స్వల్పంగా దిగొచ్చిన పసిడి ధరలు.. తులం ఎంతంటే?
బంగారం కొనాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తుంది.. ఇక వెండి కూడా అదే దారిలో నడిచింది.. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 57,990కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 63,220కి చేరింది.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం..
చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,390గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,710గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 57,990గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 63,220గాను ఉంది.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,140గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,320గా ఉంది. కోల్‌కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,990 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 63,220గా ఉంది.. ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ధరలు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,990గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,220గా నమోదైంది..
హైదరాబాద్‌లో నేటి నుంచి 36వ జాతీయ పుస్తక ప్రదర్శన!
ప్రతి ఏడాది హైదరాబాద్‌లో జాతీయ పుస్తక ప్రదర్శన (నేషనల్ బుక్ ఫెయిర్) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తున్న ఈ జాతీయ పుస్తక ప్రదర్శన.. 36వ ఎడిషన్‌తో ఈ ఏడాది కూడా మన ముందుకొచ్చింది. ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు పది రోజుల పాటు ఈ బుక్ ఫెయిర్ కొనసాగనుంది. ఈ ప్రదర్శనను తెలంగాణ రాష్ట్ర సాంస్కృతి, పర్యాటక, అబ్కారీ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ తెలిపారు.
దోమలగూడలోని ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫెయిర్ జరగనున్నట్లు జూలూరు గౌరీ శంకర్ తెలిపారు. ఈ పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరు పెట్టినట్లు తెలిపారు. ఈ వేదికకు సంస్కృత పండితులు రవ్వా శ్రీహరి పేరు, ద్వారానికి ఉర్దూ దినపత్రిక సియాసత్ మాజీ ఎండీ జహీరుద్దీన్ అలీ ఖాన్ పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ నెల 10 నుంచి 18వ తేదీ వరకు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. మొత్తం 365 స్టాళ్లలో అన్ని భాషలకు చెందిన లక్షల పుస్తకాలు అందుబాటులో ఉంటాయని గౌరీ శంకర్ చెప్పుకొచ్చారు.
హల్ద్వానీ హింసలో ఇప్పటివరకు ఆరుగురి మృతి..300 మందికి పైగా గాయాలు
హల్ద్వానీలోని వన్‌భుల్‌పురాలోని మాలిక్ తోటలో అక్రమంగా ఆక్రమించిన మదర్సాలు, మతపరమైన స్థలాలను కూల్చివేస్తున్న సందర్భంగా భారీ కలకలం చెలరేగింది. మునిసిపల్ కార్పొరేషన్, పోలీసుల చర్యతో ఆగ్రహించిన గుంపు రాళ్లు రువ్వి, వనభూల్‌పురా పోలీస్ స్టేషన్‌కు నిప్పుపెట్టింది. ఈ కాల్పుల్లో వన్‌భూల్‌పురా ప్రాంతానికి చెందిన ఆరుగురు చనిపోయారు. నైనిటాల్ డీఎం వందనా సింగ్ హల్ద్వానీలో తక్షణ కర్ఫ్యూ విధించారు. డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని అన్ని పాఠశాలలను శుక్రవారం మూసివేయాలని ఆదేశించారు. రాత్రి 9 గంటల తర్వాత నగరంలో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోయాయి.
ఓటీటీలోకి వచ్చేసిన ‘గుంటూరు కారం’.. ఎక్కడ చూడొచ్చంటే?
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల్లో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా కూడా ఉంది.. ప్రీమియర్ షోలతో ముందుగా మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ .. ఆ తర్వాత మాత్రం మంచి విజయాన్ని అందుకుంది.. ఈ సినిమా ఇప్పటివరకు బాగానే కలెక్షన్స్ ను రాబట్టినట్లు తెలుస్తుంది.. డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గత నెల జనవరి 12న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలు పోషించగా.. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, జయరామ్ వంటి ప్రముఖ నటులు ప్రత్యేక పాత్రల్లో నటించారు..
అమ్మ సెంటిమెంట్ తో సినిమాను తెరాకెక్కించారు.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంది.. పాటల గురించి చెప్పక్కర్లేదు. తమన్ అందించిన మ్యూజిక్ శ్రోతలను ఆకట్టుకుంది. ఈ మూవీలోని ‘కుర్చీ మడతపెట్టి’ పాటకు వచ్చిన రెస్పాన్స్ గురించి చెప్పక్కర్లేదు. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం అడియన్స్ ఎంతో ఆసక్తి ఎదురుచూశారు. ఇక ఇప్పుడు ప్రేక్షకులకు ఎదురుచూపులకు తెర పడింది.. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది..
రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.. నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నాలుగు రోజుల పాటు నిర్వహించాలని బిజినెస్ అడ్వై జరీ కమిటీ (బీఏసీ) నిర్ణయించిన విషయం తెలిసిందే.. ఈనేపథ్యంలో నిన్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. నిన్న (గురువారం) మధ్యాహ్నం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాంబర్లో కమిటీ సమావేశమైంది. ఇవాళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్తూ సభలో తీర్మానం ప్రవేశపెడ్తారు. దానిపై చర్చించిన తర్వాత సభ వాయిదా వేస్తారు. రేపు (శనివారం) అసెంబ్లీ, కౌన్సిల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడ్తారు. ఇక సోమవారం బడ్జెట్‌పై సాధారణ చర్చ నిర్వహిస్తారు. మంగళవారం బడ్జెట్‌పై సాధారణ చర్చకు సమాధానమిస్తారు. మూడు నెలల కాలానికి ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత సభను వాయిదా వేస్తారు.
