NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు ఏపీలో కూటమి ఎమ్మెల్యేల భేటీ.. శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు..!
నేడు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో ఉదయం 10.30 గంటలకు టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఎమ్మెల్యేల శాసన సభా పక్ష సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఈ సమావేశంలోనే శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును పవన్ ఏకగ్రీవంగా ప్రతిపాదించనున్నారు. దీనికి మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు మద్దతు తెలపిన తర్వాత ఆ తీర్మానాన్ని కూటమి తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు కూటమి నేతలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. ఇక, చంద్రబాబును ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించనున్నారు. మరోవైపు, రేపు( బుధవారం) కేసరపల్లిలో జరగబోవు ప్రమాణస్వీకారోత్సవానికి ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేపు ఉదయం 11:27 గంటలకు ఏపీ రాష్ట్రానికి మూడో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

పార్టీ నేతలతో పవన్ కీలక భేటీ.. జనసేన పక్షనేతగా ఎన్నిక..!
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన పార్టీ విజయం సాధించింది. గెలుపే లక్ష్యంగా టీడీపీ- జనసేన- బీజేపీ కూటమిగా జత కట్టాయి. అయితే, ఈ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు రేపు (జూన్ 12వ) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో టీడీపీ ప్రభుత్వంలో ఎవరికి ఏ ఏ మంత్రి పదవులు దక్కుతాయనే ఉత్కంఠ కూటమి నేతల్లో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలందరూ పవన్ కళ్యాణ్ ను శాసన సభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు.

ఏపీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై వైఎస్ జగన్ ఆరా..?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి నుంచి తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులతో భేటీ అవుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను తెలుసుకోబోతున్నారు. వరసగా నియోజకవర్గాల వారీగా నేటి నుంచి విడివిడిగా వైసీపీ నేతలతో జగన్ సమావేశం అవుతున్నారు. కాగా, ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమికి పార్టీ అభ్యర్థుల నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేసినా ప్రజలు ఎందుకు తిరస్కరించారనే దానిపై నేతలను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై కూడా వారితో చర్చించే ఛాన్స్ ఉంది. నియోజకవర్గాల వారీగా నేతలతో వైఎస్ జగన్ నేటి నుంచి వరసగా సమావేశమవుతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక, తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 175 స్థానాలకు కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించింది.

మూడు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఈ నెల 5న మహబూబ్‌నగర్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. దీని ప్రభావంతో నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు. ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది. నేడు నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు తెలిపారు. ఇక బుధవారం నల్లగొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ మేడ్చల్ మల్గాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రానున్న గురువారం ఆదిలాబాద్, నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

నీటి ఎద్దడితో ఇబ్బందుల్లో ఢిల్లీ ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు
నీటి ఎద్దడితో సతమతమవుతున్న రాజధాని ఢిల్లీ ఇప్పుడు దాహార్తిని తీర్చుకునేందుకు కొత్త మార్గం వెతుక్కోవాల్సి వస్తోంది. ఎందుకంటే 137 క్యూసెక్కుల అదనపు నీటికి సంబంధించి హిమాచల్ ఇప్పుడు యూ-టర్న్ తీసుకుంది. తమకు ఎక్కువ నీరు లేదని హిమాచల్ పక్షం సమాధానం ఇచ్చింది. దీంతో తమకు అదనపు నీరు లభిస్తుందని ఢిల్లీ ప్రభుత్వం హిమాచల్‌పై పెట్టుకున్న ఆశలు అడియాసలు అయ్యాయి. దీనికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ఎగువ నదీ జలాల బోర్డు అధికారులను యమునానగర్‌కు పంపింది. వారు మూడు రోజుల పాటు హత్నికుండ్ బ్యారేజీ వద్ద మకాం వేశారు. హిమాచల్ కూడా అదనపు నీటిని అందించడానికి నిరాకరించడంతో వారి ఆశలు గల్లంతయ్యాయి. ఢిల్లీ నీటి సంక్షోభానికి సంబంధించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని, ఆ తర్వాత హిమాచల్ ప్రభుత్వం ఢిల్లీకి 137 క్యూసెక్కుల నీటిని అందజేస్తామని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. యమునానగర్ నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆర్ఎస్ మిట్టల్ మాట్లాడుతూ, హిమాచల్ నీరు ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలిసిందన్నారు. ఆర్‌ఎస్ మిట్టల్ మాట్లాడుతూ, హిమాచల్ ప్రభుత్వం నీరు ఇవ్వకపోవడానికి నీటి కొరతే కారణమని పేర్కొంది. హత్నికుండ్ బ్యారేజీ వద్ద 2497 క్యూసెక్కుల నీరు నమోదైందని ఆయన తెలిపారు. ఈ నీటిని యూపీ, హర్యానాలకు పంపడంతోపాటు కొంత నీటిని ఢిల్లీకి కూడా మళ్లించారు. ఈ విషయమై ఆమ్ ఆద్మీ పార్టీ…. భారతీయ జనతా పార్టీ నీచ రాజకీయాలు చేస్తోందని ఆరోపించింది.

