NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

కేసీఆర్ ను గద్దె దించండి.. రేవంత్‌ కు నామినేషన్ డబ్బులు ఇచ్చిన కొనాపూర్ వాసులు

తెలంగాణ ఎన్నికల అసలు ఘట్టం మొదలైంది. ఈరోజు నామినేషన్‌కు చివరి తేదీ. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణలో ప్రధాన పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యే ఉంది. బీఆర్‌ఎస్‌కు ముఖ్యమంత్రే స్టార్ క్యాంపెయినర్. కాంగ్రెస్‌కు చెందిన రేవంత్ సుడిగాలి పర్యటనలో దూసుకుపోతున్నారు. రేవంత్ తన ప్రసంగాల్లో బీఆర్‌ఎస్‌పై పదునైన డైలాగులతో పార్టీని ఉర్రూతలూగిస్తున్నారు. మంచి స్పందన రావడంతో పార్టీ మరింత ఉత్సాహంగా కనిపిస్తోంది. కాగా.. కొనాపూర్ లో రేవంత్ రెడ్డి పర్యటించారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కేసీఆర్ పూర్వీకుల గ్రామం కొనాపూర్ కు వెళ్లారు. అక్కడ రేవంత్ రెడ్డిని చూసిన కొనాపూర్ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. పదేళ్లుగా గుర్తురాని కొనాపూర్ ఇవాళ గుర్తొచ్చిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను గద్దె దించేందుకే రేవంత్ రెడ్డి కి గ్రామస్తులమంతా కలిసి నామినేషన్ డబ్బులు అందజేశారు. కాంగ్రెస్ గెలవాలని కోరారు. గ్రామస్తులకు రేవంత్ హామీ ఇచ్చారు. కేసీఆర్ ను తప్పకుండా గద్దె దించుతామన్నారు.

తెలంగాణ దీపావళి సెలవు తేదీలో మార్పు.. ఎన్నిరోజులంటే..

దీపావళి పర్వదినానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ముందుగా దీపావళి సెలవు తేదీని మార్చారు. ఈ మేరకు సెలవుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రకటించిన మేరకు నవంబర్ 12వ తేదీని దీపావళి సెలవు దినంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ తేదీని మారుస్తూ విడుదల చేశారు. తాజా ప్రకటన ప్రకారం.. దీపావళి సెలవులను నవంబర్ 13కి మార్చుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మారిన సెలవులను పాఠశాలలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, సంస్థలు, ప్రైవేట్ సంస్థలకు కూడా అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

కోడిగుడ్డు మీద ఈకలు పీకాలని చూస్తున్నారు.. మంత్రి అప్పలరాజు ఫైర్‌

నాదెండ్ల మనోహర్, ధూళిపాళ నరేంద్ర కోడిగుడ్డు మీద ఈకలు పీకాలని చూస్తున్నారు అంటూ ఫైర్‌ అయ్యారు మంత్రి సిదిరి అప్పలరాజు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమూల్ గ్రాండ్ సక్సెస్.. జగనన్న పాలవెల్లువ కంటే ముందు పాల సేకరణ ధరలు ఏడాదికో, రెండేళ్ళకో పెంచేవారు.. అమూల్ సంస్థ గత మూడేళ్లలో 8 సార్లు పాల సేకరణ ధరలు పెంచిందన్నారు.. దీని వల్ల ప్రైవేటు డైరీలకు ధర పెంచక తప్పటం లేదు.. అందుకే పాలవెల్లువ పై నాదెండ్ల, ధూళిపాళ ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 3 లక్షల 73 మహిళా రైతుల నుంచి పాల సేకరణ జరుగుతోంది.. పాడి రైతులకు 4 వేల 900 కోట్లకు పైగా అదనపు లబ్ది చేకూరిందని వివరించారు.

పొంగులేటి నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు.. మూడు బ్యాగులు, ఒక బ్రీఫ్‌కేస్‌ స్వాధీనం

జూబ్లీహిల్స్ లోని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు నేటితో ముగిసాయి. మూడు బ్యాగులు, ఒక బ్రీఫ్‌కేస్‌, ప్రింటర్, కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక రూమ్‌ లాక్‌ చేసి ఉండడంతో కీస్ తీయకుని రావాలని పొంగులేటి భార్యకు ఐటీ అధికారులు సూచించారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు ఎదురుచూసి కీస్ తీసుకురాలేకపోవడంతో డోర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్లి సోదాలు జరిపారు.

పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో రెండో రోజుల వరకు ఐటీ అధికారులు సోదాలు కొనసాగాయి. అయితే దీనిపై ఐటీ దాడులపై పొంగులేటి స్పందించారు. నాలుగు వందల మంది ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇంకా పది చోట్ల ఐటీ దాడులు సాగుతూనే ఉన్నాయి.. సెంట్రల్, స్టేట్ ఎన్నికల కమిషన్ లకు ఫిర్యాదు చేశాను అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎన్నికల కమిషన్ ప్రభుత్వాలకు సపోర్టు ఉందా అని పిస్తోంది.. ఎన్నికల కమిషన్ బ్యాలెన్స్ తప్పుతున్నారా లేక అధికారం ఒత్తిడికి లోంగుతున్న రా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల మీదనే దాడులు జరుగుతున్నాయని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీజేపీ- బీఆర్ఎ

అంబలి, అన్నదానం చేస్తే.. చేసిన పాపాలు పోతాయా? బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

అంబలి, అన్నదానం చేస్తే చేసిన పాపాలు పోతాయా? అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులారా.. ప్రభుత్వాలనే మార్చేసిన చరిత్ర మీరన్నారు. కేసీఆర్ అరాచక పాలన ఎట్లుందో, మీరు పడ్డ గోసను గుర్తు చేసుకోండని తెలిపారు. కేసీఆర్ పాలనను అంతం చేయండి. మీకోసం కొట్లాడిన బీజేపీని గెలిపించండి. పొరపాటున మళ్లీ కేసీఆర్ అధికారలోకి వస్తే 3 నెలల కోసారి జీతాలొస్తయ్. బదిలీలు, ప్రమోషన్లు రావని గుర్తుంచుకొండి’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. తెలంగాణలో తొలి ఓటరున్న నియోజకవర్గం సిర్పూర్ కాగజ్ నగర్… బీజేపీ తొలి విజయం కూడా ఇక్కడే అని ధీమా వ్యక్తం చేశారు. కోనప్పా…. ఇక చాలప్ప…ఇగ ఆంధ్రాకు వెళ్లిపో అప్పా…’’ అంటూ ఎద్దేవా చేశారు. సిర్పూర్ కాగజ్ నగర్ బీజేపీ అభ్యర్ధిగా డాక్టర్ పాల్వాయి హరీష్ రావు ఈరోజు నామినేషన్ వేసిన సందర్భంగా సిర్పూర్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు వేలాది మంది తరలివచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ సమక్షంలో పలువురు నాయకులు బీజేపీలో చేరారు.

తెలంగాణలో ముగిసిన నామినేషన్ల పర్వం

తెలంగాణ శాసన సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 13న నామినేషన్ల స్కృటీని, 15న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు. అయితే.. ఈనెల 30న పోలింగ్, వచ్చే నెల 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. నిన్న ఒక్క రోజే 1133 మంది నామినేషన్లు దాఖలు అయ్యాయి. నిన్నటి వరకు మొత్తం నామినేషన్లు 2028 వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలు చేశారు అభ్యర్థులు. నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఆర్వో కార్యాలయాల పరిసరాల్లో కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు చేశారు. 3 గంటలలోపు ఆర్వో కార్యాలయంలో ఉన్న వారికి నామినేషన్ దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చారు.

“హిందువులు సహనంతో ఉంటారు, వారి నుంచి నేర్చుకుంటున్నాం”.. జావేద్ అక్తర్ ప్రశంసలు..

ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జావేద్ అక్తర్ హిందువులపై ప్రశంసలు కురిపించారు. హిందూ సమాజం సహనంతో ఉందని, హిందూ సంస్కృతి, సంప్రదాయాల కారణంగా భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ఉందని ఆయన గురువారం అన్నారు. సమాజంలో అసహనం పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

హిందువులు ఉదారంగా, విశాల హృదయంతో ఉంటారని అన్నారు. కొంతమంది ఎప్పుడూ అసహనంతో ఉంటారని, హిందువులు అలా ఉండరని అది వారి గొప్ప గుణం అని అన్నారు. ‘వారికి గొప్ప గుణం, ఉదార, విశాల హృదయం ఉందని వాటిని కోల్పోకండి, లేకపోతే మీరు ఇతరులలా అవుతారు’ అని చెప్పారు.

