NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines @1pm

Top Headlines @1pm

కవిత సీబీఐ లిక్కర్ కేసు.. నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ..

కవిత సీబీఐ లిక్కర్ కేసుపై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో విచారించనుంది. కవితపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ ను రౌస్ అవెన్యూ కోర్టు ఇప్పటికే పరిగణలోకి తీసుకుంది. ఇవాళ కవితను తీహార్ జైల్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరు పరచనున్నారు. కవితపై చార్జిషీటులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం పాలసీ రూపకల్పనలో ప్రధాన సూత్రధారి కవిత అని సీబీఐ పేర్కొంది. మద్యం వ్యాపారులకు అనుకూలంగా మద్యం పాలసీ తయారీ… అందుకు సౌత్ గ్రూప్ నుంచి పెద్ద ఎత్తున విరాళాలు అందాయి. రూ. 100 కోట్ల విరాళాలు సేకరించి విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడంలో కవిత సూత్రధారి అని సీబీఐ చెబుతోంది. కవిత కోసం బుచ్చిబాబు, అభిషేక్ బోయిన్ పల్లి, అరుణ్ పిళ్లై, అశోక్ కౌశిక్ పనిచేశారని సీబీఐ చెబుతోంది. మద్యం వ్యాపారంలో భాగస్వామ్యం కోసం కవితకు మాగుంట రాఘవ, వెనక శరత్‌రెడ్డి డబ్బులు సమకూర్చినట్లు సమాచారం.

కార్గిల్ విజయ్ దివస్ 25 ఏళ్లు పూర్తి.. అమరవీరులకు రాష్ట్రపతి నివాళులు..!

1999లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్ సాధించిన విజయానికి గుర్తుగా కార్గిల్ విజయ్ దివస్‌ను ప్రతి సంవత్సరం జూలై 26వ తేదీన జరుపుకుంటున్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఈ సందర్భంగా దేశ సాయుధ బలగాల ధైర్యసాహసాలు, అసామాన్య పరాక్రమాలకు పాల్పడి అమరులైన మన సైనికులకు ఘన నివాళులు అర్పించినట్లు ప్రెసిడెంట్ ముర్ము అన్నారు. ఇక, లడఖ్‌లోని ముఖ్యమైన ప్రాంతాలను దొంగచాటుగా ఆక్రమించిన పాకిస్తాన్ దళాలను వెనక్కి పంపించేందుకు భారత సైన్యం భీకర ప్రతిదాడిని ప్రారంభించింది. 1999లో కార్గిల్ శిఖరాలపై భారతమాతను కాపాడుతూ అత్యున్నత త్యాగం చేసిన ప్రతి సైనికుడికి నేను నివాళులర్పిస్తున్నాను.. వారి పవిత్ర స్మృతికి గౌరవంగా నమస్కరిస్తున్నాను.. వారి త్యాగం, పరాక్రమాన్ని దేశప్రజలందరూ స్ఫూర్తిగా తీసుకుంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.. జై హింద్ జై భరత్! అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పుకొచ్చింది.

