NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

నేడు వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సమీక్ష..
నేటి నుంచి ప్రభుత్వంలోని అన్ని శాఖలపై ఆంధ్రప్రదేశ్ నూతన సీఎంగా చంద్రబాబు నాయుడు సమీక్షలు చేయనున్నారు. అందులో భాగంగానే.. ఇవాళ వైద్య ఆరోగ్య శాఖపై తొలి సమీక్ష చేయనున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో వెంటనే చేపట్టాల్సిన చర్యలపై సీఎం దృష్టి సారించనున్నారు. అలాగే, పోలవరం ప్రాజెక్ట్ విషయంలో గత ఐదేళ్లలో జరిగిన పనులపై కూడా శ్వేత పత్రం విడుదల చేసేందుకు ఏపీ సర్కార్ ప్లాన్ చేస్తుంది. పోలీవరం పరిస్థితిపై శ్వేతపత్రం సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు.
ఇక, పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఐదేళ్లలో ఏం జరిగిందో ప్రజలకు చెబుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈఎన్సీ, ఉన్నతాధికారులతో అర్థరాత్రి వరకు మంత్రి నిమ్మల రామానాయుడు కసరత్తు చేశారు. గత ప్రభుత్వ విధానాల వల్ల జరిగిన నష్టం, ముందున్న సవాళ్లపై వైట్ పేపర్ విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే, 7 శాఖల్లో స్థితిగతులపై శ్వేత పత్రాలు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
రేపు (శనివారం) కొండగట్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని తన మొక్కులను తీర్చుకునేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే పవన్ రేపు కొండగట్టుకు రానున్నారు. కొండగట్టు అంజన్నను తమ ఇంటి ఇలవేల్పుగా జనసేన అధినేత భావిస్తూ ఉంటారు. గతంలో అంటే వారాహి యాత్రకి ముందు.. ఆ వాహనానికి తొలిపూజ కూడా కొండగట్టులోనే పవన్ కళ్యాణ్ నిర్వహించారు. అలాగే, ఎన్డీయే కూటమి పొత్తులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించింది కూడా కొండగట్టులోనే కావడం గమనార్హం. ఇవాళ మధ్యాహ్నం పవన్ సెక్యూరిటీ అధికారులు కొండగట్టుకు వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్ మార్గం ద్వారా పవన్ కొండగట్టుకు చేరుకుంటారు. జేఎన్టీయూలో హెలీప్యాడ్ అందుబాటులో లేకపోవడంతో.. పవన్ సెక్యూరిటీ స్పెషల్ అడ్వైజర్ కల్నల్ అర్జున్ రూట్ మ్యాప్, పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. తెలంగాణ జనసేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ కు భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రజల్లో వైసీపీకి ఆదరణ తగ్గలేదు.. వారికి అండగా ఉంటాం..!
నెల్లూరు జిల్లాలోని పొడలకూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. అనుభవమున్న.. చంద్రబాబుగా పరిపాలన చేస్తారని ప్రజలు ఎన్నుకున్నారు.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ నేతల ఆస్తులు ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అని ఆయన మండిపడ్డారు. వైసీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయి.. మూడు పార్టీలు కూటమిగా ఏర్పడితే వచ్చిన ఓట్లు 60 శాతం.. మా ప్రభుత్వ హాయంలో జరిగిన లోపాలను గుర్తించి సమీక్షించుకుంటామన్నారు. వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం.. నేతలతో కలిసి కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తామని కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. టీడీపీ చోటా నాయకుల ఉడత బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు అని మాజీమంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. ప్రజల్లో వైసీపీకి ఆదరణ తగ్గలేదు.. గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని.. సీబీఐ విచారణ వేస్తామని అంటున్నారు.. ఎవరి చేత విచారణ చేయించినా ఎలాంటి భయం లేదన్నారు. ఇక, జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం అనేది సమాజం.. ప్రతి పక్షం లేకుంటే ప్రభుత్వం నిర్వీర్యం అవుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చి ఓట్లను వేయించుకున్నారు.. ఇప్పుడు పింఛను తప్ప మరే పథకం గురించి మాట్లాడడం లేదు.. నాకు పదవి ఉన్నా.. లేకున్నా సర్వేపల్లి నియోజకవర్గ ఇంటి బిడ్డనే.. అధికారం ఉన్నపుడు ప్రజలకు న్యాయం చేసాం.. ఇప్పుడు ప్రజలకు అన్యాయం జరగనియ్యకుండా అడ్డుకుంటానని కాకాణి గోవర్థన్ రెడ్డి పేర్కొన్నారు.

