థర్డ్ పార్టీ యూపీఏ ఉపయోగించేందుకు ఆమోదం పొందిన పేటీఎం
Paytm వినియోగదారుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నుండి గురువారం రిలీఫ్ న్యూస్ వచ్చింది. మార్చి 15 తర్వాత విజయ్ శేఖర్ శర్మ కంపెనీ Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిమితులు వర్తిస్తాయి. అయితే దీనికి ముందు NCPI Paytm మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్ లిమిటెడ్‌కు మూడవ పార్టీ UPI అప్లికేషన్‌ను ఉపయోగించడానికి అనుమతిని ఇచ్చింది. మల్టీ బ్యాంక్ మోడల్ కింద థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (టిపిఎపి)కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఎన్‌సిపిఐ ప్రకటనలో తెలిపింది. ఇందులో యెస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి.
టెన్త్ పరీక్షల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రశ్నా పత్రానికి క్యూఆర్ కోడ్..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మార్చి నెల 18వ తేదీ నుంచి 30 వరకు ఉదయం 9.30 నుండి 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకి సమయం దగ్గర పడుతుండగా ప్రశ్నా పత్రానికి భద్రతా చర్యలపై దృష్టి పెట్టారు అధికారులు. ఇకపోతే ఈసారి పదవ తరగతి పరీక్షల్లో అక్రమాలకు పాల్పడకుండా సరికొత్త విధానాన్ని అమలులోకి తీసుక రాబోతున్నట్లు అర్ధమవుతుంది. ఇందుకోసం ఎగ్జామ్ పేపర్ కు ఓ క్యూఆర్ కోడ్ ను ముద్రిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో అనేక అక్రమాలను నివారించేందుకు అవకాశం కలుగనుంది.
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?
ఇటీవలి కాలంలో బంగారం ధరలు దడ పుట్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు పెరగడమే తప్ప.. తగ్గడం లేదు. నేడు మరోసారి బంగారం ధరలు పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (మార్చి 15) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,610గా ఉండగా.. 24 క్యారెట్ల (999 గోల్డ్) 10 గ్రాముల ధర రూ.66,120గా ఉంది. నిన్నటితో పోలిచ్చుకుంటే 22 క్యారెట్ల బంగారంపై రూ.10.. 24 క్యారెట్ల బంగారంపై రూ.10 పెరిగింది. దేశీయంగా వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ఉండడంతో అమ్మకాలు పుంజుకుంటున్నట్లు తెలిసింది.
రంజాన్ నేపథ్యంలో పైలెట్లు, విమాన సిబ్బందికి పాకిస్తాన్ కీలక ఆదేశాలు.
ఆర్థిక కష్టాలతో సతమతం అవుతున్న పాకిస్తాన్ జాతీయ ఎయిర్ లైన్స్ ‘పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)’ తమ పైలెట్లు, క్యాబిన్ క్రూకి కీలక ఆదేశాలు జారీ చేసింది. రంజాన్ సమయంలో ఉపవాసాలు ఉన్న పైలెట్లు, విమాన సిబ్బంది విమానాల్లో విధులు నిర్వర్తించొద్దని చెప్పింది. విమానంలో ప్రయాణిస్తు్న్నవారు, నేలపై ఉన్న వారి ప్రాణాలకు హాని కలుగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఉపవాస సమయాల్లో డీహైడ్రేషన్, సోమరితనం, నిద్రను ఎదుర్కొంటారని అలాంటి సందర్భా్ల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందనే వైద్య సిఫారసులతో పీఐఏ ఈ నిర్ణయం తీసుకుంది.
నేటితో కాంగ్రెస్ పాలనకు 100 రోజులు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడి నేటి సరిగ్గా వంద రోజులు అవుతుంది. గతేడాది డిసెంబర్ 7వ తేదీన పాలనా పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వంద రోజుల ప్రగతి నివేదనను రిలీజ్ చేసింది. డిసెంబరు 7న ప్రగతిభవన్ దగ్గర కంచెను తొలగించి తమ ప్రభుత్వ నిర్వహణ తీరుపై సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్రగతి భవన్ పేరును మహాత్మ జ్యోతిభా ఫూలే భవన్‌గా మార్చి.. అక్కడ ప్రజావాణి కార్యక్రమానికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. వారంలో రెండు రోజులు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరిస్తూ.. ప్రజా ప్రభుత్వంగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది.