ఎంపీ పప్పు యాదవ్‌ పై ఎఫ్ఐఆర్ నమోదు..రూ.కోటి మోసం చేశాడని ఆరోపణలు
ఈసారి పూర్నియా లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ రెండింటినీ ఓడించి గెలిచిన పప్పు యాదవ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. సోమవారం, జూన్ 10న ముఫాసిల్ పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యాపారి ఫిర్యాదు చేశారు. రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ నుండి కోటి రూపాయల దోపిడీ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు వ్యాపారి ఆరోపించారు. దీంతో పాటు హత్య బెదిరింపులు కూడా వచ్చాయి. పూర్నియా జిల్లా పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. డెకరేషన్ వ్యాపారం చేసే ఫిర్యాదుదారుని ఓట్ల లెక్కింపు రోజు జూన్ 4న తన ఇంటికి పిలిపించిన పప్పు యాదవ్ కోటి రూపాయలు డిమాండ్ చేశారు. ఇంతకుముందు 2021, 2023లో కూడా పప్పు యాదవ్ ఇలాంటి డిమాండ్ చేశారని పోలీసులు తెలిపారు. అయితే ఈసారి కూడా డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తానని యాదవ్ బెదిరించడంతో పాటు వచ్చే ఐదేళ్లపాటు ఎంపీతో వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

టీ20 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన భారత్!
టీ20 ప్రపంచకప్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. మెగా టోర్నీలో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు నమోదు చేసిన మొదటి జట్టుగా రికార్డు నెలకొల్పింది. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 6 పరుగుల తేడాతో గెలుపొందింది. టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్‌కు ఇది 7వ విజయం. దాంతో భారత్ ఖాతాలో ఈ అరుదైన రికార్డు చేరింది. పొట్టి టోర్నీలో ఇండో-పాక్ టీమ్స్ ఇప్పటివరకు 8 సార్లు తలపడగా.. భారత్ ఏకంగా ఏడు విజయాలు అందుకుంది. టీ20 ప్రపంచకప్ 2007లో గ్రూప్ స్టేజ్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ టై అవ్వగా.. బాల్ ఔట్ పద్దతిలో టీమిండియా గెలిచింది. ప్రపంచకప్ 2007 ఫైనల్లో ఇరు జట్లు తలపడగా.. భారత్ విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‌ 2009లో ఇరు జట్లు వేర్వేరు గ్రూప్‌‌ల్లో ఉండటంతో తలపడలేదు. 2012, 2014, 2016 ప్రపంచకప్‌లో భారత్ గెచింది. టీ20 ప్రపంచకప్‌ 2021లో భారత్‌ను పాకిస్థాన్ ఓడించింది. 2022, 2024లో పాకిస్థాన్‌ను టీమిండియా ఓడించింది. టీమిండియాపై ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ నిరాశే ఎదురైంది. ఏడు విజయాలు సాధించిన భారత్.. పాకిస్థాన్ పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ ఆరు విజయాలు సాధించింది. వెస్టిండీస్‌పై శ్రీలంక కూడా 6 సార్లు గెలుపొందింది. ఇక టీమిండియాపై ఓటమితో పాకిస్థాన్ సూపర్ 8 చేరుకునే అవకాశాలు సన్నగిల్లాయి. గ్రూప్-ఏలో టీమిండియాతో పాటు అమెరికా రెండు విజయాలు సాధించి పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

ప్రభాస్ ‘కల్కి’ నుండి రిలీజ్ కానున్న మరో ట్రైలర్..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ” కల్కి 2898 AD “..మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా లో అమితాబ్ ,కమల్ వంటి లెజెండరీ స్టార్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను జూన్ 10 న మేకర్స్ రిలీజ్ చేసారు.రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను మరో కొత్త లోకంలోకి తీసుకెళ్లింది.విజువల్ వండర్ గా కల్కి ట్రైలర్ వుంది.కళ్ళు చెదిరిపోయేలా వున్నా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది.ఈ సినిమా ట్రైలర్ మూవీపై భారీగా అంచనాలు పెంచేసింది.ఈ ట్రైలర్ లో ప్రభాస్ యాక్షన్ స్టంట్స్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించింది.అలాగే సినిమాలో అమితాబ్ క్యారెక్టర్ అదిరిపోనున్నట్లు తెలుస్తుంది. కల్కి ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది.అన్ని భాషల్లో కలిపి ఈ ట్రైలర్ కు 16 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజుల ముందు మేకర్స్ ఈ సినిమా నుండి మరో ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

Show comments