దమ్మురేపుతున్న థ్రెడ్స్.. భారత్‌లోనే అధిక డౌన్‌లోడ్స్..
ట్విట్టర్‌కి పోటీగా మెటా తీసుకువచ్చిన థ్రెడ్స్ దుమ్మురేపుతోంది. మొబైల్ యాప్ లాంచ్ చేసిన ఒక్క రోజులోనే ప్రపంచ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఒక్క రోజులోనే 4 కోట్ల డౌన్‌లోడ్స్ జరిగాయి. ట్విట్టర్‌కి రాబోయే రోజుల్లో గట్టిపోటీ ఇవ్వబోతోంది. గత దశాబ్ధకాలంలో ఏ యాప్ కూడా ఇంతటి డౌన్‌లోడ్స్‌ని సొంతం చేసుకోలేదు. అన్నింటి రికార్డులను అధిగమించింది. ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్స్ తో పోలిస్తే ఆండ్రాయిడ్ మొబైల్‌లోనే యాప్ కి ఎక్కువ రెస్పాన్ వచ్చింది. ఏకంగా 75 శాతం ఆండ్రాయిడ్స్ ఫోన్స్ లోనే యాప్‌ని కలిగి ఉన్నారు.
ఇక ఇదిలా ఉంటే యాప్‌కి భారత్, బ్రిజిట్ బ్రహ్మరథం పట్టాయి. ముఖ్యంగా మొత్తం డౌన్‌లోడ్స్‌ని పరిశీలిస్తే 22 శాతం భారత్ లోనే నమోదయ్యాయి. 16 శాతం బ్రెజిల్ తర్వాతి స్థానంలో ఉంది. అమెరికాలో 5.5 శాతం డౌన్‌లోడ్స్ జరిగాయి. పోకీమాన్ జీఓ, కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ వంటి ప్రముఖ గేమ్స్ రికార్డును థ్రెడ్స్ అధిగమించింది. ఈ రెండు గేమింగ్స్ యాప్స్ తొలిరోజుల్లో సుమారుగా 2 కోట్ల డౌన్ లోడ్స్ జరిగితే.. థ్రెడ్స్ మాత్రం ఒకే రోజులో 4 కోట్ల డౌన్‌లోడ్స్ ని సొంతం చేసుకుని మొదటిస్థానంలో నిలిచింది. అంతకుముందు ట్విట్టర్ కి పోటీగా ట్రంప్ తీసుకువచ్చిన ట్రూత్ సోషల్ 1,44,000 డౌన్‌లోడ్‌ల ఉంది. 96 శాతం థ్రెడ్స్ వినియోగదారులు యాక్టివ్ గా ఉన్నట్లు తేలింది.
సూడాన్‌లో వైమానిక దాడులు.. 22 మంది మృతి
సూడాన్ దేశం సైనిక వర్గాల మధ్య ఘర్షణతో అట్టుడుకుతోంది. దేశంలో సైన్యం, పారామిలిటరీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. 12 వారాలుగా ఈ ఘర్షణ జరుగుతూనే ఉంది. ఈ రెండు విభాగాలకు చెందిన అధిపతుల మధ్య పోరు మొత్తం దేశాన్ని అతలాకుతలం చేస్తుంది. తాజాగా పశ్చిమ ఒమ్‌దుర్‌మాన్‌పై సూడాన్ సైన్యం జరిపిన వైమానిక దాడిలో కనీసం 22 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. రాజధాని ఖార్టూమ్ జంట నగరమైన ఒమ్‌దుర్మాన్ మరియు బహ్రీలలో ఏప్రిల్ నెలలో జరిగిన పోరాటంలో పారామిలిటరీ దళాలు ఆధిపత్యం చేలాయించాయి. ఈ నేపథ్యంలో సైన్యం తాజగా వైమానిక దాడులు జరిపింది.