నేడు ఆదిలాబాద్ లో మంత్రి సీతక్క పర్యటన.. అధికారులతో సమీక్ష
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యటించనున్నారు. కొమురం భీం, ఆదిలాబాద్ జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం కొమురం భీం జిల్లా, మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. ఉమ్మడి జిల్లా అధికారుల తో ఉట్నూర్ లో మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 7:15 గంటలకు నూతన జిల్లా గ్రంధాలయ భవనం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఉదయం 07:30 గంటలకు సీతక్క ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఉదయం 08.00 గంటలకు ఆసిఫాబాద్ మండలంలోని గుండిగ్రామం వద్ద వంతెన పరిశీలించనున్నారు. ఉదయం 10:00 AM కి జోడేఘాట్ లోని కుమ్రంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. మ్యూజియం సందర్శించిన అనంతరం మధ్యాహ్నం భోజనం అనంతరం ఉట్నూర్ కే.బీ కాంప్లెక్స్ లో నాలుగు జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
యాదాద్రి ఆలయ ఇన్‌చార్జ్ ఈఓ రామకృష్ణరావుపై బదిలీ వేటు అందుకేనా..?!
తాజాగా యాదాద్రి లక్ష్మి నరసింహ ఆలయ ఇన్ఛార్జ్ ఈఓ పై బదిలీ వేటు పడింది. దీనితో కొత్త ఆలయ నూతన ఈవోగా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావుని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు మేర తెలిపింది. 11వ తేదీన ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు హాజరు అయ్యారు. ఈ నేపథ్యంలో స్వామి వారి దర్శనం తర్వాత ముఖ్యమంత్రికి, అలాగే మంత్రులకు కలిపి వేద బ్రాహ్మణులు వేద ఆశీర్వచనం ఇచ్చారు.
అయితే ఈ సమయంలో సీఎం, మిగతా మంత్రుల కంటే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖలకు కాస్త చిన్న పీటలు వేశారు ఆలయ అధికారులు. దీనితో పెద్ద ఎత్తున ఈ విషయం గురించి వివాదం రాజుకుంది. ఈ సందర్భంగా ఆ మంత్రులకు అవమానం జరిగిందంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేసాయంటే అర్థం చేసుకోవచ్చు.. ఈ విషయం ఇంత సీరియస్ అయ్యిందో. ఇక ఈ అంశం సంబంధించి ఆలయ ఈఓ బదిలీకి కారణమని సమాచారం.
నేడు వైసీపీలో చేరనున్న ముద్రగడ పద్మనాభం
నేడు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. నిన్న రాత్రి ముద్రగడ పద్మనాభం కిర్లంపూడి నుంచి బయలుదేరి విజయవాడకు చేరుకున్నారు. ఈరోజు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీలో ముద్రగడ పద్మనాభం చేరనున్నారు. సుదీర్ఘకాలం తర్వాత ఆయన పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటి వరకూ ఆయన కాపు సామాజికవర్గం సంక్షేమం కోసం అన్ని రాజకీయ పార్టీలకూ దూరంగా ఉన్నారు. అయితే ఈరోజు ఆయన వైసీపీలో చేరుతుండటంతో సుదీర్ఘకాలం తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్లయింది. అయితే.. కుమారుడి గిరితో కలిసి ముద్రగడ వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు. భారీర్యాలీగా వెళ్లి తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరతానని వెల్లడించారు. అయితే.. నిన్న వైసీపీలో చేరాల్సిన ముద్రగడ చేరిక వాయిదా పడింది. ముుందుగా ప్రకటించిన మార్చి 14న కాకుండా .. నేడు వైసీపీలో చేరనున్నట్లు ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఈ మేరకు అభిమానులకు ఓ లేఖ రాశారు. అలాగే తాడేపల్లికి ర్యాలీగా వెళ్లాలనే తన నిర్ణయాన్ని కూడా మార్చుకున్నారు. కేవలం తానుు మాత్రమే తాడేపల్లికి వెళ్లి వైసీపీలో చేరనున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
నేడు హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ హైదరాబాద్ రానున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని ఆమె ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి తన సందేశాన్ని వినిపిస్తారు. అలాగే, రేపు (శనివారం) ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ డ్ విశిష్ట అతిధిగా హాజరు కాబోతున్నారు. ఈ నెల 17న ప్రపంచ ఆధ్యాత్మిక గురువుల కొన్ని సెషన్లు ఉండనున్నాయి. ఇక, ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనం-2024 నిన్న (గురువారం) స్టార్ట్ అయింది. దీన్ని కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ, హార్ట్ ఫుల్నెస్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు కొనసాగనుంది.
