NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

జగదాంబ జ్యువెలర్స్‌లో యజమానిపై కత్తితో దాడి

కొంపల్లిలో గురువారం తెల్లవారుజామున బుర్ఖా ధరించి వచ్చిన ఇద్దరు వ్యక్తులు బంగారు దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ రోడ్డులో ఉన్న దుకాణంలోకి కస్టమర్లంటూ పోజులిచ్చుకున్నారు. దొంగల్లో ఒకరు కత్తితో కొరడాతో కొట్టి, నగల పెట్టెలను బ్యాగ్‌లో ఉంచమని దుకాణదారుని బెదిరించారు. అయితే, నిందితులు ఆభరణాలపై చేయి వేయకముందే, దుకాణం యజమాని టేబుల్ మీద నుండి దూకి సహాయం కోసం కేకలు వేస్తూ దుకాణం నుండి బయటకు వచ్చాడు. వారి పథకం విఫలమవడంతో నిందితులు షాపు నుంచి బయటకు వచ్చి మోటార్‌సైకిల్‌పై పరారయ్యారు.

ముగిసిన సమీక్షా సమావేశం.. వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయం

వైసీపీ నేతలతో పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షా సమావేశం ముగిసింది.. ఈ భేటీకి సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు హాజరయ్యారు.. అరగంట పాటు కొనసాగిన ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ జగన్.. ప్రజలకు ఎంతో చేశాం.. ఇన్ని చేసిన తర్వాత.. ఇలాంటి ఫలితాలు చూసిన తర్వాత బాధ అనిపించిందన్నారు.. ఫలితాలు చూసిన తర్వాత శకుని పాచికల కథ గుర్తుకు వచ్చింది.. శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయని.. కానీ, ఆధారాలు లేకుండా మాట్లాడలేం అన్నారు.. శకుని పాచికలు అనే సబ్జెక్ట్‌ కేవలం ఇంటర్వెలే.. శ్రీకృష్ణుడు తోడు ఉన్నా.. పాండవులు ఓడిపోతారు.. కానీ, ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు..

బండి సంజయ్‌ను కలిసిన గ్రూప్ -1 అభ్యర్థులు..

గ్రూప్-1 అభ్యర్థులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గురువారం సమావేశమయ్యారు. గ్రూప్-1 మెయిన్స్‌కు ప్రిలిమ్స్ నుండి 1:100 చొప్పున ఎంపిక జరిగేలా నిరుద్యోగులు కోరుతున్నారు. నాలుగేళ్లలో మూడుసార్లు గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయడం వల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని నిరుద్యోగులు వాపోయారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 1:100 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేస్తామని కాంగ్రెస్ నేతలు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారని నిరుద్యోగులు గుర్తు చేశారు. మెయిన్స్ కు 1:50 చొప్పున ఎంపిక చేయడం వల్ల గ్రూప్ 1 పోస్టులు ఎక్కువగా ఉండడం వల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లలో మూడుసార్లు గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయడంపై తీవ్ర నష్టం జరిగిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు.

వారానికి ఒక రోజు కాటన్ వస్త్రాలు ధరించండి.. ప్రజలకు మంత్రి విజ్ఞప్తి

ప్రతి ఒక్కరూ వారాని ఒక రోజు కాటన్ వస్త్రాలు ధరించాలని విజ్ఞప్తి చేశారు.. మంత్రి సవిత.. సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె.. అన్ని జిల్లాల్లో బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటుపైన మొదటి సంతకం, ఎన్టీఆర్ విదేశీ విద్యగా పేరు మార్పుపైన రెండవ సంతకం చేశారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గలకు సేవ చేసే అవకాశం చంద్రబాబు నాకు కల్పించారు. బీసీలకోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాకే బిసీలకు సంక్షేమం ప్రారంభమైంది. గతంలో కూర్చోడానికి కుర్చి లేని పరిస్థితిల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుచేశారు.. 32 ఉండే బీసీ రెసిడెన్సియల్ స్కూల్స్ ను చంద్రబాబు 106 కు పెంచరన్న ఆమె.. జగన్ పాలనలో కేవలం రెండు బీసీ రెసిడెన్సియల్ కాలేజీలు మాత్రమే తెచ్చారని విమర్శించారు.