లక్ష రూపాయల కోసం తండ్రిని చంపిన కొడుకు
ప్రస్తుత సమాజం మొత్తం డబ్బుమయం అయిపోయింది. డబ్బు కోసం ప్రజలు ఎలాంటి పనులు చేసేందుకైనా వెనకాడడం లేదు. డబ్బు ముందు రక్తసంబంధాలు కూడా మర్చిపోతున్నారు. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో చోటుచేసుకుంది. ఔరంగాబాద్‌లోని సుర్జావలి గ్రామంలో డబ్బు కోసం కొడుకు తన తండ్రిని హతమార్చిన షాకింగ్ సంఘటన జరిగింది. ఈ వ్యవహారంలో రాజ్‌కుమార్ అలియాస్ రాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడు. మృతదేహంపై ఉన్న దంతాల గుర్తుల ఆధారంగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే కుటుంబసభ్యులు అవాక్కయ్యారు.
పాకిస్తాన్ వలుపు వలలో బీఎస్ఎఫ్ ఉద్యోగి..
భారతదేశ రహస్యాలను తెలుసుకోవడానికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హనీట్రాప్ ని ఉపయోగిస్తున్నాయి. ఇప్పటికే డీఆర్డీఓలో పనిచేస్తున్న ఓ సైంటిస్టు సున్నితమైన భారత మిస్సైల్ రహస్యాలను ఓ పాకిస్తాన్ మహిళా ఏజెంట్ లో పంచుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్న సమయంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో హనీట్రాప్ కేసు వెలుగులోకి వచ్చింది.
గుజరాత్‌లోని భుజ్‌లో సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) కాంట్రాక్టు ఉద్యోగిని పాకిస్తాన్ మహిళా ఇంటెలిజెన్స్ ఏజెంట్‌తో సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నారనే ఆరోపణలపై అరెస్టు చేశారు. నిందితుడు నీలేష్ బలియా గత ఐదేళ్లుగా భుజ్‌లోని బిఎస్‌ఎఫ్ ప్రధాన కార్యాలయంలోని సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ కార్యాలయంలో ప్యూన్‌గా పనిచేస్తున్నాడు. ఇతను పాకిస్తాన్ మహిళా ఏజెంట్ వలుపువలలో చిక్కుకున్నాడు. పాక్ ఏజెంట్ కు వాట్సాప్ ద్వారా సున్నితమైన సమాచారాన్ని చేరవేసినట్లు తెలుస్తోంది. గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) సదరు బీఎస్ఎఫ్ ఉద్యోగిని శుక్రవారం అతడిని అరెస్ట్ చేసింది.
ఘనంగా మహంకాళి బోనాలు.. అమ్మవారికి బోనం సమర్పించిన తలసాని
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజ అనంతరం తెల్లవారుజామున 3.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాగా, తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయానికి భక్తులు బారులు తీరారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉదయం 9.30 గంటలకు ఎమ్మెల్సీ కవిత మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించనున్నారు. అదయ్య నగర్ కమాన్ వద్ద పూజల్లో పాల్గొంటారు. అమ్మవారిని దర్శించుకునే భక్తుల కోసం మొత్తం ఆరు క్యూలను ఏర్పాటు చేశారు. బాటా చౌరస్తా నుంచి ఆలయానికి వచ్చే లైను ఎంజీ రోడ్డు రాంగోపాల్‌పేట పాత పోలీస్‌స్టేషన్ కొత్త ఆర్చి గేట్ నుంచి మహంకాళి పోలీస్ స్టేషన్ మీదుగా ఆలయానికి వెళ్లాలి.
