NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు సచివాలయంలో సీఎం కీలక సమీక్ష.. తడిసిన ధాన్యం సేకరణపై చర్చ
నేడు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరనున్నారు. వ్యవసాయ రంగంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సమీక్షించనున్నారు. ధాన్యం కొనుగోలుతో పాటు ఇటీవల వర్షాలకు తడిసిన ధాన్యం సేకరణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలిసి చర్చించనున్నారు. నేటి నుంచి పరిపాలనపై దృష్టి పెడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చిట్ చాట్ లో తెలిపిన విషయం తెలిసిందే.. రైతుల సమస్యలు, గిట్టుబాటు ధర పైనే ఎక్కువ ఫోకస్ ఉండే అవకాశం ఉంది. రైతు పండించే వాటిని రేషన్ షాపుల్లో అందించే ఆలోచన చేయనున్నారు. మిల్లర్లు మింగి కూసుంటాం అంటే చూస్తూ ఊరుకోనని రేవంత్ రెడ్డి హెచ్చరించిన విషయం తెలిసిందే. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు కూడా.. విద్యుత్ శాఖలో కొందరు కావాలని పవర్ కట్ చేస్తున్నారని, వారిపై చర్యలు ఉంటాయని రేవంత్ తెలిపారు. ఇప్పటి వరకు ఎన్నికలపై ఫోకస్ పెట్టిన సీఎం.. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి.. నేటి నుంచి పరిపాలనపై పూర్తి స్థాయి చర్యలు ఉంటాయన్నారు. మరోవైపు.. రిటైర్డ్ ఉద్యోగుల పై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రుణమాఫీ పై ఫోకస్, విద్యాశాఖ, అన్ని హస్టల్స్ కి సన్న బియ్యం అందించే దిశగా మీద ఫోకస్ పెట్టనున్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన సన్న బియ్యం కాదు.. నిజమైన సన్నబియ్యం ఇస్తామని అన్నారు.

నగరానికి క్యూ కట్టిన జనం.. ప్రయాణికులతో కిక్కిరిసిన బస్సులు, రైళ్లు..
లోక్ సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటు వేసేందుకు ఇళ్లకు వెళ్లిన వారంతా పోలింగ్ ముగియడంతో తిరుగు ప్రయాణమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ, ఏపీలోని ఇతర ప్రాంతాల నుంచి తిరిగి వచ్చే ప్రయాణికులతో నగరంలోని మెట్రో, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ నగరానికి చేరుకున్న ప్రయాణికులు తమ తమ ప్రాంతాలకు వెళ్లేందుకు మెట్రో రైళ్ల వినియోగం పెరగడంతో హైదరాబాద్ మెట్రో రైళ్లలో రద్దీ పెరిగింది. ఎల్బీ నగర్-మియాపూర్ మార్గంలో మెట్రోలు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. చాలా మంది మెట్రో రైలులో నిలబడి ప్రయాణిస్తున్నారు. కొన్ని రైళ్లలో నిలబడేందుకు కూడా గ్యాప్ లేకుండా ప్రయాణిస్తున్నారు. ఉదయం 5.30 గంటల నుంచి ఓటర్ల తిరుగు ప్రయాణంతో మెట్రో రైళ్లు ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అరగంట ముందుగానే మెట్రో సర్వీసును ప్రారంభించారు. అయితే రద్దీ ఎక్కువగా ఉండడంతో హైదరాబాద్ మెట్రో మరిన్ని ట్రిప్పులు నడపాలని యోచిస్తోంది. దీనికి తోడు కార్యాలయాలకు వెళ్లే వారి సంఖ్య కూడా పెరగడంతో స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. మరోవైపు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే జాతీయ రహదారి ట్రాఫిక్‌తో కిటకిటలాడుతోంది. ఎన్నికలకు వెళ్లిన ఏపీ ప్రజలు మళ్లీ నగరానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌గేట్‌ వద్ద పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. టోల్ ప్లాజాలో 16 గేట్లు ఉండగా హైదరాబాద్ వైపు పది గేట్లు తెరిచారంటే రద్దీ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.

