NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

చంద్రుడి ఉపరితలంపై ముందుగా బ్యాటింగ్ చేయాల్సిందే!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం బుధవారం సక్సెస్ అయిన విషయం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన విక్రమ్‌ ల్యాండర్‌.. కొన్ని నిమిషాల్లోనే భూమిపై ఉన్న పర్యవేక్షణ కేంద్రంతో కమ్యూనికేట్ అయింది. జాబిల్లి యాత్రల్లో ఇప్పటిదాకా ఏ దేశం అందుకోలేకపోయిన సంక్లిష్ట లక్ష్యాన్ని ఇస్రో విజయవంతంగా ఛేదించింది. జాబిల్లిపై పరిశోధనల కోసం రష్యా ప్రయోగించిన లూనా-25 చతికిలపడి వారం రోజులు కూడా కాకముందే.. చంద్రయాన్‌ 3 విజయవంతంగా ల్యాండవ్వడం భారత సాంకేతిక సత్తాకు దర్పణం పట్టింది.

విక్రమ్‌ ల్యాండర్‌ తీసిన చంద్రుడి ఫొటోలను ఇస్రో కేంద్రానికి పంపింది. ఈ ఫొటోలను ఇస్రో తన ఎక్స్ (ట్విటర్) వేదికగా పంచుకుంది. చంద్రుడి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చంద్రుడి ఉపరితలం ఫొటోలపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తనదైన శైలిలో స్పందించాడు. చంద్రుడి ఉపరితలాన్ని క్రికెట్ పిచ్‌గా ఊహించుకున్న జాఫర్.. మొదట బ్యాటింగ్ తీసుకోవాల్సిన పిచ్ ఇది అని పేర్కొన్నాడు. ‘కచ్చితంగా ముందుగా బ్యాటింగ్ తీసుకోవాల్సిన పిచ్ ఇది. ముగ్గురు స్పిన్నర్లు, ఒక సీమర్, ముగ్గురు ఆల్‌రౌండర్‌లతో బరిలోకి దిగుతా’ అని జాఫర్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌ అయింది.

ఇద్దరు మంత్రులపై పునర్విచారణ.. సుమోటోగా కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం

మద్రాస్‌ హైకోర్టు ఇద్దరు మంత్రులకు షాకిచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. వారిద్దరు 2006 నుంచి 2011 వరకు డీఎంకే నేతృత్వంలోని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. వారిద్దరిపై అక్రమాస్తుల కేసులు నమోదయ్యాయి. 2011 తరువాత అధికారంలోకి వచ్చిన అన్నా డీఎంకే ప్రభుత్వం వారిపై కేసులు కొనసాగించింది. విచారణను కొనసాగించినప్పటికీ కేసును పూర్తి చేయలేదు. 2021లో డీఎంకే తిరిగి అధికారంలోకి వచ్చింది. దీంతో ఇద్దరు మంత్రులపై విచారణ చేపట్టిన కోర్టు వారు నిర్దోషులుగా తేల్చుతూ కేసును కొట్టి వేశారు. అయితే కేసును కొట్టివేసిన తరువాత కింది కోర్టు ఇచ్చిన తీర్పును మద్రాస్‌ హైకోర్టు పరిశీలించిన తరువాత అక్రమాస్తుల కేసులో పునర్విచారణ చేపట్టాలని.. సుమోగోగా కేసు నమోదు చేస్తున్నట్టు హైకోర్టు ఆదేశిచ్చింది.

కేవలం ఆ మూడు రోజులే దేవర షూటింగ్ లో పాల్గొన్నాను..

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో గా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఓ భారీ యాక్షన్ ఎంటర్టైమెంట్ తో ప్రేక్షకులను పలుకరించనున్నాడు..ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నాడు.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ బ్లాక్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో దేవర హై యాక్షన్ సినిమా వస్తుండడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గతం లో కొరటాల శివ చివరిగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య అనే సినిమాను తెరకెక్కించారు.. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించారు. అయితే ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఆచార్య సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ కావడంతో ఎన్టీఆర్ తో చేసే దేవర సినిమా కోసం కొరటాల ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రతి విషయం తానే దగ్గరుండి పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అభిమానులకు శుభవార్త.. ఆ కార్డు ఉంటే ఒకరోజు ముందుగానే టిక్కెట్స్! బుకింగ్‌ ఎప్పటినుంచంటే