భూతవైద్యం కోసం తీసుకొచ్చి.. భార్యను చెరువులో ముంచి చంపిన భర్త
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ భర్త తన భార్యను చెరువులో ముంచి చంపిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. వారిద్దరూ అన్యోన్యంగానే మజార్ వద్దకు పూజ నిమిత్తం వచ్చారు. చాలాసేపు అక్కడ కూర్చున్న తర్వాత ఏదో విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాదనలో భర్త తన కోపాన్ని నియంత్రించుకోలేకపోయాడు. భార్యను సమీపంలోని చెరువులోకి తీసుకెళ్లి ముంచి హత్య చేశాడు. ఇరువురి మధ్య వాగ్వాదం జరుగుతుండగా పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ విషయం ప్రయాగ్‌రాజ్‌లోని ఘుర్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి సంబంధించినది. ఇక్కడ నివసించే మహ్మద్ ఆరిఫ్ తన భార్య తరానా బానోతో కలిసి శనివారం కోబ్ రౌలిలోని మజార్‌కు ప్రార్థన చేసేందుకు వెళ్లారు. ఈ సమయంలో ఇద్దరూ కలిసి చాలాసేపు కూర్చున్నారు. ఆ తర్వాత అకస్మాత్తుగా ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. ఆరిఫ్ తన భార్యపై కోపంతో తరానాను సమీపంలోని లోతైన చెరువులో ముంచి చంపాడు.
నా భర్తలాగే నేను ఇప్పుడు హిందువుని, భారతీయురాలిని.. పాకిస్తాన్ మహిళ..
పబ్జీ లవ్ స్టోరీ దేశవ్యాప్తంగా వైరల్ గా మారిన సంతతి తెలిసిందే. పాకిస్తాన్ కి చెందిన మహిళ, ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన వ్యక్తితో ప్రేమలో పడింది. కరోనా సమయంలో పబ్జీ గేమ్ ద్వారా ఇద్దరూ మొదటగా పరిచయమయ్యారు. ఆ తరువాత వీరిద్దరు ప్రేమలో పడ్డారు. తన ప్రియుడిని కలుసుకునేందుకు ఆమె భారతదేశానికి వచ్చింది. అప్పటికే పెళ్లై నలుగురు పిల్లలు ఉన్న సీమా హైదర్ సౌదీ అరేబియా, నేపాల్ మీదుగా ఇండియా చేరింది.
వీరిద్దరు నేపాల్ లో పెళ్లి చేసుకున్నారు. అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించినందుకు సచిన్‌ను జైలులో ఉంచగా, ఏడేళ్ల లోపు వయసున్న తన నలుగురు పిల్లలతో కలిసి నేపాల్ ద్వారా వీసా లేకుండా అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించినందుకు సీమాను జూలై 4న అరెస్టు చేశారు. అయితే తాజాగా వీరిద్దరికి శనివారం బెయిల్ లభించడంతో రిలీజ్ అయ్యారు. కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు.
నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్లు ఇవే..
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా వచ్చే భక్తులతో ఆలయం దగ్గర రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించి వాహనాలను దారి మళ్లించనున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చేవారు ముందుగానే బయలుదేరాలని సూచించారు.
కర్బలా మైదాన్, రాణిగంజ్, రాంగోపాల్ పేట్ ఓల్డ్ PS, ప్యారడైజ్, CTO, ప్లాజా, SBI క్రాస్ రోడ్, YMCA, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ క్రాస్ రోడ్, పాట్నీ క్రాస్ రోడ్, పార్క్ లైన్, బాటా, ఘస్మండి క్రాస్ రోడ్, రసూర్ పురా రోడ్లు, జంక్షన్ల వైపు వాహనదారులు రావద్దని సూచించారు.
మహిళలకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..ఎంతంటే?
పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్ ఈరోజు బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు ఈరోజు భారీగా పెరగడంతో జనాలు బంగారం కొనుగోళ్ళ పై నిరాశ చెందుతున్నారు.. బంగారు ఆభరణాలు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మార్కెట్ రేట్లు తెలుసుకోవడం ముఖ్యం. దేశ రాజధాని ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో జులై 9 ఆదివారం నాడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.59,510లు నమోదైంది. అలాగే, 22 క్యారెట్ల ధర 10 గ్రాముల ధర రూ.54,550 వద్ద నమోదైంది.నిన్నటితో పోలిస్తే..24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.440లు పెరిగితే, 22 క్యారెట్ల ధర రూ.400 పెరిగింది. అదే సమయంలో వెండి ధర కూడా కేజీపై రూ.1000లు పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి..