బస్సు డ్రైవర్ ఓవర్ స్పీడ్ వల్లే ప్రమాదం.. పోలీసుల విచారణ..!
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో దారుణం చోటు చేసుకుంది. ఓటు వేసి తిరిగి వస్తుండగా బస్సు – టిప్పర్ ఢీ కొట్టడంతో ఆరుగురు సజీవదహనం అయ్యారు. బాపట్ల జిల్లా చిన్నాగంజం నుంచి హైదరాబాదుకు బయలు దేరిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు, చిలకలూరిపేట మండలం ఈవూరి వారి పాలెం డొంక సమీపంలో ఒక టిప్పర్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు – టిప్పర్ ఢీ కొవడంతో అక్కడికక్కడే మంటలు వ్యాపించి రెండు వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుల్లో టిప్పర్ డ్రైవర్, ట్రావెల్ బస్ డ్రైవర్ తో పాటు మరో నలుగురు బస్సులోని ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. కాగా, బస్సు బయలుదేరినప్పటి నుంచి ప్రయాణికుల్లో ఆందోళన నెలకొందని ప్రత్యక్ష సాక్షులు తెలియజేశారు. బస్ డ్రైవర్ యమ స్పీడుతో నడిపారని పోలీసులకు సమాచారం. చిన గంజాం నుంచి బయలుదేరినప్పటి నుంచి బస్సును డ్రైవర్ అంజి ఓవర్ స్పీడ్ గా నడిపినట్లు చెప్పుకొచ్చారు. ఫాస్టుగా వెళ్లొద్దని పలువురు ప్రయాణికులు నివారించినట్లు తెలిపారు. బస్సెక్కిన గంటప్పావులో ఆరు నిండు ప్రాణాలు బుగ్గిపాలైనట్లు చెప్పారు. ఇప్పటికీ మరో మృతుని ఆచూకి తెలియలేదు.. బస్ డ్రైవర్ సీటు వెనుకున్న బెర్తులో పడుకున్న వ్యక్తి చనిపోయినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇక, బస్సు ప్రమాదంతో బస్ క్లీనర్ బెంబేలెత్తి పారిపోయినట్లు తెలుస్తుంది. బస్ క్లీనర్ ఆచూకీపై పోలీసుల ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి గురైన లక్ష్మీ ప్రసన్న ట్రావెల్స్ బస్ చీరాలకు చెందునదిగా గుర్తించారు. ప్రమాదంలో చనిపోయిన ఓనర్ కమ్ డ్రైవర్ అంజీ.. ప్రమాద సమయంలో డ్రైవర్ల కండీషన్లపై పోలీసుల ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే, చిలకలూరి పేట బస్సు ప్రమాదంలో గాయపడిన వారిలో ఏడుగురికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఐదుగురికి చికిత్స చేసిన పంపించిన వైద్యులు.. మరో ఇద్దరు క్షతగాత్రులకి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

చంద్రగిరిలో కొనసాగుతున్న హైటెన్షన్.. 144 సెక్షన్ అమలు..!
తిరుపతి జిల్లా చంద్రగిరిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. పద్మావతి వర్శిటి స్టాంగ్ రూమ్ దగ్గుర పోలీసులు భారీ భద్రతతో పాటు 144 సెక్షన్ విధించారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని ఈ రోజు సాయంత్రం డిశార్జ్ చేసే అవకాశం ఉంది. అయితే, మహిళా యూనివర్సిటీ దగ్గర వైసీపీ నేతల దాడిలో గాయపడిన పులివర్తి నాని, గన్ మ్యాన్ ధరణి కోలుకున్నారు. అయితే, పులివర్తి నాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రామచంద్రాపురం జెడ్పీటీసీ ఢిల్లీరాణి భర్త భాను ప్రకాష్ రెడ్డి, నడవలూరు సర్పంచ్ గణపతి రెడ్డి ప్రధాన నిందితులుగా గుర్తించారు. ఇక, పులివర్తి నానిపై దాడికి పాల్పడింది మొత్తం 30 మంది అని పోలీసులు గుర్తించారు. అందులో ఇప్పటి వరకు ముగ్గురుని అదుపులోకి తీసుకోగా.. మిగిలిన వారంతా పరారీలో ఉన్నట్లు సమాచారం. వెంటనే అరెస్ట్ చేయకపోతే చంద్రగిరిని దిగ్భందిస్తామని పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి హెచ్చరించింది. దీంతో పులివర్తి సుధారెడ్డి వార్నింగ్ తో చంద్రగిరిలో భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డీజీతో మాట్లాడి, ఎన్నికల కమిషన్ కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు.