త్వరలో భారత్‌ వేదికగా జరనున్న వన్డే ప్రపంచకప్‌ 2023 మ్యాచ్‌ల టిక్కెట్ల కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అభిమానులకు శుభవార్త అందించింది. మెగా టోర్నీ టిక్కెట్లు ‘బుక్‌మై షో’లో బుకింగ్ చేసుకోవచ్చని బీసీసీఐ తెలిపింది. ప్రపంచకప్‌ 2023 కోసం ‘బుక్‌మై షో’ను తమ టికెటింగ్‌ భాగస్వామిగా బుధవారం అధికారికంగా ప్రకటించింది. ప్రధాన, వామప్‌ మ్యాచ్‌లు కలిపి మొత్తంగా 58 మ్యాచ్‌ల టికెట్లను బుక్‌మై షోలో కొనుగోలు చేయవచ్చు.

భారత్‌ మినహా మిగతా జట్ల వామప్‌ మ్యాచ్‌లు, ప్రధాన మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్లు ఆగష్టు 25 నుంచి బుక్‌మై షోలో అందుబాటులో ఉండనున్నాయి. అయితే బీసీసీఐ స్పాన్సర్లలో ఒకరైన ‘మాస్టర్‌ కార్డ్‌’ వినియోగదారులకు మాత్రం ఒకరోజు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. నేటి రాత్రి 8 గంటల నుంచి మాస్టర్ కార్డ్ వినియోగదారులు బుక్ చేసుకునే వీలుంటుంది. అయితే భారత్ ఆడే మ్యాచులకు ఈ మాస్టర్‌ కార్డ్‌ వర్తించదు.

బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత..

హైదరాబాద్ చేప మందుగా పేరుగాంచిన బత్తిని హరినాథ్ గౌడ్ మృతి చెందారు. అనారోగ్యంతో హైదరాబాద్ బొలక్ పూర్ పద్మశాలి కాలనీలో ఆయన నివాసంలో పరిస్థితి విషమించడంతో బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. బత్తినీ హరినాథ్ గౌడ్ కు బార్య సునిత్రదేవి, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పాత బస్తీ లోని దూద్ బౌలి కి ప్రాంతానికి చెందిన బత్తిని సోదరులు ఐదుగురు శివరాం, సోమ లింగం, విశ్వనాథ్, హరినాథ్ గౌడ్, ఉమా మహేశ్వర్ వీరిలో ఇప్పటికే ముగ్గురు చనిపోగా బుధవారం హరినాథ్ గౌడ్ మృతి చెందగా విశ్వనాథ్ ఒక్కరే ఉన్నారు. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజున హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బత్తిని కుటుంబ సభ్యులు చేపమందు పంపిణీ చేస్తారు. చేప ప్రసాదం కోసం తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు నగరానికి వస్తుంటారు.

చీరకి లక్షన్నర ఏంటి సర్? మా నాలుగు నెలల సాలరీ అది

లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ని మైంటైన్ చేస్తున్న సమంత, సెప్టెంబర్ 1న ఖుషి సినిమాతో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. విజయ్ దేవరకొండ-సమంత కలిసి నటించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ పై ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. శివ నిర్వాణ లవ్ స్టోరీని బాగా హ్యాండిల్ చేస్తాడు కాబట్టి ఖుషి సినిమా తప్పకుండ హిట్ అవుతుంది అనే నమ్మకం అందరిలోనూ ఉంది. అయితే శివ నిర్వాణ చేసిన టక్ జగదీష్, సమంత చేసిన శాకుంతలం, విజయ్ దేవరకొండ చేసిన లైగర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఈ కారణంగా డైరెక్టర్, హీరో, హీరోయిన్ లక ఫ్యూచర్ ఖుషి రిజల్ట్ పైన డిపెండ్ అయ్యి ఉంది. సాంగ్స్ వర్కౌట్ అయ్యాయి, ట్రైలర్ కూడా బాగానే ఉంది కాబట్టి ఖుషి సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వస్తే సినిమా హిట్ అవ్వడం గ్యారెంటీ. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన సమంత, ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్ లో విజయ్ దేవరకొండతో డాన్స్ చేసి సినిమాకి ప్రమోషన్స్ చేసింది.