చివరి దశకు టీపీసీసీ చీఫ్ కసరత్తు..
ఈరోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండనున్నారు. నేడు వరంగల్ పర్యటన ఉన్నా.. తన టూర్ ను వాయిదా వేసుకుని హస్తినలోనే ఉన్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్, కేబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో సమాలోచనలు జరిపారు. మరోవైపు.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి సహా.. డిప్యూట సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే అనే అంశంపై చర్చించారు. అటు.. ఇప్పటికే పార్టీ నేతలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన ఏఐసీసీ పెద్దలు పలువురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది. మరోవైపు మంత్రివర్గ విస్తరణపై కూడా కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. నామినేటెడ్ పోస్టులను త్వరగా భర్తీ చేసే యోచనలో ఉంది. దీంతో పదవులు ఆశిస్తున్న వారంతా ఢిల్లీలోనే పడిగాపులు కాస్తున్నారు. పార్లమెంట్ హాల్లో పార్టీ అధినేత సోనియా గాంధీని మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీ వేర్వేరుగా కలిసి తమ మనసులోని మాటను ఆమెకు తెలియజేశారు. ఇక.. హస్తినలోనే ఉన్న ముఖ్య నేతలు ఎవరెవరికి ఏఏ పదవులు ఇవ్వాలన్న దానిపై చర్చలు జరుపుతున్నారు. కేబినెట్ లో ఒకేసారి ఆరు మంత్రి పదవులు భర్తీ చేయాలా.. లేదా కొన్నింటిని పెండింగ్ లో ఉంచాలా అన్న దానిపై మంతనాలు సాగుతున్నాయి. ఇక.. మంత్రి మండలి కూర్పు, కాంగ్రెస్ లో చేరికల అంశం భేటీలో చర్చకు వచ్చినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించామని తెలిపారు. లోక్ సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండాలని, సీడబ్ల్యూసీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారని అన్నారు. అటు.. సామాజిక సమీకరణాలతో పాటు సీనియార్టీ, సమగ్రవంతమైన నాయకుడికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే.. ఇవాళ కొత్త పీసీసీ పేరు ఖరారు అవుతుందా లేదా ఇంకా టైమ్ పడుతుందా అనేది సస్పెన్స్ గా మారింది.

నీట్ రగడ.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముట్టడి
యూజీసీ నెట్ పేపర్ లీక్ సహా నీట్‌లో అవకతవకలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. ఈ పరీక్షలను నిర్వహించే ఎన్టీఏ (NTA) రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో.. హైదరాబాద్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటిని యువజన విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, అవకతవకల పై ఎన్టీఏని రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ తిరుకు నిరసనగా నేతలు ముట్టడించారు. నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలంటూ.. మళ్లీ తిరిగి ఎగ్జామ్ పెట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నీట్ సమస్య పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరగా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు. అందులో భాగంగా.. వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. మరోవైపు.. పార్లమెంట్‌ సమావేశాలు ఐదోరోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే.. రెండు సభల్లో నీట్‌పై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో గందరగోళం నెలకొంది.

నీట్‌పై కాంగ్రెస్ వాయిదా తీర్మానం.. లోక్‌సభలో గందరగోళం..
లోక్‌సభలో గందరగోళం ఏర్పడింది. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై శుక్రవారం చర్చ జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ లోక్‌సభలో, సుధాన్షు త్రివేది రాజ్యసభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం ‘నీట్’ అవకతవకలపై చర్చ జరగాలని పట్టుబట్టాయి. కాంగ్రెస్ పార్టీ నీట్ వ్యవహారంపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చాయి. కాంగ్రెస్ నేత మానిక్క ఠాగూర్ ఈ తీర్మానాన్ని ఇచ్చారు. పరీక్షా నిర్వహణలో ఎన్టీఏ విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. నీట్ పేపర్ లీకుపై సమగ్ర చర్చ జరిగిన తర్వాతే రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. విద్యార్థులకు సభ నుంచి ఓ సందేశం ఇవ్వాల్సి ఉందని, అధికార-ప్రతిపక్షాలు విద్యార్థులకు భరసా ఇవ్వాలని ఆయన అన్నారు. అయితే, రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానం తర్వాత ఈ వ్యవహారాన్ని చర్చిద్ధామని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. దీనికి ప్రతిపక్షాలు అంగీకరించలేదు. తక్షణమే చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టడంతో సభలో గందరగోళం ఏర్పడింది. మధ్యాహ్నం 12 గంటలకు సభను స్పీకర్ సభను వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలో నీట్ అంశాన్ని చర్చించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లతికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే అధికార ఎన్డీయే రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంతో పాటు ఎమర్జెన్సీపై చర్చించాలని అనుకుంటోంది.

జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కి బెయిల్..
ల్యాండ్ స్కామ్ కేసులో అరెస్టై జైలులో ఉన్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్‌కి బెయిల్ లభించింది. ల్యాండ్ స్కామ్ కేసులో మనీలాండరింగ్‌కి పాల్పడినట్లు ఆరోపిస్తూ ఈడీ సోరెన్‌ని అరెస్ట్ చేసింది. ఈ కేసులోనే ఈ రోజు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. భూ కుంభకోణం కేసులో జనవరి నెలలో ఈడీ సోరెన్‌ని అరెస్ట్ చేసింది. అక్రమ లావాదేవీలు, నకిలీ పత్రాల ద్వారా రికార్డులను తారుమారు చేసి, కోట్ల రూపాయల విలువైన భూమిని సంపాదించడానికి కుట్ర పన్నాడనే ఆరోపణలు ఉన్నాయి. జనవరి 31న సోరెన్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. రాంచీలో 8.86 ఎకరాల భూమిని అక్రమంగా సంపాదించారని సోరెన్‌పై అభియోగాలు ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సోరెన్, ఐఏఎస్ అధికారి, రాంచీ మాజీ డిప్యూటీ కమిషనర్ ఛవీ రంజన్, భాను ప్రతాప్ ప్రసాద్ తదితరులతో సహా 25 మందికి పైగా వ్యక్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.. తనపై వచ్చిన ఆరోపణల్ని సోరెన్ ఖండించారు. ప్రతీకారంతోనే బీజేపీ తమనపై దాడులు చేయిస్తుందని ఆరోపించారు.

బార్బడోస్లో అడుగుపెట్టిన టీమిండియా ఆటగాళ్లు.. (వీడియో)
శనివారం దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్స్‌ కోసం టీమిండియా బార్బడోస్‌లో అడుగుపెట్టింది. (ANI) X ఖాతాలో అప్‌లోడ్ చేసిన వీడియోలో.. భారత జట్టులోని సభ్యులు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ వంటి పలువురు విమానాశ్రయం నుండి వారి బస్‌ ఎక్కేందుకు వెళ్తుండటం చూడొచ్చు. జట్టు సభ్యులతో పాటు.. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ కూడా విమానాశ్రయం నుండి బయటకు వస్తున్నట్లు వీడియోలో కనిపించారు. రేపు.. ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్, కెన్సింగ్టన్ ఓవల్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. శనివారం జరిగే ఫైనల్ పోరులో ఇరు జట్లు టైటిల్ సాధించాలనే కసితో ఉన్నాయి. పదేళ్ల తర్వాత ఫైనల్‌ చేరిన భారత్‌ రెండో కప్పు గెలవాలని, చరిత్ర తిరగరాయాలనే కసితో ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా మొట్ట మొదటి ఐసీసీ వరల్డ్‌ కప్‌ గెలిచి రికార్డ్ క్రియేట్ చేయడానికి ఎదురుచూస్తోంది. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు ఒక్క మ్యాచ్ ఓడకుండానే ఫైనల్ వరకు చేరాయి.

కల్కిలో నటించిన మృణాల్.. తెగ మెచ్చుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సంచలన చిత్రం ‘కల్కి2898ఏడి’. దీనిని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినిదత్ దాదాపు రూ.600కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. బిగ్ బి అమితాబ్, లోకనాయకుడు కమల్ హాసన్, శోభన, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, మృణాల్ ఠాకూర్ చిన్న పాత్రల్లో కనిపించారు. అయితే ఈ మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8500థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టిస్తోంది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఇందులో నటించిన నటీనటుల రెమ్యునరేషన్లకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో నటించినందుకు మృణాల్ రెమ్యునరేషన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని సమాచారం. దానికి కారణం ఈ అమ్మడుకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బ్యానర్ కావడంతో కల్కిలో ఫ్రీగా చేసినట్లు తెలుస్తోంది. కాగా, మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఆమె అందరి గుండెల్లో తెలుగమ్మాయిగా చెదరని ముద్ర వేసుకుంది. సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయిందనే చెప్పాలి. దీని తర్వాత ఈ బ్యూటీకి వరుస సినిమా అవకాశాలు రావడంతో బిజీ అయిపోయింది. అలాగే ఇటీవల నటించిన హాయ్ నాన్న కూడా సూపర్ హిట్ అవడంతో అమ్మడు క్రేజ్ భారీగా పెరిగింది. ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా చిత్రాలు చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది.