాష్ట్రాలకు చెందిన కేంద్ర ఉద్యోగులకు ఓనం, గణేష్ చతుర్థి పండుగలకు ముందు వారి ఖాతాల్లో జీతం, పెన్షన్ జమ అవుతుంది.

పండుగలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో గణేష్ చతుర్థి జరుపుకుంటారు కాబట్టి, కేరళలో ఓనమ్‌ను వైభవంగా జరుపుకుంటారు. ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం తన పదవీ విరమణ చేసిన, సేవలందిస్తున్న ఉద్యోగులకు ముందుగానే పెన్షన్, జీతం ఇవ్వాలని నిర్ణయించింది. విశేషమేమిటంటే.. ఇందుకోసం ఆర్థిక శాఖ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.

ఘోరం..ప్రసూతి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం…

ఇటీవల తెలంగాణాలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఇప్పుడు తాజాగా మరో ఘోర ప్రమాదం వెలుగుచూసింది.. హన్మకొండలోని ప్రసూతి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు… అయితే వెంటంనే మంటలను అదుపు చెయ్యడం తో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అంచనా వేస్తున్నారు..

ఆస్పత్రి భవనం నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు..

ఇది చాలా హాట్ గురూ… మిరపకాయ ధర రూ.7000

ద్రవ్యోల్బణం కారణంగా దేశంలో సామాన్యులు నానాఇబ్బంది పడుతున్నారు. పాలు, పెరుగు, గోధుమలు, పిండి, బియ్యం, పప్పులతో సహా అన్ని రకాల ఆహార పదార్థాలు ఖరీదుగా మారాయి. కానీ, చాలా మసాలా దినుసుల అధిక ధర సామాన్య ప్రజలను కంటతడి పెట్టిస్తోంది. గత కొన్ని నెలల్లో మసాలా దినుసుల ధర రెండింతలు పెరిగింది. ముఖ్యంగా జీలకర్ర కిలో 1200 నుంచి 1400 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. అదేవిధంగా ఎర్ర మిరపకాయ కూడా చాలా ఖరీదైనదిగా మారింది. కిలో రూ.400 అయింది. కాగా గతేడాది వరకు కిలో ధర రూ.100 మాత్రమే. కానీ ఓ రకమైన మిర్చి ప్రపంచంలో అత్యంత ఘాటైన మిరపకాయలలో ఒకటిగా నిలిచింది. దీంతో పాటు దీని రేటు కూడా దాదాపు కిలో వేల రూపాయలు ఉంటుంది.

దాని పేరే ‘భూత్ జోలోకియా’. ప్రపంచంలోనే అత్యంత ఘాటైన ఎర్ర మిరపకాయ ఇదేనని చెబుతున్నారు. ఒక్క సారి తిన్న తర్వాత చెవిలోంచి పొగలు రావడం ఖాయం. దాని ధర వింటే మీ మనస్సు గందరగోళానికి గురవడం గ్యారెంటీ. విశేషమేమిటంటే, ‘భూత్ జోలోకియా’ భారతదేశంలో మాత్రమే సాగు చేయబడుతుంది. నాగాలాండ్‌లోని కొండ ప్రాంతాలలో మాత్రమే రైతులు దీనిని సాగు చేస్తారు. భూత్ జోలోకియా దాని ఘాటు కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది.

ఆసియా కప్‌ 2023కు కేఎల్ రాహుల్‌ వద్దు.. రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆగష్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ 2023 ఆరంభం కానుంది. టోర్నీ మొదటి మ్యాచ్ పాకిస్తాన్, నేపాల్ మధ్య జరగనుంది. సెప్టెంబర్ 2న హై ఓల్టేజ్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్‌ మధ్య జరుగుతుంది. ఆసియా కప్ 2023 కోసం ఇప్పటికే బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్ జట్లు తమ టీంలను ప్రకటించగా.. భారత్ ఇంకా వెల్లడించలేదు. ఆగష్టు 20న బీసీసీఐ జట్టును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పుపై టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి స్పందించాడు. తాను కేఎల్‌ రాహుల్‌ను ఆసియా కప్‌ తుది జట్టులో ఆడించనన్నాడు.