రెవెన్యూ శాఖను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతా..

రెవెన్యూ శాఖను దేశంలోనే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతా అన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్‌.. సచివాలయంలో రెవెన్యూ, స్టాంప్స్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను ఇంత పెద్ద భాధ్యత ఊహించలేదు.. కానీ, నాపై నమ్మకంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ భాద్యతలు ఇచ్చారు.. ఆ నమ్మకాన్ని వమ్మ చేయకుండా పనిచేస్తాను అన్నారు.. రెవెన్యూ డిపార్టమెంట్‌లో ఉన్న పాలసీలపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేయించాలన్నారు. గతంలో జరిగిన అవినీతిపై వెలికితీత ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పుడు దోవలో పేద ప్రజలకు అన్యాయం చేసిన వారిపై విచారణ జరిపిస్తాం.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

గ్రూప్‌-2 అభ్యర్థులు బిగ్ అలర్ట్.. మరికొన్ని గంటలే ఛాన్స్..

తెలంగాణ జాబ్ జాతర కొనసాగుతుంది. ఓ వైపు గ్రూప్ 4 పోస్టుల అభ్యర్థుల సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కొనసాగుతోంది. ఇక మరోవైపు గ్రూప్ 1,2,3 మెగా డీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. కాగా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 2 పోస్టుల భర్తీకి డిసెంబర్ 29, 2022న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 783 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ క్రమంలో గ్రూప్ 2 అభ్యర్థులకు టీజీపీఎస్సీ భారీ అలర్ట్ ఇచ్చింది. దరఖాస్తులో నమోదు చేసిన వివరాలలో తప్పులను సరిదిద్దడానికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వబడింది. ఈ అవకాశం ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. దీంతో అధికారులు గ్రూప్-2 విద్యార్థులకు ఈరోజు సాయంత్రం వరకే ఈ అవకాశం ఉంటుందని వెల్లడించారు. మళ్లీ ఈ అవకాశం కోసం లింక్ ఓపెన్ చేసిన ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు.

ఆలయాలకు సంబంధించిన ప్రతి సెంటు భూమి కాపాడేలా చర్యలు

ఆలయాలకు సంబంధించిన ప్రతి సెంటు భూమి కాపాడేలా చర్యలు తీసుకుంటాం.. ఆక్రమణకు గురైన ప్రతి సెంటు భూమి తిరిగి దేవదాయ శాఖ ఇప్పించే విధంగా చర్యలు చేపడతాం అన్నారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. విజయవాడలోని దేవాదాయశాఖ కమిషనర్‌ కార్యాలయంలో ఏపీ దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయ.. ఏపీ ప్రభుత్వ దేవాదాయ మంత్రిగా తొలి సంతకం చేశారు.. ఇక, నేటి నుంచి పూర్తిగా శాఖ పైన అన్ని రకాల చర్యలు, నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు.. మంత్రి బాధ్యతల స్వీకరణకు అనేక ప్రాంతాల నుంచి ఆలయ పాలకవర్గ అధికారులు వచ్చారు.

5 కోట్ల మంది ఆంధ్రులకు అమరావతి చిరునామా.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఏపీ అంటే అమరావతి, పోలవరం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతి రైతులు 1631 రోజులు ఆందోళన చేపట్టారని, రాజధాని కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులదన్నారు. గురువారం అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం సీఆర్‌డీఏ కార్యాలయం సీఎం చంద్రబాబు మాట్లాడారు. అమరావతి రైతుల పోరాటం భావి తరాలకు ఆదర్శమని కొనియాడారు. అమరావతిని ప్రపంచం అంతా గుర్తించిందన్నారు. ఏపీ అనగా ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం అంటూ చంద్రబాబు అన్నారు. ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం రాజధాని నిర్మాణం మొదలు పెట్టామని, అలాంటి రాజధానిని వైసీపీ ప్రభుత్వం అతలాకుతలం చేసిందన్నారు. పోలవరం వల్ల రైతులకు మేలు జరిగేదని, ఈ రెండింటిని వైసీపీ సర్వ నాశనం చేసిందని విమర్శించారు. విభజిత ఏపీ, ఉమ్మడి ఏపీలో ఇంత పెద్ద విక్టరీ ఎప్పుడూ రాలేదన్నారు.

కేంద్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఇవాళ మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. సింగరేణి కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించిందని ఆయన అన్నారు. సింగరేణికే గనులు అప్పగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారు కిషన్ రెడ్డి అని ఆయన మండిపడ్డారు. ప్రభుత్త్వ రంగ సంస్థలకే బొగ్గు గనుల కేటాయింపు జరగాలన్నారు. కేంద్ర నిర్ణయం సరికాదు.. రాష్ట్రంలో ఉన్న గనులు… ప్రభుత్వ సంస్థలకు కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని, సీఎం త్వరలో ప్రధాని ని కలుస్తారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర సమస్యలు..సహకారం.. సింగరేణి అంశాలు ప్రధాని దృష్టికి తీసుకెళ్తారని, వేలంలో పాల్గొనాలో వద్దో నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.

ప్రభుత్వ భవనాల్లో ఉండాల్సిన కర్మ జగన్‌కు లేదు..

త్వరలోనే టీడీపీ శ్రేణులు దాడులు చేసిన వారిని వైసీపీ అధినేత జగన్ పరామర్శిస్తారని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. జగన్‌తో భేటీ అనంతరం మీడియాతో కొడాలి నాని మాట్లాడారు. నియోజకవర్గాల్లో వారం రోజుల పాటు నేతల పర్యటనలు ఉంటాయన్నారు. ఓటమి ఒక మిరాకిల్ మాదిరి ఉందని.. ఇంత మంచి చేసినా ఓటమి పాలవడం నమ్మశక్యంగా లేదన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని.. 1500 మహిళలకు ఫించన్, 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు అంశాల గురించి చంద్రబాబు మాట్లాడటం లేదని ఆయన విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఈ నెల ఒకటో తేదీన అమలు చేస్తారా లేదా ఇప్పటికే క్లారిటీ లేదన్నారు. పోలవరం, అమరావతి పేరుతో హామీలు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

బెంగాల్ రైలు ప్రమాద ఘటన.. రీల్స్ కోసం భారీగా జనాలు

సోమవారం పశ్చిమ బెంగాల్ లోని న్యూజల్ పైగురి స్టేషన్ కు సమీపంలో కాంచన్ జంగా ఎక్స్ ప్రెస్ ను వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో.. 15 మంది మృతి చెందగా, 60 మందికి గాయాలయ్యాయి. అయితే.. ఈ ప్రమాదం జరిగిన స్థలానికి జనాలు చూసేందుకు భారీగా వెళ్తున్నారు. అయితే.. వారు అక్కడ సెల్ఫీలు దిగుతూ, రీల్స్ చేస్తున్న క్రమంలో షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది. ట్రాక్ పై చాలా మృతదేహాలు పడి ఉన్నాయని వారు చెబుతున్నారు. ప్రమాదస్థలికి జనాలు ఎక్కువ సంఖ్యలో వస్తుండటంతో స్థానికులు నీరు, స్నాక్స్ అమ్ముతున్నారు. 15 మంది ప్రాణాలను బలిగొన్న ఈ ప్రదేశం ఇప్పుడు ప్రజలకు పర్యాటక కేంద్రంగా మారింది. భయంకరమైన రైలు ప్రమాదంలో చాలా మంది తమ ప్రియమైన వారిని శాశ్వతంగా కోల్పోయారు. ఈ ప్రదేశం ఇప్పుడు కొంతమందికి వినోదం, ఉత్సుకత కలిగించే అంశంగా మారింది. ప్రమాద ఘటన చూసేందుకు జనాలు చాలా కిలోమీటర్లు ప్రయాణించి సెల్ఫీలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా.. వందలాది మంది రీల్స్ చేస్తున్నారు. ఘటనాస్థలికి పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. స్థానికులు సైతం ఇక్కడ చిరు వ్యాపారులు చేసుకునే పరిస్థితి నెలకొంది. సమీప గ్రామాల నుంచే కాకుండా.. సూదూర ప్రాంతాలైన మతిగర, ఫుల్ బరి, బాగ్ డోగ్రా నుంచి బైక్ లు, కార్లలో పెద్ద ఎత్తున వస్తున్నారు.