1800 అడుగుల కింద పడిపోయిన లిఫ్ట్.. గనిలో చిక్కుకున్న 150 మంది కార్మికులు
రాజస్థాన్‌లోని జుంజునులో జరిగిన కోలిహాన్ గని ప్రమాదంలో పెద్ద అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. గత రాత్రి, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సిఎల్) గనిలోని లిఫ్ట్ మెషిన్ 1800 అడుగుల మేర పడిపోయింది. దీని కారణంగా విజిలెన్స్ బృందంతో సహా 15 మంది అధికారులు లిఫ్ట్‌లో చిక్కుకున్నారు. కాగా, లిఫ్ట్ నుంచి ముగ్గురు అధికారులను సురక్షితంగా బయటకు తీసినట్లు వార్తలు వచ్చాయి. మిగిలిన వారిని రక్షించే చర్యలు కూడా కొనసాగుతున్నాయి. గనిలో 150 మందికి పైగా కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. లిఫ్ట్‌లో నుంచి ప్రజలను రక్షించకపోతే గనిలో చిక్కుకున్న 150 మంది కార్మికులను రక్షించడం కష్టం. కోలిహన్ గనిలో ప్రమాదం గురించి సమాచారం అందుకున్న తరువాత, రెస్క్యూ టీమ్ రాత్రి భిల్వారా జిల్లాలోని రాంపుర నుండి బయలుదేరింది. త్వరలో రాంపుర రెస్క్యూ టీమ్ ఖేత్రికి చేరుకుంటుంది. ప్రస్తుతం స్థానిక బృందం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉందని నీమ్‌కథాన ఎస్పీ తెలిపారు. లిఫ్ట్‌లో చిక్కుకున్న అధికారులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగకుండా ఆక్సిజన్‌ను సరఫరా చేశారు. సమీపంలోని ఆసుపత్రుల నుంచి అన్ని అంబులెన్స్‌లను రప్పించామని ఎస్పీ తెలిపారు. వైద్యుల బృందాలను కూడా అత్యవసర పరిస్థితులకు సిద్ధం చేయాలని కోరారు. మంగళవారం సాయంత్రం విజిలెన్స్ బృందం గనిలోకి ప్రవేశించింది. గని నుంచి బయలుదేరుతుండగా రాత్రి 8:10 గంటల ప్రాంతంలో లిఫ్ట్ చైన్ తెగిపోయింది. దీంతో లిఫ్ట్‌లో ఉన్న 15 మంది అందులో చిక్కుకున్నారు. లిఫ్ట్‌లో చిక్కుకున్న గనిలో 150 మందికి పైగా కూలీలు పనిచేస్తున్నారు. ఈ లిఫ్ట్ ప్రమాదం కారణంగా వీరంతా కూడా గనిలోనే చిక్కుకుపోయారు. లిఫ్ట్‌లో చిక్కుకున్న వారిని ముందుగా రక్షించనున్నారు. ఆ తర్వాతే కార్మికులను రక్షించనున్నారు. ప్రస్తుతం ముగ్గురు అధికారులు సురక్షితంగా బయటపడ్డారు. కోలిహన్ గని డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎకె శర్మ, మేనేజర్లు ప్రీతమ్ సింగ్, హర్సిరామ్‌లను రక్షించారు.

మహేష్ స్టన్నింగ్ లుక్ అదిరిపోయిందిగా..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన లేటెస్ట్ మూవీ “గుంటూరు కారం”..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ప్రస్తుతం మహేష్ తరువాత మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్లోబల్‌ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ తరువాత సినిమా తెరకెక్కుతుంది.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైనట్లు నిర్మాత కేఎల్‌ నారాయణ అప్డేట్ అందించారు.ఈ సినిమాలో మహేశ్ బాబు లాంగ్‌ హెయిర్‌తో స్టన్నింగ్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. అయితే వీరి కాంబినేషన్ లో సినిమా  ప్రకటించినప్పటి నుంచి స్టైలిష్‌ లుక్ లో కనిపిస్తూ మహేష్ తన అభిమానులను సర్ప్రైజ్ చేస్తూనే వున్నారు. తాజాగా బ్లూ టీషర్ట్‌లో , బ్లాక్‌ గాగుల్స్‌ పెట్టుకున్న మహేష్ స్టైలిష్ లుక్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.మహేష్ నయా లుక్ చూసిన అభిమానులు ఎంతో ఖుషి అవుతున్నారు.గ్లోబల్ అడ్వెంచరస్‌ మూవీగా వస్తున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్‌ నారాయణ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.ఈసినిమాను దర్శకుడు రాజమౌళి బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో పలువురు టాప్ హాలీవుడ్ యాక్టర్స్ నటిస్తున్నట్లు సమాచారం.

కాలంతో పాటు మారాలి.. ఆ నిబంధన మంచిదే..!
ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ నిబంధనపై ఆటగాళ్లు, నిపుణులు తమతమ అభిప్రాయాలను తెలిపారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. టీమిండియా ఆటగాళ్లు అక్షర్‌ పటేల్‌, ముకేశ్‌ కుమార్‌లు ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా చాలా మంది ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ను విమర్శిస్తుంటే.. టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి మాత్రం ఆ నిబంధన మంచిదే అని అంటున్నాడు. ఇంపాక్ట్‌ రూల్ వల్ల మ్యాచ్‌లు మరింత హోరాహోరీగా సాగుతాయని అభిప్రాయపడ్డాడు. రవిచంద్రన్ అశ్విన్‌ యూట్యూబ్‌ ఛానెల్‌లో రవిశాస్త్రి మాట్లాడుతూ… ‘ఆటలో కొత్త నిబంధన వచ్చినప్పుడు అది ఎందుకు సరైంది? కాదో? చెప్పే వాళ్లుంటారు. కానీ 190, 200 స్కోర్లు నమోదవుతున్నప్పుడు.. ఆటగాళ్లు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నప్పుడు జనం పునరాలోచిస్తారు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన మంచిదే. కాలంతో పాటు మనం మారాలి. ఇతర క్రీడల్లో కూడా ఇలాంటి నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధన వల్ల మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతాయి’ అని అన్నాడు. గత ఐపీఎల్‌ సీజన్‌లో ఎన్నో మ్యాచ్‌లు రసవత్తరంగా ముగియడం మనం చూశామని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన ఎంతో ప్రభావం చూపించిందన్నాడు. అయితే ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన శాశ్వతం కాదని, అందరినీ సంప్రదించి టీ20ప్రపంచకప్‌ 2024 తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇటీవల అన్నాడు.