గాయపడిన భారత స్టార్ ప్లేయర్స్ కేఎల్ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో కోలుకుంటున్నారు. ఆసియా కప్‌ 2023 కన్నా ముందు వాళ్లు పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తారని బీసీసీఐ అధికారులు భావిస్తున్నారు. అందుకే భారత జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. అయితే టీమిండియా మాజీ ప్లేయర్ రవిశాస్త్రి మాత్రం ఆసియా కప్‌ 2023కు రాహుల్‌ వద్దు అని అంటున్నాడు. గాయం నుంచి కోలుకుంటూ.. కొన్ని నెలలుగా ఆటకు దూరంగా ఉన్న ఆటగాడిని ఆడించడం సరికాదు అని అన్నాడు.

బోనులో చిక్కిన మరో చిరుత

గురువారం తెల్లవారుజామున అలిప్రి కాలిబాటలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుతపులి చిక్కింది. తిరుమల నడకదారి వద్ద బుధవారం రాత్రి మరో చిరుతపులి పట్టుబడింది. గత వారం చిరుతపులి దాడిలో ఆరేళ్ల బాలిక లక్షిత మృతి చెందిన తర్వాత పట్టుకున్న చిరుత ఇది రెండోది కాగా, 50 రోజుల్లో పట్టుకోవడం మూడోది. అటవీశాఖ అధికారులు బోను ఏర్పాటు చేయగా చిరుత బోనులో చిక్కుకుంది. అటవీశాఖ అధికారులు వాక్‌వేకు ఇరువైపులా కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల్లో చాలా వరకు చిరుతపులి కదలికలను గుర్తించారు.

బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలోని బోనులో చిరుతపులి చిక్కుకుపోయినట్లు సిబ్బంది గుర్తించారు. మోకాలి మెట్టు వద్ద మరో ఉచ్చు బిగించారు. శేషాచలం అడవుల్లో 40కి పైగా చిరుతలు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు అంచనా వేశారు. వీటిలో దాదాపు పది చిరుతలు గుడికి వెళ్లే మెట్ల దగ్గరకు వస్తున్నాయి. చిన్నారిని టార్గెట్ చేయడంతో అటవీశాఖ అప్రమత్తమైంది. మెట్ల దారికి ఇరువైపులా కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేశారు. చిరుతపులి కదలికలను గుర్తించేందుకు దాదాపు 500 కెమెరాలను వినియోగించారు. మెట్ల దారికి సమీపంలో అదే ప్రాంతంలో చిరుతల సంచారం ఉండటంతో వాటిని బంధించేందుకు బోనులను ఏర్పాటు చేశారు. 35వ మలుపులో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కుకుపోయి ఉంటుందని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

పార్లమెంటరీ స్టాడింగ్‌ కమిటీ సభ్యుడిగా రాహుల్‌ గాంధీ

పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన వారిని వివిధ స్టాండింక్‌ కమిటీల్లో సభ్యులుగా కొనసాగిస్తారు. లోక్‌సభకు ఎన్నికైన వారితోపాటు, రాజ్యసభకు ఎంపికైన వారిని ఇలా పార్లమెంటరీ స్థాయి సంఘం స్టాండింగ్‌ కమిటీల్లో సభ్యులుగా తీసుకుంటారు. అటువంటి అవకాశాన్ని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ఎంపీ అయిన రాహుల్‌ గాంధీకి కల్పించారు. ఎంపీ రాహుల్‌ గాంధీకి పార్లమెంటరీ స్టాడింగ్‌ కమిటీ సభ్యుడిగా మరోసారి అకాశం కల్పించారు. రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నియమించారు. ఇందుకు సంబంధించి లోక్‌సభ బులెటిన్‌ను విడుదల చేసింది. రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా రాహుల్‌ గాంధీ బుధవారం నామినేట్‌ అయ్యారు. ఆయనతోపాటు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మరో ఎంపీ అమర్‌సింగ్‌ కూడా కమిటీకి నామినేట్‌ అయ్యారు. ఇందుకు సంబందించి బుధవారం లోక్‌సభ ఒక బులెటిన్‌ విడుదల చేసింది.

హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. 2 రోజులు 30 ప్రాంతాల్లో నీళ్లు బంద్..

హైదరాబాద్ వాసులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జల్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఈ నెల 19వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ మధ్యాహ్నం వరకు దాదాపు 30 ప్రాంతాల్లో పాక్షికంగా లేదా పూర్తిగా నీటి సరఫరా నిలిచిపోతుందని అధికారులు తెలిపారు. నగరంలో తాగునీటిని సరఫరా చేస్తున్న మంజీరా వాటర్ సప్లై ఫేజ్-2లో కలబ్‌గూర్ నుంచి పటాన్‌చెరు వరకు పైప్‌లైన్ కోసం అధికారులు జంక్షన్ పనులు నిర్వహిస్తున్నారు. అయితే.. బీహెచ్‌ఈఎల్‌ క్రాస్‌ రోడ్డు వద్ద కొత్తగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌ పనులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ జంక్షన్‌ పనులు చేపడుతున్నారు.

రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్డ్

తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు లేవు. జూలై చివరి వారంలో వర్షాలు కురిసినా ఆగస్టు ప్రారంభం నుంచి వరుణుడి జాడ లేదు. రైతులకు ఆగస్టు చాలా ముఖ్యమైన నెల. ప్రస్తుతం కాయలు ఎదుగుదల దశలో ఉన్నందున వర్షం అవసరం. అయితే రాష్ట్రంలో చాలా రోజులుగా పొడి వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లో అడపాదడపా వర్షాలు తప్ప జిల్లాల్లో వరుణుడు పలకరించలేదు. దానికి తోడు ఎండల తీవ్రత కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటమే కాకుండా మయన్మార్ నుంచి మేఘాలు తెలుగు రాష్ట్రాల వైపు కదులుతున్నాయి. ఈశాన్యానికి ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి 4.5 నుండి 7.6 కి.మీల మధ్య ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని చెప్పారు. పెరుగుతున్న ఆటుపోట్లు దక్షిణం వైపు వంగి ఉంటుందని పేర్కొంది. దీని ప్రభావంతో నేటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. వచ్చే శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

టెట్ అప్లికేషన్స్ కు ముగిసిన గడువు..

తెలంగాణ రాష్ట్రం లో ఆగష్టు నెల 1వ తేదీన టెట్ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆగష్టు 2వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. రాష్ట్రం లో సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు జరగనున్నాయి. డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు పేపర్-1 పరీక్షను రాసుకునేందుకు అవకాశం కల్పించారు.గతంలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు డీఈడీ అభ్యర్థులకు మాత్రమే పోటీ పడే అవకాశం ఉండేది.కానీ 2018 న బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు పేపర్-2తో పాటు పేపర్-1కు కూడా రాసుకునే అవకాశం ఎన్సిటీఈ కల్పించింది.అయితే రాష్ట్రంలో 1.5 లక్షల మంది డిఈడి పూర్తి చేసినవారు అలాగే 4.5 లక్షల మంది బిఈడి పూర్తి చేసిన అభ్యర్థులు ఉన్నారు.గతంలో, టెట్ చెల్లుబాటు కేవలం 7 సంవత్సరాలు మాత్రమే ఉండేది.కానీ రెండేళ్ల క్రితం, టెట్ కాలవ్యవధిని జీవితకాలానికి పొడిగించారు.

 

 

Exit mobile version