మాల్దీవుల అధ్యక్షుడికి ఉపశమనం.. అభిశంసన ప్రతిపాదనను సుప్రీంకోర్టు వాయిదా
అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూకు ఉపశమనంగా మాల్దీవుల సుప్రీంకోర్టు గురువారం పార్లమెంటు స్టాండింగ్ ఆర్డర్‌లలో ఇటీవలి సవరణను వాయిదా వేయాలని ఆదేశించింది. ఈ సవరణ ప్రతిపక్ష ఎంపీలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిపై అభిశంసనను సులభతరం చేసింది. మాల్దీవుల రాజ్యాంగం ప్రకారం, ప్రెసిడెంట్ లేదా వైస్ ప్రెసిడెంట్‌పై అభిశంసన తీర్మానానికి పార్లమెంటు సభ్యులలో మూడింట రెండొంతుల మంది ఓటు వేయాలి.
అయితే, అవసరమైన ఓట్ల సంఖ్యను తగ్గించడం ద్వారా అభిశంసన తీర్మానాన్ని సులభతరం చేయడానికి పార్లమెంటు ఇటీవల తన స్టాండింగ్ ఆర్డర్‌లను సవరించింది. మాల్దీవుల అటార్నీ జనరల్ కార్యాలయం జనవరి 28న సవరణపై సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. ఇందులో న్యాయస్థానం తుది నిర్ణయం ఇచ్చే వరకు సవరణను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
ప్రతి జట్టు ఆటగాళ్లకు ఐపీఎల్ 2024 ఏంతో కీలకం!
టీ20 ప్రపంచకప్ 2024 ఉన్న నేపథ్యంలో ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ప్రదర్శనలకు ఎంతో ప్రాధాన్యం ఉండబోతుందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్ మూడీ అంటున్నారు. ఐపీఎల్ 2024లో పరుగులు చేయడం, వికెట్లు తీయడం టీ20 ప్రపంచకప్ సెలక్షన్‌లో పరిగణనలోకి రానున్నాయన్నారు. టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న అమెరికాలో ఆడడం చాలా మంది ఆటగాళ్లకు కొత్త అనుభవం కానుందని పేర్కొన్నారు. ఐపీఎల్ 2024 మర్చి 23న ఆరంభం కానుండగా.. జూన్ 1న టీ20 ప్రపంచకప్ మొదలవుతుంది.
ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టీమ్ డెసర్ట్ వైపర్స్ నిర్వహించిన ఇంటరాక్షన్‌లో టామ్ మూడీ మాట్లాడుతూ… ‘మార్చి-మే నెలల్లో ఐపీఎల్, ఇంటర్నేషనల్ లీగ్ టీ20 జరగబోతున్నాయి. ఈ టోర్నీలలో సత్తాచాటడం ఆటగాళ్లకు చాలా కీలకం. పరుగులు చేయడం, వికెట్లు తీయడం, స్థిరంగా రాణించడం టీ20 ప్రపంచకప్ సెలక్షన్‌లో పరిగణనలోకి రానున్నాయి. పొట్టి ప్రపంచకప్‌కు ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలంటే.. ఈ లీగ్‌లలో సత్తా చాటడం చాలా ముఖ్యం. గతంలో కంటే ఈసారి ఐపీఎల్‌లో బాగా ఆడాలని ప్రతి ప్లేయర్ అనుకుంటాడు’ అని అన్నాడు.
నేడు ప్రధాని మోడీ, అమిత్ షాతో సీఎం జగన్ భేటీ
హస్తినలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. నిన్నటికి నిన్న సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు బయలు దేరారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్ర కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ అయ్యారు. అయితే.. ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు ఉదయం 11.15 గంటలకు ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఆ తర్వాత అమిత్ షాతో భేటీ కానున్నారు సీఎం జగన్. ఏపీలో పొత్తులు, రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేసేందుకు కేంద్రం తగిన సహాయ సహకారాలను అందించాలని, తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన విద్యుత్తు బకాయిలు, విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీల అమలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం జగన్ ప్రధానితో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లను సైతం కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
నేడు నాగోబా మహా పూజ.. తరలి రానున్న మెస్రం వంశీయులు
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న నాగోబా జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మేడారం తర్వాత రాష్ట్రంలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన నాగోబా జాతరను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు కేస్లాపూర్‌కు వచ్చి నాగోబాకు పూజలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ గౌస్ ఆలం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ముగ్గురు డీఎస్పీల ఆధ్వర్యంలో ఆరుగురు సీఐలు, 28 మంది ఎస్సైలు, 37 మంది ఎస్సైలు, 94 మంది హెడ్ కానిస్టేబుళ్లతో పాటు 94, 243 మంది ఇతర సిబ్బందిని మోహరించారు. ఇవాళ అర్ధరాత్రి నుంచి జాతర ప్రారంభమవుతుంది. ఇవాళ, రేపు, ఎల్లుండి(9, 10, 11) తేదీల్లో జరిగే జాతర 12న దర్బార్‌తో ముగుస్తుంది. కేస్లాపూర్‌లోని మర్రిచెట్టు వద్ద హస్తిన సరస్సుకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నీటిని మెస్రం ప్రజలు ఇప్పటికే తీసుకొచ్చారు.