స్మార్ట్ ఫోన్ కొంటే టమాటాలు ఫ్రీ..ఫ్రీ.. ఎక్కడంటే?
జనాల తెలివి రోజురోజుకు పెరిగిపోతుంది.. మార్కెట్ కు తగ్గట్లు బిజినెస్ చెయ్యడంలో తెలివి మీరిపోతున్నారు.. ప్రస్తుతం మార్కెట్ లో టమోటా ధరలు మండిపోతున్నాయి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.200 లకు పైగా పలుకుతుంది.. ఇక . కొన్ని చోట్ల అయితే రూ. 250కి చేరువుతోంది. దీంతో ప్రజలు టమాట అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.. జనాలు పొద్దున్నే లేచినప్పటి నుంచి టమోటా ధరల పై చర్చిస్తున్నారు.. టమోటాలతో చేసే వంటల మాట పక్కన పెడితే అస్సలు టమోటాలను వంటల్లో వెయ్యడం లేదంటే నమ్మాలి..
మార్కెట్ లో అంతలా టమోటా ధరలు భారీగా పెరిగాయి.. సామాన్యులకు ఈ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.. ఒక్క టమోటా మాత్రమే కాదు అన్నీ కూరగాయలు అలానే ఉన్నాయి.. అందుకే జనాలు ఇప్పుడు చికెన్ వైపు మొగ్గు చూపిస్తున్నారు.. ఇలాంటి తరుణంలో ఓ దుకాణం అతను అదిరిపోయే బంఫర్ ఆఫర్ ను ప్రకటించారు. అదేంటంటే.. స్మార్ట్ ఫోన్ కొంటె రెండు కేజిల టమోటాలు ఫ్రీ అని ప్రకటించారు.. దీనికి జనాల్లో మంచి స్పందన వస్తుంది..
నిలిచిపోయిన అమర్‌నాథ్ యాత్ర.. భారీ వర్షాలతో ఆగిన యాత్ర
అమర్‌నాథ్ మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు వెళ్తున్న యాత్రికుల యాత్ర మధ్యలోనే నిలిపివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రను ఆపివేసినట్టు అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలు ఉత్తర భారత దేశాన్ని వణికిస్తున్నాయి. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. దీంతో పవిత్రమైన అమర్‌నాథ్ యాత్ర.. మధ్యలోనే ఆగిపోయింది. ప్రతికూల వాతావరణం ఉండటంతో అధికారులు.. అమర్‌నాథ్ యాత్రను నిలిపివేశారు. ఈ కారణంగా అమర్‌నాథ్ ఆలయానికి వెళ్తున్న వేలాదిమంది భక్తులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. అమర్‌నాథ్ మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు వెళ్తున్న యాత్రికుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా భారీగానే ఉన్నట్లు చెబుతున్నారు.
పదవుల కోసం లీడర్లు పార్టీ మారుతున్నారు.. మహారాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్ కామెంట్స్
సీఎం కేసీఆర్ మహరాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించారు. బీఆర్ఎస్ పార్టీని ఆ రాష్ట్రంలో బలోపేతం చేయాలని చూస్తున్నారు. తెలంగాణ సరిహద్దుల్లోని జిల్లాల్లో ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు పెరిగాయి. మహారాష్ట్రలో అధికారంలోకి వస్తే తెలంగాణ పథకాలను అక్కడ కూడా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా నిన్న బీఆర్ఎస్ లోకి పలువురు మహారాష్ట్ర నాయకులు చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సమకాలీన రాజకీయాల్లో పదవిని కాపాడుకోవడం చాలా ముఖ్యమైన అంశంగా మారింది. మహారాష్ట్రలో పదవుల కోసం రాజకీయ నాయకులు ఒకపార్టీ నుంచి మరో పార్టీకి ఎలా మారుతున్నారో దేశ ప్రజలు గమనిస్తున్నారంటూ సీఎం కేసీఆర్ శనివారం అన్నారు. మహరాష్ట్రలో శివసేన-ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంలో ఎన్సీపీ చేరడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావడం గురించి యువత ఆలోచించాలని పిలుపునిచ్చారు. దేశంలో నీటి వంటి సహజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ, కేంద్రంలో అధికారంలో ఉన్నవారు స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఈ విలువైన ఆస్తులను ఎందుకు సక్రమంగా వినియోగించుకోలేకపోయారని ప్రశ్నించారు. దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు.
