NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @1pm

Top Headlines @1pm

కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ..

ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం విచారించనుంది. తనపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ ఈ నెల 21న హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తొలుత ఈ కేసును విచారించిన జస్టిస్ శ్రవణ్ కుమార్ ధర్మాసనం.. ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్ ను అరెస్టు చేయవద్దని, అయితే విచారణ కొనసాగించవచ్చని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ, పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్‌కు నోటీసులు జారీ చేసింది. తమది రెగ్యులర్‌ బెంచ్ కానందున, తదుపరి విచారణ రెగ్యులర్ రోస్టర్‌తో కూడిన బెంచ్ ముందు జాబితా చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు జరిగిన విచారణపై ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న మున్సిపల్ శాఖ కార్యదర్శి దానకిషోర్ కూడా కౌంటర్ దాఖలు చేయనున్నారు.

మిస్టరీగా ఎస్.ఐ, కానిస్టేబుల్, ఆపరేటర్ మృతి కేసు.. కీలకంగా మారిన కాల్ డేటా..

కామారెడ్డి జిల్లాలో భిక్కనూరు ఎస్.ఐ. సాయికుమార్, కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతి కేసు మిస్టరీగా మారింది. వీరి ముగ్గురి కాల్ డేటా, వాట్స్ అప్ చాటింగ్ లు కీలకంగా మారాయి. వారం రోజులుగా ముగ్గురు గంటల తరబడి ఫోన్లు మాట్లాడుకుని, వాట్స్ అప్ చాటింగ్ చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. ముగ్గురు మృతి కేసు విచారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు అధికారులు. సీసీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. ముగ్గురు కలిసి ఒకే కారులో అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువుకు వచ్చినట్లు గుర్తించారు. దర్యాప్తులో పోస్ట్ మార్టం నివేదిక కీలకం కానుంది. పోస్ట్‌ మార్టం నివేదిక ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించనున్నారు.

విద్యుత్‌ ఛార్జీల పెంపుపై నేడు వైసీపీ నిరసనలు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలపై అదనపు భారాన్ని మోపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. విద్యుత్ ఛార్జీల పెంపుతో సామాన్యులపై భారాన్ని పెంచిన ప్రభుత్వ నిర్ణయం దారుణమని ఆ పార్టీ నేతలు విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపు కారణంగా ప్రజలపై రూ. 15,000 కోట్ల అదనపు భారం పడిందని వైసీపీ ఆరోపించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపుతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో నేతలు, కార్యకర్తలు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.

మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు..

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిదిగ్భ్రాంతిని వ్యక్టం చేశారు. తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. భారత ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో రాష్ట్ర సాధనకోసం ఎత్తుగడలో భాగంగా నాటి బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీ కుదుర్చుకున్న పొత్తు నేపథ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వారి క్యాబినెట్ సహచరుడిగా పనిచేసిన గతాన్ని, డాక్టర్ మన్మోహన్ సింగ్ తో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు.

సంధ్య థియేటర్ ఘటనలో నేడు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్

పుష్ప 2 బెనిఫిట్​ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్​ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంలో ఈ నెల 13న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్​ను అరెస్ట్​ చేశారు. అనంతరం పోలీస్​ స్టేషన్​కు తరలించి విచారించారు. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం అల్లు అర్జున్​ను చంచల్​గూడ జైలుకు తరలించారు. మరోవైపు తనపై చిక్కడపల్లి పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్​ హైకోర్టులో క్వాష్​ పిటిషన్​ వేయగా దీనిపై విచారించిన హైకోర్టు ఈ నెల 30 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పార్థివ దేహానికి నరేంద్ర మోడీ నివాళి..

భారత మాజీ ప్రధాని, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్‌ సింగ్‌ వయసురీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో నిన్న (గురువారం) రాత్రి తుదిశ్వాస విడిచారు. కాగా, ఈరోజు (డిసెంబర్ 27) ఆయన పార్థివదేహానికి ప్రధాని నరేంద్ర మోడీ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధాని మోడీతో పాటే కేంద్రమంత్రులు అమిత్‌ షా, జేపీ నడ్డా, ఇతరులు మన్మోహన్‌ సింగ్ నివాసానికి వచ్చారు.

