NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

నిరుద్యోగులకు అలర్ట్‌.. టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్‌

తెలంగాణలోని వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే.. తాజాగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వ్యవసాయ, సహకార శాఖలో 148 అగ్రికల్చర్ ఆఫీసర్ల పోస్టులు, 128 ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్, కమిషనర్ నియంత్రణలో నేరుగా భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌లను విడుదల చేసింది. వ్యవసాయ అధికారుల 148 పోస్టులలో, TSPSC మల్టీ జోన్-I (MZ-I)లో 100 ఖాళీలను మరియు మల్టీ జోన్-II (MZ-II)లో మిగిలిన 48 పోస్టులను భర్తీ చేస్తుంది. అగ్రికల్చర్ ఆఫీసర్ల పోస్టుల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ జనవరి 10 నుండి ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ జనవరి 30 సాయంత్రం 5 గంటల వరకు అని TSPSC నోటిఫికేషన్‌లో తెలిపింది. ఫిజికల్ డైరెక్టర్ల 128 పోస్టుల్లో 37 ఖాళీలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ కింద, మిగిలిన 91 ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కమీషనర్‌ పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఫిజికల్ డైరెక్టర్ల అర్హత వయో పరిమితి 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల వరకు, TSPSC నోటిఫికేషన్ తెలిపింది. ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ జనవరి 6, 2023 నుండి ప్రారంభమవుతుంది మరియు ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ జనవరి 27, 2023 సాయంత్రం 5 గంటల వరకు. అర్హత గల అభ్యర్థులు TSPSC వెబ్‌సైట్ (https://www.tspsc.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

చంద్రబాబు అధికార దాహం వల్లే ప్రమాదం : మంత్రి కాకాణి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న నెల్లూరు జిల్లాలోని కందుకూరులో నిర్వహించిన ‘ఇదేం కర్మ రాష్ట్రానికి’ అనే కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభ సంతాప సభగా మారింది. పామూరు రోడ్‌లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో.. సభలో గందరగోళం, తొక్కిసలాట చోటు చేసుకోవడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. అంతేకాకుండా పలువురు తీవ్రంగా గాయపడటంతో హుటాహుటివారిని ఆసుపత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ మరో ఆరుగురు మృతి చెందారు. అయితే తాజాగా ఈ ఘటనపై మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు అధికార దాహం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. లేనిది ఉన్నట్లు చూపించే ప్రయత్నం వల్లే దుర్ఘటన చోటు చేసుకుందని ఆయన అన్నారు. ఎక్కువ మందిని చూపించడానికి కందుకూరులో సభ పెట్టారని ఆయన విమర్శించారు. ఎన్ని పొరపాట్లు చేయకూడదో చంద్రబాబు అన్ని చేశారని, 8 మందిని చంద్రబాబు పొట్టనపెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు. సభకు వస్తే కూలీ ఇస్తారని వచ్చినవాళ్లు చనిపోయారని, డ్రోన్ షాట్ల కోసం బలవంతంగా తరలించిన జనంతో చంద్రబాబు సభ పెట్టారన్నారు. రెండు పక్కల ఫ్లెక్సీలు పెట్టి మధ్యలోకి జనాన్ని తోలారని, ఇవి చంద్రబాబు చేసిన హత్యలే చంద్రబాబుపై కేసు పెట్టాలని ఆయన అన్నారు. రాష్ట్రానికి చంద్రబాబే ఖర్మ అన్న కాకాణి.. చంద్రబాబు రాష్ట్రంలో పుట్టడమే ఖర్మ అంటూ విమర్శలు గుప్పించారు. జగన్ సభలకు అంత మంది వచ్చినా ఎక్కడా ఒక అపశృతి జరగలేదని, ఇంకా ఒకసారి అవకాశం ఇవ్వాలని అంటేనే చంద్రబాబు ఎంత దిగజారిపోయారో అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. 8మంది కుటుంబాలు వీధిన పడ్డాయని, చంద్రబాబు ఏం చేశారని జనం వస్తారు?.. గతంలో పుష్కరాల సమయంలోనూ 29మంది మృతికి కారణమయ్యారు అని మంత్రి కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కందుకూరు ఘటనలో.. అధికారంలోకి రావాలన్న తన ఆరాటం అందులో కనిపిస్తుంది : మంత్రి పెద్దిరెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలోని కందుకూరులో నిర్వహించిన ‘ఇదేం కర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో తొక్కిసలాట చోటు చేసుకొని 8 మంది మృతి చెందారు. అయితే.. ఈ ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ… ఘటనపై విచారం వ్యక్తం చేశారు. 8 మంది మృతి చెందడం, అనేక మంది బాధ పడడం బాధాకరమన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఒకపక్కన సొంత పార్టీ కార్యకర్తలు చనిపోతే, అందురు ఇక్కడే ఉడండి సభ కొనసాగిస్తా అని చంద్రబాబు అన్నారని, అధికారంలోకి రావాలన్న తన ఆరాటం అందులో కనిపిస్తుందని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. మంచి చెడ్డలు లేకుండా, అయ్యోపాపం మన కోసం వచ్చి చనిపోయారు అని లేకుండా అలా సమావేశం కొనసాగించడం బాధాకరమన్న మంత్రి పెద్దిరెడ్డి.. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇరుకైన సందుల్లో, చిన్న చిన్న జంక్షన్లలో ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుందని, అలాంటి చోట్ల ఇలాంటి సమావేశాలు అనుమతి ఇవ్వకూడదు అని సీఎస్, డీజీపీ, కలెక్టర్లు కోరుతున్నామన్నారు. ఇలాంటి ఘటనలు జరిగే ఆస్కారం లేని విశాలమైన ప్రాంతాల్లో మాత్రమే అనుమతులు మంజూరు చేయాలని, ఈ ఘటనలో 8 మంది చనిపోవడం దురదృష్టం, ప్రభుత్వం తరపున చింతిస్తున్నామన్నారు. నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని పేపర్లో చూసాను అందులో ఆశ్చర్యం లేదని, రోజు 10 కిలోమీటర్లు నడవడం ఆయన ఆరోగ్యానికి మంచిదన్నారు. రాజకీయాల్లో ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు అనేది ప్రధానమన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి, ఇన్నేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అయన తండ్రి ప్రజలకు ఏం చేశారన్నారు. గతంలో 30 ఏళ్లు పుంగనూరు ఒకే కుటుంబం చేతిలో ఉంది, వారు అభివృద్ధి చేసుంటే ఈ రోజు ఇలా కష్టపడే పరిస్థితి ఉండేది కాదని, ఇప్పుడు మనం పెద్ద స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. వారు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుంటే ఇప్పుడు మనకు చేయడానికి ఏమి ఉండేది కాదన్నారు. ఇదే విధంగా చంద్రబాబు, లోకేష్ రాష్ట్రం గురించి కానీ, రాష్ట్ర ప్రజల గురించి కానీ పట్టించుకోవట్లేదు. కేవలం అధికారం లోకి రావడం కోసమే చూస్తున్నారు. లోకేష్ పాదయాత్రకు, జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. లోకేష్ పాదయాత్ర గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జగన్ మోహన్ రెడ్డి గారికి నమ్మకంగా ఉన్నమానే మా పై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తుంది.’ అని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.

2047 నాటికి 40 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్

రిలయన్స్ వ్యాపారం మర్రిచెట్టులా విస్తరిస్తోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ అన్నారు. రిలయన్స్ ఫ్యామిలీ డే ఫంక్షన్ లో ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో భారత్ మరింతగా అభివృద్ధి చెందుతుందని..దాంట్లో రిలయన్స్ పాత్ర ఉంటుందని వెల్లడించారు. దశాబ్ధాలు గడిచిపోయాయి.. రిలయన్స్ మర్రిచెట్టులా దాని కొమ్మలు విశాలంగా విస్తరిస్తున్నాయని.. భారతీయుల జీవితాలను సుసంపన్నం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. 40 ఏళ్ల క్రితం ప్రారంభం అయిన రిలయన్స్ ఓ వటవృక్షంలా మారిందని, మా నాన్న స్థాపించిన మిషన్ గురించి ఆలోచించినప్పుడు గొప్పగా, ఎంతో పవిత్రమైనదిగా నమ్ముతానని అన్నారు. ప్రపంచస్థాయి వ్యాపారాలు నిర్మించడం ద్వారా భారతదేశాన్ని సుసంపన్నంగా చేయడమే రిలయన్స్ లక్ష్యం అని అని అన్నారు. ప్రపంచం మొత్తం 21 శతాబ్ధాన్ని ‘భారతదేశ’ శతాబ్ధంగా చూస్తోందని.. మన ప్రధాని నరేంద్రమోదీ ఈ కాలాన్ని ‘భారతదేశ అమృత కాలం’గా అభివర్ణిస్తున్నారని తెలిపారు. రాబోయే 25 ఏళ్లు భారతదేశ 5 వేల ఏళ్ల చరిత్రలో అత్యంత పరివర్తన చెందుతుందని.. 2047 నాటికి భారత్ 40 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యువత, పరిణితి చెందిన ప్రజాస్వామ్యం, సాంకేతిక శక్తి భారతదేశాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాయని అన్నారు.

కోలుకుంటున్న ప్రధాని మోదీ తల్లి.. ఒకటి, రెండు రోజుల్లో డిశ్చార్జ్

ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మోదీ(100) ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. నిన్న అనారోగ్యంతో అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ లో చేరారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న ఆమె ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని గుజరాత్ ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ‘‘హీరాబా ఆరోగ్యం ఉన్నారని.. ఆమె ఆరోగ్యం వేగంగా మెరుగుపుడుతోందని.. ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని.. నిన్న రాత్రి నుంచి ఓరల్ డైట్ ప్రారంభమైందని’’ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

జూన్ నెలలో 100వ పడిలోకి అడుగుపెట్టిన హీరాబెన్.. శ్వాసకోశ సమస్యలతో నిన్న ఆస్పత్రిలో చేరారు. విషయం తెలిసిన వెంటనే మోదీ ఢిల్లీ నుంచి సాయంత్రం 4 గంటలకు విమానంలో అహ్మదాబాద్ కు వెళ్లారు. ప్రధాని వస్తుండటంతో ఆస్పత్రి వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఆస్పత్రికి వెళ్లారు. ప్రధాని గంట పాటు తల్లిని పరామర్శించి మళ్లీ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని తన తల్లి వద్దకు వెళ్లి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తల్లితో కలిసి ప్రధాని మోదీ టీ తాగుతున్న దృశ్యాలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పుతిన్‌ను అంతం చేయడానికి అమెరికా కుట్ర

ఉక్రెయిన్-రష్యా యుద్ధం పదో నెలకు చేరుకుంది. అయినా ఈ రెండు దేశాల మధ్య ఇప్పుడప్పుడే శాంతి నెలకొనే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ మరింతగా ఆయుధ సహాయం, ఆర్థిక సహాయాన్ని పొందేందుకు అమెరికాలో పర్యటించారు. అమెరికా నుంచి పెట్రియాడ్ క్షిపణి వ్యవస్థను ఉక్రెయిన్ కోరుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్ సంక్షోభానికి అమెరికానే కారణం అంటూ రష్యా ఆగ్రహం వ్యక్త చేస్తోంది. రష్యాను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే రష్యా మరోసారి అమెరికాపై సంచలన ఆరోపణలు చేసింది. ఉక్రెయిన్ యుద్దాన్ని ముగించడానికి పుతిన్ ను చంపేందుకు ప్లాన్ చేస్తోందని ఆరోపించింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ.. పుతిన్ ను నిర్మూలించడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధాలని ముగించాలని అమెరికా చూస్తుందని అన్నారు. రష్యాపై పశ్చిమ దేశాల విధానం అత్యంత ప్రమాదకరమైనదని ఆయన అన్నారు.