ఎకో పార్కులో పులివెందుల నియోజకవర్గం అభివృద్ధి పనులపై సీఎం జగన్ సమీక్ష

సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా వైఎస్సార్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా.. ఈరోజు ఉదయం ఇడుపులపాయ ఆర్కే వ్యాలీలో రూ.1.75 కోట్లతో నిర్మించిన ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్, రూ.2.75 కోట్లతో నిర్మించిన జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, డీఐజీ శెంథిల్ కుమార్, ఎస్పీ శిద్దార్థ్ కౌశల్, జమ్మలమడుగు ఎమ్యెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

“ఇది చేప కాదు, బంగారం”.. ఒకే రాత్రిలో కోటీశ్వరుడైన పాక్ మత్స్యకారుడు..

పాకిస్తాన్‌కి చెందిన ఓ మత్స్యకారుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అతని వలలో చిక్కిన ఓ చేప అతని తలరాతనే మార్చేసింది. కరాచీ నగరంలోని నిరుపేద మత్స్యకారుడైన హాజీ బలోచ్ అత్యంత అరుదైన చేప చిక్కింది. ఇది కోట్లలో రేటు పలకడంతో అతని దశ తిరిగింది.

వివరాల్లోకి వెళితే.. పాక్ లోని ఇబ్రహీం హైదరీ అనే మత్స్యకార గ్రామంలో నివసించే హాజీ బలోచ్, అతని వర్కర్స్ సోమవారం అరేబియా సముద్రంలో వేటకు వెళ్లారు. వీరికి అత్యంత అరుదైన గోల్డెన్ ఫిష్ స్థానికంగా ‘‘సోవా’’గా పిలిచే చేపలను పట్టుకున్నారు. శుక్రవారం కరాచీ నౌకాశ్రయంలో వీటిని వేలం వేయగా వారికి పాక్ కరెన్సీలో దాదాపుగా 70 మిలియన్ రూపాయలకు అమ్ముడయ్యాయని పాకిస్తాన్ ఫిషర్ మెన్ ఫోక్ ఫోరమ్‌కి చెందిన ముబారక్ ఖాన్ వెల్లడించారు.

వికాస్‌ రావును వరించిన వేములవాడ బీజేపీ టికెట్‌

పెద్ద ట్విస్ట్‌తో గతంలో తుల ఉమకు ఇచ్చిన వేములవాడ బీజేపీ టిక్కెట్‌ను ఇప్పుడు బీజేపీ సీనియర్ నాయకుడు సిహెచ్ విద్యాసాగర్ రావు కుమారుడు సిహెచ్ వికాస్‌రావుకు కేటాయించి బి-ఫారం కూడా జారీ చేసింది బీజేపీ అధిష్టానం. మొదట్లో వేములవాడ టికెట్ అంశాన్ని పెండింగ్‌లో ఉంచిన బీజేపీ.. ఆ తర్వాత నాలుగో జాబితాలో తుల ఉమకు ప్రకటించింది. గురు, శుక్రవారాల్లో ఇప్పటికే మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన ఉమకు పార్టీ టిక్కెట్టు ప్రకటించినా బి-ఫారం ఇవ్వలేదు. ఆశ్చర్యకరమైన పరిణామంలో వేములవాడ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడమే కాకుండా నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన శుక్రవారం వికాస్‌రావుకు బి-ఫారం కూడా జారీ చేశారు బీజేపీ పెద్దలు.

ఎప్పుడూ మమ్మల్ని తలుచుకోనిదే కేసీఆర్ నిద్రపోడు

తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విజయవాడకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కోదాడకు బయల్దేరి వెళ్లారు. ఆయనతో పాటు ఏపీ కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు.. తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఉన్నారు. డీకే శివకుమార్ కోదాడ, హుజుర్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. మూడు అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం చేస్తానని తెలిపారు. తెలంగాణ మొత్తం మార్పుకోసం చూస్తోందని.. సోనియాకు కృతజ్ఞత చెప్పాలని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. ఇక ఈ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ఫాంహౌస్‌లో రెస్ట్‌ తీసుకోవాల్సిందేనని డీకే శివకుమార్‌ విమర్శించారు.