జగన్ ఇప్పుడు చిలకపలుకులు పలుకుతున్నాడు

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ఫై మంత్రి అనగాని సత్యప్రసాద్‌ విమర్శలు గుప్పించారు. ఇవాళ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ.. తన పాలనలో రాష్ర్ట విద్యుత్ రంగంపై దాదాపు లక్షా 30 వేల కోట్ల రూపాయల భారాన్ని మోపిన జగన్ ఇప్పుడు చిలకపలుకులు పలుకుతున్నాడని ఆయన మండిపడ్డారు. యూనిట్ కు ఐదు రూపాయలకు దొరికే విద్యుత్ కు బదులు 8 నుండి 14 రూపాయల వరకు కొనుగోలు చేసి ప్రజలపైన జగన్ రెడ్డి మోయలేని భారాన్ని మోపాడని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. సోలార్, విండ్ ఎనర్జీ పీపీఎలను రద్దు చేసి రాష్ర్టానికి 10 వేల మెగా వాట్ల పునారుత్పాదక విద్యుత్తును జగన్ అందుబాటులో లేకుండా చేశాడన్నారు మంత్రి అనగాని.

ఎంత ఎదిగినా ఎలా ఒదిగి ఉండాలో చాటి చెప్పిన మహనీయుడు మన్మోహన్ సింగ్

ఎంత ఎదిగినా ఎలా ఒదిగి ఉండాలో తన చర్యల ద్వారా చాటి చెప్పిన మహనీయుడు మన్మోహన్ సింగ్ అని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల జగ్గారెడ్డి సంతాపం తెలియజేశారు. నిజాయితీకి, నిబద్ధతకు నిలువుటద్దం మన్మోహన్ సింగ్ అన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు తన మేధస్సును ధార పోసి దేశ ఆర్థిక అభ్యున్నతికి దారులు వేసిన దార్శనికుడు మన్మోహన్ సింగ్ అని తెలిపారు. ఎంత ఎదిగినా, ఎలా ఒదిగి ఉండాలో తన చర్యల ద్వారా చాటి చెప్పిన మహనీయుడన్నారు. దేశ రాజకీయాల్లో అజాత శత్రువుగా చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి అన్నారు. ఆయన మరణం దేశానికే తీరని లోటు, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా అన్నారు.

మన్మోహన్‌ సింగ్‌ పార్థివ దేహానికి సోనియా, రాహుల్‌, ప్రియాంక, ఖర్గే నివాళులు

భారత మాజీ ప్రధాన మంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్‌ సింగ్‌ భౌతికకాయం వద్ద కాంగ్రెస్‌ అగ్ర నేత సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, లోక్ సభలో విపక్ష నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే, వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు ఆమె ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా సైతం మన్మోహన్‌ సింగ్ నివాసానికి చేరుకుని ఘన నివాళులర్పించారు. ఇక, మీడియాతో రాబర్ట్‌ వాద్రా మాట్లాడుతూ.. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్ ఎల్లప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తూ.. దేశ అభివృద్ధికి కృషి చేసే వారని చెప్పుకొచ్చారు. ఆర్థిక రంగంలో అనేక విషయాలపై ఆయనకు చాలా పరిజ్ఞానం ఉందని పేర్కొన్నారు.

డెడ్ బాడీ పార్సిల్ కేసులో వీడిన మిస్టరీ..

పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలన రేపిన డెడ్‌ బాడీ పార్సిల్‌ కేసులో మిస్టరీ వీడింది. ఈ కేసు విచారణలో పోలీసులకు వరుస ట్విస్ట్ లు ఎదురయ్యాయి. నిందితులు తిరుమాని శ్రీధర్ వర్మ పాటు మూడో భార్య పెనుమత్స సుష్మ అలియాస్ విజయలక్ష్మీ, రెండో భార్య తిరుమాని రేవతి అరెస్టు చేశారు పోలీసులు. నిందితుడు తిరుమాని శ్రీధర్ వర్మ క్రిమినల్ మైండ్ తో వదిన సాగి తులసి ఆస్తి కొట్టేయడానికి ప్లాన్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ప్లాన్ అమలు చేయడానికి కూలి పనులు చేసుకునే పర్లయ్యను 17వ తేదీన కారులో తీసుకువెళ్లి సుష్మాతో కలసి హత్య చేశాడు శ్రీధర్ వర్మ. మృత దేహాన్ని తరలించడానికి సొంతంగా చెక్క పెట్టే తయారు చేసిన శ్రీధర్ వర్మ.. మృత దేహాన్ని కారులో తరలించే సమయంలో టైరు పంచర్ అయ్యింది. అయితే.. మృతదేహాన్ని ఒకరోజు కారులో మరొక రోజు ఇంట్లో ఉంచాడు నిందితుడు.

 

Show comments