రెవెన్యూ రికార్డులు కాల్చివేత ఘటన.. విచారణ ముమ్మరం

మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులు కాల్చివేత ఘటనకు సంబంధించి నాలుగో రోజునా విచారణ ముమ్మరంగా సాగింది. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆర్పి సిసోడియా మూడు జిల్లాల కలెక్టర్ల, ఆర్డీవోలు, తాసిల్దారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అనేకమంది వైకాపా బాధితులు సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని తమ బాధలు వెలగక్కారు. దీంతోపాటు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నర్ కేసు పురోగతిపై జిల్లా పోలీసులతో సమీక్ష నిర్వహించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులు కాల్చివేత ఘటనకు సంబంధించి ఇటు రెవిన్యూ శాఖ అధికారులు, పోలీసులు సమాంతరంగా నాలుగో రోజు కూడా విచారణ వేగవంతంగా చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా ఈ ఘటనపై ఆరా తీస్తోంది. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సీసోడియ ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో మూడు జిల్లాల కలెక్టర్లు రెవిన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ఆర్డీవోలు తాసిల్దార్లతో ఆయన సమావేశం నిర్వహించారు. చుక్కల భూములు, 22ఏ ల్యాండ్స్, రిజర్వాయర్లకు సంబంధించిన భూములు, అసైన్మెంట్ ల్యాండ్స్ భూముల రికార్డులన్నీ భద్రంగా ఉన్నాయా లేదా అనేదానిపై సిసోడియా ఆరా తీశారు. గడచిన మూడేళ్ల కాలంలో ల్యాండ్ కన్వర్షన్ చేసిన భూముల వివరాలు పై చర్చించారు. ప్రధానంగా తిరుపతి జిల్లాలో జరిగిన ల్యాండ్ కన్వర్షన్ భూముల పైన సిసోడియా సంబంధిత రెవెన్యూ అధికారులకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. ఏ ఏ భూములు రిజిస్ట్రేషన్లు జరిగాయి ల్యాండ్ కన్వర్షన్ ఏవిధంగా జరిగిందనే దానిపై జిల్లాల వారీగా ఆయన సమీక్ష నిర్వహించారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటన దృష్టిలో ఉంచుకుని ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా రెవెన్యూ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు…

ద్రాస్‌లో అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోడీ ఘన నివాళి…

25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ద్రాస్‌లో అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. కార్యక్రమం కోసం ప్రధాని మోడీ కార్గిల్ యుద్ధ స్మారకం వద్దకు చేరుకుని, 1999లో భారత్-పాకిస్థాన్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లను స్మరించుకున్నారు. లడఖ్‌లోని ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్‌ను కూడా ప్రధాని మోడీ నేడు సందర్శించనున్నారు. కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లోని కార్గిల్ జిల్లాలో ద్రాస్ ఒక పట్టణం అని తెలిసిందే. దీనిని లడఖ్‌కు గేట్‌వే అని కూడా అంటారు. ప్రధాని మోడీ కంటే ముందు ఆర్మీ చీఫ్ ద్రాస్‌లో అమరవీరులకు నివాళులర్పించారు. కాగా.. ఈ మధ్య కశ్మీర్ లో ఉగ్రదాడులు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఇండియన్ ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రకటించింది. హిట్‌లీస్ట్‌లో గుర్తించిన 55 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను అంతమొందించడమే లక్ష్యంగా ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0‌ను స్టార్ట్ చేయబోతుంది. అయితే, ఈ ఆపరేషన్ ఏకంగా ప్రధాని మోడీ ఆఫీసులో నుంచే పర్యవేక్షిస్తారు. ఈ మిషన్‌లో భాగంగా అందులో భాగస్వాములైన ఆర్మీ అధికారులు, ట్రూప్ నేరుగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌కు రిపోర్టు చేసేలా ఏర్పాట్లు చేశారు.

పరువు నష్టం కేసులో నేడు సుల్తాన్‌పూర్ కోర్టుకు రాహుల్ గాంధీ..

పరువునష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ (శుక్రవారం) ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని​ సుల్తాన్ పూర్ లోని ఎంపీ– ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టుకు హాజరు కాబోతున్నారు. ఉదయం 9 గంటలకు రాహుల్ లక్నో ఎయిర్ పోర్టుకు నుంచి సుల్తాన్​పూర్ వెళ్తారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. 2018లో బీజేపీ నేత, ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ సుల్తాన్ పూర్ బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా పెట్టారు. ఈ కేసులో రాహుల్ కు ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే, విచారణలో భాగంగానే ఆయన కోర్టుకు హాజరు కానున్నారు.