తెలంగాణకు ప్రధాని మోడీ రాక.. నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు..!
తెలంగాణలో బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నేడు, రేపు (శుక్రవారం, శని) సోమవారాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు, రోడ్‌షోల్లో మోడీ పాల్గొంటారు. ఇవాళ సాయంత్రం ప్రధాన హైదరాబాద్ చేరుకుని, రాత్రికి రాజ్ భవన్ లో బస చేస్తారు. శనివారం ఉదయం నాగర్‌కర్నూల్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మళ్లీ 18న జగిత్యాలలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. నేడు, రేపు (శుక్ర, శనివారా)ల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందన్న అంచనాల మధ్య ప్రధాని పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
మేం అధికారంలోకి వస్తే రైతుల గొంతుక అవుతాం..
తాము అధికారంలోకి వస్తే రైతుల ప్రయోజనాలను రక్షిస్తామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్‌తో కలిసి గురువారం మహారాష్ట్రలోని నాసిక్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా ‘కిసాన్ మహాపంచాయత్’లో ప్రసంగించారు. నాసిక్ ఉల్లి, ద్రాక్ష, టొమాటోల సాగుకు ప్రసిద్ధి. మహాపంచాయత్ సభ సందర్భంగా రైతులు తమ కష్టాలను చెప్పుకున్నారు.
నేడు ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు.. హాజరు కానున్న సీఎం రేవంత్
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ మొదటి శుక్రవారం కావడంతో ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ ఇఫ్తార్ విందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా, రాష్ట్ర కేబినెట్ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి హాజరయ్యే ఇఫ్తార్ విందు ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించారు.
తెలంగాణలో నేటి నుంచే ఒంటిపూట బడులు
నేటి నుంచి తెలంగాణలో అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. ఈనెల 15 నుంచి ఒంటి పూట బడలు నిర్వహించాలని తాజాగా పాఠశాల విద్యాశాఖ ఆదేశించిన విషయం తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఆమె తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు అన్ని ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు ఈ నిబంధనలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, మధ్యాహ్న భోజనం అందించిన తర్వాతే పిల్లలను ఇంటికి పంపించాలని ఆదేశించారు.
ఒకేరోజు 25వేల ఇళ్ల పట్టాల పంపిణీ చేసి చరిత్ర సృష్టించాం
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి సుబ్రమణ్య మైదానంలో ఎంపీ మార్గాని భరత్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. రాజమండ్రిలో ఇవాళ ఒకేరోజు 25వేల ఇళ్ల పట్టాల పంపిణీ చేసి చరిత్ర సృష్టించామన్నారు. సీఎం జగన్ ఒకేరోజు 25వేల ఇళ్ల పట్టాల కోసమని 300 కోట్లు విడుదల చేశారన్నారు మార్గాని భరత్. ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లకపోతే రాజమండ్రిలో పట్టాల పంపిణీ ఎప్పుడో పూర్తయ్యేదని, ఇలాగే ఇళ్ల పట్టాల అందుకున్న గీతాంజలిని టిడిపి సోషల్ మీడియా హింసించి బలితీసుకుందని ఆయన విమర్శించారు. పట్టాల పంపిణీలో ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్ పర్సన్ షర్మిల రెడ్డి పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్‌కు పిఠాపురంలో చేదు అనుభవం తప్పదని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. పొలిటికల్ ట్రాన్స్‌ఫర్‌లో భాగంగా పవన్ ఇక్కడికి వచ్చారా? అని ప్రశ్నించారు. చంద్రబాబే ఇండిపెండెంట్‌ను నిలబెట్టి పవన్‌ను ఓడిస్తారేమో అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి రాజకీయ పరిణామాలను జనసేన నేతలు లోతుగా పరిశీలించుకోవాలని సూచించారు.