అర్థం లేని కొత్త నిబంధనలు.. ప్రయాణికులు ఇబ్బందులు

హైదరాబాద్ మెట్రో నిత్యం లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంది. దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. చిరు వ్యాపారులు, విద్యార్థులు, నగరంలో ఒకవైపు నుంచి మరో వైపు వెళ్లే ప్రజలు ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా నిమిషాల వ్యవధిలోనే గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ మెట్రోకు ఆదరణ పెరిగింది. ప్రయాణికుల ఆదరణతో ఆదాయం కూడా పెరిగింది. కానీ అర్థం లేని కొన్ని నిబంధనలు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మెట్రో సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రో, భద్రతా సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడంతో ప్రయాణికులకు కొత్త సమస్య తలెత్తింది.

రష్యాలో విమాన ప్రమాదం.. వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్‌ మృతి

రష్యాలో విమాన ప్రమాదం జరిగింది. . మాస్కో నుంచి సెయింట్‌ పీటర్స్ బర్గ్‌ వెళుతున్న విమానం బుధవారం మాస్కో ఉత్తర ప్రాంతంలోని ట్విర్‌ రీజియన్‌లో కుప్ప కూలింది.ఇది ఒక ప్రైవేట్ విమానం. ఇందులో 10 మంది ఉన్నారు. పైలెట్, క్రూ కాకుండా ఆరుగురు ప్రయాణీకులు కూడా ఉన్నారు. అయితే వీరిలో ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో మిగలలేదు. ఇందులో విస్తుగొలిపే విషయం ఏంటంటే ఈ విమాన ప్రమాదంలో ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై తిరుగుబాటు చేసిన ప్రైవేటు సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ చీఫ్‌ ప్రిగోజిన్ కూడా ఉన్నారు. అయితే ఈ విషయాన్ని రష్యా అధికారికంగా ప్రకటించలేదు. అయితే విమానంలో ప్రయాణించిన 10మంది పేర్లలో ఒక పేరు ప్రిగోజిన్ ఇంటి పేరుతో సహా సరిపోయిందని రష్యా వైమానిక సంస్థ రోసావియాట్సియా నిర్ధారించినట్టు రష్యా అధికారిక న్యూస్ ఏజెన్సీ టాస్‌ వెల్లడించింది.ఇదే విషయాన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా పేర్కొ్నాయి. అయితే ఈ ప్రమాదం వెనుక పుతిన్ హస్తం ఏమైనా ఉందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే రెండు నెలల క్రితం రష్యాలో అంతర్యుద్ధం ప్రకటించింది వాగ్నర్ గ్రూప్. అప్పుడు వాగ్నర్ గ్రూప్, ప్రిగోజిన్ పేర్లు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగాయి. ఈ సందర్భంగానే ప్రిగోజిన్ మరణం వెనకాల పుతిన్ ఉన్నాడేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సెప్టెంబర్ 2న కన్నా ముందే OG బాంబ్ బ్లాస్ట్ అవ్వనుంది

ఓజి అంటే… ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఓజి వర్కింగ్ టైటిల్‌తో మొదలు పెట్టారు కానీ దీన్నే టైటిల్‌గా ఫిక్స్ అయిపోయారు అభిమానులు. అందుకే పవన్ ఓజి సినిమా పై ఎక్కడా లేని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు పవర్ స్టార్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కాదనే న్యూస్ షాకింగ్‌గా మారింది. మరి ఓజి అంటే ఏంటి? సుజిత్ ఏ టైటిల్ ని లాక్ చేసాడు అనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో పెరిగింది. ‘దే కాల్ హిమ్ OG’ అనే టైటిల్ ని సుజిత్ అండ్ టీం లాక్ చేసారని సమాచారం. పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున సెప్టెంబర్ 2న టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటు టీజర్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం OG సినిమాపై ఉన్న అంచనాలని బట్టి చూస్తే సోషల్ మీడియాలో ఉన్న రికార్డ్స్ అన్నీ OG టీజర్ బయటకి రాగానే చెల్లాచెదురు అవ్వడం గ్యారెంటీ.

వచ్చే నెలలో వాటి ధరలు తగ్గుతాయ్: ఆర్బీఐ గవర్నర్

ప్రస్తుతం నిత్యవసరాల ధరలు నింగిని తాకుతున్నాయి. మొన్నటి వరకు టమాటా ధరలు చుక్కలు చూపించాయి. పప్పుధాన్యాల ధరలు కూడా రాకెట్ లా దూసుకుపోతున్నాయి. దీంతో సామాన్యులపై భారం పడుతోంది. కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరగడంతో ఏమి కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతొ దేశంలో ద్రవోల్బణం కూడా విపరీతంగా పెరుగుతోంది. ఇది ఆర్థికాభివృద్దికి అంతమంచిది కాదు. ఈ నేపథ్యంలో సామాన్యులకు ఊరట కలిగే ఒక విషయాన్ని వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. సెప్టెంబర్ నుంచి కూరగాయల ధరలు తగ్గవచ్చని పేర్కొన్నారు. లలిత్ దోషి స్మారకోపన్యాసంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశంలో ద్రవ్యోల్బణం ప్రస్తుతం కాస్తంత ఎక్కువగానే ఉన్నప్పటికీ అది క్రమక్రమంగా తగ్గుతోందని శక్తికాంత్ దాస్ తెలిపారు. మొన్నటి వరకు పెరిగిన టమాటా ధరలు ప్రస్తుతం చాలా తగ్గాయని, ఇక పెరుగుతాయనుకున్న ఉల్లి ధరలను ప్రభుత్వం కట్టడి చేసిందని ఆయన పేర్కొ్న్నారు. ద్రవోల్బణాన్ని తగ్గించేందుకు ఆర్బీఐ చేపడుతున్న చర్యలు ఫలితాన్ని ఇస్తున్నాయనడానికి ఇది రుజువన్నారు. ఇటీవల కాలంలో కూరగాయలు, చిరుధాన్యాల ధరలు పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అయితే దీనిని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టిన ఆర్బీఐ గతేడాది మే నుంచీ వడ్డీ రేట్లను 250 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. సుస్థిరాభివృద్ధికి ధరల్లో స్థిరత్వం కీలకమని ఆయన తెలిపారు.

తుమ్మల మంచి నాయకుడు.. పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తాం

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ప్రకటించారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపే వారికి స్వాగతం పలుకుతామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను తుమ్మల నాగేశ్వరరావు అభివృద్ధి చేశారన్నారు. తుమ్మల నాగేశ్వరరావు మంచి నాయకుడని ఆమె పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ లోకి తుమ్మల వెళతారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

తుమ్మల నాగేశ్వరరావు ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నాయకుడు. తుమ్మల చాలా కాలం టీడీపీలో ఉన్నారు. సీఎం కేసీఆర్, తుమ్మల నాగేశ్వరరావు టీడీపీలో కలిసి పనిచేశారు. ఈ పరిచయంతోనే 2014లో తుమ్మల నాగేశ్వరరావును అప్పటి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్‌.. ఆ తర్వాత తుమ్మల్‌ను ఎమ్మెల్సీ చేసి మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాంతీయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. 2016 పాలేరు ఉప ఎన్నికలో సుచరితపై కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి విజయం సాధించారు.

నెక్స్ట్ అరెస్ట్ చంద్రబాబే.. మంత్రి కొట్టు సంచలన వ్యాఖ్యలు

శ్రీశైలంలో మంత్రి కొట్టు సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీశైలంలో చేపట్టిన అభివృద్ధి పనులను వచ్చేనెల సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. చంద్రయాన్ 3 విజయంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు మంత్రి కొట్టు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు జగన్ ని ఎదుర్కోలేక అందరూ ఒక్కటే దొంగ ఓట్ల తొలగింపు గురించి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు 14 సంవత్సరాలు అధికారంలో వుండి లక్ష కోట్లు దోచి సింగపూర్ తరలించారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. సింగపూర్ లో బినామీ ఏర్పాటు చేస్తే అక్కడి ప్రభుత్వం బినామీని అరెస్టు చేసింది నెక్స్ట్ అరెస్ట్ చంద్రబాబే అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

 

Show comments