పాకిస్థాన్ పై మోడీ ఫైర్..ఉగ్రవాదులకు భారీ హెచ్చరిక

25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ద్రాస్‌లో అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. కార్యక్రమం కోసం ప్రధాని మోడీ కార్గిల్ యుద్ధ స్మారకం వద్దకు చేరుకుని, 1999లో భారత్-పాకిస్థాన్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న పాకిస్థాన్ పై ప్రధాని మోడీ విరుచుకు పడ్డారు. పాకిస్థాన్ గతంలో భారత్ ను ఓడించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటమిని చవిచూడాల్సి వచ్చిందన్నారు. కానీ పాకిస్థాన్ తన చరిత్ర నుంచి ఏమీ నేర్చుకోలేదని తెలిపారు. ఉగ్రవాదం, ప్రాక్సీ వార్‌ను ప్రారంభించి అది (పాకిస్థాన్) తనను తాను సంబంధితంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. భారతదేశం శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించిందని గుర్తుచేశారు. ఈ సమయంలో మోడీ ఉగ్రవాదాన్ని కూడా సవాలు చేశారు. “ఈ రోజు నేను టెర్రర్ ఆఫ్ మాస్టర్స్ నేరుగా నా గొంతును వింటున్నాయి. మీ నీచమైన ఆకృతులు ఎప్పటికీ ఫలించవని.. నేను ఉగ్రవాద మద్దతుదారులకు చెప్పాలనుకుంటున్నాను. మా ధైర్యవంతులు ఉగ్రవాదాన్ని పూర్తి శక్తితో అణిచివేస్తారు. శత్రువుకు తగిన సమాధానం ఇస్తారు.” అని మోడీ వ్యాఖ్యానించారు.

జగన్‌కు ఢిల్లీ స్థాయిలో షెల్టర్ కావాలి

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై టీడీపీ సీనియర్ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం యనమల రామకృష్ణుడు, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు అసెంబ్లీ లాబీలో విడివిడిగా మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. ఇండియా కూటమికి జగన్ దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. జగన్‌కు ఢిల్లీ స్థాయిలో షెల్టర్ కావాలని, ఇండియా కూటమికి కూడా పార్టీలు కావాలన్నారు. జగన్ ధర్నాకు ఇండియా కూటమి పార్టీలు రావడమే దీనికి సంకేతమని ఆయన వ్యాఖ్యానించారు. అంఏతకాకుండా.. ఇండియా కూటమిలో చేరడం జగనుకు అనివార్యమని ఆయన పేర్కొన్నారు.

వరికి రూ. 500 బోనస్ ఇస్తామన్నారు. బడ్జెట్‌లో కేటాయింపులు ఏవి ?

వరికి రూ. 500 బోనస్ ఇస్తామన్నారు. బడ్జెట్‌లో కేటాయింపులు ఏవి మరి? బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బడ్జెట్‌పై కొందరు అర్థ సత్యాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అన్ని రాష్ట్రాలకు సమపాళ్లలో కేటాయింపులు జరిగాయన్నారు. గత పదేళ్లుగా ఎన్డీఏ నేతృత్వంలో అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నా, రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నా ఆలోచన విధానం ఒకటే అన్నారు. జెండాలు మాత్రమే మారాయి తప్ప విధానాలు మారలేదన్నారు. మార్పు ఏదైనా ఉందా అంటే.. దానం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారారని తెలిపారు. మార్పు ఇంకేదైనా ఉందంటే.. కుర్చీలు మాత్రం మారాయన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రూ. 20 కోట్లతో కేసీఆర్ కొన్నారని, కానీ తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రూ. 5 కోట్లకే కొన్నామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో చిట్ చాట్‌లో చెప్పారని తెలిపారు.

కవిత‌కు మళ్లీ నిరాశ.. జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా వారు దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వీరి రిమాండ్‌ను ఈ నెల 31 వరకు పొడిగించింది. మరోవైపు సీబీఐ దాఖలు చేసిన కేసులో వాదనలు విన్న న్యాయమూర్తి కావేరీ బవేజా గురువారం రాత్రి రిమాండ్‌ను ఆగస్టు 8 వరకు పొడిగించారు. తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జైలు అధికారులు నిందితులను కోర్టు ముందు హాజరుపరిచారు.