నేడు నగరానికి జేపీ నడ్డా..11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులతో మీటింగ్..
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో బీజేపీ హైకమాండ్ ఫుల్ నజర్ పెట్టింది. ఇప్పటికే పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేసిన బీజేపీ పార్టీ ఇక జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బీజేపీ అగ్రనేతలు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ జిల్లాలో పర్యటించగా.. నేడు బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హైదరాబాద్ కు వస్తున్నారు. అయితే.. హైదరాబాద్ లో జరుగనున్న 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల మీటింగ్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ మీటింగ్ కొనసాగనుంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలే టార్గెట్‌గా కమలం పార్టీ ఈ కీలక మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో వ్యూహాలను సిద్ధం చేయనుంది.
తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన హెబ్బా పటేల్..
హెబ్బా పటేల్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన హాట్ అందాలతో ఎంతో పాపులర్ అయింది ఈ భామ.. తొలిసారిగా కుమారి 21ఎఫ్ తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది. ఈ సినమాలో తను మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంది. కానీ ఆ సినిమాలు అంతగా మెప్పించలేకపోయాయి.ఇక కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది ఈ భామ కానీ ఇప్పుడు మాత్రం ఈ అమ్మడును అస్సలు పట్టించుకునే వారే లేరు.దీంతో అవకాశాల కోసం తెగ ఎదురు చూస్తుంది.. పైగా తన గ్లామర్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది… హాట్ ఫోటో షూట్స్ తో లతో సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది.సినిమాలలో అవకాశాలు రాక పోయినా కూడా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ టచ్ లో ఉంటుంది.
అప్పుడప్పుడు తన వ్యక్తిగత విషయాలను కూడ పంచుకుంటూ ఉంటుంది. ఈ భామ ఫోటో షూట్స్ పై నెగటివ్ కామెంట్స్ వచ్చిన కూడా వాటిని అంతగా పట్టించుకోవడం లేదు. ట్రోల్స్ చేసేవారు ఎలా వున్నా ట్రోల్స్ చేస్తారని గట్టిగా నమ్మింది హెబ్బా పటేల్. అందుకే అలాంటి కామెంట్స్ పై ఎప్పుడూ కూడా స్పందించదు ఈ భామ.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను తన ఇంస్టాగ్రామ్ లో బాయ్ ఫ్రండ్ అంటూ ఒక వ్యక్తి ఫోటో ను పంచుకుంది. ఇక అతడిని హాగ్ చేసుకుంటూ కనిపించింది ఈ భామ. ఆ ఫోటో చూసిన వాళ్లంతా ఎవరై వుంటారా అని ఆలోచించడం మొదలు పెట్టారు.. పైగా మంచి రొమాంటిక్ మూడ్ లో ఉంది అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. అయితే అతడు నిజంగానే ఆమె బాయ్ ఫ్రండ్ ఆ లేక సరదాగా అలా పెట్టిందో మాత్రం తెలియదు కానీ ఇదంతా చూస్తుంటే ఈ భామ పెళ్లి చేసుకోవడానికి సిద్దమైనట్లు తెలుస్తుంది.
